పార్లమెంట్ రణగొణ ధ్వనుల మధ్య, జంతర్ మంతర్ నిరసన ధ్వనుల మధ్య, నాయకుల పరస్పర ఆరోపణల మధ్య వాహనాల రొద ఏ మాత్రం చీకాకు కలిగించదు. దేశ రాజధాని ఢిల్లీ అంటే అందరికీ వాయుకాలుష్యం గుర్తుకు వస్తుందేమో కాని నాకు ధ్వని కాలుష్యం మధ్య రాజధాని కొట్టుమిట్టాడుతున్నట్లనిపిస్తుంది. ఏ ధ్వనీ సహజమైనది కాదు. అసహజమైన ధ్వనుల మధ్య ఆర్తనాదాలు వినపడవు. ఆక్రోశాలు చెవి వరకు రావు. నడికూడలిలో ఒక నాయకుడు భూనభోంతరాళాలు దద్దరిల్లేలా ఛాతీ చరుచుకుని ధ్వనితరంగాలను పంపుతుంటే ప్రకంపనల ప్రభావానికి గురైన వారే ఎక్కువ. వందిమాగధుల, బానిసల, భజనపరుల, పారవశ్య ధ్వనికోలాహలంలో దేశ రాజధాని నిరంతరం పులకించిపోతుంది. కూలిపోతున్న దేహాలు, విరిగిపడుతున్న చెట్ల శబ్దాలను వినపడకుండా చేసే అర్థ నిమీలిత నేత్రాల, భక్తిగీతాల ఉచ్ఛైస్వరమే నేను ఆధునిక భారత దృశ్య రావం.
ఇలాంటప్పుడు ఒకసారి రాజధానిలో కొందరు కవుల గొంతులు వినిపిస్తాయి. అప్పుడు మళ్లీ కాళ్ల క్రింద పచ్చగడ్డి తడి తగిలినట్లనిపిస్తుంది. మరణించిన అమ్మ గొంతు వెనకనుంచి పిలిచినట్లనిపిస్తుంది. చుట్టూ క్రమ్ముకున్న పొదలు పరిమళించినట్లనిపిస్తుంది.
అలాంటి కవి వివేక్ చతుర్వేది. ఎక్కడో మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో కళానికేతన్ పాలిటెక్నిక్ లో పనిచేస్తూనే హిందీ కవితలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు సాహిత్య సదస్సుల్లోకి ప్రవేశించి కవితలు వినిపించి మళ్లీ తన నేలలో ఇంకిపోతుంటాడు. ఈ మధ్య ఢిల్లీలో సాహిత్య అకాడమీ సాహిత్యోత్సవంలో ఆయన కవిత్వం వినే అవకాశం లభించింది.
వివేక్ చతుర్వేది రచనల్లో ఎక్కడా పదాలతో విన్యాసాలు, గంభీరమైన శబ్ద సముచ్ఛయాలూ ఉండవు. కాని ఆయన కవితలు చదువుతుంటే మన పక్కన ఒక స్నేహితుడు నడుస్తున్నట్లుంటుంది. బస్సు కిటికీల్లోంచి చూస్తుంటే చల్లటి గాలి మన ముఖాన్ని తాకినట్లనిపిస్తుంటుంది. ప్రవహించే స్వచ్ఛమైన నీటి వాసన ఆఘ్రాణించినట్లనపిస్తుంది.
స్త్రీలు, పురుషులు ఉదయాన్నే పనులకు వెళ్లి సాయంత్రాలు ఇంటికి తిరిగి వస్తుంటారు. కాని స్త్రీ ఇంటికి తిరిగి రావడం, పురుషుడు ఇంటికి తిరిగి రావడం ఒకటే కాదు అంటాడు వివేక్ చతుర్వేది.
స్త్రీలు ఇంటికి తిరిగి వస్తారు
పడమటి ఆకాశంలో
వ్యాకులంతో ఎగిరే
నల్లపక్షుల వరుసలా..
స్త్రీ ఇంటికి తిరిగి రావడం
పురుషుడు ఇంటికి తిరిగిరావడం ఒకటే కాదు
పురుషుడు ముందు గదిలోకి,
తర్వాత బాత్ రూమ్ కు,
ఆ తర్వాత బెడ్ రూమ్ కు తిరిగి వస్తాడు
స్త్రీ ఒకేసారి మొత్తం ఇంటికి తిరిగి వస్తుంది
ఒకే సారి ముందుగది నుంచి వంటింట్లోకి వస్తుంది
పిల్లల ఆకలి తీర్చే రొట్టె రూపంలో వస్తుంది.
పప్పన్నంలా తిరిగి వస్తుంది.
విరిగిన మంచం వైపు తిరిగి వస్తుంది
కష్టపడి వేళ్లాడదీసిన
మచ్చర్ దాన్ లా తిరిగి వస్తుంది
పెరట్లో తులసి, పూల మొక్కల వద్దకు తిరిగి వస్తుంది
ఆమె స్త్రీ
తరుచూ స్త్రీలా తిరిగి రాదు
ఒక భార్యలా, సోదరిలా, తల్లిలా, కూతురిలా
తిరిగి వస్తుంది
ఆమె స్త్రీ
రాత్రి నిద్రపోయేందుకు
మాత్రమే ఆమె తిరిగి రాదు
ఉదయపు బాధలకోసం కూడా
ఆమె తిరిగి వస్తుంది
స్త్రీ పక్షిలా తిరిగి వస్తుంది
ప్రతి రోజూ తన గుప్పిట్లో
కొంత మట్టిని తీసుకువస్తుంది
స్త్రీకి ఇల్లు కూడా ఒక బిడ్డే
అది ప్రతి రోజూ ఎదుగుతూనే ఉంటుంది
స్త్రీ ఇంటికి తిరిగి వస్తే
పచ్చికబయలులో గడ్డి
మరింత పచ్చగా మారుతుంది
నిజానికి ఒక స్త్రీ ఇంటికి తిరిగి రావడం
ఇంటికి తిరిగిరావడం కానే కాదు
భూమి తన కక్ష్యలోకి తిరిగి రావడం
‘స్త్రీలు ఇంటికి తిరిగివస్తారు..’ అన్న శీర్షికతోనే వివేక్ చతుర్వేది తన తొలి కవితా సంకలనాన్ని వెలువరించారు. అదే సాహిత్య ప్రపంచంలో ఆయనకు చిరస్థాయిని ఆర్జించిపెట్టింది. ఆయన కవితల్లో స్త్రీలు, తల్లి, తండ్రి..మానవ సంబంధాలు ప్రత్యక్షమవుతాయి. మానవ సంబంధాలను కాపాడుకుంటే చాలు, ఆ సంబంధాలను కవిత్వంలో ప్రతిఫలిస్తే చాలు సమాజాన్ని ఆలోచించేలా చేయగలం అనుకునే కవుల్లో ఆయన ఒకరు.
ప్రపంచంలోని అందమైనవన్నీ మాయమైపోతున్నాయి
పిచ్చుకల్లా, వెచ్చటి సూర్యకాంతిలా
బాల్యంలా, నక్షత్రంలా
మానవత్వమనే ఆస్తితో మాత్రమే జీవించే మనిషిలా..
-అని వాపోతాడు.
ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు, ఎండలో నడిస్తే చెమట విలువ తెలుస్తుందని చెప్పే వివేక్ చతుర్వేది చెమట నిండిన కవిత ఎండిన పొలాల్లోనే పెరుగుతుంది అంటాడు.
చెమట నిండిన కవిత ఎండిన పొలాల్లోనే పెరుగుతుంది
అది ఎడ్లబండిలో రాత్రంతా మేల్కొని మండీకి వెళుతుంది
మద్దతు ధర రాకపోతే అసహనంగా మారుతుంది
ఎరువులు, విత్తనాలు దొరకనప్పుడు
నీరు కుట్ర చేసినప్పుడు గావుకేకలు పెడుతుంది
బ్లాక్ ఆఫీసర్ నిజాయితీ కోల్పోయినప్పుడు
పాములా బుస కొడుతుంది
అది కాలంతో పయనిస్తుంది
నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటుంది
రాత్రంతా అమ్మకళ్లలో మేల్కొంటుంది
చెల్లెలు పెళ్లిలో కంటతడిపెడుతుంది
కొన్ని సార్లు బీడుభూమిలా ఎండిపోతుంది
కొన్ని సార్లు వర్షాకాలంతా తడిసిపోతుంది
కొన్ని సార్లు చెమటతో తడిసిన నల్లటి దేహంలా..
ముసలివాడి కర్ర శబ్దంలా వినపడుతుంది
గ్రామంలో ఎండిపోయిన చెరువు గట్టు వద్ద కూర్చుని రోదిస్తుంది
నీరు, పక్షులు, చెట్లు, పర్వతాలు, జనం
ఎక్కడున్నారో
ఆమె అక్కడే ఉంటుంది
కవితా వస్తువును ఎక్కడో వెదుక్కోనక్కర్లేదు. అది మన మధ్యే ఉంటుందని, మనలో నే ఉంటుందని, మన చుట్టూ ఉంటుందని నమ్మే సహజమైన కవి వివేక్ చతుర్వేది. మనుషులు సృష్టించే యుద్దాల గురించి ఆయన మరో ఆలోచింపజేసే కవిత రాశారు. ఇద్దరు నియంతలు ఒకరి తర్వాత యుద్దం జరుగుతుందని ప్రకటిస్తే ప్రపంచమంతా యుద్దారావాలతో నిండిపోతుందంటాడు.
కుంచించుకుపోయిన కుష్టు మీడియా కూడా
టీఆర్పీ కాటుకు గురైన మీడియా కూడా
ఆసుపత్రి పడకనుంచి లేచి
యుద్దం ఉంటుందని ప్రకటిస్తుంది
యుద్దాన్ని ఉత్సవంలా జరిపిస్తుంది
జాతీయ వాద తిలకాలు, జాలీ టోపీలూ
అరవడం మొదలుపెడతాయి
యుద్దం మెదళ్లకి వ్యాపిస్తుంది.
గుమాస్తాలు సోమరి ఫైళ్లను వదిలేసి
టీ కొట్టు వద్ద టీ తాగుతూ
యుద్దం ఉంటుందని ధ్రువీకరిస్తారు
మధ్యాహ్నం కాకముందే సంపాదకులు
ఆఫీసులకు పరుగెత్తుకెళ్లి
వార్తాపత్రికల కాగితాలపై
ఇంకు బదులు నెత్తురు చల్లుతారు
మిల్లుల మూసివేతలూ
పిల్లల ఆకలిచావులూ
ఉల్లిపాయల ధరలు పెరగడాలూ
బ్యాంకుల్లో రుణాలు
రూపాయి పడిపోవడాలు
వార్తలు కావు. అతి చెత్తలోకి వెళతాయి
ధాన్యాలు, మద్యాల కంపెనీల వర్తకులు
ఆనందాతిరేకంలో మునుగుతారు
ధరలు పెరిగాయన్న విషయం ఎక్కడా చర్చకు రాదు
రహదారి చేరకముందే ఊరేగింపులు ఆగిపోతాయి
ప్రతి ఘటన గీతాల సగమే పూర్తవుతాయి
అసంతృప్తులన్నీ వాయిదా పడతాయి
స్కూలు పిల్లవాళ్లకూ తెలుసు యుద్దం వస్తుందని
మైదానంలోనే వారు రెండు దేశాలుగా విడిపోతారు
కల్లు దుకాణంలో కూడా యుద్దం ప్రవహిస్తుంది
మందిరాల్లో ఆరతి, మసీదుల్లో ఆజాన్ ధ్వనులకు పక్షులూ పారిపోతాయి
రాముడు, అల్లా ఒకరికొకరు వీపు చూపించుకుంటూ వెనక్కి తిరిగి ఉంటారు
రాత్రి పూట పురుషులకు శీఘ్ర స్ఖలనం అవుతుంది
స్త్రీలకు కామవాంఛ తగ్గిపోతుంది
అలిసిపోయిన కూలీలు, దోపిడీకి గురైన ఉద్యోగులు
నిరుద్యోగులు, మరణశయ్యపై ఉన్న వృద్దులు
హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు
అందరూ టీవీ వైపు మెరుస్తున్న కళ్లతో చూస్తారు
యుద్దం వస్తుందని ఉద్వేగంతో అరుస్తారు
అర్థరాత్రి వరకూ ఎవరూ పట్టించుకోని
కవులు, కళాకారులు కూడా
పెన్నులు, కుంచెలూ పారేసి యుద్దం వస్తుందని చెబుతారు.
ఉదయాన్నే లేచేందుకు ఇంటికి వెళ్లిన సూర్యుడు కూడా
మధ్యలో ఆగిపోతాడు
రాత్రి మరింత చీకటి అవుతుంది
అదే చీకటి రాత్రిలో ఇద్దరు నియంతలు
మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు
మరింత సగర్వంగా, ఆధిపత్యంతో
తీవ్రంగా హెచ్చరికలు చేస్తారు
దేశం యుద్దం కోరుకుంటుంది
యుద్దం ఉంటుంది.. అవును యుద్దం జరుగుతుంది..
తాళాలు తాళపు చెవులను గుర్తు చేసుకుంటాయని వివేక్ చతుర్వేది మరో కవితలో రాశారు. తాళం తన స్వంత తాళం చెవుల ఉనికినే గుర్తిస్తుంది కాని వేరే తాళం చెవితో తెరుచుకోదు. దర్వాజాకు వేళ్లాడడం దానికి ఇష్టం ఉండదు. తాళం చెవులను గుర్తు చేసుకుంటూ దారివైపు చూస్తుంటుంది ఎన్ని ఏళ్లయినా, ఎంత తుప్పు పట్టినా మళ్లీ పాత తాళం చెవులు వచ్చే సరికి అది కొంత మొరాయించినా స్నేహపు బిందువులు వేసే సరికి ఆ తాళం కిలకిలా నవ్వుతూ తెరుచుకుంటుంది.
తాళం, తాళం చెవులూ రెండు మనిషికీ మనిషికీ మధ్య అనుబంధాలకు ప్రతీకలు. మనం కోరుకునే స్నేహాలకు, జీవన సంబంధాలకు చిహ్నాలు. విత్తనానికీ, నేలకూ మధ్య, ప్రేమికుడికీ ప్రియురాలికీ మధ్య అనిర్వచనీయతకు ప్రతి రూపాలు. భవబంధాలతో కూడిన అనురాగాన్ని, గుండెపొరల్లో దాగిన తడిని గుర్తు చేసే పరికరాలు. పాత పుస్తకాల్లో దాగిన వాడిన మల్లియలు.
కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఆ రహస్యం వివేక్ చతుర్వేదికి బాగా తెలుసు
*
మంచి పరిచయం . ఆ కవి అంటారు”అలిసిపోయిన కూలీలు, దోపిడీకి గురైన ఉద్యోగులు
నిరుద్యోగులు, మరణశయ్యపై ఉన్న వృద్దులు
హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు
అందరూ టీవీ వైపు మెరుస్తున్న కళ్లతో చూస్తారు
యుద్దం వస్తుందని ఉద్వేగంతో అరుస్తారు
అర్థరాత్రి వరకూ ఎవరూ పట్టించుకోని
కవులు, కళాకారులు కూడా
పెన్నులు, కుంచెలూ పారేసి యుద్దం వస్తుందని చెబుతారు.
ఉదయాన్నే లేచేందుకు ఇంటికి వెళ్లిన సూర్యుడు కూడా
మధ్యలో ఆగిపోతాడు”