సమకాలీన తెలుగు కవిత్వంలో వస్తువిస్తృతి అవసరాన్ని నొక్కి చెబుతూ గత సంచికలో కొన్ని అనువాద కవితలను ఉదాహరణల రూపంలో ఇచ్చాను కదా. ఈ రెండవ భాగంలో కుఁవర్ నారాయణ్, కె. జి. శంకర పిళ్ళై అనే ఇద్దరు పరభాషాకవుల కవిత్వాన్ని పరిచయం చేస్తున్నాను. వీరిలో మొదటి కవి హిందీలో రాస్తారు, రెండో అతను మాళయాళ కవి. ఒక్కొక్కరివి ఎనిమిది చొప్పున కవితలను అనువదించాను.
కుఁవర్ నారాయణ్ కవితల్లో మొదటిదాన్నీ చివరిదాన్నీ మినహాయిస్తే, మిగిలిన ఆరింటిలో వస్తువు భిన్నంగా ఉండటం మనం గమనించవచ్చు. అంతే కాదు, వాటిలోని Central theme స్వభావం తెలుగు కవులు తరచుగా తీసుకునే వస్తువులలో లాగా చాలా స్పష్టంగా వుండదు. అది కొంతవరకు vague గా, amorphous గా వుంటుంది. సున్నితంగా అని కూడా అనవచ్చునేమో. బాగా పాతుకుపోయిన, చాలా స్పష్టమైన వస్తువులను కాక ఇట్లాంటి వస్తువులను స్వీకరించడం తెలుగు కవిత్వంలో ఇంకా సర్వసాధారణం అవలేదు. అంటే మనం conventionality ని – సాధారణత్వాన్ని, సంప్రదాయబద్ధతను – వీడలేదన్న మాట. ఇదే నేను చెప్పదల్చున్న ముఖ్యమైన విషయం. శంకర పిళ్ళై కవితల్లోని వస్తువును పరిశీలిస్తే, అది యెంతో అరుదైనదనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎడిటింగ్ అనే చిన్న విషయాన్ని తీసుకుని దానిమీద ఆరు కవితల్ని రాయడం తప్పక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక శిల్పపరమైన వైవిధ్యం మొదటి ఎనిమిది కవితల్లో అంతగా లేకపోవచ్చు. కాని, శంకర పిళ్లై కవిత్వంలో చాలా చోట్ల అది కనిపిస్తుంది. అయితే అది ప్రత్యేకమైన భాష ద్వారానో, వాక్యనిర్మాణవైచిత్రి ద్వారానో సాధించింది కాకపోవచ్చు. అరుదైన వస్తువును తీసుకుని అరుదైన రీతిలో చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా శిల్పంలో కొత్తదనం చోటు చేసుకుంటుందని నా అభిప్రాయం. దీన్ని సంపూర్ణంగా, సవివరంగా విస్తరింపజేస్తే ఈ రచన నిడివి చాలా పెరిగే ప్రమాదముందని భావించి అట్లా చేయడం లేదు కనుక, ఈ వాక్యంలో vagueness ఉన్నట్టు అనిపించవచ్చు. ఫలితంగా కొందరు విభేదించే వీలుంది. ప్రోజ్ పొయెం, టెక్నిక్ నిండిన కవిత్వం – వీటిలోని శిల్పవైవిధ్యం మరింత బలమైనదిగా వుంటుంది. ప్రోజ్ పొయెంకు పేరాగ్రాఫ్ కవిత అనే పేరును స్థిరపరచాలని అనిపిస్తుంది నాకు.
చాలా గొప్ప భావాలు నిండిన కవిత్వాన్ని రాసేటప్పుడు, లేక అనువదించేటప్పుడు ఎట్లాంటి పదాలను వాడినా పెద్దగా తేడా వుండదు అని రాశాను ఇంతకు ముందు ఒక చోట. అయితే, ఈ వాక్యం పాఠకులలో కొంత అయోమయాన్ని కలిగించే అవకాశం వుంది కాబట్టి, చిన్న వివరణ అవసరం. సందర్భానికి కచ్చితంగా సరిపోయే పదాలు – అంటే సరైన అర్థాన్నిచ్చే పదాలు – వుండటం తప్పనిసరి అనేదాంట్లో అనుమానం లేదు. కాని, గొప్పభావాలున్న కవిత్వంలో చాలా సరళమైన పదాలున్నా okay. గొప్ప భావానికి గంభీరమైన భాష నప్పదని చెప్పడం లేదిక్కడ. అది లేకపోయినా ఫరవా లేదనడమే ముఖ్య ఉద్దేశం. సాధారణస్థాయి కవిత్వానికి మాత్రం భాష ద్వారా – అంటే పెద్ద, లేక ప్రత్యేకమైన పదాల ద్వారా – కొన్ని మెరుగులు దిద్ది, దాన్ని ఆకర్షణీయంగా మార్చవచ్చు. అనుభూతిని ప్రసాదించడంలో ఏదైనా వెలితి ఉంటే దాన్ని అవి compensate చేస్తాయి. భావమూ భాషా రెండూ చప్పగా వున్న కవిత్వాన్ని ఎంత వరకు ఆస్వాదించగలం, చెప్పండి. ఇంకో విషయం. అనువాదంలో ఉపయోగించే భాష మూలకవిని/రచయితను అనుభూతిలోనికి తేవాలి. ఇది అనుకున్నంత సులభం కాదు. నిజానికి చాలా కష్టమైన విషయం. అయితే, మూలకవిని స్ఫురింపజేయ లేకపోయినా కనీసం అందులో అనువాదకుడు కనిపించకూడదు. ఇది కూడా అనుకున్నంత సులువైన పని కాదు. అనువాదంలో సైతం ఒక రకమైన సొంతముద్ర వుంటుంది చాలామంది విషయంలో. దాన్నుండి బయటికి రావడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి.
ఇంతటితో నా ఆలోచనలను ఇక్కడ ఆపేస్తున్నాను. పాఠకులారా! అనువాద కవితలను చదివి ఆనందించండి.
కుఁవర్ నారాయణ్ కవితలు
- పవిత్రత
కొన్ని పదాలు అవమానాన్ని
చాలా కాలం భరిస్తాయి
ఆపైన నిశ్శబ్దంగా జీవితంలోంచీ
భాషలోంచీ తప్పుకుంటాయి
అట్లాంటి పదాల్లో ‘పవిత్రత’ ఒకటి
అది పురాతనమైనదనిపిస్తుంది
దాని తెగ తాలూకు పదాలన్నీ
అంతరిస్తున్న జాతులకు చెందుతయ్
గాలిలో భూమిలో నీరులో సైతం
వాటి ఆనవాళ్లను గుర్తించలేము
దాని సంపూర్ణ స్వచ్ఛతను నిరూపించడానికి
ఏదీ జీవించి లేదిప్పుడు
‘శాంతి’ కూడా పూర్వం అట్లాంటి పదమే
ఇప్పుడది పూర్తిగా మాయమైంది
దాని వంశంలోని ఒక్క పదం కూడా మిగిలి లేదు
మనిషిలోపల గానీ బయట గానీ
శాంతి ఆనవాలు కనిపించదిప్పుడు
మరణం తర్వాత శాంతి వరిస్తుందంటారు
కాలధర్మం తర్వాత కైమోడ్పునందిస్తుందనే
ప్రతిదాని మీదా అనంతమైన అపనమ్మకం నాకు
ప్రేమ కూడా అట్లాంటి పదమేనని నా ఊహ
కాని, అది తన ప్రతిధ్వనిని వదిలి వెళ్లింది
జీవితపు అపురూప ఆస్తులనుకున్న మాటలన్నీ
ఏదో మాయ ప్రదేశానికి వలస పోయాయి
తనువు చాలించి
ఏ భాషకూ అందకుండా
ఎక్కడో మునులలాగా మిగిలిపోవడమే
వాటికి ఇష్టం
-
పొద్దుపొడుపు కోసం
పొద్దు పొడిచే దిక్కు కోసం అన్ని దిశలనూ
శోధించాలంటుంది ప్రపంచజ్ఞానం
అయినా సూర్యోదయం కోసం నిరీక్షిస్తూ
పడమరకు తిరిగారు వాళ్లు
నిజానికి సూర్యుడు ఉదయించడు అస్తమించడు
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది
“సూర్యుడస్తమించని సామ్రాజ్యం మాది”
అంటూ గర్వంగా ప్రకటించుకుందొక దేశం.
కాని, ఆ సామ్రాజ్యం కూలిపోయింది
అయినా సూర్యుడుదయించాడు ఎప్పట్లాగే
-
శిలల్లోని జీవితం
మొదటి దెబ్బకే
శిల నిట్టూర్పు విడిచింది
రాళ్లు కూడా ప్రాణమున్నవేనని శిల్పికి తెలుసు
మూలశక్తి నెలకొన్న కచ్చితమైన స్థానం కోసం
అంతటా ఉలితో కొట్టసాగాడు శిల్పి
ప్రతిమ చెక్కడం పూర్తయ్యాక
ఆ రాయిలోని స్పందించే గాయమైన
హృదయాన్ని గుర్తించాడు
తర్వాత తన చేతులను తదేకంగా చూసుకున్నాడు
అవి రక్తమోడుతున్నాయి
-
సీతాకోకచిలుకల దేశంలో
ఒకసారి నేను సీతాకోకచిలుకల దేశంలో వున్నట్టూ
ఒక సీతాకోక నన్ను వెంటాడుతున్నట్టూ
భ్రాంతి చెందాను
నేను ఆగాను
అది కూడా ఆగింది
నేను నా వెనుకవైపు చూశాను
అదీ తన వెనుకవైపు చూసింది
నేను దాన్ని వెంబడిస్తుంటే
అది కూడా తనను తాను వెంబడించింది
నిజానికి అది కూడా నాలాగా
సీతాకోకల దేశంలో వున్నట్టూ
ఎవరో తనను వెంటాడుతున్నట్టూ
చిత్తభ్రాంతిలో వుంది
-
గాయం
నేను మరక అంటకుండా
ఈ వీధుల్లోంచి పోగలిగితే బాగుండును
కానీ నా బట్టలమీద మరక అనివార్యమైతే
అది అమాయకుల రక్తానిది
కావద్దని నా ఆశ
అది నా ఆత్మ మీద
ఎన్నటికీ నిండని అనంతప్రేమ తాలూకు
గాయం అయివుండాలి
-
భటియాలీ రాగం
బావుల్ సంగీతంలో
భటియాలీ అనే రాగం వుంది
దాని చివరి స్వరం
స్వేచ్ఛగా గాలిలో డోలలూగుతూ వుంటుంది
ప్రాణచైతన్యంతో నిండి
అనంతత్వంలోకి అంతర్ధానమయ్యే నాదం అది
అది మిగిలిన స్వరాలను కట్టి వుంచదు
ఆఖరున ఆ స్వరాలూ దాన్ని కట్టి వుంచవు
చివరి నిట్టూర్పు లాగా
అది విముక్తి తాలూకు
ఒక వింత అనుభూతిని శ్వాసిస్తుంది
-
మామూలు జీవితం
నేను ప్రపంచాన్ని మార్చలేననీ
దానితో పోరాడి గెలువలేననీ
తెలుసు నాకు
పోరాడి అమరుణ్ని కాగలను
అంతకు మించి బహుశా
ఒక అమరస్తూపాన్ని నా పేరున పొందగలను
లేదా కీర్తిని సొంతం చేసుకున్న ఒత సితారను కాగలను
కాని, అమరుడు కావడమనేది
పూర్తిగా వేరే విషయం
మామూలు జీవితాన్ని జీవిస్తూ కూడా
నిశ్శబ్దంగా అమరులవుతారు కొందరు
-
రోజా పువ్వు లాగా
(Werner Herzog రచించిన ‘Where the Green Ants Dream’ కవితను తల్చుకుని…)
పూలకుండీల్లోని బతుకులు మాకొద్దు
మా సొంత విధానంలో
మమ్మల్ని పూయనివ్వండి వాడిపోనివ్వండి
మా అడవుల్నీ నేలనూ మాకివ్వండి
చెట్టునుండి మమ్మల్ని తెంపకండి
చెట్టు మా యిల్లు
మా రీతిలో దాన్ని అలంకరించనివ్వండి
మమ్మల్ని దానికింద
పూలపరుపుగా మారనివ్వండి
మాకు మీ సానుభూతీ వద్దు
మీ క్రూరత్వమూ వద్దు
మా వేళ్లను పెరికి
మమ్మల్ని నాగరికులుగా మార్చకండి
మీకిష్టమైన రీతిలో
మమ్మల్ని ఊహించుకోకండి
మేము రంగూ సువాసనా
కలగలిసిన గులాబీలం
ముళ్ల చివరల మీద
మృదువైన దీర్ఘాలోచనల్లో
మునిగిపోయిన పువ్వులం
కె. జి. శంకర పిళ్ళై కవితలు
- సంప్రదాయం
మెట్లు లిఫ్టులుగా
పోర్టికో లోని బెంచి బాల్కనీగా
చిన్న నిప్పురవ్వ పెనుమంటగా
మంట సలసల కాగే సలిలంగా
ఎడిట్ చేయబడ్డాయి
మామూలు భోజనం చికెన్ బిర్యానీగా
మిరియపు గింజ భూగోళమంత పెద్దదిగా
పచ్చి మంచినీళ్లు పసందైన పానీయంగా
ఎడిట్ చేయబడ్డాయి
విలువల్ని బేరీజు వేసేందుకు
కొత్త త్రీడీ కామిక్ హీరో అయిన
ఒక పిశాచాన్ని నియమించారు
వెంటనే
సంప్రదాయం ఆధునికత స్థాయికి చేరింది
-
దూరం
దూరం దగ్గరితనంగా ఎడిట్ చేయబడింది
సగం మరమనిషీ సగం జంతువూ అయిన
స్ఫింక్స్ కు ఎన్నో విషయాలు తెలియక
లెక్కలేనన్ని అనుమానాలతో కొట్టుమిట్టాడుతోంది
దానికి మస్తిష్కపు గేటు దగ్గర
ద్వారపాలకుని పని ఇచ్చారు
ఇంటర్వూ ప్రశ్నకు ఇచ్చే సమాధానం
ఐటీ దిగ్గజపు విషాదమరణానికి ద్వారం కాకూడదు
అయినా అదొక ఉత్సవం అనిపించాలి
మహా అయితే తనను తాను తెలుసుకోలేకపోయిన
విషాదపరిణామంగా అగుపించాలి
అట్లా ఎడిట్ చేయబడింది కథ
ఫలితంగా దూరం దగ్గరితనపు
బుద్ధికుశలతగా మారింది
ఎత్తు
ఉపరితలం ఉత్తుంగశిఖరంగా
ఎడిట్ చేయబడింది
శిఖరాగ్రం మీద
ఎందరో దేవుళ్లవి ఎన్నో జెండాలు
రెపరెపలాడాయి
ఎత్తుగా పెరిగిన ప్రేమవృక్షపు కొమ్మమీంచి
ఒక పిట్టను గెంటివేశారు
పాపానికి ప్రేమలో స్నానం…
ఫలితంగా అది అయింది రామాయణం
-
సుడిగాలి
ఎడిటింగ్ కు లోనైన సుడిగాలి
స్నేహితునిగా మారింది
అది మళ్లీ సుడిగాలిలాగా చుట్ట చుట్టుకోకముందే
పదాల మధ్య అగాధాన్ని మరింత లోతుకు తవ్వడంతో
స్నేహం ఎడిటింగ్ కు లోనైంది
పదానికుండే ముఖద్వారం
తక్కువ ఎత్తుకు దించబడింది
తారలారా, అవతారమూర్తులారా
వంగిన వామనుల్లా సైతం రాకండి దయ చేసి
గుమ్మానికి తగుల్తుంది మీ తల
అప్పులతో అన్యవాగ్దానాలతో రావద్దు నా దగ్గరికి
ధర్మాన్ని పునరుద్ధరించేందుకు
నా దగ్గర నాలుగు పాలసీలూ
ఆరు ఫిక్స్ డ్ డిపాజిట్లూ వున్నాయి
-
విషయాలు
ఎడిటింగ్ కు లోనైనప్పుడు
ఆధునికుడు సైతం
అవుతాడు పాత చింతకాయ పచ్చడికి సమానం
సర్వసంగపరిత్యాగి దురాశాపరునిగా
తక్షకుడు సైతం తక్కువ సైజు జెర్రిగా మారుతారు
పిపీలికం పెద్ద ఏనుగవుతుంది
ప్రతి నీటిబిందువు ఒక సింధువుగా మారుతుంది
ప్రతి సమాచారశకలం ఒక సంగ్రామవార్త అవుతుంది
ప్రతి విషయంలో శూన్యమే చేరుతుంది
ప్రతి మూఢత్వంలో ఒక సోయగం దూరుతుంది
ఏ విషయంలోని అచ్చెరువునైనా
ఆనందిస్తాను నేను
వారం వారం ఈ జ్ఞాన ఉద్దీపనను కూడా
-
హిమపాతం
హిమపాతంలో స్టాలిన్ ప్రపంచం
ఒక సత్యపు శవాగారం
ప్రపంచం సులభంగా
కుళ్లిపోయే వస్తువుల సముదాయం
అని గుర్తు చేస్తుంది హిమపాతం
ఇంకా అంటుంది యిలా:
చల్లదనంతో గడ్డ కట్టించడం
రక్షించడానికి సమానం
-
రెండు మాటల ధోరణి
పగటి వెల్తురు
రాత్రి పాడినన్ని పాటల్ని
పాడలేదు
రాత్రి మనను నేలమీద పడి దొర్లేంతగా నవ్వించింది
ఉదయపు వెలుగు అట్లా చేయలేదు
పగటి వెలుతురు
శాంతినీ సౌఖ్యాన్నీ సడలింపునూ
అంతగా యివ్వలేదు
అయినా తరగతిగదిలో
పురికొల్పుతాను నేను యిలా:
తమసోమా జ్యోతిర్గమయః
-
నిత్యనీహారం
ఎడిటింగ్ తర్వాత కూడా
ప్రేమబీరు లోని భాష నురుగు
కౌగిలిలో కలహంలో నిశ్శబ్దంలో
కొనసాగింది
“అది మద్యం, బీరు కాదు”
అంటూ దాని తీవ్రతను
ఎడిట్ చేసిందామె
పెళ్లికూతురు దేహం మీది
పొలుసుల్ని వొలిచి
ఆమెను భార్యగా ఎడిట్ చేశారు
రోజువారీ పొగమంచు దూరదృష్టిని నిషేధించి
చరిత్రను ఇంటి ఇష్టగోష్టిగా మార్చింది
న్యాయం అందడంలోని ఆలస్యంకన్న
నెలసరి రావడంలోని ఆలస్యమే
ఎక్కువ బాధించింది ఆమెను
తలగడకూ తేనీటి కప్పుకూ రాసుకుని
పెదవి మొండిబారింది
వలపువసంతం
మస్తిష్కగణితం లోని అంకెలలాగా
రాలిపోయింది
భార్యాభర్తలను ప్రేయసీప్రియులుగా మార్చే
మాయామత్స్యం పదాల విరిగిన అల మీద
జారడం లేదిప్పుడు
ఆమె అన్నది యిలా:
ప్రతి బంధంలోని మాంత్రికవాస్తవికత
వాడిపోతుంది ఏదో వొక రోజున
***
అద్భుతమైన కవిత్వం.ఎడిటింగ్ అనే ఆధునిక పరికరం మీద కవిత్వం యింత దాకా చదవలేదు.అనువాదాల్లా లేవు యీ కవితలు, అన్నీ వొరిజనల్ గా అనిపిస్తున్నాయి.థాంక్యూ సార్, ఎలనాగ గారూ.
థాంక్స్ వెంకట కృష్ణ గారూ, మీ ప్రశంసకు. ఒరిజినల్ కవితలు గొప్పగా ఉండటం వల్లనే నా అనువాదం కూడా బాగా వచ్చిందని అనుకుంటాను నేను.
adbhutangaa rasaru yelanaga garoo. anuvada prakriya gurinchi chala viluvaina vyasam mukhyangaa anuvadakulandarikee… mee anuvada kavitalanu anuvadalante nammadam kashtam – chala manchi anuvadalu – saralangaa goppa pravaha shaili lo saginayi
నా అనువాద కవితలు అనువాదాలలా లేవనీ, అవి ఒరిజినల్ కవితల్లా ఉన్నాయనీ మీరు మెచ్చుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది నారాయణస్వామి గారూ. కృతజ్ఞతలు.