కవనశర్మ చూపించిన మనలోకం!

ఆమె ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆమె ఇల్లు లో కమల ఎదుర్కున్న పరిస్థితి లాంటి పరిస్థితిని మా అమ్మతో సహా నాకు పరిచయం వున్న చాలామంది స్త్రీలు ఎదుర్కోవడాన్ని చూసి వున్నాను కనుక.

వన శర్మ గారు ఇక లేరు అన్న వార్త వివిన మూర్తి గారి పోస్ట్ ద్వారా తెలియగానే నాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకు కలిగిందో నేను చెప్పలేను. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం ఏదీ లేదు. కానీ ఆయన గురించి నా  గురుతుల్యులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ద్వారా చాలా విన్నాను. ఆయన రచనలు చదివాను. ముఖ్యంగా ఆయన కథలు. మె ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆమె ఇల్లు లో కమల ఎదుర్కున్న పరిస్థితి లాంటి పరిస్థితిని మా అమ్మతో సహా నాకు పరిచయం వున్న చాలామంది స్త్రీలు ఎదుర్కోవడాన్ని చూసి వున్నాను కనుక. నాకు సొంత ఇల్లు కొనుగోలు చేసే  ఆర్ధిక స్థోమత వచ్చాక నేను ఆ ఇంటిని నా సహచరి పేరుతోనే కొనుగోలు చేయడం వెనుక శర్మ గారి ఆమె ఇల్లు ప్రభావం ఎంతయినా వుంది . చలం పేరుచెప్పగానే  “ఒక పువ్వు పూసింది ” శ్రీపాద పేరు చెప్పగానే “వడ్లగింజలు “పురాణం పేరు చెప్పగానే “నీలి ” గుర్తుకువచ్చినట్టు కవన శర్మ గారి  పేరుచెప్పగానే “ఆమె ఇల్లు “గుర్తుకువస్తుంది ఇంతకూ ఏముంది ఆమె ఇల్లు లో …. ?

స్త్రీకి పెళ్లి కాగానే ఇల్లు మారుతుంది . ఇంటి పేరు మారుతుంది . నిజానికి స్త్రీ పుట్టింట్లో వున్నపుడు కూడా ఆ ఇల్లు ఆమెది కాదు . ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే కదా . ఆడపిల్ల , ఆడ పిల్లే కానీ మన పిల్ల కాదు అనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాము. కానీ స్త్రీ మాత్రం పుట్టిన ఇంటి మీద శకుంతలోపాఖ్యానం లో శకుంతల పూల చెట్ల మీద , బుజ్జి దూడల  మీద , పిట్టల మీద ప్రేమ, మమకారం పెంచుకున్నట్టు గానే అనుబంధం పెంచుకుంటుంది . పెళ్లి అయ్యాక అత్తవారింటికి వెళ్ళాక  ఆ ఇల్లు కూడా తనదే అనుకుంటుంది . ఏదైనా, ఇల్లైనా ,బంధమైనా సొంతం చేసుకోవడం లో  స్త్రీ తరువాతే ఎవరైనా . కానీ అత్తగారు , భర్తా ఆమెకు పదే ,పదే  మీ పుట్టింటిలో , మీ ఇంట్లో అని తను  ఉన్న  అత్తగారి ఇల్లు తనది కాదు అని గుర్తు చేస్తూ వుంటారు . బాల్యం లో తల్లి తండ్రుల దగ్గరా , యవ్వనంలో భర్త దగ్గరా , వృద్ధాప్యం లో కొడుకు దగ్గరా  స్త్రీ వుండాలని మనుధర్మ శాస్త్రం చెపుతోంది . అంటే స్త్రీ ఎక్కడా తనంత తాను సొంతంగా ఉండలేదని , ఉండకూడదని అర్ధం . అందుకే ఆమెకు ఒక ఇల్లు అనే కాన్సెప్ట్ మన సాహిత్యం లో ఎక్కడా కనిపించదు . కానీ ఇల్లు తనది కాదు అని పదే, పదే  తల్లి తండ్రులు , భర్తా , పిల్లలు గుర్తు చేస్తుంటే ఆమె పడే నరక యాతన అనుభవం అయితే తప్ప అర్ధం కాదు , భర్త కి కోపం వచ్చినప్పుడల్లా “ఇది నా ఇల్లు . ఇక్కడ ఉండాలంటే నా ఇష్టం వచ్చినట్టే ఉండాలి “అని అంటూ ఉంటే  వినీ , వినీ , విసుగెత్తిన కమల తనకంటూ ఒక ఇల్లు కావాలి అనుకుంటుంది.

బంధువులు వస్తున్నారని , వాళ్ళు రాగానే కాఫీ కలిపిఇవ్వవచ్చు అని భావించిన కమల వాళ్ళు రాకముందే కాఫీ డికాషన్ కలిపి ఉంచుతుంది . ఆ సాయంత్రం వాళ్ళు రావడంలేదని తెలిసాక , రాత్రి కలిపిన  డికాషన్ పొద్దున్నే కాఫీ కలిపితే భర్త తాగడని  తెలిసి డికాషన్ పారపోసి తాజా గా  కాఫీ  కలిపితే “నీకు సంసారి లక్షణం ఒక్కటీ లేదు . రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది “అంటూ భర్త తిడతాడు.

అప్పుడే ఆమె తనకంటూ ఒక వుద్యోగం సంపాదించుకోవాలని . అలాగే సంపాదించుకుంటుంది . ఆ తరువాత జరిగిన సంఘటనలో భర్త ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటే , వుద్యోగం ద్వారా కాస్త ఆర్ధిక స్వతంత్రం లభించింది కనుక వేరే ఇల్లు వెతుకుని వెళ్ళిపోతుంది .

అద్దె ఇంట్లోకి చేరాక , అది అద్దెదే కావచ్చు , కానీ తన సొంతం . తన ఇల్లు  అన్న భావన ఆమెను ఆనందం లో ముంచెత్తుతుంది . తన ఇల్లు తన స్వేచ్ఛ , తన స్వర్గం అనుకుంటుంది . తమ్ముడు వచ్చి బావ దగ్గరికి వెళ్లడం ఇష్టం లేక పోతే నా దగ్గరికి వచ్చి వుండు అంటాడు . అది నీ ఇల్లు నాది కాదు కదా అంటుంది . అది తన ఇల్లు కాదని తమ్ముడు ఎన్ని సార్లు ఎలా తనకు తెలియ చెప్పాడో పూస గుచ్చినట్టు వివరిస్తుంది . తమ్ముడు నిస్సహాయంగా వెళ్లి పోయాక , కొడుకు వచ్చి తన  ఇంటికి రమ్మంటాడు , అది నీ ఇల్లు కానీ , నా ఇల్లు కాదు కదా అంటుంది . చివరకు భర్త వచ్చి ఇంటికి వెళదాం రమ్మంటాడు . అది మీ ఇల్లు . నాది కాదుకదా అంటుంది . నువ్వు ,నేను ఒకటి కాదా అని భర్త అడిగితె , ఇద్దరూ ఒకటి కాదని ఎన్ని సార్లు ఎలా తెలియ చెప్పాడో సోదాహరణం గా వివరిస్తుంది

రచయిత్రి బి. పద్మావతి కుటుంబం, సాహిత్య మిత్రుల మధ్య కవనశర్మ

ఈ కథ లో కవన శర్మ చేసిన అబ్సర్వేషన్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో . కొడుకు ముసలితనం తో ఒక్క దానివీ ఎలా ఉండగలవు అని ప్రశ్నిస్తే నువ్వు ఎలా ఉంటావో నేనూ అలాగే , ముసలి తనానికి స్త్రీ ,పురుష బేధం లేదు అంటుంది . పెళ్లి కాక ముందు ఇంట్లోని పాత పేపర్లు అమ్మితే వచ్చిన డబ్బును తమ్ముడు , అక్క చేరి సగం పంచుకుంటారు . అక్క పెళ్లి చేసుకుని వెళ్లి పోయింది కనుక ఆ పాత పేపర్లు మళ్ళీ అమ్మితే వచ్చే డబ్బులో భాగం అక్కకి ఇవ్వక్కరలేదు అనుకుంటాడు తమ్ముడు . పెళ్లయింది కనుక పుట్టింట్లోని పాత పేపర్ల అమ్మితే వచ్చిన డబ్బు మీద హక్కు ను అక్క కోల్పోయింది అనుకుంటాడు తమ్ముడు . ఆ హక్కును నేను నీకు బదలాయించేదాకా అది నాదే అంటుంది అక్క . అత్తగారింట్లో అత్తా , భర్తా తలుపులు వేసుకుని మరీ డబ్బు విషయాలు మాట్లాడుకోవడం , ముప్పై ఏళ్ళు అయినా ఆమె పుట్టింటి వాళ్ళను మీ వాళ్ళు , అంటూ మాట్లాడటం ఆ ఇంట్లో  తాను  అతిధి అని చెప్పడం గా ఆమె భావిస్తుంది . ఇలా చాలా మైన్యూట్  డీటెయిల్స్ ను కూడా ఎక్కడా మిస్ అవరు  కవన శర్మ తన అక్క కామేశ్వరి తన 55 ఏళ్ళ వయసులో వేసిన ప్రశ్నకి తమ్ముడు కవన శర్మ ఆమె 80 వ పుట్టిన రోజు జు సందర్భంగా ఇచ్చిన బహుమతి ఈ కథ.

ఆయనదే మరోకథ  గంట లేని బడి అంటే కూడా నాకు చాలా ఇష్టం . ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ పాఠశాలల హవా నడుస్తున్నది కానీ , అవి ఉనికి లోకి రాకముందే విద్య ఎలా వ్యాపారమయం అవుతుందో గంట లేని బడి లో విపులంగా చిత్రించారు కవన శర్మ . పల్లెటూళ్ళో జీవనం గడవక , మిరపకాయ బజ్జీలు వేయడం లో భార్యకున్న నైపుణ్యాన్ని పెట్టుబడిగా పెట్టి జీవనోపాధి పొందాలని పట్టణం వచ్చిన  రాయలు అనతి కాలంలోనే   బాగా డబ్బు సంపాదిస్తాడు. ఒక అందమైన అమ్మయిని తన కోరికల  కోసం చేరదీసి చిన్న ఇల్లు పెడతాడు . కష్టం లో తోడున్న పెద్ద భార్య కి చిన్న ఇల్లు , కోరి చేసుకున్న చిన్న భార్య కి పెద్ద ఇల్లు కట్టించాక , డబ్బు వచ్చింది ఇక పేరు రావాలి అని తహతహ లాడతాడు  తన వూరికి చెందిన వాడొకడు అక్కడ స్కూల్ నడుపుతున్నాడు అని తెలుసుకుని అతడి దగ్గరకి వెళ్లి స్కూల్ పెట్టడం లో ఆనుపానులు తెలుసుకుని  “రాయల్ స్కూల్ “పేరు తో  ఒక కొత్త స్కూల్  ప్రారంభించి తనకు ఎవరైతే స్కూలుపెట్టాడా లో సహాయం చేసారో వాళ్ళ స్కూల్ మూతపడేలా చేసి , చివరకు ఆ స్కూల్ ఐ టేకోవర్ చేసి అప్పటి దాకా స్కూల్ నడిపిన యజమానిని ప్రిన్సిపాల్ చేస్తాడు . ఒక స్కూల్ , ఒక జూనియర్ కాలేజీ  , మరో వృత్తి విద్యా కళాశాల , డే , రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టి రాయల్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్  కి యజమాని అవుతాడు .

మాజీ రాష్ట్రపతి జైలు సింగ్ పేరుతొ పెట్టిన ఒక జూనియర్ కాలేజీ లో కల్చరల్ వీక్ నడిపి మంత్రిగారిని ఆహ్వానిస్తాడు . మంత్రిగారు ఆ కాలేజీ లో  గంట లేకపోవడం గమనించి గంటలేదేమి అనిఅడిగితే  హాస్టల్ వార్డెన్ ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తాడు . ఆ కాలేజీ , హాస్టల్ పక్కనే ఒక జైలు ఉంటుంది  ఆ జైల్లో వార్డెన్ గా ఒక సింగ్ గారు పనిచేస్తూ ఉండేవాడు . రాయలు ఈ కాలేజీ కి హాస్టల్ కడుతున్నప్పుడు ఆ సింగ్ ని ఈ హాస్టల్ కి వార్డెన్ గా రమ్మని అడిగాడు . అందుకు సింగ్ ఒప్పుకుని వార్డెన్ గా వస్తాడు . ఆ సింగ్ కి ఈ కాలేజీ కీ , ఆ జైలు కీ . ఈ పిల్లలకీ , ఆ ఖైదీలకీ పెద్ద తేడా ఏమీ కనపడదు . అందుకని జైల్లో పాటించిన పద్ధతులే ఇక్కడా పాటిస్తూ ఉంటాడు . జైల్లో కొట్టే గంటలనే సంయానుకూలగా హాస్టల్ కి కూడా వర్తింపచేస్తాడు . తద్వారా గంట కొట్టే వాడి జీతం యాజమాన్యానికి మిగులు . జైలు పద్ధతులే పాటించడం వలన కాలేజీ కి ఇంత పేరు వచ్చింది” అని చెపుతాడు.  కవన శర్మ వ్యంగ్య వైభవానికి ఈ కథ  ఒక మచ్చుతునక .

ఇప్పుడు తక్కువ అయి పోయినవి కానీ ఈ దేశం లో ఇదివరకు సమ్మెలు ఎక్కువగా జరిగేవి . ఏ చిన్న విషయం జరిగినా కాలేజీలు , స్కూళ్ల మూసివేత . వీటన్నిటినడుమా విద్యాసంస్థలు పని చేసే రోజులు తగ్గిపోయేవి . అలా ఒక విద్యా సంవత్సరం లో ఒక యూనివర్సిటీ పది రోజుల పాటు నడచిన సందర్భాన్ని పురస్కరించుకుని  అమిత వ్యంగ్యం గా “దశ దినోత్సవం “పేరుతొ ఒక కథ  రాశారు ఆయన కవన శర్మ మరో కథ  యంతరపి అన్న కూడా నాకు చాలా ఇష్టం . కవన శర్మ వృత్తి రీత్యా ఇంజనీరు కనుక ఆ థెర్మో డైనమిక్స్ అన్నింటినీ మానవసంబంధాలకు అన్వయిస్తూ యంతరపి కథ  రాశారు . నిజానికి యంతరపి అంటే a thermodynamic quantity representing the unavailability of a system’s thermal energy for conversion into mechanical work, often interpreted as the degree of disorder or randomness in the system. the second law of thermodynamics says that entropy always increases with time” ఇవాళ సమాజం లో జరుగుతున్నది అదే . తల్లి అస్థికలను గోదావరిలో కలపడానికి బయలుదేరుతారు తండ్రీ కొడుకులు . కొడుకు వేగంగా కారు నడుపుతూ ఉంటే ఒక పసిపిల్లాడు అడ్డుగా వస్తాడు . కొడుకు బ్రేక్ వేస్తాడు . తల్లి పరుగున వచ్చి పిల్లాడిని అందుకుంటుంది . అప్పుడు తండ్రి ఇలా చెపుతాడు “బండి వేగాన్ని నియంత్రించడం బ్రేక్ తో కాదు . యాక్సిలేటర్ తో చేయాలి . అది శక్తినీ ,ఇంధనాన్నీ ఆదా చేస్తుంది . బ్రేక్ శక్తిని తిరిగి వాడుకోవడానికి పనికిరాని ఉష్ణం గా మారుస్తుంది . ముందుకు వెళ్ళవలసిన తప్పని సరి పరిస్థితులలో తప్పదనుకో” అంటాడు

తండ్రి చెప్పింది కొడుక్కి అర్ధం అవుతుంది . మానవ సంబంధాలు కూడా స్టాటిక్ కాదు . అవి నిరంతరం ముందుకు సాగాలి అంటే ఘర్షణ తప్పదు  . ఆ ఘర్షణ ఎంతవరకు అవసరమో తెలుసుకొనక పోతే మానవ సంబంధాలు గతి తప్పుతాయి . చాలా సున్నితంగా చెప్పిన కథ  ఇది.

రామ కాండం పేరుతో ఆయన రామాయణాన్ని రాశారు . రామాయణాన్ని చారిత్రక దృక్పధం తో తన సైన్స్ పరిజ్ఞానాన్ని జోడించి రాశారు . వాల్మీకి రామాయణం నుండి కొంత పక్కకుతొలగి కొన్ని, అతి కొన్ని కల్పనలు చేసి చారిత్రక రామాయణం గా రాశారు .

ఆయన కధలు, నవలలు , సైన్స్ వ్యాసాలు , భారతీయ సంస్కృతి మీద వ్యాసాలూ , యాత్రాకథనాలు , పిల్లల కధలు , ఇరాక్ డైరీ , చివరకు సినిమా సమీక్షలు కూడా . ఆయన సృజన విస్తృతమైనది . ఇప్పుడు ఆయన లేకపోవడం , నిజంగా తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. ఆయనకు నా నివాళి.

*

వంశీ కృష్ణ

11 comments

Leave a Reply to Kalavathi M Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవనశర్మ గారి గురించి వినటమే కానీ చదివింది తక్కువ
    ఆ లోటు తీర్చారు వంశీకృష్ణ గారూ
    మంచి విశ్లేషణ తో
    ధన్యవాదాలు

  • వంశీకృష్ణగారు ..కవనశర్మ గారి ఆమె ఇల్లు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు . లేక పోతే ఒక అద్భుతమైన కధని మిస్ అయ్యేదాన్ని.మంచి ఇతివృత్తం స్త్రీల జీవితానికి అద్దం పట్టిన కవిత .ఆమె యిల్లు లో ఆమె చిత్రీకరణ చదివిన వారిలో ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుందనడంలో సందేహం లేదు . నాకు అబ్బూరి ఛాయాదేవి గారి సుఖాంతం గుర్తుకొచ్చింది. కవన శర్మ గారి వంటి గొప్ప రచయితని మనం కోల్పోయినా ఇటువంటి సాహిత్యంతో మనతోనే ఉన్నారనిపిస్తుంది .

  • కొన్ని రచనలు చదివాను కానీ ఈ కథ నేను చదవలేదు. “ఆమె ఇల్లు” లోని పరిస్థితులు చాలా మంది ఎదుర్కొన్నవే. బాగా విశ్లేషించారు. ఆయనకు నివాళి.

  • Kavanasarma gari kathala gurinchi telusukovadam baagundi..chaalaa gadhata unna subjectsni teesukoni raasaaru..nijamgaa aayana lekapovadam saahiteelokaaniki teerani lotu..May his soul Rest in Peace

  • సర్, కవన శర్మ గారిగురించి మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ చూసాను , అయన గురుంచి విన్నాను కానీ అయన కథలు ఎప్పుడు చదవలేదు . చాలా చక్కగా వారి గురుంచి వ్రాసారు . ధన్యవాదములు .

  • కవన శర్మ గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారు వ్రాసిన “ఆమెఇల్లు” కథ నాకు చాల నచ్చింది. వంశీక్రిష్ణ గారు, మీరు పైన చెప్పిన విధంగా వారి మిగతా కథలు “గంట లేని బడి, దశదినోత్సవం మరియు యంతరపి” కథలు తాలుకు లింకులు ఇక్కడ పోస్ట్ చెయ్యవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు