కళాత్మకమైన విమర్శ వుందా?!

నేను చదువుకునేటప్పుడు సాహిత్య దర్శనం అనే వ్యాసాలు పుస్తకం మాకు పాఠ్యభాగంగా ఉండేది.
పన్నెండు సాహిత్యవ్యాసాలు, పూర్తిగా 150 పేజీలు కూడా లేని పుస్తకం.
ఆ పుస్తకాన్ని మా మాష్టారు దాదాపు రెండునెలల పాటు పాఠం చెప్పేరు. అందులో మొదటి వ్యాసం పేరు విమర్శకళ. ఆ ఒక్కవ్యాసమూ గట్టిగా పది పేజీలు లేని వ్యాసాన్ని చెప్పడానికి ఆయన ఇరవై క్లాసులు వెచ్చించారు.
ఆశ్చర్యమే కదూ
మిగతా కాలేజీల్లో చదువుకున్న తోటి విద్యార్ధులను అడిగితే ఎవరూ ఆ పుస్తకాన్ని పాఠం గా చెప్పలేదుట. ఏముంది అందులో వ్యాసాలే గా చదివేసుకోండి అన్నారట.
అందువల్ల వాళ్లు సాహిత్యరసాస్వాదనకి సంబంధించి చాలా కోల్పోయారు. మేం మాష్టారి వల్ల ఆ మార్గాల వెంట నడక ఎలాగో నేర్చుకున్నాం, ఎంత దూరం నడిచేమో చెప్పలేం గానీ.
ఇంతకీ ఈ వ్యాసాలు రాసిన వారు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు. మా మాష్టారు ఆయన గురించి చెప్పేటప్పుడు మామాష్టారూ అనేవారు. విశ్వనాధ సత్యనారాయణ గారి గురించి చెప్పేటప్పుడు మా గురువు గారు అనేవారు.
మాష్టారు వీరశైవులు నిష్ఠాపరులు. ఆయనతో ఒకసారి కాటూరి వారు శరభయ్యా ఓ సిగరెట్ కాల్చు అని ఇవ్వబోతే మాష్టారు నవ్వి ఊరుకున్నారట. అలా కాదు. జీవితం లో అన్నింటినీ తెలుసుకోవాలి అంటే రుచి చూడాలి అని చూపించేరట. మాష్టారు నవ్వుకుంటూ, మధ్యలో ముక్కుపొడుం పీలుస్తూ ఈ ముచ్చట చెప్పేరు.
కాటూరి వారు ఎంత సనాతనుడో అంతటి ఆధునికుడు. “ప్రాచీనమిత్యేవ నసాధు సర్వం” అనగలిగిన వాడు
ఆయన ఈ వ్యాసం లో సాహిత్య విమర్శ అంటే ఏమిటో చెప్తూ ఈ విమర్శ కొంతమంది వల్ల కొన్ని సార్లు కళ గా కూడా మారుతుంది అని ఉదాహరణ పూర్వకంగా చెప్తారు.
దాని గురించి మనలో మనం ముచ్చటించుకునే ముందు అందులో ఆయన రాసిన ఒక పేరా చూద్దాం.
ఆయన సరళ గ్రాంధికంలో రాసేరు. అదే యథాతథం గా.
“అజంతా గుహచిత్రములయందొకానొక చిత్రమున బాలకుడొకడు నిలిచి యున్నాడు. వాని వెనుక ఒక స్త్రీ మూర్తి నిలిచి యున్నది. ఆ బాలుని భుజములపై తనచేతులుంచి ఇంచుక వంగి ఉన్నదా స్త్రీ. బాలుడు మోడ్పుకరములతో ముందుకు చూచుచున్నాడు. వాని చూపుల వెంటనే తల్లి చూపులు కూడా ప్రసరించుచున్నవి.
దీనిని వ్యాఖ్యానించునప్పుడు బాలుని వయస్సును, ఆ స్త్రీ వయస్సును చెప్పి, వారి శరీరవర్ణమును సౌకుమార్యమును సూచించు రేఖలను వివరించి, వారు ధరించిన వస్త్రములను ఆభరణములను వర్ణించి, వారు ఏ భంగిమ లో నిలిచిఉన్నారో తెలిపి వారు మాతా పుత్రులని, వాకిట నిలిచిఉన్నారని తెలుపుచూ చిత్రములోని వర్ణములను వాటి సమ్మేళనమును కూడా వ్యాఖ్యాత వివరించినచో అది కేవలము ఆ చిత్రమును వాచ్యార్ధము చెప్పినట్లు అగును.
అంతేకాని వారిరువురూ ఎవరు? ఎందులకిట్లు నిలిచియున్నారు? వారి చూపులు దేనిని సూచించుచున్నవి? వాటి ద్వారా చిత్రకారుడు మనకేమి చెప్పదలచుకొన్నాడు
వారి చూపులును , వినమ్రమైన వారిశరీర భంగిమలునూ ఏమి ధ్వనింపజేయుచున్నవో చెప్పినప్పుడు ఈ విమర్శ కళ అనిపించుకొనును.
కేవలము తల్లీ బిడ్డలను చూపుట చిత్రకారుని ఉద్దేశము కాదు. ఆ మూర్తులు రెండునూ భక్తిని, వినయమునూ మనకు పట్టిఇచ్చుచున్నవి.
అవి బౌద్ధగాధాచిత్రములగుట వలన భక్తి మయములైన వారి చూపులో, వినమ్ర శరీరములో, మోడ్పుచేతులలో దూరమునుండి భిక్షార్ధము ఏగుదెంచు బుద్ధభగవానునడు మనకు ప్రత్యక్షమగుచున్నాడు.
అంతట ఆ తల్లిబిడ్డలలో యశోధరా రాహులులు కూడా మనకు దర్శనమిత్తురు. అప్పుడు వారి మూర్తులలోని భక్తి భావముల అర్ధము మనకు తెలియును.
ఇట్లు శిల్పిచేసిన రూపమందు రసమయమైన రూపాంతరమును దర్శించువిమర్శకు కళాగౌరవము లభించును. “
ఇదీ ఆయన చెప్పే విమర్శ కళ.
తెలుగు భాషలో సరియైన విమర్శ లేదు అన్న ఆక్రోశం చాలాసార్లు విన్నాను. ఈ ఆక్రోసిస్తున్న వీళ్లు దేన్ని విమర్శ అంటున్నారో మరి. పైన చెప్పిన విమర్శకళ చేసే విమర్శకులు మనకు లేరనడం సరి కాదు.
ఇంకా ఇలా అంటున్నారు కాటూరి వారు. వారి సరళ గ్రాంధికాన్ని నేను సరళ వ్యావహారికం చేస్తున్నాను
కవి కల్పించిన రసభావాలను దేనికవి విడదీసి చూపడం విమర్శ తాలూకు ప్రాధమికదశ . కానీ ఇది కళ కాదు. కళంటే ప్రతి సృష్టి. కాబట్టి ఇలాంటి విమర్శలో విడదీయడమే కాని ప్రతిసృష్టి లేదు. అంచేత ఈ విమర్శ కళ కాదు.
మరి కళాత్మకమైన విమర్శ కు దారి ఏది అంటే ఇంకా ఇలా చెప్తారు.
ఈ లోకంలో మనం కష్టసుఖాలూ, రాగద్వేషాలూ అనుభవిస్తూంటే కవి వాటిలో రసభావాలను చూస్తాడు. కారణం అతనిది అతీంద్రియానుభవం. దాన్ని చెప్పడానికి అతను ఇంద్రియానుభవాలను మాత్రమే చెప్పడానికి పుట్టిన మాటల ద్వారానే దాన్నీ చెప్పాలి. దానికోసం ప్రత్యేకమైన మాటలేవీ లేవు.
అందుకోసం కవుల అలంకార యుక్తమైన శైలిని ఎన్నుకున్నారు. వాటి ద్వారా వారు చెప్పినమాటలకు రూపాంతరీకరణ వస్తుంది.
ఉదాహరణకు ద్రౌపది అజ్ఞాతవాసం లో ఉండి భీముడితో మాట్లాడే సందర్భంలో నకులుడి అందం గురించి చెప్తూ “తన యొప్పెదురగన్న తగిలి ఎవ్వరికైన మలగి క్రమ్మరచూడవలయువాడు” అంటుంది.
ఒకసారి ఎదురుపడితే ఎవరైనా సరే వెంటనే వెనక్కి తిరిగి చూచేటంత అందం అతనిది అని.
ఇది ఒక తెరిచి పెట్టిన కిటికీ అంటారు వారు . కవులు తమ పదాల ద్వారా ఇలా కిటికీలు తెరిచి పెడతారు. అందరూ ఆకిటికీల ద్వారా ప్రయాణించలేరు. కానీ ఎంత దూరం ప్రయాణించగలిగితే అంత లభిస్తుంది. ఆ ప్రయాణ రహస్యం చెప్పగలగడమే విమర్శ కళ అంటారు ఆయన.అది చెయ్యగలవారే విమర్శకులు.
“చెలువములన్నీ చిత్రరచనలే, చలనములోహో నాట్యములే”
అన్న పింగళి నాగేంద్రరావు గారి పదాల పొందిక తెరిచిన కిటికీ లాగే ఉంటుంది.
“చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ పరవశమూ” అని నాయిక అడిగితే
“ఏకాంతములో నేనూహించిన అందమే నీలో ఉన్నదనీ” అంటాడు నాయకుడు అంటూ ఆ ఊహించిన అతీంద్రియానుభవాన్ని గురించి అలా చెప్తాడు. చెలువములన్నీ… అంటూ.
చెలువములు అంటే కేవలం అందాలు  రంగురంగులుగా కన్పిస్తున్నాయి మనసుకి. కాబట్టి చిత్రరచనలే. పెయిటింగ్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే కదలని అందాలు బొమ్మల్లా ఉన్నాయి.
కదిలే అందాలు అంటే కదలికలు. అవి విలాసవంతంగా ఉన్నాయి. నాట్యాలే అవి. మరోమాట లేదు. మామూలు కదలికలు నాట్యం కాదు. కొన్ని సౌందర్యాత్మక భావాల ప్రకటనలు నాట్యం. అవుతుంది. . ఆమె చలనములు (మధ్యలో ఓహో అని ప్రశంసిస్తూ) నాట్యములే అంటున్నాడు.
ఏకాంతంలో తను ఊహించిన అందాలన్నీ ఆమె లో ఇలా కనిపించేయిట. ఇది ఇంద్రియాతీతమైన అనుభవం. ఊహ లోది కాబట్టి. దాన్ని మనకు అందించడానికి కవి అతి తక్కువ పదాలు వాడడం గమనించాలి.
ఇదీ కవులు పదాలతో తెరిచిపెట్టిన కిటికీ లోంచి మనకి ఆనినది. ఇంకా బాగా చూడగలిగిన వాళ్ళకి ఇంకా మరెంతో కనిపిస్తుంది.
ఒక్కొక్కసారి కవికి స్ఫురించనిది కూడా విమర్శకుడికి స్ఫురిస్తుంది. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
అందుకే కవులు ఉపయోగించిన పదాలు స్ఫటికముల వంటివై కవి భావనలో కరిగి కొత్తవన్నెలు, రుచులు, వాసనలూ సంపాదించుకుని కవి భావించిన దివ్య లోకాలకు కిటికీలు ద్వారాలూ తెరిచిపెడతాయి.
అలా తెరిచిపెట్టడమే కళల పని.
ఆ శబ్దాల ఆవరణను ఛేదించి రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగరగలిగితే అప్పుడు కళల, కవిత్వాల సారం అందుతుంది
అంతే గాని ఆ సారాన్ని కవులు కళాకారులు గోరుముద్దలు గా మనకు అందించరు. అందిస్తే అవి కళలే కావు.
ఈ అందిచడమన్న పని మనందరి కోసమూ చేసేవాడే విమర్శకుడు. అంటారు కాటూరి.
“అతను కావ్య పరిశ్రమ అధికముగా చేసినవాడు. లోకానుభవమూ. సౌందర్యబోధా కలవాడు. అతను తన చేయి అందించి ఆ సౌందర్యసీమలకు మనను నడిపించుకొని పోగలడు.
మన అందరిలో సౌందర్య బోధ ఉండనేఉన్నది. కాని నిద్రించుచున్నది. దానిని మేలుకొలుపుటే కవులు చేయుపని. తరువాతపని చేయవలసిన వాడు వ్యాఖ్యాత యే. ” అనీ అంటారు
ఎందుకంటే ఇంద్రియజగత్తుకు హద్దులున్నాయి. అతీంద్రీయ జగత్తుకు హద్దులు లేవు. వెళ్లగలిగిన వారికి వెళ్లగలిగినంత.
సౌందర్యానికి లేనట్టే భావనకు కూడా హద్దులు లేవు.
కవి తెరిచి పెట్టిన ఈ గవాక్షం నుంచి మంద దృష్టులు కొంతే చూడగలరు. తీక్ష్ణదృష్టులు చాలా దూరం చూడగలరు. వారే కళావిమర్శకులు లేదా విమర్శను కళ గా మార్చగలవారు అంటారు ఆయన.
ఐతే చివరగా ఈ మాట అంటారు.
ఎంత చూసినా తరగని ఆ పరసీమ ను కవీ విమర్శకుడూ కూడా చూడలేరు అని.
కానీ ఈ దుఃఖపూరితమైన లోకం లో పాలకడలి లాంటి సంతోషాన్ని అందించిన కవులూ కళాకారులూ ఏం అందించేరో దాన్ని మన దోసిళ్లలో నింపగల విమర్శకులు ఎంతగానో అవసరం అని వ్యాసం పూర్తి చేస్తారు
ఇది చాలా ఏళ్లకిందటే కళావిమర్శ గురించి నాబుద్ధి లో ఒక బీజాన్ని నాటింది. అది మొలకెత్తి బోన్సాయ్ చెట్టు గానే ఉండిపోయిందేమో నేను చెప్పలేను గానీ మిగతా కళల మాట ఎలా ఉన్నా అంటే అవి పెద్దగా అర్ధం కాకపోయినా కవిత్వం తాలూకు రూపాంతరత్వం కొంత కనిపిస్తూనే ఉంటుంది.
ఈ కవిత చూడండి
నగరం లోని వసంతం మీద కవిత
“వసంతం ఈ నగరాన్ని జల్లెడపట్టింది
ఈ జల్లెడలో పలచనివి
పైకి తేలుతున్నాయి, మరీ
బరువైనవి కిందకి దిగుతున్నాయి”
పై వాక్యాల్లోంచి కవి జల్లెడ లక్షణం చెప్పేడు. ఐతే జల్లెడ లక్షణాన్ని తారుమారు చేశాడు.
“టవర్లు, భవనాలూ ఫ్లై వోవర్లు
కిందకి జారుతున్నాయి
కొమ్మలు, చిగుళ్ళు కిందకు వాలిన రేలపూల గుత్తులు కూడా పైకి ప్రవహిస్తున్నాయి”
ఇక్కడ వసంతం ఏం చేసిందో దాన్ని కవి దర్శించాడు. తన అనుభవాన్ని మనకు అందించడానికి అవే పదాలు మనం వాడే మామూలు పదాలే వాడేడు, కానీ వాటిద్వారా పెద్ద గవాక్షాన్ని తెరిచాడు.
అందులోంచి వసంతాగమనంతో ఒక్కసారి గా నగరంలో చిగిర్చిన చెట్లూ, కొమ్మలూ వేలాడుతూన్న రేలపూల గుత్తులూ నగరంలోని కాంక్ట్రీటుతనాన్ని కిందకి దిగజార్చేయనీ, కిందకి వాలిన రేలపూల గుత్తులు కూడా పైకి ప్రహించేయంటాడు.
నగరపు యాంత్రికత పైన వాడిన పదాల్లోఉంది. అది నిత్యమూ కనిపిస్తూన్న, కనిపించని బరువు బయటకీ మనసుకి కూడా.
బరువైన మనసుని  వసంతం తేలుతూ తేలిక చేస్తోంది. కిందికీ వాలిన రేలపూల తేలిక మరింత తేలిక చేస్తోంది దాని ద్వారా ప్రఫుల్లం చేస్తోందన్న మాట చెప్పడు. కానీ ఇది కావ్యజ్ఞుడికి తెలుస్తుంది.
కొత్తచిగుళ్ల పూల వెల్లువ నగరమంతటినీ మరేదీ కనపడనంతగా ఆవరించడం చెప్పడానికి బరువైనవి కిందకి జారడం గురించి చెప్తాడు. నిజానికి జల్లెడ లో తేలికైనవి కిందకి జారి బరువైనవి పైకి మిగులుతాయి. కానీ ఇది కవి జల్లెడ.
అడవిలోనో పల్లెలోనో ప్రవేశించిన వసంతం గురించి చెప్పడం కాస్త సులువు. కానీ నగరంలో వసంతం కోసం వెతకాలి. కానీ కవి ఇక్కడ పాఠకుడి చూపును తిప్పుతున్నాడు. వసంతం పట్టిన జల్లెడ నగరానికి కాక పాఠకుడి కే. ఇదే కవిత్వం రూపాంతరం చెందడం అంటే. ఇదీ కవి తెరిచి పెట్టిన గవాక్షమే. మనమే చూపు సారించాలి.
మరో కవిత
కవిత పేరు తుఫాను
ఈమె ప్రేమ తుఫానుకి
గింగిర్లు తిరిగి
ఎగిరిపోయే
ఎండుటాకుని.
ఐతే
ఈ తుఫాను వేరు.
ఎగిరివెళ్లి ఎండుటాకు
తిరిగి కొమ్మ నతుక్కుంటుంది
కవి చాలా తక్కువ పదాలు వాడేడు. ఆమే, తనూ, తుఫానులాంటి ప్రేమ. తానేమో ఎండుటాకు. ఏది ఏమైనా ఈ ఎండుటాకు ఎటో పోకుండా తిరిగి కొమ్మనే అతుక్కుంటుంది ట.
 ఈ కాసిని పదాల లోంచీ కవి ఆమె ఏం చేసినా ఆమె లేనిదే బతకలేనంటాడు,అని నా కర్ధమయింది. అంతే నంటారా!!
కవి తెరిచిన కిటికీ లోంచి నా చూపు అంత దాకానే వెళ్లింది. మీరు కూడా చూసి చెప్పే పని పెట్టుకోండి.
మీ విమర్శ కూడా కళగా మారి తీరుతుంది.
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “అతను కావ్య పరిశ్రమ అధికముగా చేసినవాడు. లోకానుభవమూ. సౌందర్యబోధా కలవాడు. అతను తన చేయి అందించి ఆ సౌందర్యసీమలకు మనను నడిపించుకొని పోగలడు.
    మన అందరిలో సౌందర్య బోధ ఉండనేఉన్నది. కాని నిద్రించుచున్నది. దానిని మేలుకొలుపుటే కవులు చేయుపని. తరువాతపని చేయవలసిన వాడు వ్యాఖ్యాత యే. ” అనీ అంటారు
    ఇది విమర్శకుని నిర్వచనం.
    తరవాత రాసిన వాక్యాలు ఇవి.
    ఎందుకంటే ఇంద్రియజగత్తుకు హద్దులున్నాయి. అతీంద్రీయ జగత్తుకు హద్దులు లేవు. వెళ్లగలిగిన వారికి వెళ్లగలిగినంత.
    సౌందర్యానికి లేనట్టే భావనకు కూడా హద్దులు లేవు.
    కవి తెరిచి పెట్టిన ఈ గవాక్షం నుంచి మంద దృష్టులు కొంతే చూడగలరు. తీక్ష్ణదృష్టులు చాలా దూరం చూడగలరు. వారే కళావిమర్శకులు లేదా విమర్శను కళ గా మార్చగలవారు అంటారు ఆయన.
    ఇందులో అతీంద్రియ జగత్తు అంటే ఏమిటి
    బహుశా కాటూరి వారి ఉద్దేశ్యం ఊహా లేదా మనో జగత్తు అయుండాలనిపించింది.
    కాకపోతే ముగిపు వాక్యం అంటూ వీరలక్ష్మి రాసిన వాక్యంలో ఇలా ఉంది. ఎంత చూసినా తరగని ఆ పరసీమ ను కవీ విమర్శకుడూ కూడా చూడలేరు అని.
    ఆ అతీంద్రియ జగత్తు పరసీమ అనేవి నాకు పంటికింద రాళ్లలా అనిపించాయి. అంతకన్న కవీ, విమర్శకుడూ కూడా చూడలేడు అనటంలో ఉద్దేశ్యం ఏమిటి అన్న ప్రశ్న కలిగింది. కవి చూడలేనిది విమర్శకుడు చూడగలడు అతను కూడా చూడలేనిది పఠిత చూసేలా చేసేదే విమర్శకళ అని అంటే బాగుండేది అనిపించింది.
    వీరలక్ష్మి తన అభిప్రాయం చెపితే సంతోషిస్తాను.

    • ఆ చివరి వాక్యం కూడా ఆయనదే. బహుశా అది ఒక తాత్వికత కు చెందినది కావచ్చు. ఎందుకంటే ఈ లోకం (ప్రపంచం కాదు) అనంతం కాబట్టి దానిని పునసృష్టి చేసేక్రమంలో ఆ అనంతత్వం గురించి ఆ మాట అని ఉండవచ్చు.
      ధన్యవాదాలు అన్నా

  • ఎగిరివెళ్లి ఎండుటాకు
    తిరిగి కొమ్మ నతుక్కుంటుంది-

  • విమర్శ అంటే విడమర్చి చెప్పే కళ.మహా కవుల ఆంతర్యం
    ఆవిష్కరించే ప్రయత్నం అని హృద్యంగా వర్ణించారు.ఈ వ్యాసం దాచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించేలా ఉంది.అభినందనలు.నమస్సులు.మేమ్.

  • చాలా బావుంది వ్యాసం. మీకు పాఠం చెప్పిన మేష్టారు మల్లంపల్లి శరభయ్యగారు కేవలం పాఠ్యాంశం (పాఠం) మాత్రమే చెప్పి వదిలెయ్యలేదు. ఏ విధంగా బోధించాలో కూడా నేర్పారు. లేదా మీరు వారి బోధనావిధానాన్ని , పటిమను పాఠం వినడం ద్వారా గ్రహించారు. ఆయన వద్ద చదువుకున్న మీరూ , మీ వద్ద చదువుకున్న మీ విద్యార్ధులు , అదృష్టవంతులు.

  • చదవగానే నా మనసుకు రెండు విషయాలు వచ్చాయి
    ఒకటి “”యథా రాజా తథా ప్రజా”
    రెండవది” సాగరసంగమంలోని “ఈ సంభాషణ .
    యథో హస్త తథో దృష్టి
    యథో దృష్టి తథో మనః
    యథో మనః తథో భావ
    యథో భావ తథో రసః
    విమర్శగురించి మంచి విశ్లేషణను రాశారు. చాలా బాగుంది. ధన్యవాదాలు!!

  • స్పష్టాస్పష్టం గా కాకుండా కవిత్వాన్ని టెక్నికల్ గా, విమర్శనాత్మకంగా

    ఆనందించొచ్చు అని చెప్పారు.బావుంది లక్ష్మి గారూ ఈ నెల శేఫాలిక.

  • వ్యాసం బాగుంది. తెలుగులో విమర్శలేదు అని ఒకరు. రచయితలు విమర్శను స్వీకరించటంలేదు అనిఒకరు.దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కాస్త చెప్పండి మేడమ్

    • తెలుగులో తగినంత విమర్శ లేదు అంటారు. కావచ్చు. కానీ ఉన్న విమర్శ పుస్తకాలు చదివి వారు ఎందరు.
      విమర్శ అంటే లోపాలు ఎంచడమే కాదు కదా.ఒకవేళ విమర్శకుడు విమర్శించ దలుచుకుంటే ఎవరికోపతాపాలతో సంబంధం లేకుండా ఆ పని చెయ్యాలి. కవి కి రచయుతకు తమ రచనల మీద చాలా ఆపేక్ష ఉంటుంది. లోపం చూపెడితే తట్చుకోగలవారు అరుదు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు