కల సంపూర్ణమయింది!

తెరచిన పుస్తకంలా పచ్చని వనం. దూరంగా ఎక్కడో పక్షుల కుహుకుహు గానం. దారంటూ లేకపోయినా ఎగిరే సీతాకోకచిలుకల వెంబడి దారి చేసుకుంటూ గానాన్ని వెతుకుతూ ఒంటరిగా సాగిపోతున్నా. ఒంటరితనమనే ఫీల్ లేదు ఎక్కడా. సీతాకోకల వెంబడి పరిగెడుతూ ఉన్నా. అందమైన పూల గుత్తుల పరిమళం ఆఘ్రాణిస్తూ… తోరణాలు కట్టిన తీగలకు కరచాలనమిస్తూ… దూరమనిపించలేదు ఎంత నడిచినా. చల్లని సరస్సు, స్వచ్ఛమైన నీళ్ళలోకి తొంగిచూశా. అస్పష్టంగా ఏదో రూపం. ఎవరది, నేనేనా…? అవును నేనే. అయితే ఇప్పటి నేను కాదు. ఎన్నేళ్ళ కిందటి నేనో… సరస్సు పక్కనే పెద్దపెద్ద చెట్లు. క్రిందికి జారిన ఊడలతో వేసిన ఉయ్యాల. ఊడలను అలంకరిస్తూ అల్లుకున్న లతలు. అబ్బ, ఎవరన్నా ఊయలూపితే బాగుండు. ఎవరో ఎందుకూపాలి? నేలను తొక్కిపట్టి ఊయలలూగిన రోజులు మరచిపోయానా? బలంగా నేలను అదిమిపట్టి ఊయల ఊపుకున్నా. శరీరమంతా తేలిగ్గా, హాయిగా ఎంత బాగుందో! చిట్టచివరి చిగురాకు కొమ్మలను, నింగిలోని మబ్బులను తాకుతూ… కాలమిలా ఆగిపోతే ఎంత బాగుండు.

అరె, ఎవరు నన్ను తోసేశారు? ఎందుకిలా కింద పడిపోయాను? ఈ ఇసుక ఊబి ఎక్కడ్నుంచి వచ్చింది? సరస్సేదీ…? ఈ ఇసుక ఊబిలో కూరుకుపోతున్నాన్నేను. పైకి లాగేందుకు ఎవరూ లేరా? పచ్చటి అడవి, పక్షుల గానం అన్నీ దూరంగా జరిగిపోతున్నాయి. ఇసుక అమాంతం నన్ను మింగేస్తోంది. బాబోయ్ ఎలా బయట పడటం…? ఊపిరాడటం లేదు నాకు.

@     @     @

ఠకీమని కళ్ళు తెరిచా. చుట్టూ చీకటి. గుండె పట్టేసినట్లు వొళ్ళంతా చెమటలు. సెల్ ఫోన్లో టైమ్ చూశా. 2.42. తెల్లారటానికింకా మూడు గంటల పైన పడుతుంది. నా నిద్రకూ ఇంకా రెండు గంటల సమయం మిగిలే ఉంది. ఏంటీ భయంకరమైన కల, ఇసుక ఊబిలో కూరుకుపోతున్నట్లు? అంతకంటే ముందు… అదేదో అందమైన కల. గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఊడల ఊయల, చల్లని సరస్సు, పూల గుత్తులు, తీగల తోరణాలు, రంగురంగుల సీతాకోకలు, పక్షుల గానం, తెరచిన పుస్తకం లాంటి పచ్చని అడవి-అన్నీ మసక మసగ్గా కళ్ళముందు కదలాడాయి. ఎంత అందమైన కల! ఇంత అందమైన కలలోకి ఇసుక ఊబి వచ్చి ఎందుకు లాగేసినట్టు? చాలా అసంతృప్తిగా ఉంది. మళ్ళీ ఆ పచ్చని కల వస్తే బాగుండు. ఇక నిద్ర పట్టేనా? అటూ ఇటూ దొర్లుతూ దూరమైన నిద్రను కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తున్నా.

“అల్లా హో అక్బర్” మసీదు లోంచి మేలుకొలుపు. టైము చూస్తే అయిదూ ముప్పావు. ఇంత లేటయిపోయింది. ఈరోజు ఆదివారమేగా. డ్యూటీ ఏం లేదు. అయినా అలవాటయిపోయిన జీవితం. సూర్యుడి కంటే ముందు నిద్రలేవటం దశాబ్దాల అలవాటు. డాబా మీదకెళ్ళి నడవడం మొదలెట్టా. కాస్త నడకకు నడక. చల్లగా తాజా గాలి పీల్చుకుంటూ ఉదయ భానుడితో కాస్త రీఛార్జి కావచ్చు, నచ్చిన పాటలు వింటూ నడుస్తూ శరీరంతో పాటు మెదడుకూ కాస్త వ్యాయామం ఇవ్వచ్చు. నాలుగక్షరాలు పుట్టడానికి ఆలోచనలు పురుడు పోసుకునేది ఈ ప్రశాంత ప్రభాతంలోనే మరి.

“ఇంకా నీ నడక పూర్తి కాలేదా? కాస్త కాఫీ ఏమన్నా నా ముఖాన కొట్టేదుందా?” ఆదివారమైనా ఈ హడావుడి మాత్రం మారదు. నాకంటూ కేటాయించుకున్న ఓ గంట కూడా ప్రశాంతంగా ఉండటానికి లేదు. పేపర్లేవీ ముట్టుకోకుండానే వంటగది ప్రవేశం. పనిలో అలసట మరచిపోవడానికి కాస్త రేడియో పెట్టుకుంటానా… “అబ్బ ఈ రేడియో బోర్.” అంటూ రేడియో బందయి, టీవీ ఆన్ చేయబడుతుంది. అదృష్టం నా వైపు నిలబడి, టీవీ సిగ్నల్స్ లేక రేడియో భాగ్యం కలిగింది మళ్ళీ. “కీరవాణి… చిలకల కొలికిరో…” చెవుల బడిన పాట, గొంతులో కెళ్ళి నోట్లోంచి హమ్మింగ్ అవుతుందా, “రేడియోనన్నా పాడనివ్వు, నువ్వన్నా పాడు.” ఇంత మెత్తగా చెబితే ఇక గొంతెలా లేస్తుంది? ఇసుక ఊబిలో పడిపోతున్నాను.

“రోజూ చనిగితిన్నాల చట్నీ నేనా? నాకు ఎర్ర కారం దోసె కావాలి.” “నాకు ఎగ్ దోసె వేయవా?” “నాకు టమేటా చట్నీ కావాలి.” “ఇన్ని వెరయిటీలు చేయడానికి ఇదేమన్న హోటలా?” గొంతులో నుంచి బయటికొచ్చిన చిరాకును పట్టించుకోరెవ్వరూ. “ఈరోజు ఆదివారం కదా, మధ్యాన్నం బిర్యానీ చేయవా?” “బిర్యానీ వద్దు, స్వీట్ చెయ్యి.” కాఫీలు, టిఫినీలు పూర్తి కాకనే మధ్యాన్నం భోజనానికి మెనూ ఆర్డర్ రెడీ. ఒకటి తరువాత ఒకటి, ఏం చెయ్యాలో ‘థింకింగ్’, ఎలా చెయ్యాలో ‘ప్లానింగ్’-సూర్యుడు నడినెత్తిన చేరేసరికి ఊపిరి సగమవుతుంది. కాస్త ఉత్సాహం నింపుకుందామని గళమందుకుంటానా… “అబ్బ మొదలెట్టిందండీ పీసులీల గాత్రం” అంతే గప్చుప్. ఇసుక ఊబిలో మరింత కూరుకుపోతున్న దృశ్యం కళ్ళముందు కదిలింది.

ఆ పూట కార్యక్రమం ముగిసిపోయి, అలసిపోయిన శరీరం విశ్రాంతి భంగిమ లోకి మారాలని ఆరాటపడితే తదుపరి చేయాల్సిన కర్తవ్యాలు అడ్డుకట్ట వేస్తాయి. నెలకో సారి ఉప్మా చేసినా, రోజూ ఇదేనా అంటూ పేచీ పెట్టే కడుపు పంటల కోసం ఇడ్లీకి మినప్పప్పు నానబెట్టే పని ముగించి, శయన భంగిమలోకి వస్తూ టైం చూస్తే 2.42. పొద్దుట చదవలేని పత్రికల నుంచి చద్ది వార్తలన్నా చప్పరిద్దామని పోగేసుకుంటే ఎప్పుడు ముఖం మీద ముసుగై వాలిపోయాయో!

@     @     @

శరీరం చాలా తేలిగ్గా ఉంది. వెన్నెల మెట్లెక్కి మబ్బుల తేరు చేరుకున్నా. నెలవంక తోటమాలిని బతిమాలి చుక్కల మల్లెలు తెంచుతున్నా. మనసంతా గాలిలో తేలిపోతున్నట్లు ఎంత హాయిగా ఉందో! అరె ఈ మబ్బులు తునకలై చెల్లాచెదురై పోతున్నాయేమిటి? అయ్యో నేను కిందపడి పోతున్నాను. ఎవరన్నా పట్టుకోండి పడిపోకుండా. పడిపోతున్నా… పడిపోతున్నా. నింగి లోంచి భూమిలోకి, అక్కడి నుంచి పాతాళం లోకి జారిపోతున్నా. జారిపోతూనే ఉన్నా…

@     @     @

“అక్కా పాలు.” కాలింగ్ బెల్ తో పాటు చెవి తాకిన మాటతో ఎక్కడున్నానా అని తరచి చూసుకున్నా. ఆకాశంలో లేను, పాతాళం లోనూ లేను. భూమ్మీదే శరీరం. మళ్ళీ మరో సెషన్ మొదలు. “మిరపకాయ బజ్జీలు వేయవా?” “నాకు సేమ్యా పాయసం కావాలి.” ఇంతకూ నాకేం కావాలి? నవ్వొచ్చింది నాకు. తెరచిన పుస్తకం, పక్షుల గానం, రంగుల సీతాకోకచిలుకలు, మేఘాల రథం, తారల మల్లెలు, ఊడల ఊయల-అన్నీ ఊహలే. కోరికల గుర్రాలు, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంటాయలా. వాటి వెనక ఎలా పరిగెట్టాలి?

“అమ్మా నేను బొమ్మ వేశాను చూడు.” అంతరాయం కలిగిస్తూ కడుపు పంట చూపించిన చిత్రం కడుపు నింపేలా… పచ్చటి వనం, పచ్చిక, ఊయల, కొండలు, మబ్బులు. “అన్నీ బాగున్నాయి కానీ, ఏదో మిస్సయినట్లుందిరా. ఆ….” పెన్సిల్ తో పక్షిలా గీశాను. “ఇప్పుడు రెక్కలొచ్చాయి కదా వనమంతా తిరిగి రావచ్చు.” నా నవ్వుతో తన నవ్వు జత కలిసింది.

సాయంత్రం సెషన్ అయిపోగానే రాత్రికేం చేయాలో వెతుకులాట. సగం చదివిన సడ్లపల్లి బతుకు వెతుకులాట ఎన్నటికి పూర్తయ్యేను? నూరేళ్ళ క్రిందటి గురజాడ కల వీధికో ఆహార దుకాణం సాకారమయ్యేదెన్నడో? ఇల్లాలికింత విశ్రాంతి, మనశ్శాంతి దొరికేదెన్నడో? రాత్రికి వండీ వార్చీ, మరునాటికి ప్రిపరేషన్ కూడా ముగిసింది. హమ్మయ్య ఈ రోజుకు డ్యూటీ అయిపోయినట్టే.

మనసుకు విశ్రాంతి దొరక్కపోయినా, శరీరం మాత్రం చోటు వెతుక్కొని విశ్రమిస్తుంది. కళ్ళు చీకట్లను పూర్తిగా నింపుకునే లోగా ప్రశ్నల తుంపర మొదలు. “అమ్మా, కలలెందుకు వస్తాయి?” “మనకిష్టమైనవి మనం పొందలేక పోతున్నామనుకో, నిద్రలో మెదడు అవి అందుకున్న భ్రమలో ఉంటుందన్న మాట, అవే కలగా కనబడతాయి.” నాకు తోచిన సమాధానం చెప్పాను. “మరి పీడకలలెందుకు వస్తాయి?” “కోరికలు తీరిపోయి అక్కడే ఉండిపోతామేమోనని, ఈ లోకం లోకి రావడానికి చెడ్డ కలలొచ్చి నిద్ర లేపుతాయన్న మాట.” ఇంకా ప్రశ్నల వెల్లువను తట్టుకోలేక కళ్ళు నిద్రనాశ్రయించాయి. “పడుకున్న ఐదు నిమిషాల్లోనే నిద్ర లోకి జారుకోవడం ఎలా సాధ్యమో!” నిద్రావస్థలోనే నిష్టూరాలు చెవుల బడుతున్నాయి. పడుకున్నాక కాదు, పనిలో ఉన్నప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయంటే దేహమెంత అలసిపోయిందో అర్థం చేసుకోలేని మనసుకు ఏం చెప్తే అర్థమవుతుంది?

@     @     @

నీలిరంగు సముద్రం, నీలాకాశం కలుస్తూ కనువిందు చేస్తుంటే తెప్ప మీద కడలి కెరటాలతో పాటు ఎగురుతూ నేను. వేగంగా… తీరానికి దూరంగా… యానిమేషన్ చిత్రం మోనా (Moana) లాగా తెప్పపై తేలుతూ పోతుంటే, మనసంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా… అచ్చు ఆ సినిమాలో లాగే అవతలి తీరం పిలుస్తున్నట్లుంది. ఆ తీరంలో ఏ అద్భుతాలు దాగి ఉన్నాయో, ఏ వసంతాలు ఎదురు చూస్తున్నాయో…? ఉన్నట్టుండి ఈ సుడిగాలి చుట్టేస్తోందేమిటి? తెప్పతో సహా నన్ను సుడిగుండం లోకి జార్చేస్తోంది. సుడులు తిరుగుతూ నేను జారిపోతున్నా…

బలమంతా పుంజుకొని తెప్పతో సహా అలల పైకెగసి లేచా. సుడిగుండాన్ని తప్పించుకొని ఆవలి తీరం వైపు రెట్టించిన వేగంతో కదులుతున్నా. ఏదో మొండి పట్టుదల, ఉత్సాహం ఆవలి తీరానికి చేర్చింది. ఇదో వింత లోకంలా ఉంది. నింగిని తాకుతూ గిరులు, వాటిపై పచ్చని చెట్లు, ఈ పచ్చని వనాలకు రూపమద్దుతూ సాగుతున్న శ్రమ జీవన రాగం. చేతులు చేతులు పట్టుకుని, పదం, కదం కలుపుతూ సాగుతున్న థింసా నృత్యం. ఆటలాడుతూ, పాటలు పాడుతూ శ్రమ తాలూకు అలసట తెలియని సహజీవన రాగం. వింత ఫలాలతో చేసిన సలాడ్ దోసిట్లో ఆకు దొన్నెలో నింపి, మోకాళ్ళపై వొంగి ప్రేమ ప్రతిపాదన చేస్తున్నట్లు నా జీవన సగభాగం. ఆకాశం గోడ పై ఎర్రటి రంగు పులుముతూ మా కలల పంటలు.

@     @     @

కళ్లపై వెచ్చటి స్పర్శతో కలల లోకం లోంచి ఇలలో కొచ్చి పడ్డాను. నులివెచ్చని స్పర్శతో ఉదయభానుడు నవ్వులు చిందిస్తున్నాడు. “చూశావా, ఈరోజు నీకంటే ముందు నేనే లేచాను.” “అయితే మాన్లే. నాకెంత హాయిగా ఉందో ఇవాళ. ఇప్పటికి నాకల పూర్తయింది. ఇంకా కాసేపు కలలోనే ఉండనీ.” ముసుగు తన్నేశాను.

  • ఎం.ప్రగతి

 

ఎం.ప్రగతి

4 comments

Leave a Reply to Prasad Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు