శివసాగర్ ఐదు దశాబ్దాల తెలుగు సమాజ కల్లోలాల్లో ఒక అల. తెలంగాణా ఉద్యమ నాడి. దప్పికతో నోరు పిడచ కట్టుకపోయిన నేలలో పాటల సెలయేరు. పల్లె పదాలకు పాలు తాపి పరుగెత్తించిన పైడికంటి పాటగాడు. తన పాటతో ఉద్యమ నాడిని యుద్ధ కవాతు చేసిన నెలబాలుడు. వాయుద్ద నావకు చుక్కాని. ఆదివాసీ విసిరిన విల్లంబు. ప్రజా ప్రత్యామ్నాయ పోరాట ఆలోచనను తన కవిత్వానికి ఇందనంగా వాడుకున్నవాడు. ఆయన జీవితం కేవలం సాహిత్యానికో, రాజకీయాలకో పరిమితం చేయలేం. ఆ మాటకొస్తే సాహిత్యంలో ఒక ట్రెండ్ సెట్టర్. వామపక్ష రాజకీయాల్లో దార్శనికుడు. విప్లవ దళపతి. దళిత సాహిత్య ఈస్తటికకు ఒక బలాన్ని ఇచ్చినవాడు.
మొత్తంగా తెలుగునాట సాహిత్య, సాంస్కృతిక, విప్లవ వెల్లువతో మమేకం అయినవాడు. తెలుగు సమాజ కల్లోలాలను తన కవిత్వంలో చిత్రిక పట్టినవాడు. అవకాశవాదపు ఎత్తుజిత్తుల మధ్య క్షతగాత్రుడు. ఆయన ఉద్యమ జీవితం మినహా కుటుంబ వ్యవహారాలు బయట ప్రపంచానికి తక్కువ తెలుసు.
శివసాగర్ నాకు పరిచయం అయిన రోజుల్లో ఆయన జీవితంలో సగభాగం దాకా రాసుకున్న ఆత్మకథ నాకు కొరియర్ చేసాడు. ఒక రకంగా నాకు వ్రాతప్రతిలో ఉండగానే చదివే అవకాశం కలిగింది. అది కేవలం ఆయన వైయుక్తికమైన ప్రకటనకాదు అలా అని ఒక కుటుంబ చరిత్ర కాదు. రెండు వందల ఏళ్ళు విస్తరించిన ఒక సామూహిక అభివ్యక్తి. సాహసోపేతమైన యుద్ధవీరుడి విన్యాసాలు ఆ చిన్న ఆత్మకథ ద్వారా తెలుసుకున్న, మరుగున పడి, బతుకు సమరంలో శత్రుతోడేళ్ళ మధ్య బిక్కు మంటూ ఒక్కొక్క ఇటుక పేర్చి ముండ్లదారిని రహదారిగా మార్చడానికి ఒక కుటుంబం పడిన తపన. భారతదేశ విప్లవ నిర్మాణానికి రాళ్లెత్తిన విప్లవ కుటుంబ చరిత్ర. ఒక తరం విస్థాపితులుగా, ఇంకోతరం జాతీయోద్యమ పోరాటాలతో, మరోతరం వామపక్ష విప్లవ, దళిత ప్రజా ఉద్యమాల నిర్మాణంలో మమేకమై ఆధిపత్య వర్తమాన విప్లవ చరిత్రలో, చర్చల్లోనూ కనుమరుగైన ఒక జ్ఞాపకం. కళ్యాణరావు అన్నట్లు ఆ గతం కేవలం జ్ఞాపకమేనా? కాదు వంచిత చరిత్రలో వక్రీకరించబడిన ఒక క్షతగాత్రుని గతం. విప్లవనిర్మాణాల వైయుక్తిక చైతన్యం సామూహిక బృందగానాల్లో విస్తృతం కాబడిన చేదునిజం. ప్రత్యామ్నాయ నిర్మాణాల కోసం వ్యక్తిగతంగా ఏమీ మిగిలించుకోకుండా జీవితం మొత్తం పనిచేసి డస్సిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు తన పేజీలు ఎక్కడ? ఎవరు రాయాలి? అనే ఆలోచన బతికుండగా ఆయనకు కలగకపోవడం విషాదం. నిష్పాక్షికంగా చరిత్ర గమనాన్ని నడిపిన శివసాగర్ లాంటివాళ్ళ పరంపర ఏం కావాలి. చరిత్రలో పరాజితుల వెలివేతలు బతుకుల జీవితాలు అంత సాఫీగా నడవవు కదా. బతికినా చచ్చినా వెంటాడే యూదా ఇస్కరియోతులు. మన చుట్టూ ఉన్నకాడ నిజం పాతరపడుతూనే ఉంటది.
రెండు వందల ఏభై ఏళ్ల క్రింద బస్తర్ అడవుల్లో శివసాగర్ పూర్వీకులు ఉండేవారని అని తన ఆత్మకథలో రాసుకున్నారు. సరిగ్గా బ్రిటిష్ ఆధునికత ఆ అడవుల్లోకి సామాజిక అటవీ పెంపకం అనే ప్రాపకంతో ప్రవేశించింది. మైదానవాసి ఉనికి విస్తరణ అవసరాల కోసం ‘అటవికుల‘ దగ్గరకు వెళ్లింది. అక్కడ మొదలైంది మైదానవాసికీ ఆదివాసికీ మధ్య ఘర్షణ. వందల వేల ఏళ్లుగా ‘నాగరిక సమాజానికి దూరంగా తమవైన బతుకులు అవి. క్రూర మృగాలతో బ్రతుకు యుద్ధం చేసిన ఆదివాసీలు తమ బతుకుల్లోకి
చొచ్చుకొని వస్తున్న ఆధునికతను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. వందల ఏళ్ల పరాయి పాలన మీద తిరుగుబాటు చేసి వాళ్ల సాంప్రదాయ ఆయుధాలే మైదానవాసికి రక్షణ నిచ్చాయి. ఆ ఆయుధాలే బిర్సాముండాని, రాంజీ గోండు, కొమరం భీంలను తయారు చేసింది. వాళ్లకు తెలియదు అలా తరమబడిన ఒక కుటుంబమే అదే బస్తర్ కేంద్రంగా వేలాది మందితో కలిసి ప్రజా ప్రత్యామ్నాయ పోరాటాలు నిర్మిస్తాయని. అలా తరమబడిన మూడో తరమే శివసాగర్ కుటుంబం. ఎంత విషాదం? ఈ దేశ వనరుల కోసం, భూమికోసం, శత్రు దేశాలతో కొట్లాడిన మూలవాసుల బతుకే అపహాస్యంగా మారింది. మన అవసరాల కోసం అడవిలోకి వెళ్లాం. విస్తారమైన వనరుల మీద అత్యాశతో అక్కడి నుండి ఆదివాసీని తరమాలని చూస్తున్నాం.
అలా విస్తాపితులుగా మైదాన ప్రాంతానికి తరమబడిన వెంకటస్వామి, అచ్చమ్మ శివసాగర్ పూర్వీకులు. కొల్లేరు దిశగా బయలుదేరారు. విస్తారంగా ఉన్న భూముల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. ‘స్థానికంగా ఉన్న మాల కుటుంబాల మధ్య కలిసిపోయారు.” అక్కడికి వచ్చేనాటికి వాళ్లు హిందువులు, క్రైస్తవులు మాత్రం కారు. స్థానికంగా జరిగిన ఒక గొడవలో గాయపడిన కుటుంబాల పరామర్శకు వచ్చిన కెనడియన్ మిషనరీల మూలంగా గుడికి, బడికి దగ్గర కాగలిగారు. ఆ విధంగా ఆ కుటుంబంలో మొదట అక్షరాలు దిద్దుకున్నవాడు ప్రసన్నరావు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఒక మాజీ సైనిక ఉద్యోగి. ముగ్గురు పిల్లలు. ఖంభం జ్ఞాన సత్యమూర్తి, మంజులభాయి, విలియం కెరీ. అందులో పెద్దవాడు శివసాగర్. ఈ ముగ్గురూ పసిపిల్లలుగా ఉండగానే ప్రసన్నరావు భార్య చనిపోయారు. ఆ రోజుల్లో బడిపంతులుగా ముగ్గురు పిల్లలను సాకాడు. సత్యమూర్తి శివసాగర్ గా సాయుధ రాజకీయాలలో ఉంటే, మంజులబాయి బెనారస్లో చదివి లెక్చరర్ గా, విలియం కేరి వరంగల్ లో ఫిజికల్ డైరెక్టర్ గా తమ తమ బ్రతుకుల్లో ఉన్నారు.
కృష్ణాజిల్లా శంకరంపాడులో మొదలైన శివసాగర్ బాల్యం గుంటూరు, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ నుంచి ఆంధ్రాయూనివర్సిటీ, ఆ తర్వాత తన పోరాట క్షేత్రాన్ని గుంటూరుకు మార్చాడు. ఉమ్మడి కమ్యునిస్ట్ కార్యాచరణలో ప్రజాశక్తి పత్రికలో, ఆ తరువాత గుడివాడ మున్సిపల్ కార్మికులతో ప్రజానాట్యమండలి. శివసాగర్ తమ్ముడు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న క్రమంలో వరంగల్ సెయింట్ గాబ్రియల్ లో అధ్యాపకత్వం. కొండపల్లి సీతారామయ్య సహచర్యం. గుత్తికొండ బిలం సమాలోచన. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ రెండో చీలికతో సంప్రదాయ వామపక్ష పార్టీల మీద తొలిగిన భ్రమలు, నక్సల్బరి వసంత మేఘ గర్జన, చారు మజుందార్ గుత్తికొండ బిలం సమావేశం. ఆలిండియా విప్లవకారుల సమన్వయ కమిటీ, ఆంధ్ర విప్లవకారుల ఐక్య కార్యాచరణ కమిటీ, పీపుల్స్ వార్ పార్టీ.
యాభయ్యో దశకంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాచరణలో ప్రోది చేసుకున్న బాల్యం సాయుధ రాజకీయాల దిశగా మారడం వెనక కనిపించని చరిత్రలో ప్రతి అడుగులో శివసాగర్ ఆలోచనలు, కార్యాచరణ, ప్రాసంగికత తనదైన ముద్ర ఉన్నాయి. విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాలతో ఉన్నాడు శివసాగర్. కవిగా కళాకారుడిగా విద్యార్థి నిర్మాణాల్లో సాంస్కృతిక కార్యాచరణలో ఒక కార్యకర్తగా, కవిగా, నాయకుడిగా సాయుధ పోరాట వ్యూహకర్తగా తాను పనిచేసినంతకాలం నిబద్ధతతో ఉన్నాడు. ఆయన ఆదర్శాల కోసం తుపాకి పట్టుకోలేదు. అది ఒక చారిత్రక అవసరంగా భావించాడు.
ఒక రోజు శిఖామణి ‘కిర్రుచెప్పుల భాష‘ చదువుతున్నా.
దానికి శివసాగర్ ‘తుమ్మపూల సౌందర్యం‘ పేరుతో ముందుమాట రాసాడు. నేను పరిశోధక విద్యార్థిని. తెలుగు సాహిత్యం కాస్త పరిచయం. జాషువా, శివసాగర్,
కౌముది… ఈ మూడు పేర్లు నాకు బాగా ఇష్టం. వాళ్ళ కవిత్వం కూడా. ఆ ‘తుమ్మపూల సౌందర్యం‘ చదవకపోతే శివసాగర్ పరిచయం జరిగే అవకాశమే లేదు. శిఖామణి ద్వారా విశాఖ ప్రొ.అత్తులూరి నరసింహారావు గారితో మాట్లాడాను. అత్తులూరి గారే నాకు శివసాగర్ కలవడానికి దారి చూపారు. మే
నెల ఎండల్లో సముద్ర తీర ఉక్కునగరం ఉక్కపోతల మధ్య సెక్టార్ ఎనిమిదిలో ఆయన ఉన్నాడని తెలిసింది. శివుని చిన్న కూతురు శ్రీదేవి ఇంట్లో కలిసాను. నిజానికి నేను కలిసేనాటికి ఆయన ఏ నిర్మాణాల్లో ఉన్నాడో నాకు తెలియదు. ఆ రోజు డెబ్బై ఏళ్ళ పసిపిల్లవాణ్ణి ఉద్వేగంతో చూసా. అది నా జీవితంలో ఒక మరచిపోని రోజు. ఉద్యమ నెలబాలుడు చిక్కి శల్యమై ఉన్నాడు. మొదటి చూపులోనే “మా అబ్బాయి డా.గోపీనాథ్ తెలుసా? మా రాధమ్మ ఎలా ఉంది? డా.హరీష్ బాగున్నాడా?” అన్నాడు. ఇవ్వాళ హరీష్ లేడు. రాధమ్మ అచేతనంగా ఉంది.
గోపీనాథ్ నిరాకారంగా ఉండు. రాస్తుంటే కల్లోలంగా ఉంది.
దశాబ్దాల సంక్లిష్టమైన జీవితం ఆయనది. వాళ్ల పూర్వీకులది ఖమ్మం అని ఇన్నేళ్లకు తెలిసింది. వారు బస్తర్ అడవుల్లో ఉండేవారనీ బ్రిటిష్ పాలకులు అడవుల నుండి తరిమేస్తే బతుకు భుజాన వేసుకొని మైదాన ప్రాంతానికి తరమబడిన విస్తాపితులు అని శివసాగర్ రాసుకున్న అసంపూర్ణ జీవిత చిత్రణ ద్వారా తెలిసింది. ఖమ్మం ఆయన కార్యక్షేత్రం అయిన విషయమూ తెలియదు. అప్పుడు మొదలైంది శివసాగర్ అక్షరాల కోసం వెతుకులాట. డా.కె. హరీష్ నాకు రాజకీయ గురువు. ఆయన విద్యార్థి దశలో వరంగల్ లో మెడిసిన్ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో శివసాగర్ శిష్యుడని తెలిసింది. ఖమ్మంలో ఆయనను ఇష్టపడే మిత్రులు ఆయన అభిమానులు నా చుట్టూ ఉన్నారు. అలా శివసాగర్ సాహిత్య సేకరణ మొదలైంది. విప్లవ కవిత్వానికి చిరునామాగా మారిన ఆయన రాసిన కవిత్వం 1968 నుండి 1972 వరకు రాసిన ‘గెరిల్లా విప్లవ గీతాలు, 1972 నుండి 73 మధ్యలో రాసిన ‘జనం ఊపిరితో‘ అవి కలిపి ‘పది వసంతాలు‘, ఉద్యమ నెలబాలుడు‘ 1983 గా ఒక సంకలనం ఆనాటి విప్లవ సాహిత్యంలో జనఘోష, సాగరహోరు. 1990 సెప్టెంబర్ లో విరసం సిటీ యూనిట్ ‘నెలవంక‘ మాత్రమే
ఆనాటికి శివసాగర్ అచ్చులో ఉన్నాడు. ఒక చారిత్రక కవితా సంకలనం రావడం వెనక ఇంతటి కల్లోలం ఉంది.
నేను మొదటిసారి విశాఖ ఉక్కునగరంలో శివుడిని చూసాక ఏడాదికి నాకో ఉత్తరం రాసాడు. దళిత బహుజన శ్రామిక విముక్తి అనుబంధ విద్యార్థి సంఘ రాష్ట్ర
మొదటి మహాసభలకు ఖమ్మం వస్తున్నట్టు కార్డు ముక్క అందింది. ఖమ్మం వర్తక సంఘ భవనం నలభై ఏళ్ళ కింద విరసం మొదటి సభలు జరిగిన చారిత్రక ప్రాంతం. నాడు ఆ సభలకు వస్తూ శ్రీ శ్రీ శివసాగర్ కవిత ‘నలెంక చెట్టు కింద నరుడో భాస్కరుడా‘ అని పాడుకుంటూ ఖమ్మం లో దిగాడు. అదే వర్తక సంఘ భవనంలో మీటింగ్.
శ్రీధర్ మాటల్లో బస. ఆయన చిన్ననాటి మిత్రుడు బెనారస్లో చదివి ఖమ్మంలో స్థిరపడ్డ పొట్లూరి వెంకటేశ్వరావు. ఆయన గుడివాడ కళాశాలలో చలసాని ప్రసాద్, చలసాని ప్రసాదరావు,
రామోజీరావుతో కలిసి చదువుకున్న మిత్రులు. స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాచరణలో బతికిన క్షణాలు. ఆ విధంగా పొట్లూరి ఇంట్లో కలిసాం. ఇద్దరూ ఒక్క క్షణం జ్ఞాపకాల దొంతరలోకి జారారు. ఆ రోజు ఆ ఇద్దరు మిత్రులు ‘మాటాడని మల్లె మొగ్గ మాదిరిగా నడిచిరా‘ అంటూ ఉద్విగ్న మానస సంభాషణ చేసారు.
ఆరోజే నాకొక విషయం తెలిసింది. 1972 కాలంలో ఒక వార్త ‘శివసాగర్ ఎన్ కౌంటర్‌లో మృతి‘. కానీ చనిపోయింది శివసాగర్ అవునో కాదో అని ఎవరు నిర్ధారించాలి. నాడు పోలీసులు ఆ దగ్గరలోనే ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న పొట్లూరి వెంకటేశ్వరావుని అడిగారు. ‘మీరు మీ స్నేహితుణ్ణి గుర్తు పట్టాలి అని.” ఊపిరి బిగపట్టి ఆ అమరుడిని చూసి ‘శివసాగర్ కాదు‘ అన్నాడు. తర్వాత తెలిసింది. ఆ ఎన్ కౌంటర్లో చనిపోయింది అమరుడు కొల్లిపర నరసింహారావు అని. అప్పటికే శివసాగర్ ఇకలేడు అని ఇంట్లో విషాదంలో ఉన్నారు. దశాబ్దాల తర్వాత ఇద్దరు మిత్రులు ఖమ్మంలో కలుసుకున్నారు. అదో ఉద్వేగం. డెబ్బై ఏళ్ళ మిత్రులు ఆ కాలపు జ్ఞాపకాలను ముందేసుకొని ముచ్చటించుకున్నారు. ఆ మరుగున పడిన చరిత్ర శకలాన్ని దగ్గరగా విన్నా. ఇద్దరి మిత్రులు తమ కాలేజీ ముచ్చట్లు నెమరేసుకున్నారు. గుడివాడ కళాశాల స్టూడెంట్ ఫెడరేషన్ ఎన్నికలు విద్యార్థి నాయకుడిగా శివసాగర్ గెలుపు. ‘ఆ రిక్షాపుల్లర్‌ను ఎందుకు?” నన్ను గెలిపించండి అన్న ఒక కుహనా మేధావినీ యాది చేసుకున్నారు. దశాబ్దాల తర్వాత కలుసుకున్న ఇరువురు మిత్రుల వలపోత. ఆ సాయంత్రం కాసింతత ఉప్మా తిని అలా తన బాల్య స్నేహితుడి దగ్గర కడసారి వీడ్కోలు తీసుకున్నారు.
మరుసటి రోజు ఇరిగిన కళ్ళద్దాల కాడలు, ఒక కాడ విరిగితే దానికి మందపాటి దారం లాంటిది కట్టుకున్నాడు. ఊడిన పళ్లసెట్. దేశాన్ని రిపేర్ చేయడానికి రాజ్యం మీద సాయుధ యుద్ధం మొదలుపెట్టిన కీలక నేత కళ్ళద్దాల, పళ్ళసెట్ల దుస్థితి. నిలువెత్తు నిజాయితీ విలువలు ఎలా దశాబ్దాలు బతికాయో ఆయన్ని చూస్తే నాకు అర్థం అయ్యింది. ఆయన నిబద్దత రాయాలి అంటే వందల పేజీలలో రాయొచ్చు. తాను అజ్ఞాత జీవితంలో ఉన్నప్పుడు తన కుటుంబానికి సహాయం చేయాలనుకున్న ఒక విప్లవ అభిమానిని హెచ్చరిస్తూ.
కామ్రేడ్ ‘మీరు ఏదన్నా చేయాలి అంటే పార్టీకి చేయండి. నా కుటుంబానికి అవసరం లేదు.‘ ఇవన్నీ ఖమ్మంతో ముడిపడిన జ్ఞాపకాలు. అదే అభిమాని నాలుగు
చొక్కాలు ఇస్తే టెక్ జాగ్రత్తలో భాగంగా కత్తెర తీసుకొని టైలర్ వివరాలు కట్ చేస్తూ తాను.
ఆరోజు శివసాగర్ సంకలనం వేయాలి అనే ఆలోచన. నేను డా. హరీష్ గారు ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగబెట్టి వచ్చాం. వాళ్ళ ముగ్గురికీ అదే చివరి కలయిక అయింది.
వాళ్లు ముగ్గురూ మళ్లీ కలవలేరు. ఇప్పుడు హరీష్, శివుడూ, పొట్లూరి ముగ్గురూ లేరు. తలపోతల బరువుతో నేను.
ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మొదలైన కార్యాచరణ మందపాడు గ్రామ కమిటీ సెక్రెటరీగా, గుడివాడ పట్టణ కమిటీ సభ్యునిగా మొదలైన ఆయన రాజకీయాలు. వరంగల్ మెడికల్ కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడిగా పనిచేస్తున్న తమ్ముడు విలియంకేరీ అక్కడే ఉండడం. డా.హరీష్, కావూరి రమేష్ బాబు, కరుణ వైద్య విద్యార్థులుగా అక్కడే సాయుధ రాజకీయాల దిశగా అడుగులు వేస్తున్న దశ. గుత్తికొండ బిలం మొదలు ఎనుమాముల ప్రజా ప్రదర్శన దాకా శివసాగర్ దశాబ్దాల కల్లోలాల్లో భాగం అయ్యాడు. కొందరు శివసాగరను, మరికొందరు సత్యమూర్తిని ఆకాశానికి ఎత్తారు. పాతాళానికి దించారు. అబద్దపు లెక్కల్లో ఆయన విద్వత్ ను తప్పుడు తర్జుమా చేసారు.
కానీ ప్రజా బాహుళ్యంలో భాగం అయిన శివుని యశస్సును చెరిపేయగలరా?
ఉద్యమ నెలబాలుడు పుస్తకానికి చేరాగారు ముందు మాట రాస్తూ శివసాగర్ కవిత్వం అర్థం కావాలంటే ఆ కాలంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, గ్రేట్ డిబేట్, శాంటియాగో, అలెండీ, ఓల్గా ఘనీభవించెను, తూర్పు పవనం వీచెనోయ్, లాంటి వాటి నేపథ్యం తెలిస్తే మాత్రామే అర్థం అవుతాయి అన్నారు. ఆ క్రమంలో ప్రతి కవితకు వివరణలు రాస్తే బాగుంటుందని సూచించారు. దాని లోటు పూరించాలని శివసాగర్ చిన్న కూతురు శ్రీదేవి ఇంట్లో ఒక వారంపాటు ఉండి ప్రతి కవితకు వివరణలు చాలా ఓపిగ్గా నాకు డిక్లేట్ చేసారు. ‘ఉద్యమ నెలబాలుడు‘, ‘నెలవంక‘ తర్వాత పదేళ్లలో వివిధ పత్రికలలో రాసిన కవితలు కలిపి పదిహేను ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ‘శివసాగర్ కవిత్వం‘ సంకలనం “శివసాగర్ ఈ నలభై ఏళ్ల తెలుగు వాళ్ల ఉత్తమ (విప్లవ) సంస్కారంలో
భాగం. మన జీవనపు వ్యక్తీకరణ దీనిని పదికాలాలపాటు దాచుకోవాల్సిన, గర్వించ దగిన కవిత్వాన్ని అందించిన శివసాగర్ మనకు అపురూపమైన సాంస్కృతిక ‘చెలికాడు‘ అని రాసుకొని 2004 సెప్టెంబర్లో మొదటి ప్రచురణ తీసుకొని వచ్చాం . ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో ఎడిషన్ అమరుడు “కష్టకాలంలో ఆదుకున్న త్రిపురనేని మధుసూదనరావు గారికి” అంకితంగా వచ్చింది.
2012 ఏప్రియల్ 17 శివసాగర్ ఇక లేడని వార్త. ఎనిమిది దశాబ్దాల విప్లవ కార్యాచరణ, సొంత ఇల్లు, సొంత ఆస్తి ఎరగని మనిషి. చిన్న ఇల్లు కావడంతో సందర్శకుల తాకిడికి ఆయన పార్థివ దేహాన్ని సమీప చర్చి ప్రాంగణానికి తరలించారు. వందలాది మంది కడసారి చూపుకోసం పూరి గుడెసెల తల రాతలు మారాలని బతుకంతా క్షతగాత్రుడిలా, కాలానికి ఎదురీదిన యుద్ధఫిరంగి శివసాగర్. ఆయన
మొదటి వర్ధంతి నాటికి శివసాగర్ సమగ్ర కవితా సంకలనం 2013 జనవరి కాలాన ప్రచురించాను.
ఎనిమిది దశాబ్దాల నిండైన జీవితం ఆయనది. ఐదు దశాబ్దాల పరిపూర్ణ సాహిత్య జీవితం. విజయవాడ బందరు లాకలు పక్కన కృష్ణాజిల్లా స్వాతంత్ర సమరయోధుల భవనంలో మొదలైన అంతిమయాత్ర. కృష్ణా నది ఒడ్డున అవనతమైంది. తూర్పు పవన గాలులను వసంత మేఘ గర్జనల వెలుగులో కల్లోల కాలానికి టార్చ్ బేరర్ నిలిచాడు. నడిచి వచ్చిన చరిత్ర గుర్తులివి. ఆధిపత్య అహంకారంతో పోతన వారసులు ‘పూతన‘ పాలుపోసినా. ఉరితీయబడ్డ పాట నుండి చెరపడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలిబాట నుండి, వాయులీనం నుండి తిరిగి వస్తాడు. తిరిగి లేస్తాడు.
శివుడు పోయిన ఆరేళ్ల తర్వాత ఈ మధ్య దొరికిన సంకలనంలో చేర్చని కొన్ని కవితలు, ‘జైలుడైరీ‘ కలిపి మీ ముందుకు తెస్తున్నాం .
*
Thank you sir.
శివసాగర్ గారి పరిచయం నేటి తరం వారికి అవసరం.
ధన్య వాదములు
తెలుగు ఆధునిక కవిత్వంలో శ్రీ శ్రీ తర్వాత ఇంత బలంగా ప్రజల గొంతు, ఉద్యమాలను పలికించిన గొప్ప కవి శివసాగర్ గారు. ఉద్యమ నేపథ్యంలో కూడా వ్రాసిన తన కవిత్వం నినాదాలుగా కాక హృదయాలను తాకుతాయి.
సారంగ పుస్తకం చదవాలని ఉంది, ఎలా పొందవచ్చో తెలిపితే సంతోషం.
శివసాగర్ నా అత్యంత అభిమాన విప్లవ కవి !🙏💐
ఆద్యంతం మీ వ్యాసం ఆసక్తికరమైన విషయాలను ఎన్నో అందించింది. శివసాగర్ ని మీ వ్యాసం ఆధారంగానే తెలుసుకోగలిగాను. మీరన్నట్టు ఈ తరం యువకవులకి శివసాగర్ కవిత్వం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు అన్నా…
అభినందనలు..
మంచిగా రాసినవ్ బై
కవిగా ,వ్యక్తిగా నాకు అత్యంత ప్రియమైన శివసాగర్ జ్ఞాపకాలను మరోసారి పంచుకోవటం సంతోషంగా ఉంది .మీ ప్రయత్నానికి అభినందనలు .పుస్తకం కోసం ఎదురుచూస్తుంటా .
చాలా ఆసక్తికరంగా వుంది.శివసాగర్ ను చదవడం యెప్పుడూ వుద్వేగభరితమే. అభినందనలు.
[…] Read Full Story […]