కొందరు విభిన్నమైన పనులు చేయరు. చేసే పనినే విభిన్నంగా, వినూత్నం గా చేస్తరు. ఆ కోవలోకే వచ్చే అరుదైన కవి, రచయిత భగవంతం. అతని కవిత్వమూ, కథ రెండూ అతన్ని వైవిధ్యంగా చూపెట్టే ప్రక్రియలు. త్రిపుర కథల్లోని ‘భగవంతం కోసం’- ఇక్కడ ‘భగవంతం తన కలంపేరు. అసలు పేరుతో పనేముంది? ‘లోయ చివరి రహస్యం’ అతని ‘కథాసంపుటి. ‘భగవంతం’ ఇప్పటి వరకూ ఒక్క కవిత్వ సంపుటి అచ్చు వేయనే లేదు. తన కవిత్వానికీ, కథలకు ప్రత్యేకమైన పాఠకవర్గం వుంది. తానింకేం సంపాదించుకోనక్కర్లేదు. భగవంతం ఎప్పటికీ గుర్తుండి పోయే పాత్ర మాత్రమే కాదు .. గుర్తుంచుకోదగిన కవి. తన కథలపై, తన కవిత్వంపై త్రిపుర ప్రభావం వుండచ్చేమో, అనుకరణ మాత్రం లేదు అది ప్లస్సో, మైనస్సో అతనికంత పట్టింపు వుండదనుకుంటాను. ఇటీవల ‘భగవంతం’ రాసిన కవిత పేరు ‘కల’.
*
కల
~
ఆదిమానవులు చేసిన ప్రయాణంలోని అసలైన సౌందర్యాన్ని పట్టుకోడానికి అతడు సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్లు నిద్రలో కలగన్నాడు
సూర్యుని కింది మనుష్యుల సుఖదుఃఖాలను దాటాడు
జంతువుల అమాయకత్వాన్ని చేత్తో తాకాడు
నదులు దాహంతో తాగిన సూర్యోదయాల్ని సముద్రాలు వెన్నెలను చూసి పడిన మోహాల్ని చూసాడు
అడవుల్లో చెట్ల కొమ్మలకు
వేలాడే భయాల్ని అడవే నాకు కాపలా ఉండగా అడవి నన్నేం చేస్తుంది అనుకునే
లేత ప్రాణుల దైర్యాన్ని
విన్నాడు
గుహల్లో నిద్రపోతున్న శతాబ్దాల
పక్క నుండి నడిచాడు. జలపాతాల తాడు పట్టుకొని ఊగి ఇసుక తుఫాను ఆగిపోయాక మెల్లిగా కళ్లు తెరిచిన ఎడారుల్లోంచి నడుచుకుంటూ అగ్నిపర్వతం అంచును చేరి అగ్నిపుష్పాన్ని తెంపుకొని జేబులో పెట్టుకొని ఆ అంచు నుండి ఎగిరి మంచుపర్వతాల మీద పడి జారిపోయి ఒక లోయలో పడ్డాడు
పడడం పడడం
అప్పటికే ఆ లోయలోకి జారిపడ్డ మనుష్యుల మధ్య
పడ్డాడు
ఆ తర్వాత ఆ మనుష్యులు చెప్పిన చంద్రుని కింది మనుష్యుల సుఖదుఃఖాల కథల నుండి కదిలి తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
*
‘కల’ కవితను అర్థం చేసుకోవాలంటే ముందుగా ‘కల’ను అర్ధం చేసుకోవాలి. ‘ఎత్తుగడ’ లోనే కవి స్పష్టంగా ‘నిద్రలో కలగన్నాడు’ అని చెప్తాడు. ఎందుకోసమో ‘లక్ష్యం’ సూచించబడింది. బహుశా అది సుదీర్ఘమైన యాత్ర కనుక ‘గమ్యం’ అనాలేమో! వాస్తవికతకు పట్టబడనిదేదో స్వప్నలోకంలో దొరుకుతది కాబోలు. సాధించలేనిదేదో సాధించినంత బరాబరి సంతృప్తి పొందడం ఖాయం. కలలే లేని ప్రపంచాన్ని, కలలే రాని మనుషుల్ని ఊహించగలమా? అసలు కలలు ఎందుకొస్తయి? ‘ కల ‘ అనేది మానవ మనస్సులోని అణచివేయబడిన కోరికలు, భావోద్వేగాలు, అచేతన ఆలోచనలకు సాంకేతిక వ్యక్తీకరణగా ‘సిగ్మండ్ ఫ్రాయిడ్’ నిర్ధారించాడు. కలలపై చేసిన విశ్లేషణను “The Interpretation of Dreams” అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. అందుకే ‘కల’ను ‘royal road to the unconscious’ అంటాడు. కలల అద్దాన్ని గుర్తించడం సంక్లిష్టమే అయినప్పటికీ, శాస్త్రీయంగా అధ్యయనం చేయడంలోని సవాళ్లను స్వీకరించగలిగితే ‘కల’ను విశ్లేషణ ద్వారా సమన్వయం చేసుకోగలుగుతాం. అతడు ‘కల’లో చేసిన కార్యకలాపాలన్నీ, క్రియలన్నీ ‘దాటాడు, తాకాడు, , చూసాడు, విన్నాడు, నడిచాడు, పడ్డాడు, కొనసాగించాడు’ రూపంలో కవి పాఠకులకు అర్థం చేయిస్తాడు. కవి ఉపయోగించిన Text – అతడు ఆదిమానవ యాత్రలోని సౌందర్యాన్ని కనుగొనడానికి ప్రకృతిద్వారా ఒకస్వన్న యాత్ర చేయడం; నదులు, సముద్రాలు, అడవులు, గుహలు, జలపాతాలు, ఎడారులు, మంచుపర్వతాలు దాటి చివరికి లోయలోని ఇతర మనష్యుల మధ్య పడడం, అందుకోసం సూర్యుని కింది మనుష్యుల సుఖదుః ఖాలను దాటడం – మొత్తం అంతా ఫ్రాయిడ్ దృక్కోణంలో ‘Manifest Content’ గా చెప్పవచ్చు. పాఠకులు కవి సూచించిన భావనల్ని అర్ధంచేసుకొని తమవైన అభిప్రాయాల్ని వైయక్తికంగా ఏర్పర్చుకోవడం అనేది ‘Latent Content’ అయితది. అంటే స్వేచ్ఛకోసం, సామాజిక కట్టుబాట్ల నుండి విముక్తి కోసం ‘అతడి’ యాత్ర కొనసాగుతుందని అర్ధం చేసుకోవడం; ఆధునిక జీవనంలో కోల్పోయిన, కోల్పోతున్న సహజత్వం తిరిగి పొందాలనే కోరికను బలంగా వాంఛించడం.. యిలా ఏదైనా కావచ్చు.
కలలు సాధారణంగా మనస్సు యొక్క సంఘర్షణను ప్రతిబింబిస్తయి. అంటే ఫ్రాయిడ్ ప్రకారం id, ego, super ego ల మధ్య ఘర్షణ అని చెప్పవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా మనస్సు యొక్క ప్రవర్తనను అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతయి. id (ఇద్) అనేది చిన్నపిల్లల మనస్తత్వానికి దగ్గరగా వుంటది. సహజంగా, నిర్మలంగా, ‘జంతువుల అమాయకత్వం చేతితోతాకడం ” అనే క్రియ ఆధారంగా అర్ధం చేసుకోవచ్చు. ego అనేది వాస్తవికతను చిత్రిస్తది. సుఖదుఃఖాలను దాటడం, సంసార సాగరాన్ని ఈదడం మొ.నవి. ఇక super ego scoz ఆదర్శాలను, నీతిని బోధిస్తది. ఎక్కువశాతం సంఘర్షణ వాస్తవికతకు-ఆదర్శాలకు మధ్య కొనసాగుతది. నీతి వాక్యాలు ఆచరణకు లొంగని సందర్భాల్లో అలజడి మొదలైతది. ఎలా వుందామనుకుంటామో అలా వుండలేకపోతున్న తనాన్ని అచేతన స్థితిలోకి అణిచి పెట్టి సమాజపు పోకడను ధిక్కరించలేక తప్పని సరిగా ఆచరించవల్సి వస్తది. లోపలి మనిషి బాధ ఎవరికీ చెప్పుకోలేం. నిద్రావస్థలో అచేతనంగా అణచివేయబడిన కోరికలు అచేతన స్థితి నుండి మేల్కొని ఉపచేతన (sub conscious) స్థితిలోకి రావడానికి ప్రయత్నించే క్రమంలోని పెనుగులాట ‘కల’ ల రూపంలో వ్యక్తమైతయి. ‘కల’ లో అతడు/ఆమె మాత్రమే Hero. యథేచ్ఛగా సంచరించే తనం, విశృంఖలత్వం అసలు మనిషి తత్వాన్ని, కౄరత్వాన్ని పట్టి చూపెడుతది. ఇది వైయక్తికమైన మానసిక చర్య. కోరిక బతికివున్నంతకాలం ‘కల’కు చావు లేదు. అయితే కలలన్నీ వాస్తవికతకు ప్రతిరూపాలే. అవి సంజ్ఞలుగా, చిహ్నాలుగా, చిత్రాలుగా, సంఘటనలుగా ‘భావాల సంసర్గం’ (free association of thoughts) ను ఏర్పరుస్తయి. ఇక్కడ ‘కల’లోని ప్రతి చిత్రం/ సంఘటనను పాఠకులు తమ స్వంత భావోద్వేగాలను జోడిస్తూ అనుసంధానం చేసుకునే వెసులుబాటు, అవకాశం ఎక్కువగా వుంది. Sublimation and destoration ల ద్వారా మనిషి తమ వాంఛల్ని తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుకుతూ Transformation కోసం ప్రయత్నించడం చూస్తాం. అంటే యుక్త వయస్సులో భర్తను కోల్పోయిన స్త్రీ తన శరీరాన్ని, మనస్సును నియంత్రించుకోవడానికి భక్తి మార్గాన్ని ఆశ్రయించడం లాంటిది. దీన్నే ఫ్రాయిడ్ Libido (లిబిడో)గా సంకేతిస్తడు.
వెన్నెలను చూసి మోహపడటం, కొమ్మలకు వేలాడే భయాలు, నిద్ర పోతున్న శతాబ్దాలు, జలపాతాల తాడు పట్టుకొని ఊగడం, ఇసుకతుఫాన్లు, ఎడారుల్లో నడవడం, అగ్నిపుష్పాన్ని తెంపుకోవడం, మంచు పర్వతంపై జారడం, లోయల్లోకి పడిపోవడం, మనుష్యులతో సంభాషించడం, వారి కథల్ని వినడం, ప్రయాణాన్ని కొనసాగించడం – ఇవన్నీ వాస్తవికతకు సంబంధించిన సంకేత రూపాలు. Code language లాంటిది. వీటిని ఎలా De-Code చేస్తాం?
అందుకు ఫ్రాయిడ్ యొక్క “Dream Work theory” ఉపయోగపడుతది. కవి సూచించిన చిత్రంలో బహుళ అర్థాలు ఏమైనా వుంటే గుర్తించగలగాలి. అచేతన కోరికల్ని ప్రకృతి చిత్రణగా మార్చిన విధానాన్ని గమనించగలగాలి. భావోద్వేగాల వ్యక్తీకరణకు ఎటువంటి ప్రతీకల్ని ఎంచుకుంటున్నాడో పరిశీలించగలగాలి. కవి చెబుతున్న కథకు సమాంతరంగా మరో కథను నిర్మించగలిగే సమన్వయాన్ని సాధించగలగాలి. ఇందులో Condensation (సంఘననం), Displacement (స్థానభ్రంశం), Symbolization (ప్రతీకాత్మకత), Secondary Elaboration (ద్వితీయ విశదీకరణ) వంటి టెక్నిక్స్ దాగి వుంటయి. వీటి ఆధారంగా `కల’ను విశేషించుకోవాలి. ఒక్కోరకంగా ఒక్కొక్కరికి ఒక కొత్త అనుభూతిని ‘కల’ కనికరిస్తది. ‘భగవంతం రాసిన ‘కల’ కవితలో ప్రధానంగా ప్రతీకలు వేటిని సూచించగలవో సాధ్యమైనన్నీ సమాధానాలు రాబట్టుకోగలిగితే సమగ్రంగా అర్ధం చేసుకోగలిగే సంభావ్యత సిద్ధిస్తది. లోపలి కథ అవగతమైతది. లేకపోతే ఉపరితల కథకే పరిమితమై కథవెనుక కథలోకి ప్రవేశించలేం.
*
Add comment