కలల విలువ చెప్పిన ఆమె!

జీవితంలో మనం పొషించే ప్రతీ పాత్రని ప్రేమగా ఎలా పొషించాలో యద్దనపూడి కథలు  నేర్పాయి. మనసెరిగి మనుగడ సాగించడంలో  ఒక్కోసారి మన మనస్సే గాయపడి కన్నీళ్ళే మిగలవచ్చుగాక.. కాని కన్నీటి స్నానాల తరువాతే కదా మనస్సు ముత్యంలా  మెరిసి పరమాత్ముడి గుండెలపైకి చేరేది.. జీవితాన్ని అనుభవించడం అంటే అదే కదా!

ద్దనపూడిగారు పోయారనగానే ఏదో బాధ.. ఒక్కసారి చిన్నప్పటినుంచీ  చదివిన కథలు గుర్తుకొచ్చి గుండె బరువెక్కి పోయింది. “ఆంధ్రజ్యోతి”లో రాధాకృస్ణ సీరియల్ వచ్చినప్పట్నుంచీ  ఆవిడ కధలు, నవలలూ చదువుతూనే ఉన్నాను. ఆ కధలు అంటే మన బాల్యం అనేటంతగా వాటిలో జీవించేశాం.

బొబ్బిలిలో వేసవికాలపు మధ్యాన్నాలు తీరిగ్గా పడుకుని ఈకథలు చదువుకుంటూ ఎప్పుడు అక్కావాళ్ళలా పెద్దయిపోయి పరికిణీలు ఓణీలు వేసేసుకుంటానా అని ఎదురుచూసేదాన్ని. నాకోసం ఒక అందమైన అబ్బాయి నొక్కుల జుట్టుతో, మెత్తని మనసుతో, తెల్లని లాల్చీ వేసుకుని.. మృదువుగా నన్ను పలకరించడానికి ఎదురు చూస్తున్నాడన్న భావంలోనే చాలా జీవితం గడిచింది.

నాతరంలోని చాలా మంది ఇలాగే పెరిగి ఉంటారు. జీవితంలో ప్రతీ సిట్యువేషన్ నీ  ఎదో కధలో సంఘటనలా ఊహించుకుంటూ ఒక భావుకత్వంలో బ్రతికేయడం! దానివల్ల రియాలిటీని తెలుసుకోకుండా ఏమైనా కోల్పోయామా..? ఎప్పటికీ నాకు ఈ ప్రశ్నకి  సమాధానం దొరకదు. కలలు కని అవి నిజమవ్వకపోతే వచ్చే నిరాశ బెటరా .. అసలు కలలే లేకుండా అలా సాఫీగా జీవితం గడపడం బెటరా? నాకైతే కలలు రాని నిద్ర తెలుసుగాని  కలలు లేని జీవితం మాత్రం తెలియదు. అవి నన్ను దుఃఖపెట్టాయి..నిరాశలోకి నెట్టాయి.. మళ్ళీ ఆశపుట్టించాయి.. ఆ కలలు లేకుండా ఎలా..?

ఈవిడ కథల వల్లే కదా ఎలా ప్రేమించాలో తెలుసుకున్నది.

మంచి కూతురంటే ఎలా ఉండాలో.. అమ్మని ఎలా నొప్పించకూడదో.. మంచి అమ్మగా ఎలా వుండాలో.. మేనత్త ప్రేమని ఎలా పంచాలో..   భర్తని దగ్గరగా తీసుకుని  జుట్టులో వేళ్ళు పెట్టి తలని గుండెలకి ఎలా ఆనించుకోవాలో..  ఎవరు నేర్పారు ఈ జీవిత మధురిమలని మాకు…?    ఈ రోల్ ప్లేయింగ్  ఏ స్కూల్ లో చెబుతారు?

జీవితంలో మనం పొషించే ప్రతీ పాత్రని ప్రేమగా ఎలా పొషించాలో యద్దనపూడి కథలు  నేర్పాయి. మనసెరిగి మనుగడ సాగించడంలో  ఒక్కోసారి మన మనస్సే గాయపడి కన్నీళ్ళే మిగలవచ్చుగాక.. కాని కన్నీటి స్నానాల తరువాతే కదా మనస్సు ముత్యంలా  మెరిసి పరమాత్ముడి గుండెలపైకి చేరేది.. జీవితాన్ని అనుభవించడం అంటే అదే కదా!

ఇలా నవలలు చదివి ఏదో ఊహించేసుకుని .. ఆనక నిరాశపడ్డామంటే దానికి కారణం యద్దనపూడిగారి కధలు చదివిన మన తప్పు కాదు. చదవకుండా జీవితాలు మొదలెట్టేసిన ఇతరులది. కోపంలో ఉన్న కధానాయకిని బలంగా తనవైపు లాక్కుని వెచ్చని ముద్దు పెట్టి ఆమె మెడవంపులో తల దాచుకుని “క్షమించమని” అడగడం హీరోఇజమే అని తెలియకపోవడవల్ల కదా ఇన్ని తగాదాలు.

ఫెమినిజం అంటే. ప్రకృతి ఇచ్చిన ప్రధమ గుర్తింపైన స్త్రీత్వ్వాన్ని నిలబెట్టుకుంటూ ఆత్మగౌరవం అనే ఆభరణాన్ని సగౌరవంగా ధరించడమని తెలిసింది ఆవిడవల్లే.

లేకపోతే జుట్టు కత్తిరించుకుని పేంట్స్ వేసుకుని, అదే స్వేచ్చ అనుకుని, పెడసరంగా మాట్లాడటమే ఆత్మవిశ్వాసమని భావిస్తూ, మగవాళ్ళని తప్పుపట్టడమే పనిగా పెట్టుకుని ఎటూగాకుండా పోయేదాన్ని.

ఏ బంధమైనా గానీ ఎడమొఖం పెడమొఖం గా ఉన్నప్పుడు కలసి బతకాల్సి వస్తే , ఇగోలు చంపుకుని వీళ్ళో పది మెట్లు వాళ్ళో పదిమెట్లూ దిగి చచ్చినట్టు కలసి బతకాల్సి వస్తుందని అనుకుంటాము. కానీ ఇదే పనిని ఎవరూ మెట్టు దిగుతున్నామని బాధపడకుండా, ఇగోలు కాస్త ‘అటు’ జరిపి , ఒకరివైపు ఒకరు కాస్త ’ ఇటు’ ఒరిగితే విశ్వంలో అంతర్లీనంగా ఉండే ప్రేమ వీళ్ళని చుట్టుకుని ఆ బంధాన్ని అనుబంధంగా మార్చేస్తుందని   యద్దనపూడిగారు తన కథల్లో చాల అలవోకగా చెప్పేసారు.

పల్లెటూళ్ళు, తెల్లవారుఝాము హడావిడిలు,  పచ్చళ్ళు, బొబ్బట్ట్లు,  అమ్మలక్కల ముచ్చట్ట్లు.. పండగలు, పెద్దమనిషి అవ్వడాలు, పెళ్ళిళ్ళు….పెళ్ళి ఇళ్ళూ, అత్తలు,  మావయ్యలు వాళ్ళ బెట్టులు , అమ్మమ్మలు, అప్యాయతలు, పేదరికాల్లో ఉండే ఆత్మగౌరవాలు,  పెద్దిళ్ళల్లో ఉందే డొల్ల తనాలు,  భేషజాలవెనుక దాగిన బేలతనాలు, అలకలు., పౌరుషాలు, రోషాల, పశ్చాతాపాలు, మౌనభాషలు, మూగ సందేశాల, అనురాగాలు, అనుబంధాలు ,ఆప్యాయతలు, స్నేహాలు, సరసాలు , సరాగాలు , బలమైన భుజాలున్న బావలు,  వాలుజళ్ళ మరదళ్ళు, వాళ్ళ కోలబొట్లు…ఎంత అందం..ఎంత ఆనందం..!

మనసు అనేది ఉన్నందుకు ఎన్ని అనుభూతులు పొందవచ్చో అన్నింటినీ అందంగా ఆవిష్కరించే  గొప్ప కళ గల కలమున్న వాణి…. తన కలలని కథలుగా మనకు పంచిన రాణి.. యద్దనపూడిగారు.

ఉమ్మడి కుటుంబాలు, ఇంట్లో అందరూ వస్తూపోతూ, మనలని గారాలు చేస్తూ, మన మాటకి విలువ ఇస్తూ, మనలని ప్రేమిస్తూ…ఎంతబావుంటుందీ ఈ జీవితం అనిపించే కధలు…

ఒక్కోసారి విధి విలన్లా మారి మనకి కష్టాలని ఇచ్చినా, ఏ రాజశేఖరమో, చంద్రమో, మీనానో వచ్చి కాపాడుతారన్నధైర్యాన్ని ఇచ్చే నవలలు…

అసలు కష్టాలు వస్తే బాగుండును… కథానాయికలా ఎదుర్కుని చూపించేస్తానంత భావావేశాన్ని వారం వారం ఇచ్చేసే సీరియల్స్.. .

మళ్ళీ మనం మనలని తక్కువగా ఊహించుకోవడానికి వీల్లేకుండా వాణిశ్రీ, విజయనిర్మల, జయసుధల గారిలాంటి వాళ్ళని మనకి రోల్ మోడల్స్ చేస్తూ సినిమాలు..

రియాలిటీలో ఎలగమ్మా జీవించడం….!

ఆడవాళ్ళకే కాదు ఈ కలలు, ఈకష్టాలు అబ్బాయిలకీ తప్పలేదు. చదివి అర్ధంచేసుకున్న అబ్బాయిలు, ఆయనలు అయ్యకా వాళ్ళ జీవితాలకి. వాళ్ళని అల్లుకున్న వాళ్ళ జీవితాలకీ  అనుభూతుల పరిమళాలని  అద్దేఉంటారు..

ఇంకా ఉత్తేజితులైపోయిన కొద్దిమంది పెన్నట్టుకుని వారపత్రికల్లో వీరతాళ్ళు వేయించుకుని యండమూరిలు, మల్లాదిలు అయ్యారు. శ్రీనివాస్ సినిమాల్లోకి వచ్చి త్రివిక్రముడయ్యాడు.

నవల అనే ప్రక్రియ సాహిత్యంలో ఉన్నన్నాళ్ళు యద్దనపూడి గారు కథారాజ్యానికి మహారాణే.

ఆవిడ తెలుగులో రాయటం మన అదృష్టం. సహజంగానే మరి తెలుగువాళ్ళం కావడం మూలాన మరీ గొప్పగా చెప్పుకోము గానీ ఆవిడ ఇంగ్లీష్ లో రాసి ఉంటే ప్రపంచం మొత్తం మెచ్చుకునేది.

చలంతో మైదానాల్లో గడిపేదామనుకున్న నన్ను జన జీవనతరంగాల్లోకి లాక్కొచ్చిన ఆ బంగారు చేయిని ముద్దాడలేకపొయినందుకు, ఊళ్ళో ఉండి కూడా ఆవిడని కలవలేక పోయినందుకు  నన్ను నేను ఈ జన్మకి క్షమించుకోలేను.

*

మేడపాటి రామలక్ష్మి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సులోచనరాణి నవలలు చదివి కలలు కని అవి తీరక పోవటము వల్ల కాదు మనకు వేదన— ఆవిడ నవలలు చదవక దేన్ని “హీరోయిజం” ఆంటారో —– దేన్ని ఆడపిల్లల” అత్మగౌరవమంటారో”– తెలియని వాల్ల వల్ల సమస్య– సో మన కలలు మంచివే —తీరకపోయినా– ఆమె నవలల్లొ నాయికలమై– జీవితాన్ని అందంగా వుహించుకోవటము– మన అదృస్టము —అది– నిజము కాకపోయినా సరే–

  • నిజంగానే, మధ్య తరగతి మహిళలకి ఉహల ఉయ్యాల ఊపిన నవల మహారాణి యద్దనపూడి

  • నిజంగానే, మధ్య తరగతి మహిళలకి ఉహల ఉయ్యాల ఊపిన నవల మహారాణి యద్దనపూడి .

  • కొ.కు. నాయన, రావిశాస్త్రి, రంగనాయకమ్మ గార్లను చదవటానికి ముందు యద్దనపూడి సులోచనరాణి గారి రచనలతో అక్షరాభ్యాసం చేసిన తరానికి చెందినవాళ్లలో ఒకడిగా; ఈ నివాళి ద్వారా సులోచనరాణి గారి రచనల విలువను ఆర్ద్రతతో తలపోసి మేడపాటి రామలక్ష్మి గారికి వినమ్రపూర్వకగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

    తనకు తెలిసినవే అయినా మళ్ళీ మా గొరుసన్న ( అర్ధాంతరంగా కలం వొగ్గేసిన సీనియర్ కదా రచయత శ్రీ గొరుసు జగదీశ్వర రెడ్డి గారి ) కోసం ఈ కాసిని

    ఆ పాత్రతో ఇప్పటికీ గొడవే! …. (2016) ‘నవ్య’ లో యద్దనపూడి సులోచనరాణి గారి ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలు… http://www.andhrajyothy.com/artical?SID=581780

    ప్రియమైన అమ్మాంటీ! … యద్దనపూడి గారి కథలతో వరుసగా సీరియల్స్‌ రూపొందించిన దర్శకురాలు మంజులా నాయుడి భావోద్వేగమైన లేఖ
    http://www.andhrajyothy.com/artical?SID=583228

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు