కుమారి నా విద్యార్థిని. ఆరోతరగతి. ఒద్దికతనం చలాకీతనం సమపాళ్లలో వున్న అమ్మాయి. చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ. చర్మం రంగు నల్లగా- కళ్లు రెండూ గొప్ప కాంతిబింబాలుగా- రేపేదో మహత్తరమైన విజయం సాధించబోతుంది అన్నట్టుంటుంది కుమారి. నాకు అందరి విద్యార్థుల జీవన నేపథ్యాలు, ఏఏ స్థితుల నుంచి బడిలోకి వస్తున్నారు- అనే అంశాలన్నీ తెలుసు. ఒక సామాజిక ఉపాధ్యాయుడిగా ఇవన్నీ తెలుసుకుని- విద్యార్థుల భావిని నిర్ధేశించాల్సిన గొప్ప బాధ్యత వుందనే ఎరుక వుంది నాకు.
సరిగ్గా ఈ రోజుకి పదేళ్ల క్రిందట సంగతి. ఏ రోజులాగే ఆ రోజు బడి ముగిసిన తర్వాత సాయంత్రం తిరుగుప్రయాణం కోసం నేను పనిచేస్తున్న భైరిపురం వూరి లోపల నుంచి వూరి బయటకు నడుస్తున్నాను. తరుచూ వూరిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి విద్యార్థుల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలుసుకోవడం నా ముఖ్య కార్యక్రమం. విద్యార్థులను ప్రేమించడం, విద్యార్థుల చేత ప్రేమించబడటం కన్నా పరమ సున్నితమైన పని ఇంకోటి వుంటుంది అనుకోను.
విద్యార్థుల తల్లిదండ్రులూ నాతో స్నేహంగా వుంటారు. కష్టసుఖాలను కలబోసుకుంటారు.
వూరి బయటకొచ్చాను
ఊరి బయట ఒక చిన్న ఖాళీ ప్రదేశంలో అంతకు ముందు తుప్పా డొంక వుండేవి. ఇప్పుడు ఒక జీవితం వెలిసింది.
ఒక వూరు తరిమేస్తే- ఈ వూరికి ఈ జాగాలోకి వచ్చిందా కుటుంబం.
అతను బుట్టలు అల్లితే, ఆమె వాటిని ఒక ఒంజులో పేర్చుతుంది. ప్రతి రోజు తెల్లారి అతను భుజానికి, చేతులకు బుట్టలూ తట్టలూ వేసుకుని వీధిల్లోకెళ్లి అమ్ముతాడు. అదే వాళ్ల బతుకు తెరువు- జీవనోపాధి.
అతనూ ఆమె- వాళ్లిద్దరి చిన్న కూతురే కుమారి. కలల బిడ్డ. చదువుల తల్లి. జీవితం లోతుపాతులను నిదానంగా గ్రహిస్తున్న తెలివిది. సుఖం కన్నా కష్టమేమిటో తెలిసిన పసిది. గతం, వర్తమానం నాతో పంచుకునేది. ‘ ‘ఇద్దన వలస’ అను వూరిలో మాఅమ్మోలు వుండేవోలు. అక్కడి పెద్దోలు మా భూమి పట్టా దొంగిలించి- మావోలిని కట్టుబట్టలతో తగిలేస్తే ఈ వూరుకి చేరారు. ఇక్కడ ఈ జాగవల ఈ వూరు పెసిరెంటుని అడిగి బతుకుతున్నాం. రేపో మాపో మళ్లీ మమ్మల్ని తగిలేస్తే ఇక్కడ నుంచి ఇంకో వూరికెలిపోతాం ‘ అని అమాయకంగా ఏ దుఃఖం చిప్పిళ్లకుండా చెప్పేది.
నేనో స్వాప్నికుడిగా- కుమారిని చూశాను. ఇప్పుడు కుమారి విజయవంతంగా పి.జి పూర్తి చేసింది. రేపటివైపు అడుగులు వేస్తుంది. అప్పటి కుమారిని గురించి రాసిన కవితే ఈ కవిత. నా తొలి కవితా సంపుటి ‘ఎగరాల్సిన సమయం’ లో ఈ కవిత వుంది. ప్రముఖ అనువాదకులు నౌడూరు మూర్తి గారు ‘weaving the dreams..’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించి అతను పొందుపరిచిన ‘Wakes on the Horizon’ అను తెలుగు కవుల ఆంగ్లసంకలనంలోనూ వుంచారు.
*
కలల వంతెన నేస్తూ..
చీకటి పలుచని వస్త్రంలా పరుచుకుంటున్న
వేళ
వాళ్లు అక్కడ వొక వంతెనను కడుతుంటారు
మహా సౌందర్యవంతమైన వంతెనను
అంతే సౌందర్యవంతమైన మాటల అల్లికతో
కడుతుంటారు
మనుషులు దీవులుగా భిన్నధృవప్రపంచాలుగా
విడిపోతున్న దశలో
వాళ్లలా నిమగ్నం కావడం సంలీనం కావడం
గొప్ప దృశ్యమానమైన స్థితి
ఆ తల్లీకూతుళ్లు ఆ రాత్రి ఆ యింట విరబూసిన
రెండు చందమామలు
***
మొన్నెక్కడో నిన్నెక్కడో
ఈ రోజు ఈ ఊరి చివర
చలనస్వభావులు వాళ్లు
వాళ్లకు విశ్వమే యిల్లు
ఆకాశం యింటి పైకప్పు
ఎప్పుడో ఏదో ఊరు విసిరేస్తే
ఈ ఊరు తీరానికి వొచ్చి చేరారు
నాలుగు వెదురుబద్దలతో
గూళ్లు అల్లుకుంటూ
బతుకును ఈదడమెలాగో
నేర్చుకుంటున్నారు
***
ఆ తల్లీ పన్నెండేళ్ల ఆ పసితల్లి
రోజూ సాయంకాలాలు
ఏం మాట్లాడుకుంటుంటారు!
బహుశా ఆ పిల్ల చదువుని గురించా
దూరంగా హాస్టల్లో వుండి చదువుకుంటున్న
తమ్ముడి గురించా
లేదా యింకా అనువుగా
గుడిసె కట్టుకోవడానికి వీలుగా వున్న
ఖాళీ జాగా గురించి అయ్యుంటుందా
***
పక్కనే జారిన పందిరి కింద
వాళ్ల కలల వంతెనను రెండో చివర నుంచి నేస్తూ
బతుకు వంతెనకు దన్నుగా వున్న
ఆ చదువుల చందమామ తండ్రి
బావుంది