ఈ నగరంలో కర్ఫ్యూ ఉంది
అది మనసును గట్టిగా కరచుకున్నట్టే ఉంది
ఊహలన్నీ ఎక్కడికి పోయాయో ఎవరూ చెప్పలేరు
బహుశా అవి రహస్య స్థావరంలోకి పోయి
గాలి ఆడని చీకటిగదిలో కూర్చుని
లోపల్నుంచి గొళ్లెం పెట్టుకుని వుంటాయి
గతంలో కాంక్షలు చాలా వరకు నెరవేరాయి
ఇప్పుడు ఆశలు నిప్పులకు ఆహుతయ్యాయి
వాటి యిల్లు కాలిపోయి బొగ్గులుగా మారింది
ఇవాళ్టి ఉదయాన బాంబు పేలి
విశ్వాసపు వంతెన కూడా ఎగిరిపోయింది…
అనే వార్త వ్యాపిస్తోంది అంతటా
కేవలం నిరాశ మాత్రం వీధిశునకం లాగా
మనసులోతుల్లో పొంచివుండి
అసంపూర్ణ ఆశలను అన్వేషిస్తూ
తిరుగుతోంది
నేపాలీ మూలం: సిద్ధార్థ రాయ్
ఆంగ్లానువాదం: ఎం. బి. రాయ్
సిద్ధార్థ్ రాయ్ 1963 లో, డార్జీలింగ్ లోని మిరిక్ లో జన్మించారు. ఈయన ఒక కవి, కథకుడు, అనువాదకుడు, చిత్రకారుడు. ఇప్పుడు హైస్కూల్లో టీచరుగా పని చేస్తున్నారు. ఒక కవితా సంపుటిని, ఒక కథల సంపుటిని రచించడమే కాకుండా డాక్టర్ ఎన్. గోపి రాసిన కాలాన్ని నిద్ర పోనివ్వను కవితా సంపుటిని నేపాలీలోకి తర్జుమా చేశారు. ఇతని రచనలలో తన పెంపకపు ప్రభావం ప్రతిబింబిస్తుంది. ఒంటరి జీవితం, నీడలాంటి నిశ్శబ్దం అందులోని ముఖ్యాంశాలు.
తర్జుమా బావుంది
గొప్ప అనువాదం సర్ అభినందనలు