కరోనా పాజిటివ్

  దాదాపు ఏడు శతాబ్దాల క్రితం-

1353లో ఇటలీని వొణికించిన భయానక మహమ్మారి ప్లేగు (బ్లాక్ డెత్) లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంది. దీని నేపధ్యంలో ఇటాలియన్ కవి,రచయిత, పరిశోధకుడు జియోవన్ని బొకాసియో “డికామెరాన్” పేరుతో ఒకే ఇతివృత్తం చుట్టూ అల్లిన వంద రూపక కథలు రాశారు. వాస్తవ జీవితానుభవాల ఆధారంగా రాయబడిన ఈ కథలు శతాబ్దాలు గడచినా చిరస్థాయిగా నిలిచినయి. ఈ పుస్తకం ప్రపంచ క్లాసిక్స్ లో ఒకటిగా శాశ్వతత్వం పొందింది. అంతేకాదు, బొకాసియోను ఇటలీ గద్య సాహిత్య పితామహున్ని చేసింది. ప్లేగు తీవ్రస్థాయిలో ఉన్న ఫ్లోరెన్స్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతూ రెండు వారాలు ఒక భవనంలో  ఆశ్రయం పొందిన పదిమంది యువతీ యువకులు వివరించిన అనుభవ కథనాలకు కొంత సృజన జోడించి రాసినవే “డికామెరాన్” కథలు.

దాదాపు ఇదే సంప్రదాయాన్ని రిపీట్ చేస్తూ గత ఏడాది ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా నేపధ్యంలో ప్రఖ్యాత “న్యూయార్క్ టైమ్స్” పత్రిక డికామెరాన్ ప్రాజెక్టు పేరిట ప్రపంచ ప్ప్రసిద్ధ రచయితలతో కోవిడ్ కథలు రాయించింది. మొత్తం 29 కథలతో కూడిన ఈ పుస్తకం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నది.

న్యూయార్క్ టైమ్స్ నేతృత్వంలో వెలువడ్డ “డికామెరాన్: 29 న్యూ స్టోరీస్ ఫ్రమ్ ది పాండేమిక్” సంపుటిలో మొజాంబిక్ రచయిత మియాకౌటో రాసిన వ్యంగ్య కథ “ఏన్ అబ్లయిజింగ్ రాబర్” కు ఇది నా అనువాదం.

 

రచయిత గురించి:

ఆఫ్రికాలో పోర్చుగీస్ భాషా రచయితల్లో అగ్రగణ్యుడైన మియా కౌటో (పూర్తిపేరు ఆంటోనియో ఎమిలియో లిటే కౌటో) మొజాంబిక్ దేశస్థుడు. సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన ఆయన బెయిరా నగరంలో 1955 జూన్ 7న  జన్మించారు.

1974లో కార్నేషన్ ఉద్యమం పోర్చుగీస్ వలసపాలనను కూలదోసిన తర్వాత మొజాంబిక్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించింది. స్వరాజ్య పోరాటంలో ప్రధాన రాజకీయ శక్తి అయిన గా “ఫ్రెలిమో” ఆదేశాల మేరకు మియాకౌటో తన మెడిసిన్ చదువు మధ్యలో ఆపేసి రెండేళ్లు  “ట్రిబ్యునా” సంపాదకునిగానూ, కొత్తగా స్థాపించిన మొజాంబిక్ సమాచార శాఖ డైరెక్టరుగానూ పనిచేశారు. ఆ తర్వాత  జీవశాస్త్రంలో ఉన్నత చదువులు పూర్తిచేసిన కౌటో దేశ రాజధాని మపుటోలో సైంటిస్టుగా ఉన్నారు.

మియా కౌటో ఆధునిక ఆఫ్రికా సాహిత్యంలో తారాజువ్వలా ఎగిసిన రచయిత. 14వ యేట నుంచి కవిత్వం రాశారు. ఆయన రచనలు ముప్పయికి పైగా దేశాల్లో వివిధ భాషల్లోకి అనువదించ బడ్డాయి. వలస పాలనతో వచ్చిన సామాజిక ఆర్థిక మార్పుల మధ్య ఆఫ్రికా దేశాలు ఇకపైన స్థిరత్వం, గుర్తింపు, సమానత్వాల కోసం మనుగడ సాగించాలని అభిలషించారు. ఆఫ్రికా శక్తిసామర్త్యాల పైన ఎంతో  నమ్మకాన్ని కలిగివున్న ఆయన అక్కడి సంస్కృతిలోని భౌతిక, ఆధ్యాత్మిక ధోరణుల నడుమ అంతర్ సంబంధాల ఆవశ్యకతను తన రచనల్లో చిత్రించారు. ప్రత్యేకించి మొజాంబిక్ సంప్రదాయ సమాజంపై వలస సంస్కృతి ప్రభావం, పరిణామాలపై సృజన చేశారు. తన రచనల్లో ప్రాంతీయ భాష, యాసకు పెద్దపీట వేసిన కౌటో, ప్రాంతీయ వాడుక పదాలు, పలుకుబడులు, కథన నిర్మాణాలను పోర్చుగీసులోకి చొప్పించి కొత్త ఉనికి కల్పించారు. నూతన కథన శైలితో కొత్త ప్రయోగాలు  చేశారు.

ఆధునిక లాటిన్ అమెరికా సాహిత్యంలో ఒరవడి సృష్టించిన “మ్యాజిక్ రియలిజం”తో ప్రభావితుడైన ఆయన పోర్చుగీసు భాషలో నూతన అధ్యాయానికి తెరలేపారు.

ప్రతియేటా ఇటలీ అందజేసే ప్రతిష్టాత్మక లాటిన్ యూనియన్ సాహిత్య పురస్కారం పొందిన తొలి ఆఫ్రికా రచయితగా మియా కౌటో చరిత్ర సృష్టించాడు. 1998లో బ్రెజిలియన్ అకాడమీ ఆఫ్ లెటర్స్ గౌరవాన్ని పొందిన మొదటి ఆఫ్రికా రచయిత కూడా ఆయనే.

పదుల సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన “స్లీప్ వాకింగ్ ల్యాండ్” నవలకు ఆయన పోర్చుగీసు భాషలో అతి ముఖ్యమైన కామోస్ అవార్డును, న్యూస్టెడ్ అంతర్జాతీయ బహుమతిని పొందారు.

కౌటో తమ రచనలన్నీ పోర్చుగీసు లోనే చేశారు.వాటిలో మూడొంతుల పైగా వివిధ భాషల్లోకి వెళ్లాయి. ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు, పది వరకూ కథల సంపుటాలు, పదిహేను నవలలు, ఆరు వ్యాస సంపుటాలు వచ్చాయి.

కరోనా పాజిటివ్ (అనువాద కథ)

                                                                           మూలరచన: మియా కౌటో

                                                                 

క్కసారిగా భయపడిపోయాను.  ఈమధ్యనెందుకో ఊరికూరికే దిగులుగానూ, భయంగానూ ఉంటున్నది. ఐనా నాకెందుకు భయమని అనుకుంటూనే ఉంటాను. కానీ, దిగులైనా.. భయమైనా మనచేతిలో ఉంటాయా? రెండూ మనసుకు సంబంధించినవే.

నాయింట్లో నేనో  ఖైదీలా ఒంటరిగా గడుపుతున్న వేళ…

హఠాత్తుగా ఎవరో తలుపు కొట్టారు. ఊరికీ…మనుషులకూ సాధ్యమైనంత దూరంగా బతుకుతున్నవాణ్ణి.  నన్ను వెతుక్కుంటూ ఇంతదూరం ఎవరొచ్చారు?  వొచ్చింది ఎవరైనా అంత గట్టిగా తలుపులు బాదడం అవసరమా?

అయినవాళ్ళెవరూ లేని ఒంటరిని. ఏ కరువు కాటకాలో, ముంపెత్తే వరదలో, చీటికి మాటికి నా వృద్ధ దేహాన్ని ఆశ్రయించే రోగాలో తప్ప మరెవ్వరూ నన్ను కలిసేందుకు రారు.

బయట నిప్పులు కురుస్తున్న ఎండాకాలం. నా బతుకులోని ఒకానొక నిస్తేజ మధ్యాహ్న సమయాన చెమటలు కక్కుతూ  వొచ్చిపడిన ఆగంతకుడెవరన్న ఆసక్తి పెరిగింది. కొంచెమైనా సంస్కారం లేకుండా  బూటుకాళ్ళతో తలుపులు విరిగిపోయేలా తంతున్నాడు.

నేను లేచి పరిగెత్తాను. పరిగెత్తానని చెప్పడం, అసలట్లా భావించుకోవడమే ఒక అందమైన భ్రమ. నా వొంట్లో అంత సత్తువెక్కడిది? సరిగా లేచి నిలబడి అడుగు వేసేందుకే  అయిదు నిమిషాలు పడుతుంది.

“దబ దబ… దబ దబ దబ…” మళ్ళా గట్టిగా.

అతడెవరో గానీ తలుపులు విరగ్గొట్టేలా ఉన్నాడు. కొంచెం హడావిడిగానే లేచి తలుపు తెరిచేందుకు వెళ్ళాను. కీళ్లనొప్పుల పాతకాపుని. కాళ్ళకున్న వదులు రబ్బరు చెప్పులు టక్కు టక్కు మని చప్పుడు చేస్తుంటే అడుగులు బలహీనంగా పడ్డాయి. ఆ వయసులో  శక్తికి మించి అంతకన్నా ఎక్కువ హడావిడి పడలేను.

దేహం వొంగిపోయి, కాళ్ళు కొలతబద్దల్లా నేలను కొలుస్తూ సాగినప్పుడూ..  భూమిలో లోతులు తరిచి చూసినప్పుడూ మనిషి  తను వృద్ధాప్యాన్ని మోస్తున్నట్టు గ్రహిస్తాడు. ఆపై ఒక అంగీకారానికీ, సర్దుబాటుకూ రావడం తప్పదు.

గడియతీసి చిన్నగా తలుపు తెరిచాను. నా ఎదురుగా విచిత్రమైన ఆకారం కనిపించింది. పాదాల నుంచి తలవరకు అంగుళం కనిపించకుండా, ఎవరో గ్రహాంతరవాసిలా నిలువెల్లా దుస్తులు ధరించివున్న ముసుగు మనిషి ఒకరు నిలబడి ఉన్నాడు.

నేను హఠాత్తుగా తలుపు తెరిచి ముందుకు రావడంతో అతడు కంగారుపడి రెండడుగులు వెనక్కి గెంతాడు.

“దూరం.. దూరంగా నిలబడండి” గద్దించినట్టు గట్టిగా అరిచాడు.

“అంత దూకుడు దేనికి పెద్దాయనా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించాలని తెలియదా? కనీసం ఆరడుగుల దూరంలో నిలబడి ఉండండి..”

అతడు బహుశా దొంగ అయివుండొచ్చు. కానీ నా ఇంటికొచ్చి నాకే హితబోధలు చేస్తాడెందుకు..? అతడు దొంగే అయితే అంత కంగారూ భయమెందుకు..? ఎవరి కంటబడకుండా దొంగతనం చేద్దామని అనుకున్నాడా? అలాగైతే తలుపెందుకు కొట్టాడు?

ఏమైనా అతడు నన్ను చూసి నిజంగానే భయపడ్డాడు. అతని భయం ఒకరకంగా ఆశ్చర్యానికి గురిచేసింది. మరోపక్క దొంగ అయివుండీ అట్లా భయపడటం ఒకింత కంగారు పుట్టించింది. ఎందుకంటే భయపడే దొంగలు అతి ప్రమాదకరమైన వ్యక్తులని నా నమ్మకం.

మూసుగువ్యక్తి హఠాత్తుగా జేబులోంచి చిన్నసైజు  పిస్టల్ ఒకటి బయటికి తీశాడు. దాన్ని సూటిగా నా నుదుటిమీద గురిపెట్టాడు. చిత్రంగా దాన్ని చూసి నేనేం పెద్దగా భయపడలేదు. అదేదో పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మలా ఉన్నది. పైగా చాలా చిన్న ఆకారంలో… పిడికిట్లో ఇమిడిపోయేలా ఉన్నది. ఏదో మీట నొక్కితే ఆకుపచ్చని కాంతిని విడుదల చేస్తున్నది.

అతడు పిస్టల్ నా నుదుటిమీద ఆనించాడు. నేను ఏం జరుగుతుందో అనే అతురతతో కళ్ళూ గట్టిగా మూసుకున్నా.

వాస్తవానికి ముసుగు మనిషి దొంగవలే కాకుండా మామూలుగా కనిపిస్తున్నాడు. అతని నడవడి, మాటతీరు కూడా అందర్లాగే సాధారణంగా ఉన్నయి. శాంతంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాడు.

కానీ అంతమాత్రాన నేనతన్ని గుడ్డిగా నమ్మి మోసపోదల్చుకోలేదు. అతనిపట్ల విధేయత చూపాల్సిన అవసరం కూడా నాకు లేదు.

నా నుదుటికి గురిపెట్టి ఆనించిన వస్తువు వల్ల నాకేం నొప్పి కలుగలేదు. నా మొహం మీద ప్రసరించే ఆకుపచ్చ కాంతి కూడా నాకెలాంటి హాని చేయలేదు. కొంచెం స్పర్శ, చిన్నగా నిమిరినట్టు అయింది.

నాకు ఆశ్చర్యమేసింది. పిస్తోలుతో నాకు నొప్పిలేని ఇంత ప్రశాంతమైన మరణమా? ఏ హింసా లేకుండా ఒక్కక్షణంలో ఇట్లా చావడం నిజంగా దేవుడిచ్చిన వరం. ఒంటరి ప్రాణినైన నా ఇన్నిరోజుల ప్రార్థనల్ని భగవంతుడు ఆలకించాడన్న మాట. ఎలాంటి యాతనలేని ప్రశాంతమైన ముగింపు ఎందరికి వస్తుంది..? దాన్ని దేవుడు నాకిస్తున్నాడు.

అతని వద్ద గల ఆయుధంతో నన్ను చంపినా సరే, అతన్ని మాత్రం నేను నమ్మదల్చలేదు. నన్ను అమాయకుణ్ణి చేసి మోసం చేయాలనుకుంటే  కుదరదు. నేను నేనంత అమాయకుణ్ణి కాదు. అతని ఆటల్ని సాగనివ్వను. అతనిపట్ల కనీస విధేయత కూడా చూపాల్సిన అవసరం లేదని భావించాను.

నాకు తెలుసు, ఎన్నోచోట్ల పనిచేశాను. నాకిలాంటివి అనుభవమే. మనసులో దుర్మార్గపు యోచన గల్గిన వాళ్ళంతా పైకి ఇట్లాగే ప్రశాంతంగా, స్నేహ పూర్వకంగానే మసులుతారు. ఈకోవలో ఎందరో దొంగల గురించీ, దుర్మార్గుల గురించీ, హంతకుల గురించీ తెలుసు. చివరికి పోలీసుల గురించి కూడా తెలుసు. నేను చూసిన సైనికుల ఆకృత్యాల గురించి మరింత బాగా తెలుసు.

అదంతా చాలాకాలం నాటి సంగతి. నేనిప్పుడు ఏ ఉద్యోగమూ చేయడం లేదు. ఎక్కడా డ్యూటీలో లేను. ఎవరితోనూ కలిసి తిరగటం లేదు. ఎవరి ప్రభావానికి ప్రలోభాలకు అందనంత దూరంగా బతుకుతున్నాను.

పిస్తోలు లోపల పెట్టేసుకోమని చెప్పి మాయింట్లో వున్న ఒకేఒక్క పాత కుర్చీలో కూర్చోమని ఆగంతకుణ్ణి ఆహ్వానించాను. అతన్ని అప్పుడే మరింత పరీక్షగా చూశాను. ముఖం నుంచి కాళ్ళ వరకు అంతా మూసుగులోనే ఉన్నాడు.  పాదాలు రెండూ కొంచెం కూడా కన్పించకుండా పెద్ద బూట్లు తొడిగాడు. వాటికి ఒకరకమైన ప్లాస్టిక్ సంచులు గట్టిగా చుట్టబడినట్టు గమనించాను. ముఖం ఏమాత్రం కనిపించకుండా మాస్కు, ఆపైన ముసుగు.

అప్పటికి ఆ దొంగ ఆంతర్యం నాకు పూర్తిగా అర్థమైంది. అతడు చాలా తెలివిగా నా ఇల్లు లూటీ చేద్దామని వొచ్చాడు. తన గురించిన ఎలాంటి ఆధారాలు వదలకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తలతో వచ్చాడు.

నేనతని ముఖం మీది ముసుగు తొలగించమని అడిగాను. అతనికి ఎటువంటి హాని చేసే ఉద్దేశం నాకు లేదని, కాటికి కాళ్ళు సాచిన ముసలివాడినని.. నన్ను నమ్మాలనీ సూచించాను. అతనికి అన్నివిధాలా భరోసా కలిగించే ప్రయత్నం చేశాను. దీనికి ముసుగు మనిషి క్రూరంగానో, వెటకారంగానో నవ్వడానికి బదులు కాసింత విచారంగా నావంక చూశాడు. నిర్లిప్తంగా చిన్న మందహాసం చేశాడు. తర్వాత నీళ్ళు నమిలినట్టు అస్పష్టంగా గొణిగాడు.

“ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవర్నీ గుడ్డిగా నమ్మడానికి లేదండీ. పైకి అంతా మామూలుగానే కనబడతారు. కానీ లోపల ఎవరేం దాచుకున్నారో.. ఏం మోసుకెళ్తున్నారో చెప్పలేం.”

అతని మాటల్లోని నిగూఢ సందేశాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాను. అతడే విషయంలో  అనుమానిస్తున్నాడు? నేను రహస్యంగా ఆయుధాలు దాచుకొని తిరుగుతున్నానని భావిస్తున్నాడా..? లేక నాఈ కృశించిన వృద్ధదేహం మాటున నిధినిక్షేపాలు గుప్తపరిచి ఉన్నాయని భ్రమపడుతున్నాడా..?

నాలో ఏం చూసి అతడంతగా సందేహిస్తున్నాడు..? అతని చేతిలో పిస్తోలు ఉంది. దాంతో బెదిరించి తనకి కావాల్సింది దోచుకొని పోవొచ్చు కదా..!

ఆగంతకుడు ఇల్లంతా ఒకసారి కలియ జూశాడు. ఇంట్లో దోచుకునే విలువైన వస్తువు ఒక్కటి కూడా లేదన్న విషయం అతనికి క్షణాల మీద అర్థమైనట్టుంది.

ఇల్లు చూడటం ఆపి నావైపు తిరుగుతూ తనను గురించి వివరంగా పరిచయం చేసుకున్నాడు.

తను వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన ప్రతినిధినని  చెప్పాడు. కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపధ్యంలో ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్టు వివరించాడు.

నాకు నవ్వొచ్చింది. ఈ దొంగెవరో కానీ, సరిగా అబద్ధం కూడా చెప్పటం చేతకానివాడిలా ఉన్నాడు. పాపం..! అనుభవం లేని దొంగనుకుంటా. సమయానుకూలంగా అబద్ధం చెప్పటమనేది చోరవిద్యలో ప్రాథమిక కళ. అది ఇతనికి అబ్బినట్టు లేదు.

కాలుతున్న అడవిలా  ప్రపంచాన్ని చుట్టుకొస్తున్న కరోనా గురించి అటు ప్రభుత్వమూ, ఇటు వైద్యశాఖ అధికారులూ ఆందోళన చెందుతున్నారనీ.. అందుకే పై అధికారుల ఉత్తర్వుల మేరకే తాము ఇట్లా ఇల్లిళ్ళూ తిరుగుతూ వైద్య పరీక్షలు చేస్తున్నామనీ అతడెంతో వివరంగా వివరించే యత్నం చేశాడు. కానీ నేనతని మాటలు నమ్మలేదు. నా సుదీర్ఘ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని ఉపద్రవాలు చూడలేదు? కరోనా కంటే తీవ్రమైనవీ,   చాలా మామూలుగా కనిపిస్తూనే ప్రాణాంతకమైన రోగాలెన్నో వొచ్చినయి… వెళ్లినయి. మనిషి ప్రాణాలతో ఆడుకునేందుకు కరోనా మహమ్మారులూ.. ఉపద్రవాలే ఎందుకు..? సామాన్యులను మాత్రమే గురిచూసి ఎంచుకొని,  ప్రాణాలు తీసే సాధారణ జబ్బులు మొదలు తీవ్రమైన రుగ్మతల వరకు ఎన్నెన్ని రోగాలు లేవు..?  వాటి గురించి ఎప్పుడూ ఎవరూ పట్టించుకోరేందుకు..?

కరోనా పాజిటివ్ అంటే ఇప్పుడు ప్రపంచం ఉలికిపడుతుంది. కానీ సామాన్యుల్ని మరణశయ్య మీదకు ఎక్కించి పీడించి పీడించి చంపే  రోగాల సంగతేమిటి..? అలాంటి రోగాలను కొందరికి మాత్రమే పరిమితం చేసి, ప్రపంచం ఎందుకు చూడనట్టు ఉండి పోతుంది?

నాకు తీవ్రంగా మశూచి సోకి దాదాపు చావుకి దగ్గరగా వెళ్లొచ్చాను. అప్పుడెవరూ ఇలా బాగోగులు కనుక్కునేందుకు రాలేదేం? నా ఆరోగ్యం గురించి ఆరా తియ్యలేదేం?

మా నాయన క్షయ రోగంతో పోయాడు. ఎవరూ దగ్గరకు కూడా రాలేదు. నా భార్య రొమ్ము కేన్సర్ తో పోయింది. అప్పుడు ఎవరైనా వొచ్చి మమ్మల్ని చూశారా? ఏదైనా సాయం చేశారా..? వైద్యం చేయించారా?

నా ఒక్కగానొక్క కొడుకుని డెంగీ బలితీసుకుంది. వాడి శవాన్ని ఒంటరిగా మోసుకెళ్లి ఈ చేతులతో సమాధి చేసి వొచ్చాను. నాతో కలిసి నడిచేందుకైనా ఏడిచేందుకైనా ఎవరూ లేకుండా పోయారు.

మా పక్కింటాయన ఎయిడ్సుతో కుళ్ళికుళ్ళి చచ్చిపోయాడు. అతనికా జబ్బు ఎందుకొచ్చిందో.. ఎట్లా వొచ్చిందో ఎవరికీ తెలియదు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కనీసం అతని పరిస్థితి తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.

నా భార్య బతికి ఉన్నప్పుడు తరుచుగా ఒకమాట అంటూవుండేది.

“ఏమండీ.. మనమిట్లా ఊరుకు దూరంగా విసిరేసినట్టు బతకడం తప్పండీ. మనిషికి మరో మనిషి తోడు అవసరం. ఒంటరిగా, అయినవాళ్లనేవారు లేకుండా, అందులోనూ  ఆస్పత్రులకు చాలా దూరంలో వుంటే అత్యవసరంలో మనకే సాయమూ  అందదు”

ఆమె అమాయకత్వానికి నవ్వేసేవాణ్ణి. ఉత్త వెర్రిబాగుల్ది. లోకం తెలియని అజ్ఞాని. మన సమాజంలో గట్టిగా వెళ్ళూనుకున్న ఒక కఠిన వాస్తవం గురించి ఆమెకు అవగాహన లేదు. మనుషులకూ, ఆస్పత్రులకూ దగ్గరగా ఉన్నంత మాత్రాన ఏ ప్రయోజనమూ ఉండదు. మనిషికి మనిషికి మధ్య దగ్గరతనం ఉండాలి. అది కలిసి ఒకచోట ఉన్నంత మాత్రాన రాదు. అలాగే ఆస్పత్రులు నిర్మించింది జనం అందరి కోసం కాదు. బడుగుల కోసం అసలే కాదు. అవి కొందరి కోసమే. సామాన్యులకు ఆస్పత్రికి వెళ్ళే దారి మాత్రమే  తెలుస్తుంది కానీ, వారు లోపలికి వెళ్ళే మార్గమెప్పుడూ మూసేవుంటుంది. దాన్ని దాటివెళ్ళే సామర్థ్యం వాళ్లకు ఉండదు. అందుకే అవి ఎండమావుల మాదిరి పేదోళ్ళకి ఎంత చేరువో అంత దూరం.

అట్లాగని ఆస్పత్రుల మీదా… వాటిని నిర్మించినవారి వ్యవస్థ మీదా నేను నిందవేయను. నేనైనా, నా వర్గానికి చెందిన వారెవరైనా మా బతుకులు వేరు. ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. మేము ఆస్పత్రులూ, అందని వైద్యం  మీద ఆశ కంటే అనారోగ్యాలతో సర్దుకుపోతుంటం.

ముసుగుదొంగ తన ధోరణిలో చెప్పుకపోతూనే వున్నాడు. అతడు ఆగకుండా మాట్లాడుతున్నాడు. మహమ్మారి వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాడు. అతను కావాలని ఏవేవో చెపుతూ తను దొంగను కాదన్న విషయాన్ని మాటల్ని మళ్లించడం ద్వారా నమ్మించే యత్నం చేస్తున్నట్టు అర్థమైంది. అప్పటికి నేనుకూడా కొంత కుదుటపడ్డాను. ముసుగుమనిషి దొంగ కాదని నాకూ నమ్మకం కలిగింది. అతడు నా నుదుటికి ఆనించి పెట్టిన పిస్తోలు నా వొంట్లో జ్వరాన్ని కొలిచే పనిముట్టు అని అర్థమైంది. అలాగే చిన్న అగ్గిపెట్టె లాంటి పరికరంతో అతడు నా పల్సును, దేహంలో ప్రాణవాయువును కొలిచి చూశాడు. తర్వాత నావైపు పరిశీలనగా చూస్తూ “మీకేమీ లేదండీ.. మీరు బాగానే ఉన్నారు” అని చెప్పాడు చిన్నపాటి వెకిలి నవ్వుతో.

దీనికి నేను పెద్దగా స్పందించలేదు. జబ్బులేదని చెపితే ఆనందిస్తానని అతడు భావించినట్టున్నాడు. నా సంగతి వేరుకదా. కనీసం సంతృప్తి సూచకంగా తలకూడా ఉపలేక పోయాను.

“మీకు ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా?” అతడు ఆరా తీశాడు.

నేను తేలిగ్గా చూస్తూ పెద్దగా నవ్వాను. నా దేహంలోని బలహీనపడిన ప్రతి ఎముక, దాని పర్యవసానంగా కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు నాకు సాధారణం.

ఇక దగ్గు..? అతడు ఎలాంటి దగ్గు గురించి అడుగుతున్నాడు? పాతిక సంవత్సరాలు రాళ్ళగుట్టల్లో పనిచేశాను. బండరాళ్లను పిండిచేస్తూ స్టోన్ క్రషింగ్ యంత్రాలు వెదజల్లే దుమ్ము, ధూళిని ఏళ్ల తరబడి అనుక్షణం పీల్చిపీల్చి ఊపిరితిత్తుల్ని కాలుష్య క్యారీబ్యాగుల్లా మార్చుకున్నా.

పదేళ్ల క్రితం అనారోగ్యంతో రాతి గనుల నుంచి ఇంటికి తిరిగొచ్చినప్పుడు నావెంట తెచ్చుకున్న దగ్గు, ఆయాసం నన్ను  గొయ్యితీసి పూడ్చిపెట్టేంత దూరం తీసుకపోయింది. దాదాపు సమాధిలోకి నడిపించింది. ఏ అదృష్టం వల్లనో బతికి బట్టకట్టగల్గుతున్నాను. కానీ ఊపిరి సలపనివ్వని దగ్గు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటది. నా పక్కటెముకలు సరిగా కదలట్లేదు. ఛాతి నిండా దుమ్ము, రాతి రేణువులే నిండివున్నయి. ఒక్కొక్కరుగా నా అనేవాళ్లు  కళ్ళ ముందే దాటిపోతుంటే ఏమీ చెయ్యలేక చూస్తుండిపోయాను. అందర్నీ కోల్పోయి ఏకాకిగా మిగిలాను. ఒంట్లో సత్తువ లేకపోయినా కడుపు నింపుకునేందుకు ఏదో ఒక పనిచేసుకుంటూ బతుకుతున్నా. కర్రల్ని తాళ్లతో బిగించినట్టు.. కదిలితే వూడి పడిపోతాయనేట్టు భయపెట్టి హింసించే మోకాలి చిప్పల నొప్పులు.

నాకున్న దగ్గు, ఆయాసం వైరస్ వల్ల వొచ్చిన లక్షణాలు కాదు. వాటికి ఏ వైరస్ కూ అందని సంవత్సరాల చరిత్ర ఉన్నది. పాతికేళ్లుగా అవి ఒంటిని అంటిపెట్టుకొని మనుగడ సాగిస్తున్నాయి. ఆరెండూ జతకలిసి ఏతంతో నీళ్ళు తోడినట్టు దేహాన్ని కుదిపి కాళ్ళమీద పడేస్తాయి. ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది. నిజానికి నా ఊపిరితిత్తులు గాలిని పీల్చుకునేది నాలుగోవంతే. మిగతా భాగాన్ని రాళ్ల దుమ్ము, కాలుష్యం ఆక్రమించుకున్నాయి.

నేను తీవ్రంగా దగ్గుతూ ఆయాసపడిన ప్రతిసారీ అది పైన యమధర్మరాజు దృష్టిని ఆకర్షించే యత్నమని తెలుసు.

అలాంటి నన్ను..ఇంతకాలానికి, ఇదిగో ఇప్పుడీ ఆగంతకుడు “మీకు దగ్గు ఉందా?” అని అడుగుతున్నాడు.

“నాకు మీరేమీ అనారోగ్యంగా కనిపించడం లేదు” ముసుగువ్యక్తి చివరికి నిర్ధారణ చేసినట్టు ప్రకటించాడు.

“అంతమాత్రాన మిమ్మల్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. మీరు లక్షణాలు పైకి బయటపడని మోతగాడు కావొచ్చు. లేదా వాటి వాహకుడు కావచ్చు”

“మోసేవాడినా? నేనేం మోసుకెళ్తున్నా?” అడిగాను.

దీనికి ఆగంతకుడు సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అతనికి నచ్చజెప్పే ధోరణిలో  కొంచెం ప్రాధేయపడ్డాను.

“దేవుని తోడు సార్..! నేనేమీ దాయడం లేదు. మోసుకెళ్లడం లేదు. కావాలంటే మీరు నన్నూ నా కొంపనూ  క్షుణ్ణంగా సోదా చేసుకోవచ్చు. నేను కష్టజీవిని. రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు మనిషిని. ఈ వయసులోనూ  రోజూ ఏదో పనికి పోతాను. అసలు ఇంట్లో ఉండేది  తక్కువ.”

ఆగంతకుడు ఈసారి మరింత పెద్దగా నవ్వాడు. తర్వాత “మీకు చదవడం వచ్చు కదా..?” అని ప్రశ్నించాడు.

వచ్చునని తలూపుతూ చిన్నగా భుజాలు ఎగురేశాను.  మహమ్మారి సోకకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు ప్రచురించి వున్న కొన్ని కాగితాలను అతడు నా ముందు బల్లమీద ఉంచాడు.

నేను వాటిని తీసి చూశాను. పరిశుభ్రంగా ఎట్లా వుండాలో, సామాజిక దూరం ఎట్లా పాటించాలో, ముఖానికి మాస్కు ఎట్లా పెట్టుకోవాలో ఇంకా ఇతర జాగ్రత్తలన్నీ రాసివున్నాయి. కాగితాలతో పాటు అతడో అట్ట డబ్బా కూడా నాకిచ్చాడు. డబ్బా తెరిచిచూస్తే కొన్ని మందులు, సబ్బు బిళ్ళలు, మాస్కులు, ఒక చిన్న సీసా ఉన్నది. ఆ సీసాను చూడగానే నాకు నవ్వొచ్చింది. ఒంటరిగా బతుకుతున్న వాణ్ని గనుక అందరు వృద్ధుల్లాగే నేనుకూడా ఏ మందుకో బానిసై ఉంటానని, నన్నో తాగుబోతుననీ అతడు భావించినట్టు ఉన్నాడు.

అమాయకుడు.. ! ఓపక్క తినడానికే సరైన తిండిలేక మిడుకుతుంటే మందుసీసాలు కొనుక్కొని ఎక్కడ తాగుతాం?

ముసుగుమనిషి ఇక వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డాడు. “వారం రోజుల పోయాక మళ్ళా వస్తాను. మిమ్మల్ని పరీక్ష చేస్తాను” అని చెప్పాడు.

అప్పటికి నాకు పూర్తిగా అర్థమై పోయింది. ముసుగుమనిషి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య సూత్రాలు ఎందుకంత శ్రద్ధగా వివరించాడో. ఆసలా జబ్బేమిటో తెలిసింది. అతడు కొత్తగా వొచ్చిన వైరస్ గురించి హెచ్చరించాడు.

దాని గురించి నాకు ఎక్కువే తెలుసు. ప్రస్తుతం లోకాన్ని వణికిస్తున్న ఈ జబ్బు చెడ్డదే కావొచ్చు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే దానికంటూ ఒక సామాజిక న్యాయం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వైరస్ లోకంలో మనుషులందరినీ సమానంగా పరిగణిస్తున్నది. దానికి  ఉన్నోడు.. లెనోడు అనే తేడాలు లేవు. అందర్నీ ఒకేలా భావిస్తుంది. ఒకేవిధంగా అక్కున జేర్చుకుంటుంది. ఉన్నోడికి, లేనోడికి వేర్వేరుగా ప్రత్యేకమైన మందులంటూ లేకుండా చూస్తుంది. అలాగే ప్రాణభద్రతకు సంబంధించిన హామీ ఎవరికీ… ఏ వర్గానికీ లేదు. దీన్ని అదుపుచేయాలంటే ప్రస్తుత వ్యవస్థలో మాదిరి ఏ కొందరి కోసమో ఆస్పత్రులు నిర్మించుకుంటే సరిపోదు. ప్రపంచం మొత్తానికీ వైద్యం చేయగలిగే భూగోళమంత సువిశాల ఆస్పత్రి కావాలి.

మరి అట్లాంటి ఆస్పత్రిని ఎవరు నిర్మిస్తారు..? యావత్ మానవజాతికి ఎవరు సేవలు  చేస్తారు..?

నన్ను చుట్టుముట్టిన ఆలోచనల్లోంచి బయటపడి చూసేసరికి ఆగంతకుడు గుమ్మం దాటబోతున్నాడు.

హఠాత్తుగా నాకళ్ళకి అతనిలో ఔన్నత్యం కొండలా పెరిగి కనిపించింది. అతని పట్ల గౌరవమూ, ఆత్మీయ భావనా ఏకకాలంలో కలిగినయి. సామాజిక దూరం అనే జాగ్రత్తను పక్కనబెడుతూ హఠాత్తుగా అడుగు ముందుకేసి ముసుగుమనిషిని కావలించుకొన్నాను.

ఊహించని చర్యకు అతడు ఉలికిపడి నానుంచి విడివడేందుకు తీవ్రంగా గింజుకున్నాడు. ముసుగుమనిషి విపరీతమైన భయంతో తత్తరపడి పోయాడు. చివరికి తన బలమంతా ఉపయోగించి నానుంచి విడిపించుకున్నాడు. తర్వాత ఒక్కక్షణం కూడా అక్కడుండకుండా పరుగులాంటి నడకతో పోయి తన వాహనం ఎక్కాడు. అంతేకాదు, నేను చూస్తుండగానే కొద్దిక్షణాల్లో తాను ధరించిన రక్షణ దుస్తులు బిరబిరా విప్పేశాడు. ఎంత త్వరగా అంటే మహమ్మారే స్వయంగా తన వేషధారణ తొలగిస్తున్నట్టు అనిపించింది.

ప్రపంచానికి ఉపద్రవాలు కొత్తకాదు. మనిషిని కాలికింద చీమలా తొక్కేసే వైరసులూ, ప్రాణాంతక రోగాలూ చరిత్రకు ఎన్నో తెలుసు. ఇదివరలో వచ్చాయి. భావితలో ఇంకెన్నో మరెన్నో రావొచ్చు. కానీ ఎన్నేళ్లయినా, ఎన్ని శతాబ్దాలైనా లోకాన్ని వీడకుండా మనిషి వెన్నంటి వుండే వైరస్ పాజిటివ్ ఒకటుంది.

దానిపేరు కరోనా కాదు, ఆకలి… అలియాస్ దారిద్ర్యం. ఎన్ని యుగాలైనా దానికి సమాధానం దొరకదు. ఎవరూ టీకా కనిపెట్టలేక పోతున్నారు.

ఇంటిముందు నిలబడి ఆగంతకునికి  స్నేహపూర్వక వీడ్కోలు చెపుతూ చేయి ఊపాను. ఎన్నో రోజుల శారీరక, మానసిక  క్షోభల నడుమ… ఇంతకాలానికి నా మనసుమీద ఒక మానవతా చిరుజల్లు కురిసినట్టయింది. ఆగంతకుని సేవానిరతి నా మనసుకు కొంత ఊరట కలిగించినట్టు భావించాను. ఒక దొంగలా అనుమానాస్పదంగా కనిపించిన  ముసుగు వ్యక్తి చివరికి మానవత్వం, దయాగుణం గల్గిన మంచిదొంగ అని నిరూపించుకున్నాడు.

వచ్చేవారం అతడు మళ్లీ వొచ్చినప్పుడు అతనికేదైనా మంచి కానుక ఇవ్వాలనిపించింది. కానీ పేదవాణ్ని… ఏమివ్వగలను? ఈ కొంపలో అతనికి ఇవ్వగలిగెంత విలువైన వస్తువులు ఏమున్నయి?

ఏదైనాసరే, అతని ఇష్టానికే వదిలి పెట్టాలనుకున్నాను. ఆ మంచిదొంగ నాఇంట్లోంచి ఏ వస్తువైనా ఎత్తుకెళ్లేందుకు సంతోషంగా అనుమతించాలనుకున్నా. ముందుగదిలో ఉన్న పాత టీవీ, లేదా మెట్లపక్కన గోడకు ఆనించి నిలబెట్టిన పాత సైకిలు. ఇంకా… ఇంకేం లేవు.

వీటిల్లో దేన్నయినా అతడు దర్జాగా  పట్టుకొని పోవచ్చు. నాకు ఇష్టమే.

———–

అయోధ్యా రెడ్డి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • వాస్తవికతను అద్దం లాంటి మీ అనువాదంతో కనిపించెలా వ్రాసి చూపినంధుకు ధన్యవాదాలు 🙏

  • పాజిటివ్ కథ చాలా బాగుంది సార్ వర్తమాన కరోనా పరిస్థితి తెలుపుతుంది. ఈ లోకాన్ని చుట్టుముట్టిన ఆపదలను వివరిస్తుంది. అనువాదం బాగుంది.

  • కథ చాలా బాగుంది అయోధ్యారెడ్డిగారూ నమస్తే
    ఆత్మాశ్రయంగా 1st person కథ నడిపించడంల వల్ల పాఠకులకు ఆత్మీయత కలుగుతుంది
    వైరస్ విరోధం సేవాభావం పూర్వపు రోగాలు ఆకలి అనేక విషయాలతో ఒక విధంగా ఒక అనుభవ విషయంలా ఆత్మకథాత్మక వ్యాసంలా ఉంది
    అనువాదం తెలుగుతనానికి దగ్గరగా ఉంది
    బూట్లు కారు కొన్ని విదేశీయతవు సూచించినా ఏతంతో తోడడం వంటి తెలుగుతనం ఉంది
    ధన్యవాదాలు

  • కథ చాలా బాగుంది.

    ఈ కథను అందరూ చదివి కరోనా నిబంధనలు పాటించడానికి ప్రచారం సాధనంగానూ, ఫ్రంట్ లైన్ వర్కర్ల నిబద్ధత వివరించడానికీ చెకుముకి సైన్స్ పత్రిక లో ప్రచురించడానికి మీ దగ్గర నుంచి, సారంగ యాజమాన్యం నుంచి అనుమతి పొందడానికి అవకాశం ఉందా? మేము ఎటువంటి పారితోషికం చెల్లించలేము.
    – ఆనంద్ కుమార్
    చెకుముకి సైన్స్ పత్రిక సంపాదక వర్గం తరఫున
    హెచ్. ఐ . జి; బి4. ఎఫ్2
    బాగ్ లింగం పల్లి
    హైదరాబాద్- 500 044

  • <blockquote కథ చాలా వాస్తవ సహితంగా ఉంది. అసలు సమస్యల పరిష్కారం లేకుండా ఏ సమస్య కైనా శాశ్వత పరిష్కారం దొరకదు అనే వాస్తవాన్ని చాలా నిశితంగా వివరించారని అనిపిస్తుంది. మీ అనువాదం చాలా బాగుంది. చివరికంటా చదివించేలా ఉంది. మంచి కథ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు sir

  • భాష చాలా సరళంగా ఉంది. సమకాలీన సమాజాన్ని అద్దంలో చూపింది.

  • హాస్యభరితంగా మొదలై, చివరికి గంభీరంగా ముగిసిన కథ.
    సామాజిక కోణంలో వున్న వ్యవస్థా లోపాలను,
    బతుకు సత్యాలను చర్చించిన కొథ.
    అనువాదం బాగుంది. అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు