కథ అంటే వస్తువే అనే భావన ఈనాడు చాలామంది ఉటంకింపుల్లోనూ, రచనల్లోనూ వేళ్ళూనుకున్నది. అంటే- చెప్పిందేమిటో మాత్రమే చూసి, ఎలా చెప్పారన్నదాన్ని విస్మరించటం. మంచి కథకు వస్తుబలంతో పాటు, శిల్పమూ, వీటిని వెల్లడిచేసే శైలీ- మూడు గుణవిశేషాలూ ముఖ్యమనే జగమెరిగిన లక్షణాల్ని వదిలేయటమన్నమాట. అయితే, కొందరు రచయితలు మాత్రం ఈ మూడింటి సమ్మిశ్రమాన్ని తమ రచనలో నిబిడీకృతం చేసి కథాన్నత్యం పట్ల తమకున్న గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాంటి కొందరిలో తొలి పంక్తిలోనివారే కుప్పిలిపద్మ.
కుప్పిలిపద్మ ప్రాథమికంగా భావుకురాలు. ‘నెమలీకలు పూసే కాలం’ ‘మోహనదీ తీరం మీద నీలిపడవ’ వంటి కవితా సంపుటాలు, ‘శీతవేళ రానీయకు’ మ్యూజింగ్స్, ‘మంచుపూల వాన’ ‘మంత్రనగరి హద్దులలో’ వంటి కథాసంపుటాలు- శీర్షికలే ఆమె భావుకత్వ శబలతకూ, చెప్పే అంశాన్ని ఆలోచనీయం చేయాలనే నిమగ్నతకు నిదర్శనాలు. ఆమె రచనా మనోధర్మంలోని నవ్యత పట్ల నిబద్ధతకు కూడా ఇవి ఉదాహరణలే. పాఠకుని సాహిత్య సంస్కారాన్ని అంతో ఇంతో ఉన్నతికి తీసుకువెళ్ళేందుకు చేసే ‘దోహద’ క్రియ ఆమె రచనల్లోని అభివ్యక్తీకరణంలో ఉన్నది. ఈ కారణం వల్లనే కథారచనలో ఆమె శైలీశిల్ప విశిష్టతల్లో ‘తనదైన ముద్ర’ను సాధించుకున్నారు.
“ముకుల” పద్మ నిన్న మొన్నటి కథాసంపుటి (2024). ఇందులో వున్న 12 కథల్లో వస్తువైవిధ్యం పుష్కలంగా వున్నది. అందులో మళ్ళీ కేంద్రబిందువు ఒకటిగా వున్న ఐదు కథలు ఉన్నాయి. ఆ కేంద్రబిందువు ‘కరోనా’. ప్రపంచానికి అత్యంత తీవ్రవిషాదాన్ని మొత్తిన కరోనా విలయం – విభిన్న పార్శ్వాల్ని పద్మ ఆర్తి జనకంగా ఆవిష్కరించారు.
‘మళ్ళీ తేయాకు తోటల్లోకి’ కథ టీ ఎస్టేట్లో పనిచేస్తున్న స్త్రీ విషాదగాథ. అదీ కరోనా సమయంలో – భర్త బతుకుతెరువు కోసం అస్సాం నుండి ఆంధ్రా పోయిన సందర్భంలో – కమ్లిని కూతురు ‘మోని’ని ఏ విషపురుగో కుట్టింది. వైద్యం ఆలస్యమై ఆ పిల్ల మరణించింది. ఆ తర్వాత… వర్ణనాతీతమైన గుండెకోత! ఈ కథలో అపూర్వమైన, అసాధారణమైన తేజోరేఖలు – శైలీశిల్పాలే! గుండెని ఉగ్గబెట్టించే శైలి.
“రైన్ కోట్ వేసుకొంటుంటే ఆమెకి ఆ వరండా చివర రెండు చేతులతో తలను పట్టుకొని దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నంలో వున్న కమ్లిని కనిపించింది. వేలాడిపోయిన ఆ చిన్నారి దేహం ఇసుకలో ఇంకిపోయిన కన్నీటి బొట్టులా వుంది. తుంచిపారేసిన తేయాకు కొమ్మలా వుంది. ఆడుకుంటున్న పిల్లల చేతిలో బొమ్మలా వుంది. కొండచిలువ మింగేసిన చందమామలా వుంది. ఆ దృశ్యం చూడగానే ఒక్క క్షణం నీలాక్షి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. బిడ్డని వొళ్ళో పడుకోపెట్టుకొని, ఎడమచేత్తో నిస్సహాయంగా తలని పట్టుకొని కూర్చున్న కమ్లిని చూసింది. గట్టిగా గుండెలు పగిలేలా రోదించటం లేదా తల్లి. మాన్పడిపోయినట్టు నిద్రిస్తోన్న బిడ్డని గుండెల్లో పొదువుకొని కూర్చున్నట్టు జాగ్రత్తగా బిడ్డకి యెక్కడ తెలివి వస్తుందేమోనని నిశ్చలంగా, బొమ్మలా కూర్చుని వుంది కమ్లిని.”
ఇంతకింతగా మనసునీ, బుర్రని తొలిచే శైలిలో నడచిన ఈ కథనాన్నీ చెప్పకుండా రచయిత్రికి అన్యాయం చేయదలచుకోలేదు. చదవండి.
“నడిచి నడిచి వచ్చిన తన వాళ్ళని చూసి కమ్లిని బెంబేలెత్తిపోయింది.
ఆ పాదాలు చెదిరిన కలల్లా వున్నాయి. ఆ పాదాలు చితికిన ఆశల్లా వున్నాయి. ఆ పాదాలు చిదిమేసిన శ్వాసలా వున్నాయి.
వెళ్ళిపోయిన పిల్ల గురించి యెందుకిలా చేసావని అడగటానికి తను కొలిచే శివయ్య స్వామి వున్నాడు, కానీ వీళ్ళని యింతగా ఎందుకలా పాదాలు అరిగిపోయేటట్టు నడిపించావని అడగడానికి ఎవ్వరూ లేరు. ఆ లేనితనం చూసి ఓటు వెయ్యడానికి నిలబడిన కాలం వెక్కిరిస్తుంటే కమ్లిని శూన్యంగా నిట్టూర్చింది.
వూరి కానీ వూరు. భాష రాదు. పనీ కొత్తే. వొకటా రెండా దాదాపు మూడువేల కిలోమీటర్ల పైన నడక. ఎన్ని నదులు, ఎన్నెన్ని కొండలూ… అడవులూ… అబ్బో తలచుకొంటేనే ఆ నడిచొచ్చిన పాదాలకి నమస్కరించాలనిపించింది కమ్లినికి. రోజూ నూనె రాసి, కాపటం పెట్టి గోవింద్ని తిరిగి మునిపటిలా చెయ్యడానికి ఆమెకి చాలా సమయం పట్టింది.”
స్థల కాలాల ఐక్యతతో, సన్నివేశాలూ సంఘటనల అనుసంధానంతో, వస్తు పరిధిని గౌరవిస్తూ, కథనాన్ని అమిత అనుభూతిప్రదం చేస్తూ- ‘నిర్మించిన’ ఈ కథ- తెలుగు కథాసాహిత్యంలో ఒక మరో మణిపూస. ప్రతి తెలుగు కథా పాఠకుడు ‘ఇదీ మా తెలుగు కథ’ అని కాలరెత్తుకుని ప్రపంచానికి చెప్పుకోదగిన, చూపుకోదగిన అమూల్యమైన, అపురూపమైన కథానిక ఇది. రచయిత్రికి దోసెడు అభినందనలు.
కరోనా కేంద్రంగా విస్తరించిన ఇతర కథలన్నీ పరామర్శిస్తాను. ‘పరిమళ కలలది యే పరిమళం’ ఒక మధ్యతరగతి ఆకలి బతుకుల బ్రాహ్మణ కుటుంబ స్త్రీలగాథ. ‘కలల పరిమళం ఆవిరైపోయిన చోట’ అగరొత్తుల తయారీకూలితో పూటలు గడుపుకొనే దురవస్థ చిత్రణ! ‘ఇంద్రధనస్సు జార్చుకున్న రంగుల్లో చంద్రవంకకి చిక్కుకున్నదియే రంగు’ ఎక్కడో సిలిగురి నుండి హైదరాబాద్ చేరుకున్న బ్యూటీషియన్ సంజన కరోనా కాలంలో ఎదుర్కొన్న ఇక్కట్ల గాథ. ‘ఏ శిశిరమూ చెప్పని వూపిరి వునికి కథ’ పల్లెటూరు నుండి హైదరాబాద్కు వచ్చి లాక్డౌన్లో చిక్కుకుని, ఇక్కడ నిలవలేక బయల్దేరి పోయి ఏమైపోయాడో తెలియని ‘మిస్సింగ్ పర్సన్’ ముసలయ్య అవస్థమో దేవుడెరుగు, ఆయన గురించి సంబంధీకుల వెతుకులాట బాధావ్యధల గాథ ఈ కథనం. ‘యిక్కడ అందని వూపిరి యే సీమవనాల్లో చిక్కుకుపోయింది’ కూడా ‘మళ్ళీ తేయాకు తోటల్లోకి’ కథ అంతటి వస్తురూపబలాన్ని కలిగిన రచనే. యూఎస్ కొడుకు, ఇండియాలో ప్రకాశం జిల్లాలో మారుమూల గ్రామంలో తల్లి. ఆమెకు కరోనా కాటు. ఆక్సిజన్ కోసం ఇక్కడి మిత్రులద్వారా కొడుకు భగీరథ ప్రయత్నం. దాని వైఫల్యం ఎంతో ఉత్కంఠతో చదివించిన కథ. అయితే కథలో మొదటి పరిచ్ఛేదం- మిన్నియా పోలిస్ నగరంలో జరిగిన ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా తెల్లజాతి అహంకారానికి నిరసన ప్రదర్శనలూ, వెంకట్ కూతురు ఆమోద ఆ ప్రదర్శనల్లో పాల్గొనటం, ఆయన వ్యతిరేకత-ఇదంతా వేరే కథగా రావలసిన ఇతివృత్తం.
‘ముకుల’ స్త్రీల మీద అత్యాచారాలూ, హింసాత్మక ఘటనలూ, అభయ, నిర్భయల నేపథ్యంతో సాగిన కథ.
“యెవరి శరీరాన్ని కాపాడుకోవడానికి వారే తప్ప మరొకరెవ్వరూ లేనటువంటి సందర్భమేదో వొక రోజున ఎదురవుతుందేమోననే అనుమానం. అటువంటి పరిస్థితికి సిద్ధపడి వుండాలనే ఆలోచన అమ్మాయిలకి వస్తున్నట్టుంది. తమకీ సమాజానికి మధ్య తమ శరీరమే ఒక సరిహద్దు అని, ఆ సరిహద్దు మీద దాడి జరిగినప్పుడు యిటు పక్కనున్నది. వొంటరి మనుషులేనని, ఎవరిమీద ఆశలు పెట్టుకోలేమని అనుకుంటున్నట్టున్నారు. అదెంతవరకు సమంజసమన్నది అప్రస్తుతం. ప్రస్తుత సందర్భంలో వాళ్ళల్లో జరుగుతున్న సంఘర్షణని అర్థం చేసుకుంటూ, వాళ్ళకి వీలైనంత సాయం చేయటమే మన ముందున్న కర్తవ్యం. ఈ ఆలోచన పర్మెనెంటా కాదని ఇప్పుడేం చెప్పలేం” ఇదీ పరిస్థితి!
‘మెట్రోకావల’ ఆర్థికంగా ఎదగాలని పల్లెనుండి భార్య మంగ, ఏడాదిన్నర కూతురు రేఖతో పట్నానికి వచ్చిన రమేష్ ఆ ఎదుగుదల కోరికలో కూరుకుపోయాడు. మంగ కూతుర్ని వదలి పనికి వెళ్ళటంలో దారుణాల్ని ఎదుర్కొని, ‘సిటీ లైఫ్’ని వదిలి ‘తిరిగి గ్రామానికి’ స్థిరం చేసుకుంది. దూరపు కొండల నునుపు తెలిసొచ్చింది!
‘యెండావాన పొగమంచు నీడల మధ్య సీతాకోకచిలుకలు’ స్వేచ్ఛాగీతిక తరుణ వయస్కురాలు.
“స్వేచ్ఛాగీతిక వొత్తిడికి గురైన ప్రతీసారి పేపర్ చేసి దాచుకున్న సీతాకోకచిలుకకి, ఆమె వయసులోనివన్నీ చెప్పుకొని గాల్లోకి ఎగరెయ్యడం శశి కిరణ్ స్నేహంలోనే ఈ మధ్యే అలవాటయింది. లార్వా నుంచి గొంగళి పురుగై, సీతాకోకచిలుకగా మారే క్రమంలో వున్న ఆమెకి తనకేం కావాలన్నది తెలియకపోవటం కన్నా, మనుషులతో బంధాల్ని ఎలా ఏర్పర్చుకోవాలి తెలియకపోవటం పెద్ద సమస్యగా తోచింది. ఇతరుల తోటి, తనతో తనే బాంధవ్యం ఏర్పరచుకోవటం శశికిరణ్ నుంచి అర్థం చేసుకునే క్రమంలో వుంది”. ఇదీ యువ(త)రంగం!
‘యెందుకంటే’ ఆశయాలు నీటిమీది రాతలై వాటి స్థానంలో అవకాశం, అవసరం ప్రాధాన్యం వహించే ఈనాటి సామాజిక వాస్తవాన్ని కథాత్మకం చేసింది. ‘ఈతరం పిల్లలందరికీ అవసరమైన తప్పనిసరైన లైఫ్ స్కిల్-వంట, యింటిపని’ అనే ఇతివృత్తం ‘రేపటి వేకువలో విచ్చుకునే పువ్వులు’ కథన రూపాన్ని పొందింది.
కుప్పిలి పద్మ రచనల్లోని అంతస్సవ్వం ఆమె కథని అనుభూతిప్రదం చేయడంలో ఉంది. పాత్ర అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో కూర్చే సంఘటనల్లో ఉంది. ‘దుఃఖించింది… దుఃఖించింది…’ పద్ధతి కాకుండా, పాఠకుని మనసుని ఆర్ద్రం చేసే ఆ దుఃఖం వర్ణన జాలులో ఉన్నది. కథని ‘క్లాసిక్’ చేయగల ఆమె శైలిలో ఉంది.
“ముకుల” సంపుటిలోని కథలు సంక్షుభిత వర్తమాన సమాజంలో జెండర్ వివక్ష, ఆర్థిక అవ్యవస్థ మనుషుల్ని ఎంతటి అలజడికీ, సంవేదనకు గురి చేస్తున్నాయో చూపుతున్నాయి. ఈ దృశ్యచిత్రణకు పద్మరచనా నైపుణ్యం, కథాకథనరీతీ దీప్తిమంతం చేశాయి. ఇటీవల వచ్చిన కథాసంపుటాల్లో అద్వితీయమైనది “ముకుల”!
*
Add comment