నేను ఒంటరిగా నడుస్తున్నా. నా చుట్టూ చీకటి పొరలు పొరలుగా రాలుతోంది. కళ్ల ముందు దారి సరిగా కనపడటం లేదు. ఎటు వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో అంతుపట్టడం లేదు. ఆ దారిన ఇంతకు ముందు నడిచిన జ్ఞాపకం కూడా లేదు. కానీ ముందుకు వెళ్తూనే ఉన్నా. ఆ అస్పష్టపు చీకట్లో రెండు చిత్రాల్లా ఒక పెద్దాయన, ఒక పెద్దావిడ నా ముందుకు వచ్చారు. అవి అంతకుముందు నాకు పరిచయం ఉన్న ముఖాల్లా అనిపించాయి. వాళ్లు నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఎత్తుకున్నారు. గుండెలకు హత్తుకున్నారు. ముద్దు చేశారు. రెండు పిలకల్తో నేను ఎంత ముద్దుగా ఉన్నానో! నాకే ఆశ్చర్యం వేసింది. ఇద్దరి చేతుల్ని పట్టుకొని వాళ్ల మధ్యలో దర్జాగా నడుస్తున్నా. నా చుట్టూ ఉన్న చీకటి పొరలు వాటికవే రాలిపోయాయి. “హమ్మయ్యా” అనుకున్నా. చాలా ధైర్యం వచ్చింది. ఒంటరితనం పోయింది.
“నా కొద్దు… నా కొద్దు” అంటూ చిన్నచిన్న అడుగులతో, గజ్జెల సవ్వడితో హైదరాబాదు పెద్దమ్మ గుడిలో పరుగెడుతున్నా. ఆ పెద్దాయన నా వెంటపడి తను అలసిపోతున్నా పట్టించుకోకుండా నన్ను దొరక పుచ్చుకున్నాడు. ఎత్తుకుని బగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ఆయన మీసాలు గుచ్చుకొని నాకు చిరాకు తెప్పించాయి. నన్ను తీసుకెళ్లి చెవులు కుట్టించాడు. పక్కనున్న పెద్దావిడ ఒడిలో కూర్చోపెట్టుకుంటే… నా చేతిలో జీడిపప్పు ప్యాకెట్ పెట్టాడు. నేను తింటూ ఉన్న.. అంతే!. “నా బంగారం ఎంత ముద్దుగా ఉందో” అని ఎత్తుకున్నాడు. అద్దం చూపించాడు. నా చెవులు లోలాకులతో మెరుస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకున్నారు.
నేను నడుస్తూనే ఉన్నా వాళ్లిద్దరి చేతులు నన్ను తీసుకెళ్తున్నాయి ముందుకు, మున్ముందుకు.
“లే… లే… ” అని ఆ పెద్దాయన శవం మీద పడి ఆ పెద్దావిడ ఏడుస్తోంది. నా లేత గుండెలో ఏదో భయం. ఎదురుగా నల్లగా కరుళ్లు కట్టినట్లు కురుస్తోంది వాన. నేను తడిచిపోతున్నా. ఆవిడ అట్లానే ఏడుస్తోంది. ఎంత మంది లేపినా లేవకుండా ఏడుస్తూనే ఉంది. తర్వాత నాకు ఏమీ కనిపించడం లేదు. నా ముందున్న వారి చిత్రాలు నీడల్లా మారిపోతున్నాయి. నా చేతులు ఖాళీగా గాల్లో ఊగుతున్నాయి. వాళ్లిద్దరు మసకమసగ్గా మారి చీకట్లో కలిసిపోయారు. నాకు గుండె ఆగినంత పనైంది. కళ్లనుంచి నీళ్లు వాటికవే కారిపోతున్నాయి. నేను ఎంత ఆపుకుందామనుకున్నా నా వల్ల కావడం లేదు.
మళ్లీ నేను నడుస్తూనే ఉన్నా… చీకటి మరీ ఎక్కువైంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. ఏటో వెళ్తున్నా…ఏమో! శూన్యం… నా ఎదురుగానే కాదు… నాలో కూడా.
**** **** ****
ఇంతలో వెనుక ఎవరో తరుముతున్న చప్పుడు. వెనక్కు తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ నాలో భయం ఎక్కువైంది. అటు ఇటు చూశా. చుట్టూ అడవిలా ఉంది. కేవలం కాలిబాట ముందుకు వెళ్లడానికి మాత్రమే కనిపిస్తుంది. వెనక నుంచి తరిమే చప్పుడు ఎక్కువ కావడంతో ముందుకే పరుగెడుతున్నా. నాలోని భయం బాధగా మారింది. అయినా అలానే పరుగెడుతున్నా. ఇంతలో ఒకతను వచ్చి నా చేయి పట్టుకొని స్కూటీ లాంటి బండి ఎక్కించుకున్నాడు. నాకు భలే తమాషాగా ఉంది. “హమ్మయ్యా…” అనుకున్నా. మళ్లీ నాలో ఏదో ఆనందం. ఏదో ధైర్యం. ఏదో ఆదరువు. ఒక భరోసా. నా ముఖంలో చిరునవ్వు పూసింది. ముద్దు ముద్దుగా పాలుగారే చిరునవ్వు అది. బుగ్గలు నల్ల మేఘాలై మెరిశాయి. అప్పటి వరకు నా ముందు ఉన్న ఇరుకు దారి మాయమై పోయింది. నగరంలో రద్దీ అంతగాలేని రోడ్డు మీద అతనితో బండి మీద హాయిగా వెళ్తున్నా.
అతని వయసు సుమారు ముప్పైకి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. నేను బండి వెనుక వెనక్కు తిరిగి కూర్చుని ఉన్నా. అతను సంతోషంగా డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్లు, షాపులు, జనాలను చూస్తూ నాలో నేను స్కూల్లో నేర్పిన “మమ్మి అండ్ డాడీ ఐ లవ్ యూ.. కమ్ టూ మీ.. వెన్ ఐ కాల్ యు” రైమ్ పాడుకుంటూ ఉన్నా. అతను విన్నట్టుంది. ఓ ఐస్ క్రీం షాపు దగ్గర బండి ఆపి కొనిచ్చాడు. ఒల్లో కూర్చోపెట్టుకొని “ఏదీ ఆ రైమ్ మళ్లీ పాడు” అన్నాడు. నే పాడుతుంటే ఎంతో ముచ్చటపడ్డాడు. ముద్దు చేశాడు. తర్వాత మళ్లీ బండి మీద ఎక్కించుకొని బేకరీకి తీసుకెళ్లి నాకు కావాల్సిన కేకు కొనిచ్చాడు. ఎగ్ పఫ్ పార్శిల్ చేయించి నాకిచ్చాడు. వాటిని చూస్తుంటే నా మనసులో నీల్లూరాయి.
నా మనసంతా ఆహ్లాదంగా ఉంది. నా చుట్టూ రంగురంగుల పక్షులు ఎగురుతున్నాయి. నేను గాల్లో తేలుతున్నాను. చుట్టూ అందమైన పువ్వుల వనం. ఎన్ని రకాల పువ్వులో!. ఒక్కొక్క దాన్ని చేత్తో తాకుతూ నేను ఆడుకుంటున్నాను. “భలే… భలే…” అంటూ చప్పట్లు కొడుతూ ఎగురుతున్నాను. లేత పచ్చికలో పూసిన పువ్వులు, వాటి నుంచి వచ్చే వాసన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇంతలో నన్ను బండి మీద కూర్చోబెట్టుకుని వచ్చిన అతను, ఆతని పక్కన మరొకామె దూరంగా కనిపించారు. ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను దగ్గరకు వెళ్లాను. అప్పటి వరకు నన్ను ముద్దు చేసినతను నన్ను పట్టించుకోలేదు. వాళ్ల మాటలు నాకు వాదనలా అనిపిస్తున్నాయి. నాకేమీ అర్థం కాలేదు. అతను నన్ను పట్టించుకోలేదన్న బాధ మాత్రమే నాలో ఉంది. బిక్కమొహం వేసుకుని అతనివైపే చూస్తున్నా. కానీ కనీసం నా వైపు కూడా చూల్లేదు. ఆమె నన్ను బలవంతంగా తన వైపు లాక్కుంది. నాకు ఏడుపొచ్చేసింది. పెద్దగా ఏడిచాను. ఆ అరుపులు ఆ తోటంతా ప్రతిధ్వనించాయి. కానీ విచిత్రంగా నా గొంతు నాకే వినిపించింది. అప్పటి వరకు నా చట్టూ తిరిగిన పక్షులు, కనిపించిన పూలు… అన్నీ మాయమయ్యాయి. ఆ ఇద్దరు వ్యక్తులు పొడిపొడిగా పుప్పొడిలా నా కళ్ల ముందే రాలి పోతున్నారు. ఏదో చిత్రంలా నా కళ్ల ముందు జరుగుతోంది. క్రమంగా వాళ్లు నాకు కనిపించనంతగా రాలిపోయారు. నేను ఇంకా పెద్దగా ఏడిచా. ఎవరూ లేరు. అప్పటి వరకు నా ముందు ఉన్నదంతా మాయమైపోయింది. నేను ఒక్కదాన్నే… ఒక్కదాన్నే.. ఒక్కదాన్నే… ఒంటరిగా ఉన్నా.
అబ్బా..!! చీకటి గది. కరెంట్ లేదు. తలుపులన్నీ వేసున్నాయి. నన్ను ఎవరో కుర్చీకి కట్టిపడేశారు. ఎంత గుంజుకున్నా కదల్లేకున్న. పెనుగులాడాను. ఫలితం లేదు. స్కూల్ డ్రెస్ లోనే ఉన్నా. ఆ డార్క్ రూమ్ లో.. నా కళ్లు డార్క్ గా మెరుస్తున్నాయి. నేనూ పూర్తి డార్క్ గా మారిపోయా. నా ఏడుపు మాత్రమే ఎక్కిళ్లగా వినిపిస్తోంది. అంతలో ఎవరివో మాటలు వినిపించాయి. “ఏడ్చావనుకో చంపేస్తా…” అంటూ ఒకతను అగ్గి పుల్ల వెలిగించాడు. ఆ వెలుతురులో అతని చేతిలోని కత్తి కనిపించింది. భయంతో వణికిపోయా… ఎక్కిళ్లు వాటంతటవే ఆగిపోయాయి. గొంతు కూడా తడారిపోయింది. అతను ఆ చీకటి వెలుతురులో నాకు స్కూల్లో చెప్పిన పాఠంలో భయంకమైన డెవిల్ లా అనిపించాడు. “నే ఇంటికి వెళ్తా” అని అరిచాను. “అరిచావో…” అంటూ కత్తి పక్కన పెట్టి స్కూడ్రైవర్ తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. అతని కళ్లు పిల్లి కళ్లలా చీకట్లో మెరుస్తున్నాయి. నాలో భయం ఇంకా ఎక్కువైంది. స్కూడ్రైవర్ తో నా కాళ్ల బొటన వేళ్లని పట్టుకొని లాగాడు. నొప్పి భరించలేక పెద్దగా అరిచా. అంతే నా చెంప చెళ్లుమంది. కళ్ల నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అతను మాత్రం గోళ్లను గట్టిగా లాగుతూనే ఉన్నాడు. భరించలేక, నా బలాన్నంతా కూడగట్టుకొని పెద్దగా అరిచా.
ఒక్కసారిగా… ఆ డార్క్ రూమ్ బద్దలైపోయింది. గోడలన్నీ వాటికవే కూలిపోయాయి. పైకప్పు సైతం పడిపోతుంటే నేను పరుగెత్తుకుంటూ బయటకు వచ్చా. కాళ్ల వేళ్ల నుంచి రక్తం కారుతూనే ఉంది. నా స్కూలు బట్టల నిండా దుమ్ము, ధూళి. నా ముఖం కూడా మాసిపోయింది. అతను కూడా అరుస్తూ డార్క్ రూమ్ నుంచి తప్పించుకున్నాడు. నా వెంట పడతాడేమోనన్న భయంతో నేను పరుగెత్తుతున్నా. రక్తం కాలి వేళ్ల నుంచి కారుతున్నా పట్టించుకోకుండా, ఏడుస్తూ పరుగెడుతూనే ఉన్నా. చిన్న చిన్న అడుగులు నావి. వాటి ముద్రలు నేలపై పడుతున్నాయి. ఆ ముద్రల్లో రక్తం మరకలు కాలి ఆకారాన్ని సరిగా గీయడంలేదు. వెనక్కు తిరిగి అప్పుడప్పుడు ఆ ముద్రలు చూసుకుంటూ పరుగెడుతున్నా. అతడ్ని చీకట్లో కొద్దికొద్దిగా మాయమైపోతున్నాడు. చీకటి అలా పూర్తిగా అతడ్ని తినేసింది. ఒక్కసారిగా నా కాళ్లను చేత్తో తడుముకున్నా. రక్తపుచారల గుర్తులు లేవుగాని, కాళ్ల బొటన వేళ్లు, మిగిలిన వేళ్లకు దూరంగా జరిగే ఉన్నాయి.
జ్ఞాపకాన్ని నిజం చేసే ‘కలా’త్మకత. కళాత్మకతను నిజం చేసే వాస్తవికత.
మళ్లీ నా ఒంటరి నడక… అదే దారి… అదే నడక. చుట్టూ భయంకరమైన చీకటి. నల్లని కరుడుగట్టిన మసిలాంటి చీకటి. కాలిబాటిలో నేను ఒక్కదాన్నే నడుస్తున్నా. ముందుకే నడుస్తున్నా.
**** **** ****
“రా… బయటకు రా… రా… నేను ఉన్నా… రా… వస్తావా రా… నా మీద నమ్మకం లేదా!?” అ పిలుపులో ప్రేమ, ఇష్టం, నువ్వు నా దానివి అన్న అధారిటీ. నా మనసుకు బలంగా వినిపిస్తున్నాయి. ఉలిక్కిపడ్డా. కళ్లు తెరిచి చూస్తే పెద్ద గుడిలో నిద్రపోతున్నా. వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నా. ఆ దేవుడు సగం స్త్రీ, సగం పురుషుడిలా ఉన్నాడు. అర్థనారీశ్వరుడిలా లేడు. పైనంతా స్త్రీ రూపంలో, కింద పురుషుడి రూపం. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది.
“ఇది కొత్తగా కట్టిన గుడి. ఈ దేవుడు కేవలం ప్రేమికుల కేసం మాత్రమే. ఈ స్వామిని దర్శించుకుంటే చాలు. ప్రేమించుకున్నోళ్లకు పెళ్లవుతుంది” అని నా పక్కన ఉన్న ఒక అమ్మాయి, ఆమె పక్కనున్న అబ్బాయికి చెప్పింది. అతడు పెదవి విరిచి నవ్వనట్లు నవ్వాడు.
గుడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చా. నేను నడుస్తుంటే దారి పక్కన అటు ఇటు రహదారులు… పచ్చటి చెట్లు… అలలు ఆగని సముద్రాలు… ఆకాశం నుంచి కురుస్తున్న నక్షత్రాలు… కరెంటు స్తంభాలపై ఎగురుతున్న ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసే పక్షులు.
నా మనసంతా మేఘాల్లో తేలుతున్నట్లనిపించింది. వర్షం చిన్న చిన్న చినుకులుగా మొదలైంది. నేను, నా పక్కన “నన్ను బయటకు రా” అని పిలిచిన అతను. ఆ చినుకుల్లో తడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇద్దరమే, పక్కన ఎవరూ లేరు. నాకు నేనే ఆనందంగా ఉన్నా. ఆ ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నా. కొద్ది దూరం నడిచాక పెద్ద హోటల్ కనిపించింది. మెట్లు ఎక్కి లోపలకు నడిచాం. హోటల్ లో అందరూ మమ్మల్ని అనుమానంగా చూడలేదు. మేము మా ముఖంలోని చిరునవ్వుకు బానిసలు అయ్యాం. లిఫ్ట్ ఎక్కి నాలుగో ఫ్లోర్ కు వెళ్లాం. ఆ ప్లోర్ లో నాలుగో నెంబర్ గది. వెలుగులో చీకటిలా ఉంది. చీకట్లో వెలుగులా ఉంది. చీకటి వెలుగుల రంగేళిలా ఉంది. ఇద్దరం దగ్గరయ్యాం. మానసికంగా, శారీరకంగా.
ఎంత బలవంతంగా ప్రయత్నించినా అనుభవం బంధీ కానీ మనసు యవనిక అది. తెరపై నుంచి దృశ్యం తెరలు తెరలుగా మాయమై పోతోంది. తర్వాత ఆ తెర తెల్లగా వెండి మేఘంలా మారిపోయింది.
మళ్లీ నడక. ఆ ఇరుకు దారిలో నేను. నడుస్తున్నాను. నడుస్తూనే ఉన్నాను. చీకటి నా చుట్టూ దట్టంగా కురుస్తోంది. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నడిచి నడిచి అలసి పోయా.
**** **** ****
ఎత్తైన కొండలు. నేను ఎక్కుతున్నా. పెద్ద పెద్ద చెట్లకున్న చిన్నచిన్న కొమ్మలు పట్టుకొని ఎగబాకినట్లు కొండను ఎక్కుతున్నా. అలసటగా ఏం లేదు. కొండ ఎక్కడం నాకు బాగానే అనిపిస్తోంది. సుమారు సగం దూరం ఎక్కా. ఇంకా ఎక్కాలి. హటాత్తుగా నా చుట్టూ పెద్ద యూనివర్శిటీ. అందరూ చదువుకుంటున్నారు. వాళ్లలో నేనూ ఉన్నా. చెట్టు కింద కూర్చొని ఏదో సీరియస్ గా బుక్స్ తిరగేస్తున్నా. కొందరు స్టూడెంట్స్ వచ్చి నన్ను వాళ్ల డౌట్స్ అడుగుతున్నారు. నేనూ చెప్తున్నాను. అందరూ నన్ను మెచ్చుకుని క్లాప్స్ కొట్టారు. వాళ్లలోంచి కొత్తగా ఒకతను వచ్చి షేక్ హాండ్ ఇచ్చాడు. ఆ స్పర్శ నాకు బాగా అనిపించింది. ముందు బండి మీద నన్ను తీసుకెళ్లిన అతని స్పర్శను నాలో మళ్లీ మొలకెత్తించింది. అతనే ఇతనేమో అనుకున్నా. మళ్లీ నాకోసం వచ్చాడేమో అనుకన్నా. అందుకే ఈ కొత్తతని చెయ్యిని వదలాలనిపించలేదు. వదల్లేదు. గట్టిగా పట్టుకున్నా.
చెట్టు కింద నించి లేచా. ఇద్దరం లైబ్రరీలోకి వెళ్లాం. పుస్తకాలలలో అవసరమైనవి చెక్ చేసి ఓ టేబుల్ ముందు పెట్టుకున్నాం. తర్వాత నేను ఆ టేబుల్ ముందు కూర్చొని వాటిని చదువుతూ రాస్తూ ఉన్నా. రాస్తూ ఉన్నా. పేజీలు పేజీలు నిండిపోతున్నాయి. తర్వాత నా ముందుకు లాప్ టాప్ వచ్చింది. కొత్తతను పక్కనే ఉన్నాడు. అతని వర్క్ కు సంబంధించి ఏదేదో చెప్తున్నాడు. నే కరెక్ట్ చేసి టైప్ చేస్తున్నా. గడియారంలో ముళ్లులు రౌండ్ రౌడ్లగా తిరుగుతూ ఉన్నాయి. “థాంక్స్” అన్నాడు. నేను పెద్దగా నవ్వా. లాప్ టాప్ బ్యాగ్ లో సర్దుకున్నా.
ఇద్దరు చిన్నపిల్లలు, ఒకామే, అతను, నేను… ఓ ఇంట్లో ఉన్నాం. ఇద్దరు పిల్లలు నా పక్కనే పడుకుని ఉన్నారు. ముగ్గురం హోమ్ థియేటర్ లో “ఫ్రోజెన్ – I” సినిమా చూస్తున్నాం. నేను ఎల్సా గురించి వాళ్లకు చెప్తుంటే, సంతోషంగా వింటున్నారు. వాళ్ల మాటలు నన్ను మైమరిచేలా చేస్తున్నాయి. ఇంతలో వచ్చాడు. “మీ వదిన భోజనానికి రమ్మంటుంది” అన్నాడు. పిల్లలు నన్ను వదల్లేదు. వాళ్లకు నేనే కలిపి నోట్లో ముద్దలు పెట్టా. కబుర్లు చెప్తూ తింటున్నారు.
నేను, మాతోటి స్టూడెంట్స్. ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ పార్టీ మూడ్ తో ఉందా ప్లేస్. రీమిక్స్ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అందరూ డాన్స్ చేస్తున్నారు. ఊగుతున్నారు. వాళ్లలో నేనూ. నన్ను నేను మరిచి డాన్స్ చేస్తున్నా. మధ్య మధ్యలో డ్రింక్ చేస్తున్నా. నా శరీరం నా ఆదీనంలోనే ఉంది. మళ్లీ తాగాలని గ్లాస్ తీసుకున్నా. “ఇంక తాగొద్దు” నాతో డాన్స్ చేసే ఇద్దరు నా చెయ్యి పట్టుకున్నారు. నేను బలవంతంగా వాళ్లు చేతులు విడిపించుకొని వెళ్లా.
“నా చెల్లెలు… తన ఇష్ట ప్రకారం” నాకు అంతకు మించి ఇతని మాటలు వినిపించలేదు మత్తులో. మరో రౌండ్ పూర్తి చేశా. మళ్లీ డాన్స్… చేస్తూనే ఉన్నా… చేస్తూనే ఉన్నా…
నాతో ఉన్న వాళ్లు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. నేను మాత్రమే మిగిలిపోయా. కళ్లు పెద్దవి చేసి చూశా. ఎవరూ కనిపించలేదు. చుట్టూ చీకటి. నేను ఒక్కదాన్నే… మళ్లీ భయం. బాధ. గుండెలు తడిచిపోయే బాధ. తడిపేసిన బాధ.
మళ్లీ.. ఒంటరి దారి. నడుస్తున్నా. నడుస్తూనే ఉన్నా. ఇటు అటు ముళ్లపొదలు. పెద్దపెద్ద ముళ్ల చెట్లు. ఏ మాత్రం చేయి తగిలినా చేతుల్ని చీల్చి వేసే ముళ్లు. చాలా జాగ్రత్తగా నడుస్తున్నా. అప్పటి వరకు పక్కన ఉన్న ముళ్ల చెట్లు నా ఎదురుగా ప్రత్యక్షమయ్యాయి. ఎలా దాటాలో అర్థం కాలేదు. కాళ్లు ఖాళీగా ఉన్న చోట పెడ్తూ అతి జాగ్రత్తగా ముందుకే వెళ్తున్నా.
**** **** ****
గదిలో మంచం మీద ఒక్కదాన్నే పడుకుని ఉన్నా. నా గదంతా ఎర్రగా ఉంది. రక్తవర్ణశోభితంగా బాధామయ అర్ణవంగా ఉంది. నా రెండు కాళ్లు ఎడం జరిగి ఉన్నాయి. పొత్తి కడుపులో సుళ్లు తిరుగే నొప్పి.
“ఎందుకక్కా ఆ పని చేశావ్… నేను వేసుకోవద్దని చెప్పానా?! నా మాట ఎందుకు వినిపించుకోలేదు” నా చెవుల్లో ఆ మాటలు గుడిలో గంట కొట్టినట్లు వినిపిస్తున్నాయి. నేను అటు ఇటు కదుల్తున్నా. కానీ కదల్లేకపోతున్నా. నా రూమ్ ఇంకా ఇంకా ఎర్రగా మారిపోతోంది.
అరుస్తున్నా… నా అరుపును ఎవరూ వినిపించుకోవడం లేదు. కళ్లు మూతలు పడుతుంటే బలవంతంగా ఆపుకుంటున్నా. అందుకు నా శక్తి చాలడం లేదు.
గదిలో ఇద్దరు వ్యక్తుల మాత్రం నాకు కనిపించకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల గొంతులు ఒకటి తర్వాత ఒకటి నాకు వినిపిస్తున్నాయి.
“వేసుకో… ఫర్వాలేదు. ఏం కాదులే.”
“నేను వస్తా… నాకు తెలుసు… నేను డాక్టర్ తో మాట్లాడా”
“ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావ్? నీకూ సమస్యని తెలియదా”
“నాది భరోసా… ఒక్క గంటలో అంతా మామూలై పోతది”
నాకు మైండ్ పనిచేయడం లేదు. శరీరం స్పృహతప్పి పోతోంది. అయినా వాళ్లు మాటలు ఆపడం లేదు. “ఆపండి” అని పెద్దగా అరవాలని ఉంది. కానీ ఓపిక లేదు. చచ్చినట్లు వింటున్నా…
“నీకులా నీకు పుట్టే బిడ్డ కూడా బాధపడాలా”
“ఏం కాదే…! నేను ఇద్దరు ముగ్గుర్ని కనుక్కున్నా”
“నా మీద నమ్మకం లేదా”
ఆ ఒక్కమాట నన్ను ఆలోచనలో పడేసింది.
“అంతే” ఆ ఒక్కమాటతో అప్పటి వరకు నాకు వినిపించిన గొంతులు మాయమయ్యాయి.
ఎర్రటి రూమ్ లో నేను ఒక్కదాన్నే శవంలా పడిపోయి ఉన్నా. గిలగిల కొట్టుకుంటున్నా. గొంతు పెగలక పోయినా అరుస్తున్నా. నొప్పి భరించ లేక ఏడుస్తున్నా. తడారి పోతున్న గొంతుతో అరుస్తున్నా.
నా కళ్లెదుట గడియారం ఆగిపోయింది. ఏమో…! నేను మాత్రమే అగిపోయింది అనుకుంటున్నా.
కను రెప్పల మూతలు పడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. బలవంతంగా ఆపినా ఫలితం లేదు. మూసుకుపోయాయి. నాకు తెలియకుండానే నాలోకి నేను అలా వెళ్లిపోయా.
**** **** ****
పెద్ద ఇంట్లో ఉన్నా. చాలా గదులు. గదులు నిండా జనం. చెవులు కుట్టించిన తాతయ్య, బండి మీద నన్ను తీసుకెళ్లి ఐస్ క్రీం కొనిచ్చిన నాన్న వరండాలో కుర్చీల్లో పేపరు చదువుకుంటూ కూర్చొని ఉన్నారు. అమ్మమ్మ, నన్ను గొడవపెట్టుకుని తన దగ్గరకు లాక్కున్న అమ్మ వంటగదిలో నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. నన్ను ఇష్టపడ్డతను, నా భర్తగా లాప్ టాప్ ముందు పెట్టుకొని ఓ గదిలో వర్క్ చేసుకుంటున్నాడు. నన్ను చెల్లి అని దగ్గరు తీసుకున్న అన్న గుడి నుంచి అప్పుడే వచ్చాడు. ఆయన పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. వదిన ఎదురెళ్లింది. నలుగురూ కబుర్లు చెప్పుకుంటూ మరో గదిలోకి వెళ్లారు. తర్వాత ఆ ఫ్యామిలీ నవ్వులు, హోమ్ థియేటర్ లో “ప్రోజెన్ – II” డైలాగ్స్ వినిపించాయి.
నేను, నా చిన్న పాపను ఎత్తుకొని గార్డెన్ లో తిరుగుతున్నాను. నా చుట్టూ రకరకాల పూల మొక్కలు. విరగబూసిన మల్లెలు. కనకాంబరాలు. గులాబీలు. చామంతులు. పరిమళం వెదజల్లే ధవనం. మా మీద మాకు అందేటంత ఎత్తులో రకరకాల పక్షులు ఎగురుతున్నాయి. నా ముఖం పాప నవ్వుల్తో వెలిగిపోతోంది.
చిన్నగా నడుచుకుంటూ నేను న్యూస్ పేపర్ చదువుకుంటున్న వాళ్ల దగ్గరకు వెళ్లా. నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి కబుర్లు చెప్పారు. వంటగదిలోకి వెళ్లా. “నీకు ఏమంటే ఇష్టం చెప్పు. అవే వండి పెడతాం” అన్నారు. ఇద్దరికి ముద్దిచ్చి బయటకు వచ్చా. తర్వాత పిల్లలతో ఉన్న వాళ్ల గదికి వెళ్లా. పిల్లలిద్దరూ “నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో” అంటూ దగ్గరకు వచ్చారు. దగ్గరకు తీసుకొని ముద్దుచేశా. భార్యాభర్తలిద్దరూ వాళ్ల గిల్లికజ్జాలకు సంబంధించిన కబుర్లు చెప్పారు. లాప్ టాప్ తో బిజీ ఉన్నతని గదికి వెళ్లా. లాప్ టాప్ పక్కన పెడ్డి
“ఇప్పుడు ఫుల్ హ్యాపీనా” అడిగాడు.
నా ముఖమే కాదు హృదయం కూడా చంద్రుడిలా వెలిగిపోయింది.
ఉలిక్కిపడి నిద్ర లేచా. అంతా మాయమైపోయింది. కలంతా మాయమైపోయింది. వాస్తవం మీద అల్లుకున్న కలంతా మాయమై పోయింది. బెడ్ మీద నిద్రకళ్లతో వెతికా. బెట్ చుట్టూ వెతికా. చేతికి ఏమీ తగల్లేదు. చుట్టూ ఎవరూ లేరు. నేను ఇష్టంగా కొనుక్కున్న రెండు బొమ్మలు తప్ప.
నా రూమ్ అంతా చీకటి. ఎవరూ దొంగలించలేనంత చీకటి. ఎవరూ దూరం లేయలేనంత చీకటి. అసలు నేనే చీకటేమో!?
భయం వేసింది. లైట్ వెయ్యాలన్నా భయం. అలాగే ఉన్నా… ఉంటున్నా…
(ఓ స్త్రీ వాస్తవ కలల ఆధారంగా…)
చిత్రం: స్వాతి పంతుల
Add comment