ఇప్పటిదాకా నేను దాదాపు 50 కథలు రాశాను. మూడు కథా సంకలనాలు వచ్చాయి. త్వరలో మరోటి రాబోతోంది. నిజానికి నా కథా ప్రయాణంలో చాలా మంది రచయిత లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. నా మొదటి కథ 1980లో రాస్తే ఈ 45 ఏళ్ల లోనూ 50 కథలు అంటే ఎంత తక్కువ చెప్పండి.
అది అలా ఉంచుదాం.
నా మొదటి కథ గురించి ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత ఆలోచిస్తే మంచి మంచి జ్ఞాపకాలూ, మంచి విషయాలూ గుర్తొస్తున్నాయి. నేను మొదటి కథ రాసింది నా 26 ఏళ్ల వయసులో. నిజానికి చాలా మంది రచయితలు అప్పటికే కొన్ని కథలు రాసేసేమని చెప్తారు. అంటే 18 ఏళ్ళ నుంచీ రచన మొదలు పెట్టిన రచయితలు ఉన్నారు. అలా చూస్తే నేను కొంచెం ఆలస్యంగానే ప్రవేశించాను.
అయితే అప్పటిదాకా నేను చేసిన రఫ్ వర్క్ ఏమీ తక్కువ కాదు. రఫ్ వర్క్ అంటే కథలు రాసి పక్కన పడేయటం కాదు. కథలు చదవడం . అప్పటికే నేను చాలా కథలు, గొప్ప రచయితల గొప్పకథలు చదవటమే కాక అధ్యయనం కూడా చేశాను.
ఆ సమయంలో కథ రాస్తాననీ అనుకోలేదు, రాయాలనీ అనిపించలేదు. చదువుకోవటమే బాగుండేది.
కానీ అనుకోకుండా ఒకరోజు నేనూ, మా తమ్ముడు చిన్న వీరభద్రుడు కూడా ఒకేసారి కథ రాద్దామని అనుకుని మొదలుపెట్టి రాశాం.
చిత్రంగా అలా రాసిన ఇద్దరి మొదటి కథలు మా పేర్లతో రాలేదు. వేరే పేర్లతో వచ్చినా కూడా వాటికి విశేషమైన స్పందన వచ్చింది.. దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
అది మళ్ళీ నిజంగానే చాలా ఉత్సాహపరిచింది. సరే తర్వాత వెంటనే కథ రాయాలనిపిస్తుంది కదా. అలా నేను రాసిన నా మొదటి అనే రెండో కథ వెన్నెల ముగ్గు కథ. ఆ వెన్నెల ముగ్గు రాసేనాటికి నేను చలం గారిని శ్రద్ధగా చదువుతూ ఉన్నాను.
ముఖ్యంగా చలం గారి ‘స్త్రీ’ వ్యాసాల పుస్తకం మళ్లీ మళ్లీ చదువుతున్నాను. అందులో ఆయన ఏమంటారంటే ప్రేమలో కానీ స్నేహాల్లో కానీ మనుషులు ఒకరికి ఒకరు పాతబడిపోకూడదు. పాతబడితే ఇక అక్కడ రొటీన్ వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుకోవాలి అంటారు. ఈ కొత్తగా ఉంచుకోవడం ఎలాగా అంటే ఎవరికి వారు సొంత వ్యక్తిత్వాలతో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాలను పెంచుకుంటూ ఉండాలి. ఎవరి అభిరుచులకు తగినట్టు వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఒకరికొకరు కొత్తగా అనిపిస్తూ ఉండాలి.
ఒకసారి ప్రేమ కలిగింది కదా అని మన ఇంట్లో నా భార్య కదా, నా భర్త కదా అని ఇష్టం వచ్చినట్టు ఉంటే రెండోవాళ్ళకి ఆ ప్రేమ గాని ఆ మోహం గాని నిలవడం కష్టమని చెప్తారు.
నలిగిపోయి మాసిపోయిన చీరలతో, జిడ్డు మొహాలతో ఉండే భార్యలు, ఒంటిమీద చొక్కా లేకుండా బనీన్తో తిరిగే భర్తలు ఇది గ్రహించండి అని కూడా చెప్తారు.
ఇవన్నీ చదివినప్పుడు నిజమే కదా దీని మీద మనం కథ ఎందుకు రాయకూడదూ అనిపించింది. అలా వచ్చిన కథే వెన్నెల ముగ్గు కథ.
సంధ్య, రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు.ఇద్దరి మధ్య చాలా ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళ జీవితాల్లో తెలియకుండానే రొటీన్ ప్రవేశించి నిరుత్సాహపరుస్తుంది. కారణమేమిటో తెలియకుండా కొంతకాలం నలుగుతారు. ముఖ్యంగా సంధ్య ఎక్కువ నలుగుతుంది. రాజుకి బయట ఉద్యోగం బయట, ప్రపంచం ఉన్నాయి. కాబట్టి అతనికి ఇంటి తాలూకు రొటీన్ చాలా వరకు ఉండదు. కానీ సంధ్యకు బయట ప్రపంచం చాలా తక్కువ .ఆమెకు ఉద్యోగం లేదు.
కానీ చివరకు దాన్నుంచి ఎలా బయటకు రావాలో తిరిగి బాంధవ్యాన్ని కొత్తగా ఎలా చేసుకోవాలో అన్న విద్య ఎలాగో వాళ్లకే అర్థమవుతుంది.ఇదీ కథ,అందులోని వస్తువు.
ఇక అప్పటికే కథ చెప్పటం గురించి నాకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. కథ లో వర్ణనలు కానీ సంభాషణలు కానీ క్లుప్తంగా ఉండాలి. పైగా వర్ణన లోనుంచి కూడా కథ నడపాలి. అంటే వర్ణన కూడా కొంత కథ చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు నాకు అప్పటిదాకా చదివిన కథలు కలిగించేయి.ఏదీ స్పష్టంగా చెప్పకూడదు. కొంత దాచి చెప్పాలి. అవసరమైతే పాఠకుడు కథని ఒకటికి రెండు సార్లు చదివేలా ఉండాలి.ఇవీ నా అభిప్రాయాలు.
అందువల్ల నేను రాస్తున్న కథలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఉంటాను కదా.
కథ మొదలు పెట్టడమే మొదటి వాక్యమే ప్రత్యేకంగా ఉంటూ తర్వాత కథ పట్ల ఆసక్తి కలిగించేదిగా ఉండాలి. అందుకని ఆ కథ ఇలా మొదలవుతుంది.
“సంధ్య నలిగిపోతుంది వెలుగురేఖలకీ చీకటిఛాయలకీ మధ్య ఇవాళ కొత్తగా కాదు చాలా రోజుల నుంచీ ”
ఈ వాక్యంతో కథ మొదలవుతుంది.
“ఇప్పుడు సంధ్య నలుగుతున్నది వెలుగుకి చీకటికి మధ్య కాదు. చీకటి ఉండగానే ద్వాదశి వెన్నెల క్రమంగా తెలియకుండానే అంతటా అలుముకుంది”
ఇది కథలో చివరి వాక్యం. కథ అంతా ఈ వాక్యాల మధ్యలో నడుస్తుంది.
ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది ఆడవాళ్ళని ఇల్లు ఎందుకు రొటీన్ గా మార్చేస్తుంది? వాళ్లలో ఉన్న ఉత్సాహాన్ని ఎందుకు పోగొడుతుంది? వంట పని, ఇంటి పని వాళ్లలో ఉన్న ఇతర శక్తులను పైకి రానీయకుండా ఎందుకు చేస్తుంది?
వాళ్లు ఇంట్లోంచి బయట ప్రపంచంలోకి వచ్చి బయట సమాజ నిర్వహణకు సంబంధించిన పనుల్లో భాగస్వాములు అయితే తిరిగి తమ ఉత్సాహాన్ని ఎలా సంపాదించుకోగలుగుతారు? అన్న విషయాలు కూడా 1980లో రాసిన ఈ కథలో ఉంటాయి.
దీనికి వెనకాల ఉన్నది చలం గారి ప్రభావం.
పైగా అప్పటిదాకా మా కుటుంబాల్లో ఆడపిల్లలు ఎవరూ చదువుకుని ఉద్యోగాల్లోకి రాలేదు. మా ప్రాంతం నుంచి మా కుటుంబాల నుంచి మంచి చదువు చదువుకుని ఉద్యోగం చేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న మొదటి స్త్రీని నేనే. అప్పటికే నేను ఆరేళ్లుగా కళాశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ ఉన్నాను.
ఈ నేపథ్యం కూడా ఈ కథకు కారణం.
అయితే కథ ఒక లలిత గీతం లాగా, సువాసన వెదజల్లే ఒక పూల తీగలాగా ఉండాలన్నది నా అభీష్టం. ఆ గీతం ద్వారా జీవన విషాదం వినిపించవచ్చు. ఆ పూలతీగ వెనక దాగిన తేనెటీగల పట్టు గురించిన హెచ్చరిక ఎలాగూ ఉండి తీరుతుంది.
ఆవేళ నుంచి ఇవాళ దాకా ఏ సామాజికాంశాన్ని గురించి చెప్పినా నేను కథ రాసే విధానం మాత్రం అంత సున్నితంగాను ఉంటుంది. అలా చెప్పడం నాకు ఇష్టం.
ఇవాళ నేను 45 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కథ చదువుకుంటే పెద్దగా లోపాలు ఏమీ కనిపించలేదు. హాయిగానే అనిపించింది.
ఈ కథ చదువుకున్నప్పుడల్లా కథ చివర్లో ఉన్న “హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగా నీకింత సంతోషమా” అన్న పాట నాకు తెలియకుండానే నా కంఠం నుంచి బయటకు వస్తుంది.
చాలామంది కూడా తమకు ఈ కథ చాలా ఇష్టం అని చెప్పారు. ఇప్పటికీ చెప్తూ ఉంటారు.
ఈ కథ 80 ఆంధ్రజ్యోతి వార పత్రికలో వచ్చింది. రెండు వారాల తర్వాత ఆ కథ మీద ఆ పత్రిక లో ఒక ఉత్తరం పడింది.
ఆ ఉత్తరం ఇలా ఉంటుంది.
“ఈ కథలో కథ ఉంది. కథా శిల్పం ఉంది. హృదయం ఉంది. ఉపయోగం ఉంది. పదే పదే చదువుకోవటమే ఈ కథకు తగిన విమర్శ.”
అని ఆ ఉత్తరం కింద “ఐ. సి. హెచ్. వి బసవరాజు” అన్న పేరు ఉంది. తర్వాత కాలంలో ఆ పేరు ‘జ్యేష్ట’ అనే పెన్ నేమ్ తో రాసే గొప్ప సాహిత్య వేత్తది అని తెలిసింది. అది నా మొదటి కథకి మొదటి ప్రశంస.
తర్వాత కూడా మేము కలిసినప్పుడు ఆయన ఆ కథను ఎంతగానో మెచ్చుకున్నారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత జరిగిన మరో సంగతి.
ఆహ్వానం అనే సాహిత్య మాస పత్రికలో నాకు నచ్చిన కథ అనే శీర్షిక నడిపేవారు. అందులో ఎవరో ఒక పాఠకురాలు ఇది నాకు ఇష్టమైన కథ అని ఉత్తరం రాస్తే సంపాదకులు ఆ కథను మళ్ళీ తిరిగి ముద్రించారు. ఇదీ నాకు మంచి జ్ఞాపకమే.
ఇంకా చాలామంది కి ఇలాంటి కథలు నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి కథలు నచ్చే వాళ్ల కోసమే నేను కథలు రాయగలను. రాస్తాను కూడా.
ఇవీ నా మొదటి కథ తాలూకు కబుర్లు.
*
Add comment