కథ చెప్పడంలోనే నా ఇష్టమంతా ఉంది!

క్కువ సమయంలో ఎక్కువ రాస్తూ గుర్తింపు పొందిన రచయిత గౌస్! స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. జననం: 1997. బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. తొలికథ ‘చిల్డ్రెన్స్ డే’ 2020లో వెలువడింది. ఇప్పటివరకూ 30 కథలు రాసి వాటిలో రాయలసీమ యాసలో రాసిన కథలన్నీ కలిపి ‘గాజులసంచి’ గా వెలువరించారు. ప్రస్తుతం ‘ జీరో నెంబర్ -1’ అనే తన తొలి నవలను వెలువరించారు. శిల్ప ప్రాధాన్యంగా రాయడం సాధన చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం: హైదరాబాద్.

చికెన్ కొట్టు పెట్టుకొని, చికెన్ పకోడి అమ్ముకునే వ్యక్తులను ఈనాడు గ్రామాల్లో సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఈ నవలలోని సూరి గాడి పాత్ర వెనుకాల మాత్రం ఎవరైనా ప్రేరణ ఉన్నారా?

నేను చిన్నప్పుడు ఒక చికెన్ సెంటర్లో పని చేసేవాడిని. అంటే సెలవురోజుల్లో అన్నమాట. ఏ కథ రాయాలా అని చూస్తున్నప్పుడు సరే జీవితంలోని ఈ భాగం నుండి కథ పుడితే మంచిదే కదా అని ఈ పాత్ర తీసుకున్నాను. కాబట్టి సూరిగాడు నాకు బాగా తెలిసిన పాత్రే.
బ్రిటీష్ కాలం నాటి ఆ సీక్రెట్ రూం నిజమైనదేనా? నిజమైతే నవల రాసేంతలా అది మీపై ఎలా ప్రభావం చూపింది?
సీక్రెట్ రూమ్ నిజం కాదు కానీ ఆ ఇల్లు అప్పట్లో పోలీస్ స్టేషన్ అని చెప్తూ ఉంటారు. పుస్తకం చివర్లో చెప్పినట్టు ఆ ప్రదేశంలో ఇలాంటి డ్రామా ఒకటి జరిగి ఉండే అవకాశం ఉంది కదా అనిపించేది. అలాంటివేమీ జరగలేదని తెలిసాక సరే అయితే నేనే ఒక కథ రాసుకుని దాన్ని గుర్తుపెట్టుకుంటాను అని ఈ కథ రాసాను.
 ఈ నవలను థ్రిల్లర్ లాగా రాశారు ఎందుకని? దాని వలన ఈ రచన కేవలం కాలక్షేపంగా తేలిపోయే అవకాశం ఎక్కువుందని మీకు అనిపించలేదా?
 ఈ కథని ఇలానే చెప్పాలి అని అనిపిస్తుంది. ఏ కారణం చేతనైనా అలా కాకుండా వేరేలా మార్చి చెప్పాల్సి వస్తే ఆ కారణం సరైనదే అనిపిస్తే మార్చొచ్చు. అయితే కాలక్షేపం కోసం చదువుతున్నారా, జీవితంలో ఏదైనా సాధించడానికి చదువుతున్నారా అనేవి పూర్తిగా పాఠకుడికి సంబంధించినవి. అందులో నా జోక్యం ఉండదు. ఒకసారి పుస్తకం పాఠకుడి చేతిలోకి వెళ్ళిపోయాక ఇంక అంతే. కథంతా నేను అనుకున్న విధంగా వచ్చిందా లేదా అన్నదే చూస్తాను.
 ఈ నవలలో మీ ప్రాంతీయ భాషను మరికొంత ఎక్కువ వాడితే బాగుండు అనిపించింది.
సంభాషణలు, కథనం రెండూ కూడా మా యాసలోనే ఉన్నాయి ఈ నవలలో. అయితే యాసలో కూడా చాలావరకు వేరే ప్రాంతాల వాళ్ళు వాడే పదాలనే వాడుతారు. అన్నీ యాస పదాలు, అన్నీ టెక్స్ట్ బుక్ పదాలు మాత్రమే నాకు ఎక్కువగా కనిపించలేదు. కాబట్టి నా కథలోకి కూడా అదే వచ్చి చేరింది అనుకుంటాను. అలాగే ఉన్న ఐదు పాత్రలు కూడా ఐదు వేరే సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుండి వచ్చిన పాత్రలు కావటం మూలాన ఆ పాత్రల యాసలో కూడా ఒక పాత్రతో పోలిస్తే మిగిలిన నాలుగు పాత్రలకీ వైవిధ్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది చాలా బాగా కనిపిస్తుంది.
 కేశవరెడ్డి, కాఫ్కా విరుద్ధమైన రచయితలకు అంకితం ఇచ్చారు. ఈ రచన వెనుక వారి ప్రభావం ఏమైనా ఉందా మీపై?
అంకితం అనేది పూర్తిగా నా ఇష్టానికి సంబంధించిన విషయం. కానీ ఈ రచన మీద ప్రభావం ఉందా అనంటే కచ్చితంగా ఉందనే చెప్తాను. చదివేవాళ్ళకి ఏమో కానీ రాసేటప్పుడు నాకు బాగా గుర్తొచ్చేవాళ్ళు. ఒకరకంగా వాళ్ళకి అంకితం ఇచ్చింది కూడా ఇందుకే.
మీరు కథలు రాశాక వచ్చిన నవల ఇది. దీన్ని నవల కాదు పెద్ద కథ అని అనవచ్చా?
నవల, నవలిక, పెద్దకథ. ఏ పేరుతో పిలిచినా నేను రాసుండేది అక్కడున్నదే. నాకు ప్రక్రియల పేర్లలో పెద్దగా ఆసక్తి లేదు. కథ చెప్పడంలోనే నా ఇష్టమంతా ఉంది.
*

గూండ్ల వెంకట నారాయణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు