ఐజాక్ బేషెవిస్ సింగర్ దృష్టిలో కథకుడు అంటే ప్రాథమికంగా ‘కథ-చెప్పేవాడు.’
ఒకానొక చోట ఆరంభమైన కొన్ని సంఘటనలు సమాహారంగా సాగుతూ వ్యర్థమైన అవాంతరాల బారిన పడకుండా నిరాటంకంగా ముగిస్తే అది కథ అవుతుంది… అనేది రోనాల్డ్ జార్రెల్ భావన. ఆ భావాన్ని ఆమోదిస్తూనే-‘ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించడం, ఒక చోట స్పష్టంగా ముగింపు పలకటమూ కథ ప్రాథమిక లక్షణాలే’ అంటాడు మార్క్ ట్వైన్.
మొత్తంగా చూస్తే కథ ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా సాగవలసిందే. కొన్ని సంఘటనలూ కొన్ని పాత్రలూ కథను నడిపించవలసిందే. చివరికి ఎంచుకొన్న గమ్యాన్ని సహేతుకంగా చేరగలిగితే అది సలక్షణమైన కథ అవుతుందని అనుకోవాలి మనం.
అయితే ఈ ‘కథ’లో-‘నేరేటివ్’కథ…ఒక సంఘటన తరువాత మరో సంఘటనను ఎక్కంలో ‘స్టెప్స్’ లాగా చెప్పుకు పోతుంటుంది. ‘ఇది జరిగింది…దీని తరువాత ఇది జరిగింది…’అంటూ సంఘటనలను ఒక క్రమంలో చెప్పుకుపోవడం ఈ ‘నేరేటివ్’ కథాలక్షణం. అయితే ఇట్లా సూటిగా చెప్పే కథకూ…ఒక ‘కథ’కు ఉండవలసిన నిర్దిష్ట ప్రయోజనం ఉండక తప్పదు.
‘కథ’ ఇప్పుడు కొత్తగా పుట్టిన సాహిత్య ప్రక్రియ కాదు. అప్పటి దాకా అవగాహనకు రాని విషయాలు క్రమంగా అవగాహనకు వస్తున్న దశలో…ఆ వికాస అనుభవం తోటి మనిషితో మాట ద్వారా పంచుకోవటం మొదలైనప్పటి నుంచే ‘కథ’ ఉనికిలోకి వచ్చిందనుకోవాలి.
‘బాలల మేధస్సును అభివృద్ధి పరచడం ఎట్లా?’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు ‘సమ్మోహన పరిచే ఫెయిరీ టేల్స్ పిల్లల చేత పదే పదే చదివించండి’అని జవాబు ఇచ్చాడుట ఆల్బర్ట్ ఐన్ స్టీన్. కథ ‘చెప్పే’ కళ పట్టుపడేందుకు ‘ఫెయిరీ టేల్స్’ తరహా నిరపాయకరమైన సాహిత్యం చదవడం… చదివించడం మంచి పద్ధతి-అని ఐన్ స్టీన్ ఉద్దేశం.
‘సంఘటన తరువాత సంఘటన చెప్పుకుపోవడం కథకు ఉండాల్సిన ముఖ్య లక్షణం’ అనే మాట నిజమే కాని, సంఘటన నుంచి సంఘటన దిశకు కథ నడిచే వడుపును బట్టే కథలోని ‘పట్టు’ బైటపడేది.
కథా ప్రక్రియ చర్చకు వచ్చే ప్రతి సందర్భంలోనూ ‘ప్లాట్’ ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంటుంది. ఉర్సులా కె. లే గుయిన్ ( Ursula K. Le Guin) జౌత్సాహిక రచయితలకు సలహాలిచ్చే ఒక సందర్భంలో ‘ప్లాట్…కథ…రెండూ ఒకటి కాదు; వేరు వేరు. ‘ప్లాట్’ అంటే జరిగే సంఘటనల క్రమాన్ని చెప్పే బ్లూప్రింట్. ఇదీ నిజానికి పట్టుబడాల్సిన ఒక ముఖ్యమైన నైపుణ్యమే. కాని, ‘కథ’ అనే పూర్తి నిర్మాణంలో ఇది ఒకానొక విభాగంగా మాత్రమే గ్రహించాలి.’అని అంటారు.
ప్లాట్ కు మించిన ప్రాధాన్యత కథకు ఉంటుంది. మళ్లీ మాట్లాడితే కథకు ప్లాట్ తప్పనిసరిగా ఉండాలనే నియమం లేదు కూడా. కథకు ప్లాట్ తప్పనిసరి అనేది చాల మంది రచయితల తప్పుడు అభిప్రాయమే. కొన్ని పాత్రల ద్వారా (రెండైనా చాలు), కేవలం ఒకే ఒక సంఘటన ద్వారా కూడా కథ కల్పించవచ్చు. కథ ప్రధాన ఆకర్షణ పాఠకుడిని ‘ఎంగేజ్’ చేయటం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది…ఈ ఎంగేజ్ మెంట్ కి గ్లామర్ తప్ప గ్రామర్ లేదు. ఆహ్లాదపూర్వకంగా ఆశావాదంతో సాగే కథ అందరినీ ఆకర్షిస్తుంది.
కథ సాహితీ మృష్టాన్నంతో సమానం. సుష్టుగా భోంచేసిన తరువాత కలిగే సంతృప్తి పూర్తి అయిన కథా కలిగించాలి. భోజనంలో వడ్డించే అనుపాకాల రుచి వాటి దినుసుల సరిపాళ్ళ మీద ఆధారపడి వున్నట్లే కథ ఇచ్చే అనుభూతీ కథాంగాల సమతూకం మీద ఆధారపడి వుంటుంది మరి.
ప్రముఖ నవలా రచయిత లెస్లీ మర్ మోన్ సిల్కో (Leslie Marmon Silko)మాటల్లో చెపాలంటే ‘కథ కొన్ని సంఘటనలను అర్థవంతంగా గుదిగుచ్చినట్లే పాఠకులనూ ఒక సమూహంగా మార్చేస్తుంది. కథ చదివి ఒకే విధమైన అనుభూతి పొందినవాళ్ళంతా ఆ సమూహంలో సభ్యుయి అవుతారని లెస్లీ మర్ మోన్ ఉద్దేశం కావచ్చు.
కథ ఒక సంక్షిప్త సమాచార కల్పన. ఎంచుకొనే విశేషాలు, వాటిని విస్తరించే విధానం, అమర్చుకొనే పద్ధతి మీద కథాసౌందర్యం ఆధారపడి వుంటుంది. వీలైనంత తక్కువ చెపుతూ తన ఊహకు ఎక్కువగా వదిలేసే కథ పాఠకుడిని చివరి వరకూ పట్టి వుంచుతుంది. తమకు తెలిసినదంతా పాఠకుడి బుర్రలో చొప్పించెయ్యాలనే ఆతృత కొత్త రచయితలో సాధారణంగా కనిపించే లోపం. నివార్యమైన వృథా విస్తరణ తన ఊహా శక్తిని మింగివేయటంతో చదివే పాఠకుడిలో ఉత్కంఠకు బదులు విసుగు జనిస్తుంది.
తెలిసినదంతా చెప్పేసెయ్యాలనే ఆతృత రచయితకు తగదు. కథ ఉన్నత స్థాయిలో ఉండాలంటే అవసరమైనంత మేరకే కథలో సమాచారం ఉండాలి. పాఠకుడి తాదాత్మ్యతకు భంగం కలిగించే రచయిత పై ‘సుత్తి రచయిత’అనే ముద్ర పడే ప్రమాదం కద్దు.
చక్కని కథ చెప్పే చమత్కారాలకు సాహిత్యంలో కొదవేమీ లేదు. కాకపోతే, ఒక్కో కథకు ఒక్కో రకమైన చమత్కారం రాణిస్తుంది. చెప్పటానికి ఎంచుకొనే విశేషాలు…వాటిని ప్రయోగించే మోతాదు మీద అదుపు ప్రధానం. ఉన్నదంతా ఎక్కీ తొక్కీ చెప్పేసెయ్యకుండా పాఠకుడి బుర్రకు పని కల్పించే కథన విధానం కనక అలవాటు చేసుకొంటే మంచి రచయితగా గుర్తింపు పొందటం కష్టమేమీ కాదు.
కథ సింపుల్ గా ఉండటమంటే రెండో ఎక్కమంత సలభంగా ఉండాలని కాదు. ముఖ్యమైన సమాచారం యావత్తూ ఏ వత్తూ దీర్ఘం పొల్లుపోకుండా ఇవ్వడమూ అవసరమే. కాకపోతే ఆ వివరణలు ఇచ్చే విధానం ఎంత హాస్యభరితంగా ఉంటే కథ చదివే పాఠకుడు అంతగా ఆ కథను ప్రేమిస్తాడు.
క్లుప్తత, బిగువైన కూర్పు ఉంటూనే వాటికి పూర్తిగా విరుద్ధమైన విస్తరణ, వివరణ-కలిగి ఉండటం కథా ప్రక్రియ విశిష్టత’ అంటాడు జాయ్స్ కెరోల్ (Joyce Carol).
అత్యంత పురాతనమైనదైనా అత్యంత శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ కథ. ఈకథ అంతస్సారాన్ని పూర్తిగా వడిసి పట్టినందువల్లే మార్క్ ట్వైన్, ఐజాక్ భాషెవిస్ సింగర్, ఎడ్యురో వెల్టీ నీల్ గైమన్ (Mark Twain, Isaac Bashevis Singer, Eudora Welty, and Neil Gaiman)వంటి వారికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. పాఠకుడు మరి ఏ మార్గంలోనూ తప్పించుకొనేందుకు శక్యం కాని విధంగా సాలెగూడు తరహాలో కథను అల్లే నైపుణ్యంలో వారిది అందె వేసిన చెయ్యి కావటమే ఇంతాఖ్యాతి గడించటానికి కారణం.
కథ అంటే ప్రారంభం, నడక, ముగింపు అనే మూడు ధారలతో ప్రవహించే సాహిత్య సాగరం అనే విశేషం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆమూడింటినీ సమర్థంగా నడిపించే నైపుణ్యం పట్టుపడాలంటే ప్రధానంగా కావలసింది విస్తృత పఠనం, పరిశీలన, సాధన. అప్పుడే ‘కథలు చెప్పే కళ క్రమంగా మరుగున పడుతోంది-అనే స్టీవెన్ స్పీల్ బెర్గ్ అభియోగం పూర్వపక్షం అయేది.
***
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Add comment