కథా  క్లాక్ టవర్  కూలిపోయింది…

నేను ఆంధ్రజ్యోతి వార పత్రికలో పని చేస్తున్న రోజులు . 1988 సంవత్సరం చివరి నెలలు అనుకుంటాను . పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు తన ఛాంబర్ లోకి పిలిచి ఒక పుస్తకం ఇచ్చి రివ్యూ చేయండి అన్నారు . అది జూదం పేరు తో వెలువడిన సింగమనేని నారాయణ గారి మొదటి కథాసంపుటి . ఆ రాత్రి కథల  పుస్తకం మొత్తం చదివి  మర్నాడు పొద్దున్నే రివ్యూ రాసుకుని శర్మ గారికి ఇచ్చాను . ఆయన  ఆ రివ్యూ కాయితాలు చేతిలోకి తీసుకుని ఇంత తొందరగానా  అన్నారు . అప్పటి నా ఆకలి  అలాంటిది . ఆయన  ప్రచురణకు “సరే ” అన్నాక  ఆంధ్రజ్యోతి  వారపత్రిక లో దాన్ని ప్రచురించాము . ఆ సమీక్ష కి నేను పెట్టిన పేరు ” పాస్ మార్కులతో పరీక్ష గట్టెక్కిన సింగమనేని ” అలా శీర్షిక పెట్టడమే కాకుండా ” జీవితం , సిద్ధాంతం రెండూ సరళ రేఖల్లాంటివి . అవి రెండూ ఎక్కడా కలవవు . కేవలం సిద్ధాంతం కోసమే  కథలు  రాయకూడదు ” లాంటి వ్యాఖ్యలు ఏవో కూడా చేసినట్టు లీలగా గుర్తు

అదే కథా  సంపుటిని నా మిత్రుడు ప్రసేన్ ఉదయం లో రివ్యూ చేసాడు . ఆ రివ్యూ కి ప్రసేన్ పెట్టిన శీర్ధిక  ” కథా  జూదం ఓడిపోయిన సింగమనేని ” . నేనూ ప్రసేన్ అనుకుని రివ్యూలు రాయలేదు . అనుకుని శీర్షికలు పెట్టలేదు . ఇప్పటిలాగా అప్పుడు సెల్ఫోన్ లేవు  కదా . అచ్చు అయిందాకా  ఒకరి రివ్యూ మరొకరికి తెలియదు . ఆ తరువాత ఎప్పుడో రెండేళ్ళకి  సింగమనేని  రివ్యూలకు పెట్టిన ఆ శీర్షికల పట్ల నొచ్చుకున్నారని తెలిసింది . పాస్ మార్కులు వేయడానికి ఆయనెవరు ?పాస్ అవడానికి నేనెవర్ని ? అని ఏదో  అన్నట్టు తెలిసింది

ఆ తరువాత అఫ్సర్ అనంతపురం షిఫ్ట్ అయ్యాక  అఫ్సర్ కోసం అనంతపురం వెళితే  సింగమనేని ని కలుద్దాం అన్నాడు . నాకు పై సంఘటనలు అన్నీ గుర్తుకు వచ్చి కొంచెం గిల్టీ గా వద్దులే అన్నాను . అనంతపురం వచ్చి సింగమనేని ని కలవకపోతే ఎలా అన్నాడు . కొంచెం భయం భయం గానే అఫ్సర్ తో కలిసి వెళ్ళాను ” వంశీకృష్ణ ” అంటూ పరిచయం చేసాడు . ఆయన ” మీరేనా ?” అని న కళ్ళలోకి సూటిగా చూశారు . తను  మామూలు గానే చూసి ఉండవచ్చు కానీ నాకు మాత్రం సరిగ్గా ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది . అదీ క్షణం సేపే ,  రెండో క్షణం లో  అంతా మామూలు అయిపొయింది . . అలా సింగమనేని తో కలిగిన పరిచయం  చివరివరకు నిలబడిపోయింది . ఆయన స్నేహావరణం లో నుండి ఎవరూ ఎప్పటికీ బయటకి వెళ్ళలేరు అంటే అది ఆయా వ్యక్తుల  గొప్పతనం కాక , సింగమనేని  వాత్సల్యమే  కారణం అవుతుంది

2

సింగమనేని  తన సుదీర్ఘ రచనా జీవితం లో రాయవలసినంత విస్తృతంగా రాయలేదు . కానీ రాసిన ప్రతి అక్షరమూ   కల కాలం నిలిచేలా రాసారు. దాదాపు యాభయ్  కథలు , మూడో నాలుగో నవలలు , తెలుగు కథలు  కథన  రీతులు  నాలుగు సంపుటాలకు సంపాదకత్వం , అనంతపురం లిటరరీమీట్ , అరసం బాధ్యతలు  కొన్ని వందల ప్రసంగాలు , సాహితీ కార్య కర్త్రుత్వం  సింగమనేని  సృజన జీవితానికి నిలువెత్తు సాక్ష్యాలు

” జీవిత వాస్తవికతను ప్రదర్శించే సాహిత్యం నాకు ఇష్టం . మనం జీవిస్తున్న సమాజం లోని ఘర్షణను , వాటి మూలాల్ని వ్యాఖ్యానించే సాహిత్యమే  మన పాదాలని  భూమికి ఆనేలా చేస్తుంది . వ్యక్తిగత సంస్కారాన్ని పెంపొందించటం తో పటు సాంఘిక సమస్యల పట్ల మన కర్తవ్యాన్ని నిర్దేశించేదే మంచి సాహిత్యం . అలాంటి రచనలే నాకిష్టం ” అని నిషిద్ధం కథ లో మమత పాత్ర అంటుంది .ఈ మాటలే సింగమనేని  కథా  తాత్విక భూమికలు . అందుకే ఆయన కధలు అన్నీ జీవితం లో నుండి నేరుగా నడిచివచ్చినట్టు  ఉంటాయి . నా మిత్రుడు ఒకరు  ఆయన కథలు  చదివి  ” సత్యజిత్ రే  సినిమాలలో ఉన్నత రియాలిటీ  ఈ కథలలో  వుంది . అంత రియాలిటీ తట్టుకోవడం కష్టము ” అన్నాడు . నిజమే  తమకు  తెలియకుండానే శాపగ్రస్తంగా  మారుతున్న జీవితాన్ని  తట్టుకోవడం ఎవరికీ మాత్రం తేలికగా ఉంటుంది

అనంతపురం జిల్లా సహజ మాండలిక మాధుర్యానికి అద్దం  పడతాయి  సింగమనేని కథలు . తన సమకాలీన రచయితలు  దృష్టి సోకని  విస్మృత అంశాలకి  సింగమనేని కథా  రూపం కల్పించారు  . అందుకు ప్రధాన  ఉదాహరణ శ్రమైక  జీవన మనే కథ . బాడీ  ఫిట్నెస్ కోసం , బరువు పెరగకుండా , పొట్ట రాకుండా స్లిమ్  గా ఉండటం కోసం  రోజూ చేసే జాగింగ్ గురించిన కథ  ఇది . ఇంట్లో తల్లి చేసే శ్రమ పట్ల ఏమాత్రము  గౌరవం కానీ , తల్లి పట్ల కాన్సర్న్  కానీ లేని ఆధునిక పిల్లల మనస్తత్వం పట్ల ఒక విలక్షణమైన పరిశీలన ఈ కథ . ఇందులో  సింగమనేని  ఒక పాత్ర చేత ఇలా చెప్పిస్తాడు

” మనకంటే సంపన్న వర్గాలను చూసి, మనకంటే తీరిక వర్గాలను చూసి మన మధ్య తరగతి వర్గం తెచ్చుకుంటున్న జాడ్యం నాయనా ఇది . మనకంటే పై వర్గాలకు అన్ని పనులు చేసి పెట్టడానికి నౌకర్లూ, పని మనుషులు  వుంటారు . వాళ్ళు చేయడానికి  ఏ పనులూ వుండవు . అందుకే వాళ్ళు బరువు పెరగడాలు , పొట్ట పెరగడాలు నిరోధించుకోవడానికి ఈ కృతిమ వ్యాయామాలు, వాకింగులు రన్నింగులూ చేస్తారు .మనకెవరున్నారు చేసి పెట్టడానికి . దేశము లోని ఇన్ని పల్లెల్లో ఈ వాకింగ్  ట్రాక్ లు లేవు వాళ్లకు వాళ్ళ పనులే వ్యాయామం . మీ అమ్మను చూడండి . మీ భాషలో ఎంత స్లిమ్ గా ఉందో . అందుకు ప్రధాన కారణం ఆమె చేస్తున్న ఇంటి పనే ”

ఒక స్త్రీ ఇంట్లో చేసే పనిని ఒక కథగా  మలిచే దృష్టి సింగమనేని కి మాత్రమే పరిమితం అంటే అతిశయోక్తి లేదేమో

” భాష  విషయంలో సింగమనేని నారాయణది మధ్యేమార్గం. మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి కథకూ, కథనానికీ మధ్య ఉండవలసిన తేడాను జాగ్రత్తగా పాటించాడు. సింగమనేని రచయితగా మాత్రమే కాకుండా తన సహచర్యంతో, ఆలోచనాపరుడుగా, లిటరరీమీట్‌, అనంత రచయితల సంఘం బాధ్యుడుగా , సంపాదకుడుగా – ఆ ప్రాంత రచయితల  వస్తు శిల్పాలను ప్రభావితం చేశాడు. “ అని వల్లమ్ పాటి  వెంకట సుబ్బయ్య గారు అంటారు . అలా సంభాషణలకు మాత్రమే మాండలికాన్ని పరిమితం చేయడం వలననే సింగమనేని అనంతపురం నుండి  అటు ఆదిలాబాద్ దాకా ఇటు శ్రీకాకుళం దాకా తన ముద్ర వేయగలిగాడేమో .

ఊబి కథలో  నారప్ప , మకరముఖం  కథలో  కొత్తగా సెకండరీ గ్రేడ్  టీచర్ గా వుద్యోగం పొందిన హరిజన యువకుడు ,రెండవ బిడ్డ పెళ్లి కోసం  పొలం తాకట్టు పెట్టి అప్పుచేసి  యక్ష ప్రశ్నలకి  జవాబు చెప్పడానికి తన జీవితమే  ఒక ఉదాహరణ అన్న  సంజీవప్ప , కుటుంబం లోని ఆస్తి పంపకాలకోసం  నాలుగేళ్ల తరువాత సొంత వూరికి వచ్చి  వూరు విడిపోయిన దౄఎశ్యం చూసి  దుఃఖ పడిన నారాయణ   వీళ్ళందరూ  అనంత జీవితం లో నుండి  సింగమనేని పాత్రలుగా మారి అనంతపురం జీవితాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారే.

ఫిరంగి లో జ్వరం  సింగమనేని మాత్రమే రాయగలిగిన కథ . వెంకట నాయుడు కి వీరా రెడ్డికి  ఆగర్భ శత్రుత్వం . ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని చూస్తారు . ఎన్ . టి  రామారావు ప్రభుత్వం మధ్య నిషేధం విధించాక  తన వ్యాపారాలను , తన వర్గాన్ని కాపాడుకోవడానికి  నాటు సారా కోసం గణేనాయక్ ను చేర  దీస్తాడు  వెంకట నాయడు . ఆర్ధికంగానూ , ఆధిపత్యపరంగానూ  బలపడతాడు . చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి పాక్షికంగా మధ్య నిషేధం ఎత్తివేసి  బార్లకీ , బీరు షాపులకీ  అనుమతి ఇస్తుంది . వెంటనే  వెంకట నాయుడు బారుషాప్ లైసెన్స్ తీసుకుని  మద్యం వ్యాపారం లోకి వచ్చేస్తాడు .. తన వ్యాపారం , తన బెల్ట్ షాపులు తనకి ఇబ్బడిముబ్బడిగా  డబ్బు సంపాదించి పెట్టాలి అంటే  లంబాడీ తండాలలో  నాటు సారా తయారీ ఉండకూడదు . అందుకని ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ ను ఉపయోగించుకుని  గణేనాయక్  ఆధ్వర్యం లో నడిచే నాటుసారా తయారీ కేంద్రాల మీద దాడులు చేయిస్తాడు . ఇద్దరి మధ్యా ఘర్షణ  ముదురుతుంది . వీరా రెడ్డి  మీద  ఆధిపత్యం  నిలుపుకోవడం కోసం గణేనాయక్ ను ప్రోత్సహించిన  వెంకట నాయడు , గణేనాయక్  స్వతంత్రంగా  వ్యవహరిస్తూ తనకు సవాల్ విసిరే సరికి  అతడిని  అంతం చేయడానికి వీరారెడ్డి తో ఆగర్భ శత్రుత్వాన్ని మరచి చేతులు కలుపుతాడు . ఆధిపత్య వర్గాలు  దళితులను , గిరిజనులను  తమ చదరంగం  ఆట లో  పావులుగా ఎలా ఉపయోగించుకుంటారో , సరి అయిన సమయం వచ్చినప్పుడు ఎలా చెక్  పెడతారో  అత్యంత సహజంగా  సింగమనేని చెప్తాడు ఈ కథ  లో .  “  నాయు డు  తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం  కోసం చేసే పోరు వెనుకా , గణేనాయక్ తన ఉనికిని నిలుపుకోవడం కోసం చేసే పోరాటం వెనుకా  ఉన్నవి  స్వార్ధ పర , వ్యాపారపర ప్రయోజనాలే . వాళ్లిద్దరూ జిల్లా సాంఘిక జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారని సమస్యను సరిగ్గా అర్ధం  చేసుకున్న ప్రగతిశీల పక్షాలు ప్రకటించాయి”  అని కథ  కి ముక్తాయింపు ఇస్తారు .

ఆయన రాసిన పరీక్షిత్తు కథ  కూడా విలక్షణమైనదే. ఇప్పుడంటే విద్యావ్యవస్థ లో బోలెడన్ని మార్పులు వచ్చి ఆన్ లైన్ క్లాసులు , ఆన్ లైన్ పరీక్షలు వచ్చాయి కానీ ఒకప్పుడు పరీక్షల నిర్వహణ ఒక సర్ప యాగం లాంటిదే.   ఏడవతరగతి , పదవతరగతి  పరీక్షలు నిర్వహణ ఒక యజ్ఞం లాంటిదే . ప్రభుత్వం ఒక పక్కన పాస్ పర్శంటేజ్  కోసం వత్తిడి పెంచుతూ ఉంటుంది . విద్యార్థులకు ప్రత్యక్షంగానో , పరోక్షంగానో  సహాయం చేయమని అన్యాపదేశముగా సూచనలు ఇస్తుంది . ఈ నేపథ్యం  లో ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఈ వత్తిడికీ  తల  వొగ్గకుండా తన పని తను  నిర్వహించి  పరీక్షలు నిజాయితీగా , సమర్ధవంతంగా నిర్వహించినందుకు  ఎలాంటి బహుమతి పొందాడో  పరీక్షిత్తు కథ  వివరిస్తుంది

తాను  పండించిన పంటకి తనకు కావలసిన ధర పొందలేని  దుస్థితి రైతుది . ప్రకృతి తో పాటు  మార్కెట్ కూడా రైతు ని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది . మార్కెట్ మోసం వెనుక ప్రకృతి మోసం వెనుక తరచి చూడాలే కానీ  మనిషి స్వార్ధమే ప్రధానంగా ఉంటుంది . తన పంటకి గిట్టుబాటు ధర లభించని ఒక రైతు అసహనానికి గురి అయి తనుఁ  పండించిన పంటను తానె ధ్వంసం చేయడం అడుసు కథా  ఇతివృత్తం .

” నాకు కథా  రచన సహజంగా అబ్బలేదు . గట్టిగా సాధన చేసి నేర్చుకున్నాను ” అని చెప్పే సింగమనేని కి సాహిత్యమూ , జీవితమూ రెండూ తెలుసు . రెండింటికీ మధ్య వున్న  కార్యకారణ సంబంధాలూ తెలుసు . అందుకే ఆయన కథలన్నీ  దృక్పథ  పరంగా గొప్ప క్లారిటీ తో ఉంటాయి

చిన్న చిన్న వాక్యాలు , సులభంగా అర్ధం అయ్యే శైలి , ఎక్కడా పాండిత్య ప్రదర్శన కి వెళ్లలేని పల్లెటూరు తనం సింగమనేని కదలనిండా  నిండి ఉండి  పాఠకుడిని తన వెంట తీసుకుని వెళుతుంది .

సింగమనేని ని ఒకసారి కలిస్తే ఆయన తో ప్రేమలో పడకుండా ఎలా ఉండాలేమో , ఆయన  రాసిన ఏ కథ  చదివినా  ఆ కథ  తో ప్రేమ లో పడకుండా ఉండలేము . మెత్తగా ఉంటూనే  జీవిత బీభత్సాన్ని రక్త మజ్జాస్థిగతమ్ చేసే కథలు  సింగమనేనివి

3

సింగమనేని ఇక లేరు అంటే అనంతపురం కథా  క్లాక్ టవర్ కూలిపోయింది అనిపిస్తోంది

సింగమనేని ఇక లేరు అంటే అనంత జీవన విషాద మాధుర్య పరిమళం పారిపోయింది అనిపిస్తోంది

సింగమనేని ఇక లేరు అంటే పచ్చపచ్చగా పూచిన  శనగచెను ఒక్క గాలివానకు ధ్వంసం అయిపొయింది అనిపిస్తోంది

సింగమనేని గారూ  వి  మిస్ యు

*

వంశీ కృష్ణ

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • క్లాక్ టవర్ కూలిపోయినట్లే ఉంది. సింగమనేని గారికి మంచి నివాళి

  • సింగమనేని గారిగురించి చాలా మంది రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణాన్ని పరిచయం చేశారు. మీరు వారి మరొక్క కోణాన్ని ,వారి కథలను పరిచయం చేశారు. 😥

  • సింగమనేని గురించి
    వంశీ కృష్ణ గారు రాసిన వ్యాసం చాలా బాగుంది.
    ఆయన రచనలన్నీ చదవాలనే ఆకాంక్ష ఎక్కువ అయింది.
    మంచి రచయిత ను కోల్పోయింది మన తెలుగు సాహితీ రంగం.

  • సింగమనేని గారికి అశ్రు నివాళి🙏🏻🙏🏻ఈ వ్యాసం ద్వారా మీరు జర్నలిజం లో ఎంత నిజాయితీ నిక్కచ్చిగా ఉండేవారో అవగతమైంది…అందుకు ఉదాహరణ లు మీరు వారి జూదం కథ రివ్యూ లకు పెట్టిన పేర్లే👍 కథా క్లాక్ టవర్ కూలిపోయింది… గొప్ప టైటిల్.
    సింగమనేని గారికి నివాళి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • సింగమనేని గారికి నివాళి! వంశీకృష్ణగారు, అసందర్భమే కానీ, మొదటి పేరాలు చదివాక తలెత్తిన సందేహాలు. విమర్శ చేసారు. ఆ పై గిల్టీ ఫీలింగ్ ఎందుకు? గుచ్చుకోవటానికేముంది? ఇదే చిక్కు. తెలీనపుడు ఏదయినా మాట్లాడగలరు. నిజాయితీగా మాట్లాడగలరు. ఆ వ్యక్తితో పరిచయమవగానే, అన్నీ బాగున్నట్టే ఉంటాయా అయితే?

    తెలుగు లో విమర్శ ఎపుడూ ఇంతే. అవతలివాడు తెలిసినవాడయితే మోయటం, తెలీకుంటే నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా చెప్పటం. ఒక్కోసారి పరిచయం లేని వారి రచనలు ఎంత గొప్పగా ఉన్నా వాళ్ళతో ఏ పరిచయం, అవసరం లేదంటే చదవనైనా చదవరు. ఈ మాత్రానికి విమర్శ మీద నానారకాల సమాలోచనలు.
    ఒకటి సత్యం. మన తెలుగు సాహిత్యంలో మంచి విమర్శకులు లేరు. మీరు నయం. పరిచయంలేనపుడయినా నిజాయితీగా చెప్పారు. ఇపుడయితే కేవలం పరిచయాలు, నెట్వర్క్ పెంచుకోవటానికి మాత్రమే కథా విమర్శలు, చర్చలు, మోయటాలు అన్నీ మొదలవుతున్నాయి కనుక నిజాయితీకి చోటే ఉండట్లేదు.

  • బాగా రాసారు వంశీకృష్ణ అన్నా..సింగమనేని కథల సంక్షిప్త పరిచయం.. వ్యక్తిత్వ పరిచయం బాగుంది.
    ఆయన మరణం ఒక ఖాళీని ఏర్పరచింది.ఆయనకు నివాళులు..

  • రైతు కుటుంబంలో జన్మించి, శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు గార్లతో ప్రభావితుడైన సింగమనేని నారాయణ మార్క్సిస్ట్ భావజాలంతో రైతుల కష్టాలు, విద్యావ్యవస్థ, మధ్యతరగతి కుటుంబాల జీవనశైలీ, సాంఘిక సమస్యలు ప్రధాన వస్తువులుగా తార్కికంగా రచనలు చేసి అనంతపురం జీవితాన్ని విశ్వవ్యాప్తం చేసారు.

    అవును సింగమనేని ఇక లేరు అంటే అనంతపురం కథా క్లాక్ టవర్ కూలిపోయింది అనిపిస్తోంది వంశీ కృష్ణ గారూ.

    పరిచయం అయిన చిన్నా, పెద్దా అందరిపట్లా వాత్సల్యం చూపే సింగమనేని గారికి అశ్రు నివాళి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు