కథల బేహారి మెట్రో వెతలు

ఏ సిద్ధాంతాలకీ, తాత్వికతలకీ టైమ్ లేని అతి సామాన్య బతుకుల రోజువారీ గుంజాటనలే ‘మెట్రో కథలు.’

దీర్ నాణ్యమైన కథల బేహారి.  అతని పదో కథల పుస్తకం “మెట్రో కథల సంపుటి” మొన్న 22న మార్కెట్ లో ప్రవేశ పెట్టిన సందర్భం ఒక వేడుకలా జరిగింది.  ముక్కు పచ్చలారని కథా బాలకుల దగ్గర్నుంచి, తలలు పండిన సాహితీ యోధుల దాకా కుడియెడమల తేడా లేకుండా అందరూ వచ్చారు.  అబ్బో అబ్బో అన్నారు.  పుస్తకం కొనుక్కున్నారు.

ముప్ఫై యేళ్ళ క్రితం అతని కథా యాత్ర మొదలు పెట్టినప్పుడు, బాగున్నాయ్ అంటూనే, ఆ నీడలూ, ఈ ఛాయలూ ఉన్నాయంటూ గద్దించారు. ‘మన్ చాహే గీత్,’ ‘బాలీవుడ్ క్లాసిక్స్’ రాగానే సరుకై పోయింది, సినిమాల వెనకాల పడ్డాడు అంటూ వెటకరించారు.  ‘గెట్ పబ్లిష్డ్’ అచ్చు కాగానే అమ్మో ! మైనారిటీ సానుభూతి కార్డ్ తీశాడుగా అని ముఖాలు చిట్లించారు.  ‘కథలెలా రాస్తారు?’ అనగానే పురోహిత పీఠానికి కన్నేశాడు అని గొణుక్కున్నా,  ‘బియాండ్ కాఫీ,’ ‘మెట్రో కథలు’ వచ్చాక ఇక అనడానికి యేమీ లేదు.  అంతులేని పాఠకుల ఆదరణ పొందిన ఈ రచయిత వీటినేం పెద్దగా పట్టించుకున్నట్టూ లేదు.  బ్రతుకులోని ప్రతి పార్శ్వాన్నీ  పట్టుకున్న అరుదైన రచయితగా రూపాంతరం చెందాడు.

ఏ సిద్ధాంతాలకీ, తాత్వికతలకీ టైమ్ లేని అతి సామాన్య బతుకుల రోజువారీ గుంజాటనలే  ‘మెట్రో కథలు.’  నగరం నుంచి మెట్రోగా మారిన హైదారాబాద్ గురించి యిటీవల కాలంలో ఇలాంటి కథలు రాలేదని వచ్చిన వక్తలందరూ బల్ల గుద్ది మరీ చెప్పారు.  మహ్మద్ ఖదీర్ బాబు నుంచి ఒట్టి “ఖదీర్” గా ఎలా కుదించ బడ్డాడో, అలాగే కథలు కూడా ఈ రోజు బాణీ కి తగ్గట్టు నాజూగ్గా నాలుగు పేజీలలోకి వచ్చేశాయి.    ‘మీటింగ్’ కథ మీ కోసం :

మీటింగ్

‘కుదరదండీ’ అన్నాడు ఫస్ట్‌ఫ్లోర్ ఆయన.

‘అవును. కుదరుదు’ అన్నాడు థర్డ్‌ఫ్లోర్ ఆయన.

‘వెంటనే ఆపేయాల్సిందే’ అన్నాడు ఇంకో ఆయన.

ఆయనది ఏ ఫ్లాటో తెలియదు. ఎప్పుడూ కనపడడు. వాటర్ ప్రాబ్లమ్ వస్తుంది. ట్యాంకర్లు మాట్లాడాలి. వాలంటీర్లు కావాలి. కనపడడు. వాచ్‌మెన్ రెండ్రోజులు లీవ్ పెట్టి ఊరికెళతాడు. ఆర్రోజులు రాడు. చెత్త పారేసే మనిషిని వెతకడంలో సహాయం కావాలి. అప్పుడూ కనపడడు. మెయిన్‌టెనెన్స్ ఎవరో ఎగ్గొడతారు. అప్పుడూ కనపడడు.

ఇదిగో… ఇలాంటి వాటికి మాత్రం రెడీ.

ఇలాంటి ఒక సమస్య వస్తుందని ఇలాంటి ఒక మీటింగ్ జరుగుతుందని ఊహించలేదు. బుద్ధి తక్కువయ్యి ఈ ఫ్లాట్లలోకి మారాడు. కొడుకు ఒక ఫ్లోర్‌లో ఉంటాడు. కోడలు గర్భంతో ఉంది. సహాయంగా ఉంటుంది కదా అని భార్యతో పాటు ఇక్కడకు మారాడు. వేరే చోట సొంత ఫ్లాట్ ఉంది. ఇది అద్దెకు. రిటైరయ్యాక, కొంచెం తీరుబడిగా ఉన్నాక, కొడుకూ కోడలికి భారం కాకపోగా వారికి సహాయం చేసే స్థితిలో ఉండటం మేలు. వచ్చారు. ఆరు నెలలు గడిచాయి. ఇప్పుడు ఈ మీటింగ్.

‘నేను చేసిన పనిలో తప్పేమిటో అర్థం కావడం లేదు’ అన్నాడు.

‘తప్పని ఎవరన్నారండీ… తప్పని ఎవరంటారు. కాకపోతే దీని వల్ల ప్రాబ్లమ్ అంటారు. మేము తిరుగుతుంటాం. ఆఫీసులకు వెళుతుంటాం. వస్తుంటాం. మా సంగతి వదిలిపెట్టండి. ఆడవాళ్లు కూరగాయలకని గుడ్లకని బ్రెడ్లకని ఫ్లాట్ల నుంచి రోడ్డు మీదకు తీరుగుతుంటారు. వాళ్ల సంగతి వదిలిపెట్టండి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాలా… మళ్లీ ఇళ్లకు రావాలా? మీరిలా వీధి కుక్కలను చేరదీసి వాటికి రోజూ అన్నం గట్రా పెడుతుంటే అవి మీ కోసం అక్కడే తిష్ట వేస్తున్నాయి. కరిస్తే ఏం కాను? మీరేయించుకుంటారా బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లూ’… ఇతన్ది ఫోర్త్ ఫ్లోర్ కావచ్చు.

సొంత ఫ్లాట్ మంచి బిజీ సెంటరులో ఉంటుంది. అక్కడ వీధికుక్కలు ఉండటానికి వీలు లేదు. ఒకవేళ ఉన్నా అవి కంటికి కనిపించేవి కావు. కాని ఈ ఫ్లాట్స్ కొంచెం ఊరికి దూరంగా ఉన్నాయి. ఫ్లాట్స్ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఊళ్లో నుంచి తరిమేసిన కుక్కలు, కొన్నాళ్లు సరదా పడి పెంచుకుని బులబాటం తీరిపోగా గుట్టుచప్పుడు కాకుండా వదిలి ఓనర్లు పారిపోయిన కుక్కలు అన్నీ ఇక్కడ చేరాయి. పది ఇరవై ఉంటాయి. వాటిలో ఫ్లాట్స్ వైపు కనీసం ఆరేడు తిరుగుతుంటాయి. వాటికి అన్నం పెట్టడం తప్పయ్యింది.

అయినా ఈ ఫ్లాట్స్ కొంచెం విడ్డూరంగానే ఉన్నాయి.

పావురాళ్లకు నీటి వసతి కోసం, పిచికలు వాలి గొంతు తడుపుకోవడం కోసం బాల్కనీలో గ్రిల్స్ మీద రెండు ప్లాస్టిక్ డొక్కులు పెట్టి వాటిలో నీళ్లు నింపుతుంటాడు. అన్నిసార్లు ప్రశాంతంగానే తాగిపోతుంటాయి. కొన్నిసార్లు దొర్లిస్తుంటాయి. అప్పుడు నీళ్లు కింద ఫ్లాట్ బాల్కనీలో పడితే… అవీ పెద్దెం ఎక్కువ కాదు… గ్లాసుడు నీళ్లు… దానికే పెద్ద రభస చేశారు. పక్షులకింత నీరండీ… అంటే ఆ ఖర్మ మా నెత్తిన ఎందుకండీ అందావిడ. ఆవిడ బాల్కనీలోకి పావురాలు ఏ కోశానా రాలేవు. వల కొట్టించింది. ఎందుకు గొడవ అని నీళ్లు కింద పడకుండా నానా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

కుక్కలకు కూడా ఏం ఇబ్బంది లేదు. అపార్ట్‌మెంట్ బయటికి వచ్చి కాస్త ఎడంగా ఎంట్రన్స్‌కు దూరంగానే అన్నం పెడతాడు. పాపం మొన్న ఒక కుక్క కడుపుతో ఉంది. లోపల బిడ్డల్ని మోయలేక మోయలేక మోస్తోంది. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇవ్వాలని ప్రభుత్వం వారు రేడియోల్లో టీవీల్లో చెబుతారు. గర్భిణీ ఊర కుక్కలకు ఎవరైనా గుప్పెడు మెతుకులు పెట్టండి అని ఎవరూ చెప్పరు. అది పిల్లల్ని పెట్టే దాకా పొద్దునా సాయంత్రం అన్నం పెట్టాడు. పెట్టాక కూడా.

నిజానికి ఇద్దరి కోసమని పెద్దగా వంట అక్కర్లేదు. తినేవి గుప్పెడు మెతుకులే. కాని కుక్కల అవస్థ చూసి పొద్దున రెండు డబ్బాలు సాయంత్రం రెండు డబ్బాలు రైస్ కుక్కర్లో పడేస్తున్నాడు. ఒక్కోసారి మిగిలిన కూరగాయలన్నీ కలిపి ఉప్మా చేస్తుంటాడు.  తోడు రెండు మూడు బ్రెడ్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి. ఆ పూట కూతురింట్లో భోజనం చేయాల్సి వస్తే- తక్కువ రేటుకు టిఫిన్లు అమ్మే బండ్లు ఉన్నాయి- అక్కణ్ణుంచైనా ఏదో ఒకటి తెచ్చి పెడతాడు. మానడు.

కుక్కలు ఏదో ఒకటి తిని అలా రోడ్ల మీద తిరుగుతున్నాయి అనుకుంటారు చాలా మంది.

కాని కాదు. పస్తులుంటాయి. కావాలంటే పది పదిహేను రోజులు కూడా పస్తులుంటాయి.

‘అయితే ఇప్పుడు ఏమంటారండీ’

‘ఏమనేదేముందండీ. వాటిని చేరదీయడం మానేయండీ. రోజూ పేపర్లలో చూస్తున్నాం కదా. వీధి కుక్కల దాడిలో ఫలానా వారు బలి… ఫలానా వారు మృతి అని’…

చెప్పాడు.

‘అయ్యా… దేశంలో లక్షలాది కుక్కలు ఉన్నాయి. కాని మీరు ఎప్పుడో ఒకసారి ఇలాంటి వార్తలు వింటారు. మనుషుల్ని కరవడమే వీధికుక్కల పనైతే మనిషి వాటిని ఈపాటికి భూమ్మీద నుంచి నిర్మూలించి ఉండును. అవి అలాంటివి కావు. మనతో కలిసి మెలిసి బతికేందుకే అవి పుట్టాయి. లోకంలో జీవులన్నింటికీ వాటి ఆహారం వాటికి ఉంది. కాని కుక్కకు మాత్రం మనిషి ఆహారమే తన ఆహారం. అందుకే అవి మనమంటే ప్రేమగా ఉంటాయి. స్నేహంగా ఉంటాయి. విశ్వాసంగా ఉంటాయి. వాటికి తిండి పెట్టడం మన బాధ్యత’…

‘అయితే మీరో కుక్కల హాస్టల్ తెరవండి’

అందరూ గొల్లున నవ్వారు.

‘ఎందుకండీ నవ్వుతారు?’

సర్దుకున్నారు.

‘చూడండీ… మీరందరూ చిన్న చిన్న ఊళ్ల నుంచి వచ్చినవారే కాదా. ఊళ్లల్లో కుక్కలు ఎలా ఉంటాయి? స్వతంత్రంగా ఇళ్లల్లోకి దూరుతాయి. పెరట్లో గిన్నెలు కడిగే చోట లేదంటే వాకిలి దగ్గర ఏవైనా పదార్థాలు పడేసి ఉంటే జబర్దస్తీగా తినేసి పోతాయి. వాటికి అలాంటి వీలుండబట్టే ఇన్నాళ్లూ బతికాయి. ఇప్పుడు మనం ఫ్లాట్లు కట్టుకుని, సోలార్ ఫెన్సింగులు పెట్టుకుని, తోడు వాచ్‌మెన్‌ని పెట్టుకుని గేటెడ్ కమ్యూనిటీ పేరుతో కుక్కలూ కోతులూ కోళ్లూ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. జాలీలు కొట్టిఆఖరకు పిట్టలు, పావురాల పొడ కూడా తగలకుండా చూసుకుంటున్నాం. కొంచెం ఆలోచించండి. ఇది ఏ మాత్రం’…

‘సార్… ఆపండి సార్… చాలా పనులున్నాయి మాకు. దొరికేది ఒక్క ఆదివారం’

‘అవునవును. నేను వెళ్లి రెడ్ మీట్ తెచ్చుకోవాలి’

‘లేట్ చేస్తే ప్రాన్స్ దొరకవు సార్’…

అందరూ కనికరం లేకుండా చూస్తున్నారు. వయసులో పెద్దవాడని మాట్లాడటం లేదుకాని ఆడవాళ్లందరూ అంతే కఠినంగా చూస్తున్నారు.

పెట్టడం సమస్య. కాని ఇంత సమస్యా?

లేచి నిలబడ్డాడు.

ఊళ్లో పెద్ద పెరడు ఉండేది. ఫలాలిచ్చే వృక్షాలు ఉండేవి. కనుక ఉడతలు గెంతేవి. పశువుల కోసం కుడితి తొట్టి ఉండేది. కనుక కాకులు అక్కడే వాలేవి. బావి చెప్టా మీద బిందెలు పెట్టగా పెట్టగా గుంటలు పడి నీరు నిలిచేవి. కనుక పిచుకలు కిచకిచలాడేవి. బియ్యం చెరగడం ఉండేది. గింజలు ఏరడం ఉండేది. కనుక పిల్లలతో కలిసి పెత్తనం చేస్తూ కోళ్లు తిరిగేవి. ప్రవేశద్వారం గోడలు ఎత్తుగా ఉన్నాయని పెరటి గోడ నుంచి దూకి కుక్కలు ఎండ పెట్టిన ఉప్పుచేపలను తన్నుకు పోయేవి. ఎలుకలు ఎలాగూ ఉండేవి. కనుక పిల్లులు పబ్లిక్‌గానే వచ్చి పోయేవి. ఇక ఉండి ఉండి ధగ్గుల వలే పెద్ద దండుతో కోతులు దాడి చేసి అంతా చిందరవందర చేసి అంతలోనే మాయమయ్యేవి.

అయినా ఇంట్లో ఏమీ అనేవారు కాదు.

‘మన కన్నా అవే ముందు భూమ్మీదకు వచ్చాయి. మనం వచ్చి వాటి జాగాను ఆక్రమించుకున్నాం. కనుక ఈ మాత్రం కప్పం కట్టాల్సిందే’ అనేవాడు తండ్రి.

అదేదో కాస్త మిగిలి ఉంది.

కాని- ఇక్కడ చూస్తే ఈ సిటీ ఏ దయకూ వీలులేని పంజరాలు నిర్మించుకుంటూ ఉందని అర్థమైంది.

‘సరే. మీకు ఇబ్బంది కలిగించే పని చేయను. రేపటి నుంచి మన ఫ్లాట్స్‌తో సంబంధం లేకుండా దూరం వెళ్లి అన్నం పెడతాను. గిన్నెలు తప్పేళాలు తీసుకొని అలా దూరం వెళ్లడం నాకు ఇబ్బందే. కాని మీ కోసం చేస్తాను’….

‘అయ్యో.. అదే వద్దనేది. మీరు ఎంత దూరం వెళ్లినా అలవాటు చేశారు గనక ఇక్కడికే వచ్చి ఎదురు చూస్తాయి. కనుక వద్దు. మానేయండి. మూడు నాలుగు రోజులు చూస్తాయి. ఆ తర్వాత మేము ఏదో చేసి వాటిని ఇటు రాకుండా తరిమి కొడతాం’

‘అవును. తరిమి కొడతాము. అదే కరెక్టు’….

తలాడించాడు.

‘సరే అయితే. కాని ఇందులో చిన్న ఇబ్బంది ఉంది’

‘ఏంటది’

‘ఇక మీదట సరిగా వానలు పడవు’

‘ఆ.. అదేమిటీ?’

‘లేదా కుంభవృష్టిగా పడి సిటీ అంతా సర్వనాశనం అయిపోతుంది.’

‘ఏంటంటున్నారు’

‘చలి కూడా సరిగ్గా కాయదు’

‘ఏం మాట్లాడుతున్నారండీ’

‘లేదా విపరీతంగా శీతలం వచ్చి అందరూ గడ్డ కట్టి చస్తారు’

‘బెదిరిస్తున్నారా….’

‘ఇక ఎండ అంటారా… నిత్యం ఎండే. ఆ కాలం ఈ కాలం లేకుండా ఎప్పుడూ ఎండ కాస్తూ అంతా ఆ ఎండలో మలమలా మాడి చావాల్సి వస్తుంది’

‘శపిస్తున్నారా  ఏమిటండీ’…

‘మీతో పాటు నేనూ అనుభవించాలి’

‘ఇదిగో… మాష్టారు.. మిమ్మల్నే’…

లిఫ్ట్ దగ్గరకు వెళ్లిపోయాడు.

అందరూ చూస్తున్నారు.

ప్రెస్ చేశాడు.

కిందకు దిగింది.

అందరి వైపు చూస్తూ  స్థిరంగా మెల్లగా డోర్ ఓపెన్ చేసుకున్నాడు.

గత సారంగ సంచికలలో ఖదీర్

ఖదీర్ 2 

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఖదీర్ గారి కథలు చదివేసాను .అవెలానూ బావుంటాయి.ఆయనకు ఏంటో మరి బాగా రాయడం అలవాటైపోయింది.నేను మొదట చదివిన తలకాయమాంసం కూర నుండి అదే వరస.నామిని గారిలా ఈయనకూ కథ మూలం దొరకేసింది.మోహన్ బాబు గారు చక్కటి కబుర్లే చెప్పారు.విమర్శ లలో వుండే ఒకలాంటి అర్ధం కాని పదజాలం మోహన్ గారి కబుర్ల లో లేదు.చూస్తుంటే ఈయన పెద్దగా చదువు కున్నట్టు లేదు.

  • ఏ దయకూ వీలులేని పంజారాలు.. హ్మ్మ్
    యిట్లాంటి కథలు అవసరం. Eye opener అంటే పెద్ద పదమవుతుందేమో గాని హడావిడిలో పడి మర్చిపోయిన అత్యవసరమైన దాన్ని దేన్నో సూదిలా పొడిచి గుర్తు చేయడం.. అవసరం. Kudos.

  • వాక్యం బాగుంటుంది.
    మెట్రో. మెట్రోలో ఫ్లాట్. ఫ్లాట్ ఓనర్ల మీటింగ్. దానికి వీధి కుక్కలకి, వాటి తిండికి ఏమిటి సంబంధం?
    “కుక్కలకి తిండి పెట్టకపోతే చస్తారు” అని శపించడంలేదు. ఉన్న నిజం చెబుతున్నాడు.
    నిజమేగా!

  • నేను ఖదీర్ గారి కధలు అన్ని కాకపోయినా ఎక్కువే చదివాను. బాగా రాస్తారు. వారితో కధల మీద మా హస్తినాపురం లో ఒక కార్యక్రమం జరుపుదామని ఎప్పటినుంచో ఆలోచన. పై కదా ఇప్పటి ఆధునిక పట్టణాలలో తరచు జరిగే కధే . గురుగ్రామ్ (హర్యానా) లో డి.ఎల్.ఎఫ్. లో మా ఇళ్ల పక్కనే ఈ గొడవలు తరచు జరుగుతాయి. బాగా రాసారు మిత్రమా .

  • నిజమే, ఎవరికీ దేనికీ టైమ్ లేదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు