కథల పండగ!

నా చుట్టూతా పడుకున్న  కథా రచయితల రాగయుక్తపు గురకల్లో నా గురకను కలిపి నిద్రపోవడం అదృష్టం కాక మరేవిటి. 

శీతాకాల కథా ఉత్సవం లో

కన్నడ రచయిత  వసుధేంద్రను మాట్లాడమన్నారు

“నాకు మళ్ళీ జన్మంటూ వుంటే “గే” గానే పుడతా” అన్నాడు . గుండెలు జల్లు మన్నాయి

చదువుకున్న ఆదివాసి చెంచు యువకుడు మల్లయ్య నవ్వుతూ “ మా ఇజ్జత్ మాకు ముఖ్యం దాని కోసం ఎంతకైనా తెగిస్తాం “ అన్నాడు . ఉద్వేగం వెల్లువెత్తింది

“నా మొట్టమొదటి కథ చదివి అలాంటి  పిచ్చి పనులు చెయ్యద్దని నాన్న తిట్టాడు, అయినా రాస్తా” స్నేహ ను చూసి కథ కలకాలం  బ్రతుకుతుందని ఆశ కలిగింది.

చిన్న వయసులోనే తనకున్న జీవితాన్ని అనుకున్నట్టుగా అనుభవిస్తున్న విరాజిత “నా ఆనందం; నువ్వు నాకు పంచుతున్న ఆనందం లో లేదు” అన్నప్పుడు మనసులో అల్లకల్లోలం మొదలయ్యింది.

తన రెక్కల కష్టంతో ముగ్గురి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి గాలిపంటల్లోని మేలు నలుగురికి తెలియచేయ్యాలని వచ్చిన ఆడ రైతు గౌసియా “మాకు అట్టాంటి పట్టింపు లేమి లేవు మేమందరం కలిసే వుంటాం” అని ఈ దేశం లో నేను బ్రతకగలనన్న బరోసా నిచ్చింది

బ్రెజిల్ నాటక ప్రయోక్త  Augusto Boal  నాటక ప్రక్రియ “Theatre of the Oppressed” అక్కడ ప్రజల్లో మార్పుకి కారణమయ్యిందని చెప్పిన మధు గారిని చూసి ఒక నాటకాలోడిగా నాకు ఒళ్ళు పులకరించింది.

“కథలంటే కలం నుంచి జాలువారిన కమ్మని అక్షరాల కూర్పు కాదు – కొందరి జీవితాలు”

ఇది నేను  తెలుసుకున్న నగ్నసత్యం ఖదీర్ బాబు, టైటానిక్ సురేష్ నిర్వహించిన  ఈ  శీతాకాల కథా ఉత్సవం లో .

 

*           *           *           *           *           *           *           *           *

శీతాకాల కథా ఉత్సవం లో

అడిగితే ఏమనుకుంటారో అనే సంకోచం లేదు రచయితలకి. అడగాలనుకుంది అడిగేస్తారు మొఖం మీదే కడిగేస్తారు.

ఏమయ్యా శేఖర్ “నువ్వు పచ్చాకు సీజను కథను ఎందుకు రాశావ్?” అన్నాడు అల్లం రాజయ్య గారు నాపాటికి నేను కూడలి ఇచ్చిన మట్టికప్పులో టీ తాగుతుంటే నా పక్కకొచ్చి.

ఒళ్ళు చల్ల బడింది టీ వేడిగా వున్నా ఏమి చెప్పాలో తెలియక. ఎలాగైనా కనుక్కోవాలనే ఆలోచన మొదలయ్యింది.

“న్యూ బాంబే టైలర్ కథ అవసరం ఇప్పుడేంది? ఖదీర్ బాబు ఇప్పుడు రెడీమేడ్ చొక్కాలు వేసుకోవడం లేదా ? పీరుభాయి కుట్టిన చొక్కాలే ఏసుకుంటున్నాడా? జెల్ల కడిగేసేడు పూడూరి రాజిరెడ్డి ఖదీర్ బాబు గారి ముందే, మాట మాటల్లో.

ఖదీర్ బాబు ఫాన్స్ పళ్ళు కొరికేరు. రాజిరెడ్డి ఫాన్సు గుండెలనిండా గాలి పీల్చుకున్నారు

“ముస్లీం రచయితలపై చిన్న చూపు కాకపోతే ఎందుకు ఏ కథావార్షికా ఏ ఒక్క ముస్లిం రచయిత చేతులమీదుగా  ఆవిష్కరింపబడలేదు” ఒక రచయిత

“కథలకి విమర్శలు రాయడమంత బుర్ర తక్కువ పని ఇంకోటి లేదనుకొని నేను నేను విమర్శలు రాయడం మానుకున్న” ఒక విమర్శకుడు

“ముందుమాటలు రాయించుకొని కనీసం అది ప్రచురితం అయిందని కూడా చెప్పరు” ఇంకొ విమర్శకుడు

“మీ టూ  యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఆడవాళ్ళ పై జరుగుతున్న అరాచకాలు, నిర్బందాలు, మగ రచయితల కథా వస్తువుల్లో చేరాలి,  ఆడవాళ్ళ రచనలపై తోటిరచయితల చిన్నచూపు మారాలి” అని చెప్తున్నప్పుడు  “ఏం మీ ఆడవాళ్ళు మమల్ని మోసం చెయ్యడం లేదా వాటిపై కథలు రావడం లేదే ?” అని అడిగేసేడు ఒక బుర్రతిరుగుడు రచయిత.

భయమేసింది గొడవలు జరిగిపోతాయని.

గొడవలు జరగలేదు.

అక్కడ , ఆ శీతాకాల కథా ఉత్సవం లో

ఖదీర్ సురేష్ నిర్వహించే కథా సమావేశాల్లో

ఫ్రీడం ఆఫ్ స్పీచ్ కి ప్రాధాన్యం వుంది

ఈ సమావేశం ప్రతి ఒక్కరి బాధను అర్ధం చేసుకోవాలనే స్పృహను కలిగి వుంది

ప్రతి బుర్ర తిరుగుడు ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది

*           *           *           *           *           *           *           *           *

శీతాకాల కథా ఉత్సవం లో

కథలెక్కువగా జీవితానుభవం సైద్దాంతిక దృక్పధం లోంచి పుడుతున్నాయని

సామాజిక చరిత్ర రచయిత ముఖ్య ఉద్దేశ్యం కావాలని

దృక్పద స్పష్టత లేని కథలు గొప్ప కథలు కాలేవని

రూపం లోంచి సారం లోకి కథకులు దిగాలని

మీ రచన ఎవరి పక్షం వహిస్తుందో తెలుసుకోవాలని

కథా వస్తువులు ఆలోచనల్లో తక్కువగా ,సమాజంలో సాటి మనుషుల్లో ఎక్కువగా ఉంటాయని

పరిశోధన లేని రచన రచయితకు  వేదన మిగిలిస్తుందని

సామెతలు నుడికారాలు మన సహజ సంపదలని అవి మన సంస్కృతిలో భాగమని వాటిని కథల్లో వాడితే కథ సహజత్వం కలిగి ఉంటుందని

సాధనా సంప్రదాయం కలిగి వుండాలని

కథ రాసాక ప్రతి కథకుడు తమ కథలపై పునరాలోచన కలిగి వుండాలని.

చాలా విషయాలు నేర్చుకున్నాను కదా!

*          *           *           *           *           *           *           *           *

శీతాకాల కథా ఉత్సవం లో

మగవాడి మీద ఇంకో మగవాడికి వుండే ఆకర్షణ సహజమే అన్నాడు కన్నడ గే రచయిత వసుధేంద్ర

దానికి బయో లాజికల్ కారణం ఏంటి ?

వాళ్ళను నార్మల్ గా మార్చడం ఎలాగా ?

దీన్ని తగ్గించడం కోసం ఏవైనా మెడిసిన్స్ ఉన్నాయా ?

వీటిమీద శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయోగాలు చెయ్యడం లేదా ?

ప్రశ్నలు

సహ రచయితల నోటినుంచి కొన్ని బయటకి వచ్చాయి కొన్ని భయం భయం గా లోపలే దాక్కున్నాయి

“ఇప్పుడు నేను గే గా వుంటే మీకొచ్చిన నష్టం ఏంటి ?”

మా దగ్గర సమాధానం లేదు

“అది రోగం అని మీరు అనుకుంటున్నారు అది సహజం అని నేననుకుంటున్నా ఎవరిది కరెక్ట్” అని అడిగాడు  గే గా జీవితాన్ని ఆనందంగా  గడుపుతున్న వసుదేంద్ర.

ఆలోచనలో పడ్డాము

“అసలు గే ఒక గే లా వుండటానికి సమాజనికున్న అభ్యంతరాలు ఏమిటో కనుక్కోవాలి గాని, గే గా మారడానికి కారణాలు ఎందుకు వెదుకుతున్నారు ?” ప్రశ్నించాడు మా ద్వారా ప్రపంచాన్ని.

అప్పుడర్ధమైంది లెస్బియన్, గే, బై సెక్సువల్ మరియు ట్రాన్స్జెండర్ ఎవరో కాదు మన సోదర సోదరీమనులేనని.

ఆడవాళ్ళ పై లైంగిక వేదింపుల గురించి మాట్లాడుతుంటే మగవాళ్ళకు ఆ వేదింపులు లేవా ? అని

దళిత బహుజనుల సామాజిక అసమానతల గురించి మాట్లాడుతుంటే రిజర్వేషన్ల వల్ల అసమర్డులకు అవకాశాలు వస్తున్నాయని

మీ టూ ఉద్యమం గురించి మాట్లాడుతుంటే వాళ్ళు అవకాశాల కోసం ఎగబడబట్టే కదా ఇలాంటివి జరుగుతుంది అని

అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళందర్నీ ఈ రచయితల సమావేశం లో కూర్చోబెడితే వాళ్లకు సమాధానాలు దొరుకుతాయనిపించింది అపర్ణ తోట, మానస ఎండ్లూరి, కుప్పిలి పద్మ, ఝాన్సీ పాపుదేసి, మిథున, అలిపిరాలసత్యప్రసాద్ ,అల్లం రాజయ్య గారు మాట్లాడిన మాటలు విన్న తరువాత.

అర్ధరాత్రి జి. లక్ష్మినరసయ్య గారి పాడిన జాషువా పద్యాలు రచయితల సమావేశాన్ని రసవత్తరం చేసాయి. ఆ రోజుని అర్ధవంతంగా ముగించేలా సహాయం చేసాయి.

*           *           *           *           *           *           *           *           *

శీతాకాల కథా ఉత్సవం లో

ఎవరితరువాత ఎవరో అనే లిస్టు లేదు

బ్రేకుల కోసం ఎవరూ ఎదురుచూడలేదు

రచయితల చేతుల్లో పేపర్ల కట్టలు లేవు

నాకంటే ముందు వాడ్ని పిలుస్తావా నీ అంతు తేలుస్తా అనే ఈగోలు లేవు

పెద్దా చిన్నా అనే భావం లేదు

పైనా కిందా తేడాలు లేవు

కల్సి తిన్నాం, పడుకున్నాం, కథలెందుకు రాయాలో నేర్చుకున్నాం.

నాకు ఒక పక్క తెలంగాణా కథల హీరో పెద్దింటి అశోక్ కుమార్ పడుకున్నారు

ఇంకో పక్క తెలుగు-తమిళ రచయిత అవినేని భాస్కర్

నా చుట్టూతా పడుకున్న  కథా రచయితల రాగయుక్తపు గురకల్లో నా గురకను కలిపి నిద్రపోవడం అదృష్టం కాక మరేవిటి.

శీతాకాల కథా ఉత్సవం లో

పొద్దున్నే తెలవారుతుండగా నా కళ్ళు తెరిచే సమయానికి ఖదీర్ బాబుగారు చలి గిలి ఎరుగకుండా అలసిపోయి పడుకున్న కరుణ అన్న పై దుప్పటి కప్పుతూ కనిపించిన దృశ్యం చాలదా రచయితలని  అతను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో  తెలుసుకోవడానికి.

హాట్స్ ఆఫ్ టు అర్గనైజర్స్.

చంద్రశేఖర్ ఇండ్ల

12 comments

Leave a Reply to చంద్రశేఖర్ ఇండ్ల Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏదో సమీక్ష వ్యాసం అనుకున్నా. కానీ శీతాకాల కథా ఉత్సవం నడకని, నడతని విశదం చేసింది.
    మంచిని పంచే మంచి కార్యక్రమంపై మంచిని పెంచే మాటలు.

    • సర్ నిజంగా చాలా మంచి సమావేశం సార్. మనం కూడా మన జిల్లాలో చెయ్యాలి. ఇలాంటి సమావేశాలు

    • చిన్న చిన్నవే కాబట్టి పెద్ద మనసుతో సర్దుకుపోవాలి

  • భలేగా రాశారు. గురకలో గురక కలిపి రాగయుక్తంగా😂 . కొత్త వ్యక్తుల్ని కలవడం ఎప్పుడూ enigmatic గా వుంటుంది. అందులో సున్నిత మనస్కులు, ఆలోచనా పరులైన సాహితీవేత్తల సమావేశం మరో లోకంలా వుంటుంది. 👏🏻👏🏻

    • ఈ సారి కొంచెం వాడి వేడిగానే జరిగింది కదా జాన్సీ గారు

  • అదిరిందయ్యా చంద్రం…

  • నామిని అన్న, మా గొరుసన్న లాంటి సీనియర్ రచయితలపై చిన్న చూపు కాకపోతే ఎందుకు ఖదీర్ నిర్వహించిన శీతాకాల కథా ఉత్సవంలో వాళ్లు అవుపించలా ? కనీసం మాలాంటి వీరాభిమానులకు ఉప్పందిస్తే గొరుసన్న నైనా కిడ్నాప్ చేసైనా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే వాళ్లం కదా! మాకా అవుకాశం ఎందుకు ఇవ్వలా?

    ఆడ బిడ్డలు, అక్కలు, తల్లులు – – – పింగళి చైతన్య, విశాఖ డా మల్లీశ్వరి, బెజవాడ పి. సత్యోతక్కయ్య లాంటి వాళ్లు కథా ఉత్సవాలకు హాజరయ్యేలా చూసుకోవద్దా.

    జాషువా పద్యాలు, కాటిసీను పద్యాలు కలైకూరి అన్నకు నచ్చేలా పాడిన మా బుడ్డగిత్త రంకి పుట్టాపెంచల్దాస్ అక్కడికొచ్చి గళం విప్పి జనపదుల జీవనవేదనసారాన్ని పాడి మీకు వినిపించలేదంటె అదీ ఓ లోపంగా అనిపిస్తోండీ నాకు.

    మా కావలి ఖదీరా! అలసిపోయి పడుకున్న కరుణ అన్న పై దుప్పటి కప్పటమే కాదు; అలసిపోసి అశ్రసన్యాసం చెయ్యాలనుకుంటున్న గొరుసన్నలను నిద్రలేపటం కూడా అవసరమే అని నీకు తెలీదా ?

    జీవితంలో తుది శ్వాస వరకూ కలం వొదలని యోధులు కొ.కు. నాయనలు, రావిశాస్త్రులు మనకు ఆదర్శం అని గొరుసన్నకు చెప్పలేడా రాజీ, రాజీ అని తను ఎంతో ప్రేమగా పిలుచుకునే ఆపూడూరి రాజిరెడ్డి గారైనా.

    అన్నట్టు ఆ ఉణుదుర్తి సుధాకర్ సామి మా త్రిపుర తండి పేరు ఒక్క సారైనా ఉచ్చరించలేదా అక్కడి సమావేసాల్లో.

    నాయనా మా ఒంగోలు చందూ! పైనున్న కుఠో లో ఉన్న వాళ్లందరి పేర్లూ రాయి. అట్నే మిగిలిన రచయితల ఫొటోలోలన్నీ ఏ ఫేస్ బుక్కులో ఉన్నాయో, ఏ వాట్స్ అప్లో ఉన్నాయో చెప్పి పున్నెం మూట కట్టుకో.

    • ఈ కథా సమావేశాల ఎంపిక ఎలా చేస్తారో నాకు తెలియదుగాని రామయ్య గారు ….. ఒక సమావేశానికి వచ్చిన రచయితలు/యిత్రుల
      దాదాపుగా ఇంకో సమావేశానికిరారు. ఆ విధంగా చూసుకుంటే మీరు ఎంతో ప్రేమగా ప్రతిపాదించిన రచయితలు/ రచయిత్రులు నేను లేని ఏదో ఒక కథా ఉత్సవం లో పాల్గొనే వుండి వుంటారు. పాల్గొన్నారు కూడా కొంతమంది నేను రాను అని సున్నితంగా తిరస్కరించారు అని విన్నాను. వాళ్ళల్లో గోరుసుగారు ఉండచ్చు పెంచాల్దాసు ఉండచ్చు. నామిని గారు కూడా వుండి ఉండవచ్చు. ఖదీర్ గార్ని వెనుకేసుక రావడం లేదు గాని ఆయనది చిన్న చూపు కాదు ముందు చూపు ఏవిధంగా అంటే ఆ సమావేశపు హాలులోకి ప్రవేశించడంతోటే గోడలపై ఒక అరవైకి పైగా రచయితల ఫోటోలు అంటించబడి వున్నాయి.

      చీకటి గుహ గృహాలలో కథా రశ్మి
      అనే టైటిల్ కింద మీ బెజవాడ పి.సత్యవతక్క పేరు

      తెలుపు నలుపు కళ్ళకు భూడిదవర్ణపు అస్పష్టగాఢత …గాధ
      అనే టైటిల్ కింద త్రిపుర గారి పేరు

      జన భాష… జీవ భాష ….వడగట్టని బ్రతుకు వెలుతురు
      అనే టైటిల్ కింద నామిని గారి

      కణకణలాడెను – భగ భగ మండెను తూర్పున నిలిచిన తెలుగు కథ
      అనే టైటిల్ కింద రావిశాస్త్రి గారిని

      ఆ విధంగా ఇంకో అరవై మంది రచయితలని తలుచుకుంటూ పెట్టిన పోస్టర్లు ఖదీర్ బాబు ఎవ్వర్నీ మర్చిపోడని ముఖ్యంగా రచయితని ఎవ్వరూ మరచిపోకూడదని ఆయన అభిప్రాయాన్ని తెలియచేసింది.

      పింగళి చైతన్య అక్కడి కథా సమావేశాల్లో వుంది.

      చివరిగా తరువాతి కథా సమావేశాల్లో నేను ఉండకపోవచ్చు మల్లీశ్వరి గారు పెంచాల్దాసు ఉండచ్చు. అప్పుడు కూడా మీరు నా మీద మీకుండే అపారమైన ప్రేమతో ఈ విధంగానే నాపేరును ఉచ్చరిస్తూ ఒక పోస్టును రాసి ఖదీర్ గారిని నిలదియ్యాలని మనవి

  • అబ్బ! చదువుతుంటేనే ఎంత బావుందోనండి! ఆ వెచ్చచెచ్చటి జ్ఞాపకాన్ని మీరే దాచేసుకోకుండా మాకూ పంచినందుకు బోల్డన్ని ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు