కథలో బందీ అయిన కథకుడి కథలు 

కథల పుస్తకాన్ని పట్టుకున్నా, ఎన్ని ఉన్నాయి అన్న దృష్టితో పాటు రచయిత ఎవరూ అన్న ఆరా వస్తుంది. అతనిదే జానర్, రాసే పద్దతీ ఇవన్నీ క్షణమాత్రమన్నా ఆలోచిస్తాం. అసలైతే నిర్మమకారంగా అందులోకి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది కానీ, అది కొంత అసాధ్యం. శ్రీనివాస్ గౌడ్ వంటి వాళ్ళ విషయంలో అటువంటి ఎంపిక, తర్జన భర్జన అనవసరం. ఎందుకంటే కవిగా, అనువాదకుడిగా, మంచి వ్యాసం రాయగలిగినవాడుగా, సంపాదకుడిగా కూడా అతను చాలా పేరు పొందిన వ్యక్తి. అతని రాతల్లో, వ్యక్తిత్వంలో నిజాయితీ పట్ల చాలా మందికి అతనంటే గౌరవం ఉంది. ఇది తన మొదటి కథల పుస్తకం. అదీ నా ఆసక్తికీ, అనాసక్తికీ కారణం. కవులుగా లబ్దప్రతిష్టులైనవాళ్ళు కథల్ని కథలుగా రాస్తారా, రాయగలరా వంటి సందేహాలు రావ్డం తప్పు కాదు. కవిత్వమంటే ఉండే మోజు మాటల్లో చెప్పలేనిది. అయినప్పటికీ కొందరు   రెండింటినీ చాలా గొప్పగా నిర్వహించారు. కవిత్వంలోంచి అలా కథలోకి కొత్తగా రంగప్రవేశం చేస్తున్నవాళ్ళలో తగుళ్ళ గోపాల్, అనిల్ డ్యానీ, నరేష్ కుమార్ సూఫీ, గూండ్ల వెంకట నారాయణ వంటి ప్రతిభావంతులెందరో కనిపిస్తారు. కవుల్ని కథ ఎందుకాకర్షిస్తుంది ? ఈ ‘మార్జినోళ్ళు’ కథల సంపుటి వెనుక ఎటువంటి ప్రేరణ దాగి ఉంది ? వంటి ఆలోచనలతో కథల్లోకి వెళ్ళాలనిపించింది. ‘ఈ కతల్ని రాసి బయట పడటమే ఈటిల్లోంచిక విముక్తి’ అన్నాడు గౌడ్. మొత్తం 12 కథలు.

రైల్వే ట్రాక్ పక్కన ఉండే మార్జిన్ జాగాలో అనధికారికంగా ఇళ్ళు వేసుకుని ఉండే వాళ్ళ జీవన దౌర్భల్యాన్ని చిత్రించిన కథ ‘మార్జినోళ్ళు’. ఉండటానికి కాసింత స్థలం లేని పేదల దుస్తితిని, వాళ్ళలో కావల్సిన చైతన్యాన్ని చర్చించిన కథ. నా కొడుకు లచ్చిమి కథ చాలా కదిలించే కథ. తప్పిపోయిన బర్రె వేరే బర్రెలతో కలసి తినడం తాగడం బ్రతకడం గురించిన కథ. కడుపుతో ఉన్న బర్రెకి కూడా కొన్ని కోరికలుంటాయేమో, దాన్ని ఈ నాల్రోజులూ ఇక్కడే సాటి బర్రెలతో కలసి ఉండనిద్దాం అన్న రమణమ్మ పాత్ర ఎంతో ఉదాత్తమైన విధంగా తీర్చి దిద్దాడు రచయిత. ఇటువంటి మానసిక స్తితి లేని కథ చదివినట్టుండదు. గౌడ్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో సురేంద్ర శీలం రాసిన ‘సూరిగాడు నల్లకోడి’ మేఘనాథ్రెడ్డి రాసిన ‘ఎర్ర దూడ’ లాంటి కథలు మనిషి తన తోటి ప్రాణులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ప్రవర్తిస్తున్నాడూ అన్న ఆలోచన కలిగిస్తాయి. ఇది కేవలం జాలి, దయ వంటి స్వభావ చిత్రణ మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే భౌతిక ప్రపంచంతో మనం ముడిపడి ఉన్న విధానం మన ప్రతి ఒక్కరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తోందో అంతర్మధనం కలిగించే కథ.

కరోనా కాలపు పెనుగులాట తెలిపే కథ ‘దిక్కు తెలీని పక్షులు’. తులశమ్మ, ఎంకటమ్మ అనే ఇద్దరు స్త్రీల జీవన సంఘర్షణ ఉంటుందీ కథలో. బ్రతుకు తీపి నేర్పే కథ. ఇప్పటికే చాలా మంది ఉపయోగించినప్పటికీ ఇందులో కొత్త శిల్ప ప్రయోగం ప్రయత్నం చేస్తాడు గౌడ్. సమాధి అన్న కథలో స్మశానాలు కూడా ఆక్రమణ కు గురైన విషయం చెబుతూ ఒక చోట ‘పోనీ గౌళ్ళ శ్మశానం కదా అంతా గౌండ్లోండే వేసుకున్నారా అంటే అదీ లేదు. అన్ని కులపోళ్ళూ దూరిపోయారు’ అంటుందొక వృద్దురాలు. మనకు వళ్ళు ఝల్లుమంటుంది. అంటే ఆక్రమణకు గురైతే గియితే ఎవరి శ్మశానం వారు కాకుండా, వేరొక కులం వాళ్ళు సైతం వచ్చేస్తున్నారు అనేది సారాంశం. ఆలాంటి ఆక్రమణ స్వభావంతో బాటు మనుషుల్లో కుల ప్రాధాన్యాన్ని తీసిపారేయలేని దౌర్భల్యం, చస్తే పూడ్చేందుకు ఇంత స్థలం కోల్పోతున్న దారుణం ఈ కథలో అర్థమవుతుంది. భిన్న కోణాల్ని తడిమిన కథ. అయితే మరింత స్పష్టత అవసరమనిపిస్తుంది.

రెటమతం మనిషి, ఆలోచనాత్మకమైన కథ. అన్నాదమ్ముళ్ళ మధ్య ఉన్న ఆదర్శానుబంధాల గురించిన కథ. ‘ప్రతి బండరాయి వెనుక ఒక నీటి చెలమ ఉంటుంది’ అంటాడొకచోట. అలాగే సంప్రదాయ భావజాలాన్ని నమ్మని ఒక భౌతికవాది ఆఖరుకి తద్విరుద్దంగా అన్ని కర్మలూ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు ప్రపంచం ఏమనుకున్నా అనవసరం అనుకుంటాడు. అతనిలో త్యాగం చూడమంటాడు రచయిత. దేన్ని పణంగా పెట్టి దేన్ని సాధిస్తున్నాడో ఆలోచిస్తే పాఠకులం మనం చాలా స్తిమిత పడతాం. అనుబంధాల కోసం ఇలాంటివెన్నైనా చేయొచ్చన్న రచయితని మనమూ సమర్థిస్తాం. వ్యవహార దక్షత ని తెలియజేసే కథ ‘వ్యవహారం’.

తిరనాళ కథలో ఒక ప్రేమజంటను కాపాడ్డం ఇతివృత్తం. వాళ్ళు ఒక నిర్జన ప్రదేశం చూసుకోవడం, అక్కడ అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకు కొందరు ప్రయత్నించడం వాళ్ళని తప్పించి ఆ ప్రేమ జంటను రక్షించడం కథ. చివర్లో ‘కుతి దీర్చుకోవడానికి ఈడకే రావాలా..చావుని వెతుక్కుంటూ’ అంటాడొక ముసలాయన. అంటే ? ఇలాంటివి జరిగే చోటు కన్నా ఇంకొక చోటకి వెళ్ళొచ్చుకదా ? అనే అర్థం రావడం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది.

నిస్సహాయ స్త్రీలపై పోలీసుల జులుంకు సంబంధించ కథ లీల. శరీర వ్యాపారంలో బ్రోకర్లకి కూడా హృదయం ఉంటుందని చెప్పే కథ. చదివిస్తుంది. పీటముడి అనే ఇంకొక కథలో ‘మగాడనే వాడు బాగా ఉంటేనే ఆడదానికి బతుకుబాగా ఉంటది’ అంటుంది నర్సమ్మ. నాగయ్య, లక్ష్మమ్మల మూగ కూతురు నర్మద చుట్టూ తిరిగే కథ. ‘మనమ్మాయిని ఇంట ఉంచేసి మూగమ్మాయి అని రాయించేశావనుకో’ అదే మంచిది లాభం అంటూ నాగయ్య చివరగా’ఇక పెళ్ళంటావా ఎవడో ఒకడు పెళ్ళాంచచ్చినోణ్ణి చూసి కట్టి పడెయ్యొచ్చులేవే’ అంటాడు వెకిలిగా. రచయిత ప్రవేశపెట్టిన ఇలాంటి పాత్రలు సమాజం లో ఉన్నాయనుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. సర్వ మానసిక శాస్త్రాలూ కళ్ళ ముందు మెదుల్తాయి. తండ్రికీ తల్లికీ నిజంగానే తేడా ఉంటుందన్న వాస్తవాన్ని రూఢీ చేసుకోవాలనిపిస్తుంది.

శ్రీనివాస్ ప్రకాశం జిల్లా వ్యవహారిక భాష ను కథల్లో గమనించవచ్చు. చాలా చోట్ల అతను మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అభివ్యక్తిలో మాత్రమే ‘రఫ్నెస్’ ఉండి కథ యొక్క అంతరార్థాన్ని సుకుమారంగా చెప్పడం బాగుంటుంది. అది అతని భాష కదా అని మనకి మనమే సర్దుకుంటాం. అక్కడి మాండలికాన్ని సందర్భానుసారంగా మరికాస్త సౌందర్యవంతంగా ఉపయోగించవచ్చు. గౌడ్ అందుకోసం ఉద్దేశ్య పూర్వకంగా ప్రయత్నించకపోవడం నచ్చుతుంది. గౌడ్ లో మౌలికంగా ఉన్న సుగుణాల ప్రతిఫలనం అతను ఏం రాసినా అందులో మనం గమనించవచ్చు. ఆ గుణ సంపన్నత్వం అతని చదువరితనంలో ఉంది. అవగాహన లోఉంది. వ్యక్తిత్వంలో ఉంది. మనం రాసే ఏ చిన్న వాక్యమైన వాటిని తప్పకుండా ప్రదర్శిస్తాయి. అవి దాగమన్నా దాగవు. ఈ విషయంలో గౌడ్ కవితకే నేను ఎక్కువ తల ఒగ్గుతాను. ఈ విషయంలో నన్నెవరూ తప్పనలేరనీ ఆశపడతాను.

శ్రీనివాస్ గౌడ్ కథలు సామాన్యుడి కథలు అనడంలో సందేహం లేదు. కానీ గౌడ్ కథాంశాలతో వ్యవహరించిన తీరులో కొంత అసందిగ్ధత  కనబడింది. కథాంశం చుట్టూ ఉన్న చిత్రణకు ఢోకా రాదు గానీ, ఆయా పాత్రల ప్రవర్తన అంతర్లీనంగా నిర్ధారిస్తున్న జీవన ప్రమాణాలు వర్తమాన దుర్మార్గ వ్యవహారికాన్ని ఉన్నదున్నట్టుగా ఆమోదించడం భయం కలిగిస్తుంది. అయితే ఆ పాత్రలు అందులోంచి బయట పడాలన్న తాపత్రయం చూపెడతాయి. పెనుగులాడతాయి కూడా. కఠిన వాస్తవం, భవిష్యదాశ రెండింటిలో ఏది ఎక్కువ పాఠకుల మనసుల్లో నాటుకుపోతుందో ఊహాతీతం కాదు. ఇక్కడే కథాంశ నిర్వహణ గుర్తుపెట్టుకోవాలేమో. కథ చదివేవాళ్ళంగా మనం ఏ కోణంలోంచి ఏ కోణాన్ని చూస్తాము ? అవసరానవసరాలతో నిమిత్తం లేకుండా ఏ దాన్ని సమర్థ వ్యతిరేకాంశాలుగా చర్చిస్తాము ? నిర్ధారణలు చేస్తునామా ? అది కరెక్టేనా ? వంటివి ప్రాధాన్యతని పొందుతాయి. సమాజం లో చాలా దుష్ట జీవన విధానాలున్నాయి. మొరటుదనముంది. వాటిని పక్కకి తోసెయ్యలేక చేస్తున్న వ్యక్తిత్వ పోరాటాలున్నాయి. ఆశావహ దృక్పథం ఉన్నది. వాటి సంయుక్త రూపానికి ఏ సృజన ప్రక్రియైనా బలాన్నివ్వాలి. గౌడ్ ఆ ప్రయత్నం లో ఎక్కడా విఫలం కాలేదు.

అయితే కథ ఎంతటి ప్రమాదకర ప్రక్రియో గౌడ్ కి ఇప్పుడు తప్పక తెలిసి ఉంటుంది. ఇప్పటికింకా కథలోంచి అతనికి విముక్తి లభించి ఉండదు. ఆ దిగ్బంధనంలోనే మరికొన్నాళ్ళు బ్రతుకక తప్పదు. కథా సాహిత్య చేర్పు లో అనీక్షికి కి మరొక మన:పూర్వక అభినందన.

మార్జినోళ్ళు (కథలు) : పి శ్రీనివాస్ గౌడ్, పేజీలు: 144, , ప్రతులకు: అన్వీక్షికి ప్రచురణలు , +91 9705972222, 9849888773

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పుస్తకం ఆసాంతం చక్కగా విశ్లేషించారు.. కథలన్నీ దేనికదే ప్రత్యేకమైన అంశాలతో రాయడం బాగుంది.. మీ విశ్లేషణ కథలు చదవాలన్న ఆసక్తిని కలిగించింది.. శ్రీనివాస్ గారికీ శ్రీరామ్ గారికీ అభినందనలు..! తల్లి వేరు తండ్రి వేరు ముమ్మాటికీ.. ఆ మాట పట్టుకోవడం బాగుంది

  • మీ సమీక్ష చాలా ఆసక్తిగా సాగింది. అభినందనలు

  • నా కొడుకు లచ్చిమి కథ మాత్రం చదివాను మిగితా కథలు కూడా చదవాలనే ఆసక్తి కలిగింది. శ్రీరామ్ సర్ సమీక్ష వాస్తవంగా వుంది సమీక్ష లో అనేక కొత్త విషయాలను తెలిపారు. శ్రీనివాస్ గారికి సమీక్షకులకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు