కడలి ఒడ్డున కవిత్వ రేవతి

కుట్టి రేవతికి బాగా పేరు తెచ్చిన కవిత ములైగళ్.  కొందరు ఈ  కవయిత్రి ని చెంప పగల కొట్టాలి అంటే, కొందరు ఆమె కవిత్వ సంపుటి చెన్నై మౌంట్ రోడ్ లో తగుల బెట్టాలన్నారు.

కే  సముద్రం  విశాఖ, చెన్నై తీరాలను తాకుతూ  అలజడి చేస్తూ ఉంటుంది. ఫాల్గుణ మాస కృష్ణ పక్షం. సాయంసంధ్య. అటు  సబ్మెరీన్, ఇటుసరికొత్త  విమాన  మ్యూజియం. దూరంగా కరి ప్రమాణంలో కదలని కొండ, దగ్గరలో నీటి  అడుగు ఇసుక మేటలు  తీస్తున్న తవ్వోడ –  సముద్రం మీద కవిత్వం రాసిన తమిళ కవయిత్రి కుట్టి రేవతి మిత్రులను పలకరిస్తూ కలుపుగోలుగా స్వాగతం పలికింది స్వీట్ మేజిక్ గుమ్మంలో –  డాక్టర్ మాటూరి శ్రీనివాస్, రేవతి,  మరో ఇద్దరు   లఘు చిత్రాల దర్శక నిర్మాతలు  ఉండగా, వెళ్లారు  రామతీర్థ,  జగద్ధాత్రి.

కవిత్వం నా రెండో ప్రాణం అంటూ రేవతి, మనం  ప్రజల మాటలే రాస్తాము, అది మన కవిత్వం ఎందుకయ్యింది, అది ప్రజల వాక్కు, అంటూ ఆమె కెరటాలు కెరటాలుగా  కవిత్వ తరంగాలను విస్తరించింది.  తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం, అభిప్రాయ ప్రకటనం తమిళంలోకన్నా ముందే మొదలు అయ్యింది.  కుట్టి రేవతికి బాగా పేరు తెచ్చిన కవిత ములైగళ్.  ఎనిమిది  కవితా  సంపుటాలు  గత పద్దెనిమిదేళ్ళలో తెచ్చిన  విలక్షణ స్వరం కుట్టి రేవతి. ఆమె  2002లో ప్రచురించిన   రొమ్ములు,  (ములైగళ్ ) కవిత్వ  సంపుటి  పట్ల,   సంప్రదాయ  తమిళ సమాజం తీవ్రంగా  అభ్యంతరాలు తెలిపింది. కొందరు ఈ  కవయిత్రి ని చెంప పగల కొట్టాలి అంటే, కొందరు ఈ   సంపుటి చెన్నై మౌంట్ రోడ్ లో తగుల బెట్టాలన్నారు. ఆమె  స్త్రీ వక్షోజాలు కేవలం  ప్రదర్శనా వస్తువులుగా కాక, నివాస బద్ధ వాస్తవం గా  చూసే  ప్రయత్నమే తన కవితలో చేశాను అని చెప్తూ, కొంత వివాదం ఊహించినా, ఇలా ముదిరిన పద్ధతి  వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు.  ఎవరు స్త్రీ శరీరానికి హక్కుదారు అనే  విషయాన్ని చర్చలో మరింత ముందుకు తీసుకువెళ్తూ, ఆమె “మాటలతో నేను నా శరీరాన్ని నేస్తాను” అని ఒక వ్యాసం రాశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు.  రేవతి వ్యాసాల్లో, కథల్లో  స్త్రీ ఆత్మగౌరవ  ప్రయాస, ఆమె ఆలోచనలకు ఇవ్వాల్సిన  గుర్తింపు, విలువ గురించి ప్రస్తావిత చర్చలు ఉంటాయి.

నిజానికి ములైగళ్  కవిత చిన్నది. బహుముఖీన చిత్రణగా తోచదు, ఎందుకంటే, అప్పటికే మనం తెలుగులో అంతకన్నా పెద్ద కాన్వాస్  మీద వచ్చిన  కొండేపూడి నిర్మల తెలుగు కవిత “హృదయానికి బహువచనం” చదివి ఉన్నాము కాబట్టి. స్త్రీకి భిన్న  వయో దశల్లో  రొమ్ముల పట్ల ఉండే భావన,  ఆధునిక  కవిత్వ ధర్మం పాటిస్తూ, నిర్మల రాసిన కవిత పలు స్తరాల్లో  నిలుస్తుంది.  తెలుగు  సాహిత్య, లేదా పౌర సమాజం నిర్మలతో విభేదించి  వాదులాటకు దిగ లేదు.  రేవతికి తమిళ సమాజంలో వచ్చిన నెగటివ్  ఆదరణ కన్నా తెలుగు సమాజంలో నిర్మల పొందిన  గౌరవం  విలువైనది. ఇలా సాగుతుంది ములైగళ్ కవిత.

ములైగళ్ (రొమ్ములు)

రొమ్ములు నీటి  బుడగలే

చిత్తడి నేలల్లో  ఎగిసేవి
అచ్చెరువుగా గమనించాను

భద్రంగా చూసుకున్నాను

మెల్లగా ఉప్పొంగి  విరిసే వాటిని

నా యవ్వన రుతు అంచుల్లో
ఎవరితో ఏమీ మాట్లాడక

అవి నాతోనే  నిత్యం పాటలు పాడుతాయి

ప్రేమ, పులకింత, ఎద కోతల గురించి

మారే నా రుతువుల శిశు సదనాలకు

ఎప్పుడూ మర్చిపోలేదవి, విఫలం కాలేదు కూడా

బిరుసెక్కి కాంక్షా భరితమవడంలో

తపసులో ఉండగా అవి పుంజుకుంటాయి

తెంచుకు పోవడానికన్నట్టు

కోర్కెల  తాడు లాగుడు లో ఎగుస్తాయవి

సంగీతానంద తారాస్థాయి జ్ఞాపకాల్లో
కౌగిళ్ళ ఒత్తిళ్ళ నుంచి అవి ప్రేమ సారాన్ని

స్వేదనం ద్వారా నిలబెట్టుకుంటాయి

ప్రసవ  దిగ్భ్రాంతిలో  నెత్తుటిని పాలుగా మారుస్తాయి.

ఎప్పటికీ తుడిచెయ్యలేని ఫలించని ప్రేమల రెండు కన్నీటి బొట్లుగా

అవి నిండా నిండి దుఖంలో ఉన్నట్టుగా  పొర్లి పోతాయి.

తెలుగులో స్త్రీ వాద  కవిత్వం,  ఇంకా సంపన్నంగా,  బలమైన అభ్యంతరాలను  నిలిపింది.  మన కవయిత్రుల కూటమి నీలి మేఘాలను తాకింది. అయితే   కుట్టి రేవతి  గత పద్దెనిమిదేళ్లుగా రాస్తూ, తదితర తమిళ  సమభావనల  కవయిత్రుల కోసం, తన కోసం,  స్త్రీల అస్తిత్వ ప్రాధాన్యత  విషయంగా “పనికుడమ్” (ఉమ్మనీరు)   పేరిట  ఒక స్త్రీ వాద  పత్రిక కూడా, పదకొండు సంచికలు   ఇంతవరకూ తెచ్చారు.  సామాజిక మాధ్యమాలు, డాక్యుమెంటరీలు, చిత్ర నిర్మాణం  ప్రస్తుతం ఈ కవయిత్రి ఎక్కువగా శ్రద్ధ పెడుతున్న రంగాలు. సాహిత్య అకాడెమీ  గ్రాంట్ తో దేశంలో  వివిధ  సాహితీ వేత్తలను కలిసే  ప్రాజెక్ట్ ఈమె  విజయవంతంగా  నిర్వహించారు. ఆ  ప్రణాళికలో భాగంగానే ఆమె  బెంగాల్ లో మహా శ్వేతను  కలిశారు, కేరళ లో కమలా దాస్ పై ఒక డాక్యుమెంటరీ తీశారు.  మహాశ్వేత తనకు ప్రతిబంధకాలైన ఎన్నో   సమాజ గుర్తింపులను చెరిపేసుకుని , ప్రజల పక్షాన నిలిచిన  ఒక మహా శక్తి గా రేవతి  అభివర్ణిస్తారు. కమలా దాస్ తో డాక్యుమెంటరీ కోసం కలిసి పని చేసినా, మహాశ్వేతా దేవి సాహిత్య పరిధి, లోక దృష్టి చాలా  విస్తృతమైనవి అని  చెప్తారు.  శ్రీలంక తమిళ కవి ప్రమీల్ తనను ప్రభావితం చేసిన   కవి అని తెలిపారు.

తమిళ  సంప్రదాయ సాహిత్యంలో కన్నగి పాత్రకి గల   ప్రజాదరణ ఎరిగి ఆమె, నేడు కాలగర్భంలో కలిసిపోయిన,   అలనాటి  చారిత్రక నగరం పూమ్పహార్ నుంచి మధురై వరకూ కన్నగి చేసిన యాత్ర  తానొక డాక్యుమెంటరీగా కూడా తీశాను అని చెప్పారు.   “శరీరం  పవిత్రతల కట్టుబాట్లతోనూ, హృదయంలో  మధురై   నగరాన్ని  తగులబెట్టగల ఆగ్రహంతోనూ ఉన్నది కన్నగి” అంటూ ఒక  కవిత్వ ఫించాన్ని విస్తరింప చేస్తుంది  రేవతి.  “నా భాషను నేను  కేవలం  స్త్రీ  శరీరం, ఆత్మలను కట్టి  ఉంచుతున్న శక్తులను దెబ్బ తీయడానికే  అలా వాడుతాను” అనే ఈ కవయిత్రి, రొమ్ములు,  లైంగికావయవం, స్వయంతృప్తి వంటి మాటలు  కవితల్లో  ప్రతీకలుగా వాడినందుకు, నేరుగా ప్రస్తావించినందుకు,   తమిళ  సంప్రదాయ సమాజం ఈమె  కవిత్వాన్ని పక్కన పెట్టగా, తమకు కూడా ఒక  వాహిక కావాలి కనుక  ‘పనికుడమ్’  పేరిట  పత్రిక తెస్తున్నాము అని, ఎందరో ప్రస్తుత  తమిళ  స్త్రీ అస్తిత్వ  రచనలు చేస్తున్న వారు ఈ పత్రిక ద్వారానే   తమిళ పాఠకులకు మొదటగా  పరిచయం అయ్యారని  చెప్పింది.  సముద్రం మీద తాను రాసిన కవిత్వం, సముద్రం పక్కనే కూచుని రామతీర్థ తెలుగు అనువాదం వినిపిస్తూ ఉంటే, కడలి కెరటంలా సంబరపడి పోయింది.  ” మహిళా హక్కుల రచనలు చేసే వారిపై తమిళ  పురుషాధిక్య సమాజంలో చిన్నచూపు,  హేళన ఎక్కువ. వారు ఏమైనా రాయవచ్చు మాకు  అవమానకరంగా, అందరూ అది చదివి  సంతోషిస్తారు. ఇలాంటివి ఎన్నో చూసాము” అని  తెలిపింది  రేవతి.

డాక్యుమెంటరీలే కాదు, మంచి కథలు కూడా సినిమాలుగా తీయవచ్చు, ఆ దిశగా ఆలోచించారా, అంటే, “మీరు నెమ్మదిగా మాట్లాడుతూనే  నా ముందర ఎన్నో కొత్త  లక్ష్యాలను ఉంచుతున్నారు, ఎంతో అభిమానం ఉంటే తప్ప, మా తమిళ  సాహిత్యలోకంలో కూడా, ఇలా ప్రేమ, శ్రద్ధ,  పట్టించుకోవడం  సాధ్యం కాదు” అంటూ, ఆమె కవిత్వ తెలుగు రూపాలతో పలకరించినందుకు గుర్తింపుగా, మనం ముందు ముందు కలసి పని చేద్దాం అన్నది కుట్టి రేవతి.   అనంతాంబరపు  నీలి నీడల జగతి  కనులను, రామతీర్థ కవితానువాదాలనూ, డాక్టర్ శ్రీనివాస్ స్నేహశీలతను అబ్బురంగా  స్వీకరించిన కుట్టి రేవతి  ఎనిమిది కవితా సంపుటాలు, ఆరు డాక్యుమెంటరీలు, తీసి,  తమిళ ప్రధాన  స్రవంతి  సినిమాలో కొంత కృషి చేస్తున్నారు.  సిద్ధ వైద్యంలో డాక్టరేట్ గల  మహిళ, కుట్టి రేవతి  తాను సముద్రం మీద  తమిళంలో  రాసిన ఈ కవిత తెలుగులో వినిపిస్తేనే –  అంతలా సంబరపడ్డది.  సముద్రం ఆది తాయి అన్నది ఆమె – ( ఆది తాయి అంటే  తొలి తల్లి అని అర్థం).  నీటి  నుంచి  నేల పైకి ప్రాణం ప్రయాణించిందని  సైన్స్ చెప్పడం  విన్నాము  అదే  కవి చెప్తే – ఇలా ఉంటుంది.

ఆది తాయి (తొలి తల్లి)

మన ప్రాచీన మాతృమూర్తి
కడలి రూపం దాల్చింది
పైకెగుస్తూ న్యాయం కోసం ఆమె ఆవేశం
ఎగిసే అలలయ్యింది
గుండెలు  బాదుకుంటూ
ఆమె తన పాటలు రాసింది
శరీరాన్ని ఓ శిలువ లాగా మోసుకెళ్లింది
మానవాళి మెరుగైన దశ కోసమై
భూపాత్రలోకి ఒదిగి
ఆమె  ఎండి ఉప్పయినా అయింది
లేదూ సురగా మారింది
మళ్ళీ ఆమె మూలికా ఔషధమయ్యింది
రాయబడని చరిత్రల జ్ఞాపకాలను  కలయబెడుతూ
తను తీసుకెళ్లే నిప్పుగిన్నెలో
కొన మంటల పైన ప్రతి దినాన్నీ సృష్టిస్తుందామె
ఓటములను నిత్యం ప్రేమిస్తుంది
తన పిల్లలను అలలుగా మార్చి
పంపుతుందామె ఒడ్డున ఆడుకునేందుకు
నదీ  శయ్యలు  ఆమె చీరంచులై  పైకుబుకుతుంటాయి
ఆమె వెతలన్నీ అక్కడ సముద్రపు నాచు  రంగుదేలి  ఉంటాయి
అక్కడ మన తొలి తల్లి
చేప రూపాన  ఇంకా తచ్చాడుతూ ఉంటుంది

జగద్ధాత్రి

అనేక భాషల సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకోవడమే కాకుండా అంతే ఇష్టంగా రాసే జగద్ధాత్రి సాహిత్య వ్యాసాల మీద ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారు. తెలుగులోకి ఇతర భాషా సాహిత్యాల వెలుగుని ప్రసరిస్తున్నారు.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరిచయం బాగుంది madam..

    రొమ్ములు లో –తప్పు గా అంటూ ఏమి లేదు
    యింకా కొన్ని గేయాల ను పరిచయం చేయండి

    —————————-
    reddy

  • కుట్టి రేవతి గారి గురించి ఇదివరకే చదివాను.. రొమ్ములు కవిత కూడా. ఈ కవితలో తమిళుల్ని అంతలా కోపోద్రిక్తుల్ని చేసిన అంశమేంటో అర్థమవ్వదు నాకు. రేవతి గారిలాగే తమిళనాడు నుంచి స్త్రీవాదాన్ని బలంగా వినిపిస్తున్న ఇంకొక గొంతుక మీనా కందసామి. Ofcourse, ఆమె ఇంగ్లీషులో రాస్తున్నారు.. Nice to read this Jagati madam .. thank you ☺

  • జగద్ధాత్రి చాలా బాగా రాసారు. రెండు కవితల అనువాదాలు కూడా బాగున్నాయి. ఐతే మన స్త్రీవాద కవులు చాలా ముందున్నారు. ఆమె రొమ్ముల్ని రొమాంటిసైజ్ చేయటమే ఎక్కువగా కనిపించింది. అందులో దోషమేమీ కాదు కానీ రొమ్ములతో అసోసియేట్ అయిన అనేకానేక మానవీయ, అమానవీయ కోణాలున్నాయి. మన కొండేపూడి నిర్మల రాసిన కవిత మహాద్భుతం అంటే మహాద్భుతం! కవిత్వంలో అంబ పలకటమంటే అదే. రేవతి సముద్రం మీద రాసిన కవిత హృద్యంగా వుంది.

  • జగ్స్..మంచి రచయిత్రిని చక్కగా పరిచయం చేశావు.

  • రొమ్ములు కవిత పావురం విడిచిన రెక్కలా ఎంత బాగుందో.రేవతి గారికి, సారంగా కు అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు