కకూన్ బ్రేకర్స్

…ఒకవేళ ఆల్రెడీ తెలిసిపోయిందా! తెలిసీనా తెలియనట్లు ఉంటోందా? అంతా నా నోటితోనే చెప్పించాలని చూస్తోందా? నిజంగా భయమేస్తోంది ఆమెనలా చూస్తే ఇప్పుడు.

హాయిగా ఉంది లోపల. తెల్లటి వెచ్చటి పొరల మధ్య ఇరుక్కుపోతూ పోతున్నప్పుడేదో చిత్రమైన హాయి. అసలు నేనీ గూడెందుకు కట్టినట్టు? దీన్ని కట్టడమే నా జీవిత లక్ష్యమైనట్టు, అసలు దీని కోసమే నేను పుట్టినట్టు, దొరికిన ఆకునల్లా ఆబగా తింటూ, హడావిడిగా, ఊపిరైనా తీసుకోకుండా, అంత వెర్రిగా కట్టుకుంటూ పోయానేంటి దీన్ని?

నిగూఢమైన రహస్యాన్నేదో దాస్తూ, నాతో ఏదో సాధించుకుంటోంది జీవితం. ఏంటా రహస్యం? ఏమో…మగతగా ఉంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇదేనా నా సమాధి? ఇక్కడేనా నా చావు? ఏమో ఈ చావే మంచిదేమో! ఆ పసుపు ముక్కు గోరింకొచ్చి పొడుచుకు తినడం కన్నా గొప్ప చావే, ఆ నల్ల కందిరీగలు చుట్టూ చేరి సూదుల్లాంటి ముక్కులతో గుచ్చి చంపడం కన్నా అద్భుతమైన చావే! ఏదేమైనా, నా సమాధిని నేనే కట్టుకోవడమేంటో అర్థం కావట్లేదు. లేదు, జీవితం ఇంకా నా కోసం ఏదో మిగిల్చే ఉంటుంది, ఏదో ఓ కొత్త మలుపు నా కోసం తయారు చేసే ఉంటుంది. కానీ అదేమీ మాటల్లో చెప్పదే. చేతల్లో తప్ప.

ఎప్పుడు తెలుస్తుందో?…ఆ…ఎక్కడ తెలుస్తుందో?…ఆ…ఛ, ఆవులింతలు…చీకటి.

*

చీకటిగా ఉంది రూమంతా. నా డెస్క్ మిర్రర్ పక్కన చిన్నగా వెలుగుతున్న బెడ్ ల్యాంప్. సెఫోరాలో తెచ్చుకున్న రెడ్ గ్లాసీ లిప్ స్టిక్ ని మెత్తగా పెదాల మీద స్లైడ్ చేస్తున్నాను. మిర్రర్ లో నన్ను చూస్తున్న నా కళ్ళే, పెదాలకంటే ఎక్కువగా మెరుస్తున్నాయి. సైడ్ కి తిరిగి చూసుకున్నాను. మాల్ లో కొన్న పింక్ మినీ, టైట్ గా నా కర్వ్స్ ని ఎలివేట్ చేస్తోంది. దాని కింద నుండి స్మూత్ గా బైటికొస్తున్న తెల్లటి థైస్. అద్దం వైపుకి వంగి మరోసారి కప్స్ పైకి పుష్ చేసుకున్నాను. ఒళ్లంతా ఎలెక్ట్రిసిటీ. ఏది ముట్టుకున్నా ఏదో థ్రిల్! నన్నిలా చూస్తే లియామ్ ఏమైపోతాడో. ఆ ఆలోచనతోనే సిగ్గొచ్చి గట్టిగా అతుక్కుంది మొహం మీద.

హెయిర్ కర్లర్ తో మరోసారి కర్ల్స్ చేసుకుంటున్నాను. మెల్లగా తలుపు బైట అలికిడి. ఊపిరాపేశాను.

డోర్ లాక్ చేసే ఉంది.

‘టక్ టక్’

“తలుపు తెరూ! జస్ట్ ఓపెన్ ది డోర్.” అమ్మ గొంతు.

నో! అమ్మ నన్నిలా చూస్తే, డోర్ బ్రేక్ చేసుకోని లోపలికొచ్చేస్తే!

ఆ తలుపెప్పుడూ అంత భయపెట్టలేదు నన్ను.

“బిజీ మా, క్లాస్ వర్క్ చేస్కుంటున్నా.” అరిచా.

నమ్మదు.

“ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్?”

టెన్త్ గ్రేడ్ స్టార్ట్ నుండీ ఆమె వేస్తున్న ప్రశ్న.

“ఆల్ గుడ్ మా, యూ గో అండ్ స్లీప్.”

మౌనం. తలుపుకింద నీడ కదల్లేదు. సన్నటి నిట్టూర్పు. మెల్లగా కాళ్ళు వెనక్కి జరుగుతున్న సౌండ్.

“గుడ్ నైట్ రోహన్!”

“గుడ్ నైట్ మా”

“గో టు బెడ్ బేటా!”

అమ్మ వెళ్లిపోయింది కానీ ‘బేటా’ మాత్రం ఎగురుతూ రూంలోకొచ్చింది. మిర్రర్లో నన్నలా చూసి వెక్కిరింతలా నవ్వింది.

తల మీద ఆ విగ్గేంటి? కళ్ళకా మస్కారా ఏంటి? షోల్డర్స్ మీద ఆ స్ట్రాప్సేంటి? కింద ఆ హై హీల్సేంటి?

చూపుల్లోనే అవమానాన్ని నింపుకోనొచ్చిందది. నా దగ్గర సమాధానం లేదు. నా హెయిర్ కర్లర్ మీద పడ్డాయిప్పుడు దాని కళ్ళు. భయమేసింది. ‘విగ్గుకి కర్ల్స్ పెడ్తున్నావా?!’ పొట్ట పట్టుకుని మరీ నవ్వుతోందిప్పుడది.

లైట్ ఆపేశాను క్విక్ గా.

చిమ్మ చీకటి.

దాని నవ్వాగిపోయింది.

ధైర్యంగా ఉంది నాకు.

*

భయంగా ఉంది నాకు. ఒళ్ళంతా నొక్కుకుపొతోంది. బలవంతంగా కళ్లు తెరిచాను. వంకర్లు తిప్పేస్తున్న నొప్పి.

ఎక్కడున్నాన్నేను? అసలెవర్ని నేను? తల కొద్దిగా కదిపి చుట్టూ చూశాను. ఏదో చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడుతున్నాను. ఇంతకు ముందు చూసినట్టే ఉంది అంతా. ఇదో కొత్త జన్మా? నా పాత జన్మ జ్ఞాపకాలింకా మిగిలున్నాయా? కానీ ఆ చెట్టు ఆకులూ, పువ్వులూ ఇంత బలంగా గుర్తొస్తున్నాయేంటి? లేదు. ఏదో జరిగింది. నాకర్థంకానిదేదో నాకు జరిగింది.

హఠాత్తుగా ఒంట్లో ఓ బలమైన కదలిక. పైకి చూస్తే మతిపోయింది. రెక్కలు! నా ఒంటిని చీల్చుకుంటూ బైటికొస్తున్న రెక్కలు. ద్రోహం! చుట్టూ ఉన్న గూడుని టకటకా కొడుతున్నాయవి. కొడుతూనే ఉన్నాయవి. గూడుని గట్టిగా కొడితే కానీ వాటిల్లోకి బలం రావట్లేదు, కానీ దాన్ని గట్టిగా కొట్టాలంటే వాటికి బలం కావాలి! మొత్తానికి సాధించాయి. మెల్లగా గూడుని విడిపించుకుని బైటపడ్డాయి. పెద్ద పెద్ద నల్లటి మచ్చలున్న ఎర్రటి రెక్కలు. గుండె అదురుతోంది. అసహ్యంగా ఉంది వాటినలా చూస్తుంటే.  అసలు నా ఉనికినీ, గగుర్పాటునీ గమనించినట్టే లేవవి. వాటి పనవి చేసుకుపోతూ, పైకెగరడానికి సిద్ధమైపోతున్నాయి. నన్ను నన్ను కాకుండా చెయ్యడానికి సిద్ధమైపోతున్నాయి. నా నాలుగు కాళ్లతో ఆ రెక్కల్ని ఒంటి నుండి తోసేయ్యడానికి ప్రయత్నించాను. సాధ్యం కాలేదు. గట్టిగా పీకడానికి ప్రయత్నించాను. వల్ల కాలేదు. ఓడిపోయాను. శాశ్వతంగా మనం కలిసే బతకాలని నిర్థారించాయవి. ఇదేనా ఇన్నాళ్ళూ జీవితం నా నుండి దాచిన రహస్యం? ఓ ప్రాణి శరీరాన్ని కేవలం పరకాయ ప్రవేశం కోసం మాత్రమే తయారు చేయడం! దీనికన్నా సృష్టిలో మరో గొప్ప మోసం ఉండదేమో. ఈ బతుకు బతికేకన్నా ఆ గూడులోనే చనిపోయినా, ఏ పక్షో చటుక్కున తినేసినా బావుండేదే!

ఇప్పుడీ మొహం పెట్టుకుని నేను బైటికెలా వెళ్ళడం?

కానీ ఈ నేను ఆ నేనుని కాదు కదా, ఎందుకూ భయం?

కానీ నేనింకా ఆ నేనే అనే నా మెదడు చెబుతోందే?

పిచ్చీ, మెదడునెవడు చూస్తాడు?

నేను చూస్తాను.

చచ్చినా ఇలా ఎవరికీ కనపడను.

*

ఎవరికీ కనపడకుండా ఎన్నేళ్లు చావాలిలా?

బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర ఇబ్బందిగా కదులుతున్నాను. ‘టక్ టక్’ మని లోపలినుండి శబ్దం. ‘చెప్పు’. మలుపులు తిరుగుతూ నరాలని పట్టుకుని పైకొస్తున్న శబ్దం. దానికే శక్తుంటే అమాంతం నన్ను నిలువునా చీల్చుకుని మరీ బైటికొచ్చే శబ్దం. ‘చెప్పు‘. గొంతు నొక్కేశాను. దానికున్న ఒకే ఒక్క దారి. మూసే ఉంచానిన్నాళ్లూ. అది తిరగబడింది, చివరికీ దీక్షకి దిగింది. నోరు తెరిచే వరకూ ఆగని శబ్ద దీక్ష!

ఎదురుగా టేబుల్ మీద నాన్న మొబైల్ ఫోన్ చూస్తూ తింటున్నారు. జాగ్రత్తగా నాతో కళ్ళు కలపకుండా.  చుట్టుపక్కల అమ్మ లేదు.

“నానా…”

తలెగరేశారు ఏంటన్నట్టు.

“నేను…స్కూల్లో…లియామ్ తో…నో…లియామ్ అంటే…“

“యా లియామ్, ఐ నో హిమ్. బ్యాడ్మింటన్లో నీ పార్ట్నర్ రైట్?

తలూపాను అవునన్నట్టు. బ్యాడ్మింటన్లో!

“రోహన్, డోంట్ హెసిటేట్ ఫర్ ఎనీథింగ్, గో అహేడ్, జస్ట్ డూ గ్రేట్!”

నవ్వాను. సగం తలూపుతూ.

‘డూ యువర్ బెస్ట్’ అనలేఎప్పుడూ నాన్న. గొప్పగా మాత్రమే బతకాలి ఆయనకి. నో అదర్ వే టు లివ్. ఆయనతో ఇప్పుడు నా కొత్త అస్తిత్వపు గొప్పతనం గురించి వాదించలేను. అసలు అస్తిత్వంలో ఏం గొప్పతనముంది కనక వాదించడానికి? ఆయన మగాడు, అమ్మ ఆడది. నేనూ ఆడదాన్నే, కానీ వాళ్ళు ట్రాన్స్ అంటారు. అంతే కదా! పుట్టుకల్లో ఎక్కువతక్కువలేముంటాయ్? నాకే నవ్వొచ్చింది ఆ ఆలోచనకి. ఎక్కువతక్కువలన్నీ పుట్టుకతోనే కదా వస్తోందసలు!

అమ్మొచ్చింది. నా వైపు అనుమానంగా చూడటం ఎక్కువైందీ మధ్య. కానీ కళ్ళు కలవకుండా పోవు కదా ఎప్పుడోప్పుడు. కలిసినప్పుడల్లా చూపు తిప్పుతోంది. ఇదో నరకం. అమ్మకి నా గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నా మొహంలో చిన్న చిన్న విరుపులనే పట్టుకోగలిగిన ఆమెకి, ఇంత పెద్ద విషయం తెలీదా? తెలీలేదా?…

…ఒకవేళ ఆల్రెడీ తెలిసిపోయిందా! తెలిసీనా తెలియనట్లు ఉంటోందా? అంతా నా నోటితోనే చెప్పించాలని చూస్తోందా? నిజంగా భయమేస్తోంది ఆమెనలా చూస్తే ఇప్పుడు.

వీళ్ళతో కాదు. ముందు షెల్లీతోనే చెప్పాలి స్కూల్లో. నన్ను జడ్జ్ చెయ్యకుండా ఎవరైనా వింటారంటే అదొక్కటే.

బ్యాగ్ తీసుకుని బైటికి నడిచాను.

*

సరాసరి తుమ్మెద దగ్గరికెళ్లి వాలాను. భయపడి ఆకు కింద దాక్కుందది.

“నేను. గొంగళినే.” అన్నాను పెదాల మీద నవ్వు తెచ్చుకుంటూ.

“ఛ, నువ్వు గొంగళివేంటి, గాల్లో ఎగురుతూ?” అందది వికారంగా మొహం పెట్టి.

“సరిగ్గా చూడు నేనే.” అన్నాను కళ్ళు పెద్దవి చేస్తూ.

పోల్చుకున్నట్టుందది. “అవునే అలానే ఉన్నావ్. కానీ నేన్నమ్మను. ఇదంతా మోసం!”

“ఏది మోసం?” అన్నా దెబ్బతిన్నట్టు.

“ఏమో. ఇదివరకు నువ్వు గొంగళివన్నది మోసం కావచ్చు, ఇప్పుడీ రంగురంగుల రూపం మోసం కావచ్చు, అసలు నీ జీవితమే ఓ మోసం కావచ్చు.” ఎగిరిపోయింది.

నాకు మాట రాలేదు. గొంతులోంచి కూడుకుంటూ ఓ చిన్న శబ్దాన్ని బైటికి తీయాలన్నా బలం చాలట్లేదు. నిస్సత్తువ ఆవరిస్తోంది. రెక్కలే పట్టుకుని వెనక్కి తిప్పాయి నన్ను. గాల్లోకెగరేసి అలా తీసుకుపోయాయి.

గుబులుగా అలా ఎగురుతూ చెట్టుకిందున్న చిత్తడి నేల మీద వాలాను. ఎదురుగా పాకుతూ వస్తున్నాడు వానపాముగాడు. నన్ను చూసి చప్పున ఆగి, చనిపోయినట్టు ముడుచుకుపోయాడు వాడు.

“ఒరేయ్ నేన్రా గొంగళిని.” అన్నాను. ఆ నేల మీదే ఎన్నో సార్లు ఆడుకున్నాం మేము.

వాడు నింపాదిగా చూసి “అవునే గొంగళిలానే ఉన్నావ్! ఇలా మారిపోయావేంటి సీతా లా?”

వాడలా పైకి అనేసరికి ఒక్కసారిగా దిగులు కమ్ముకుంది. ‘నేను సీతా నా!’

“తె…తెలీదురా. నేనిలా అవ్వాలనుకోలేదు.”

“ఆహా! నువ్వేవర్నీ అడక్కపోయినా, పిలిచి మరీ నీకీ వరమిచ్చారా అయితే?”

ఏమైంది వీడికి? ఇది వరమా?

“వరంగా కాదురా, బలవంతంగా.” అన్నాను తాత్వికంగా.

“చిన్నప్పటి నుంచీ కలిసి తిరిగామే, నాదీ నీదీ ఒకటే జాతనుకున్నా… ఇంత మోసం చేస్తావనుకోలేదు.” అన్నాడు వాడు తల వంచి వెనక్కి పాకిపోతూ.

వాడు చివరి సారి చూసిన చూపుకి అప్పటి దాకా ఏ మూలో ఉన్న ధైర్యం కాస్తా ఎగిరిపోయింది.

లోకానికి అర్థం కానని తెలుస్తోంది కానీ ఇంతటి ఛీత్కారం నేనూహించలేదు. దీనికోసమా అంతలా పోరాడి మరీ ఆ గూడు చీల్చుకుని బైటికొచ్చింది?

చివరి ఆశగా, చీమలగుట్ట దగ్గర వాలాను వెళ్లి. నా చుట్టూ గుంపులు గుంపులుగా చేరాయవి.

“ఏరా, గుర్తుపట్టారా? నేను గొంగళిని…అదే సీతాని…” తడబడ్డాను.

ఒకరిమొహాలొకరు చూసుకున్నాయవి అయోమయంగా.

“అదేంట్రా, ఈ చెట్టు పైన, పెద్ద కొమ్మ మీదుండే వాడినీ, మీరు నా చుట్టూ తిరిగే వాళ్ళూ…”

అవునన్నట్టు తలలూపాయవి సందేహంగా. అంతలో ఓ పెద్ద చీమ ముందుకొచ్చి

“ఏదీ గొంగళిగా ఉన్నప్పుడు ఒక తియ్యటి రసం ఇచ్చేవాడివి కదా, అదివ్వు చూద్దాం.” అన్నాడు.

తలలు గట్టిగా ఊపాయవి ఇప్పుడు.

‘ఓస్ అంతే కదా’ అనుకుంటూ గట్టిగా గొంతు బిగించాను, నడుము అటూ ఇటూ నొక్కాను, రెక్కలు టపపటా కొట్టాను. చుక్క రాలలేదు బైటికి. అసలప్పుడు ఆ రసం ఎలా ఇచ్చేవాడినో కూడా గుర్తు రావట్లేదు. ఆశగా చూశాయవి కాసేపు. మెల్లగా మొహం తిప్పుకుని వెళ్లిపోతున్నాయి.

“ఆగండ్రా ఇస్తాను… వెళ్ళద్దు…”, ఇంకా బలంగా నొక్కాను, ఒంట్లో అన్ని భాగాలూ తడిమాను. తెలియలేదు.

రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నానలా కొన్ని గంటల దాకా. మొహమంతా కన్నీళ్ళతో నిండిపోయింది. చివరికా కన్నీళ్లని కూడా వాటి ముందు ధారగా పోశాను. దగ్గరికి కూడా రాలేదవి.

గొంగళిగా పుట్టినప్పటినుండే అనుమానంగా ఉండేది నా ఒళ్ళు నన్ను మోసగిస్తోందని, ప్రపంచాన్ని తప్పు దారి పట్టిస్తోందని. ఇప్పుడు, ఇన్నాళ్ళకి బైటపెట్టిందది ఇలా దాని విశ్వరూపాన్ని. కనీసం అది నన్నిలా పూర్తిగా మార్చకపోయినా బావుండేది.

వాటి బారుల్లోకి అవి పోయి, ఏమీ జరగనట్టు తిరుగుతున్న చీమల్ని చూశాను. ఏదో చేస్తేనో, ఎలాగో ఉంటేనే తప్ప గుర్తించని స్నేహితులు. వీళ్లనా నేన్నమ్మింది!

ఏదైనా కడుపులో పెట్టుకునేదీ, పెట్టుకోవలసిందీ సొంత వాళ్ళే. ఛ, అక్కడికే పోవలసిందసలు. పోతాను.

పైన కొమ్మ వైపు చూస్తూ రెక్కల్ని ఆదేశించాను.

*

స్పీడ్ గా తొక్కుతున్నాను బైక్ ని. ఒళ్ళంతా చెమట. బ్రీతింగ్ కష్టంగా ఉంది. కనీసం నా ఒళ్ళు నన్ను పూర్తిగా ఆడపిల్లలా మార్చేసినా బావుండేది. ఇలా మెదడులో బిగించి టార్చర్ చెయ్యకుండా. పైకి లేచి ఊగిపోతూ తొక్కుతున్నాను. రంగులు మారిన షెల్లీ మొహం ఎదురుగా ఉన్న రోడ్డంతా కమ్మేస్తోంది. ఎంత అసహ్యంగా చూసిందది, ఏదో అగ్లీ యానిమల్ని చూసినట్టు! ఆ సెల్ఫీ చూపించకుండా ఉండాల్సింది నేను. ఇడియట్ ని. దానికి మళ్లీ అరగంట సేపు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇదంతా జోక్ అని. నా మీద నాకే కోపంగా ఉంది.

వర్షం మొదలైంది. అంత క్లోజ్ కదా,  లియామ్ తో ‘రూహీ’ అని పిలవరా కనీసం అంటే, లంచ్ మధ్యలోనే లేచెళ్లిపోయాడు. సచ్ ఎన్ ఇన్సల్ట్! పైకి చూశాను. చినుకులు కూడా నా శరీరాన్ని దాడి చేయడానికి దూసుకొస్తున్నాయి. యుద్ధం మొదలైంది. ఓ వైపు నేను, మరో వైపు అమ్మ, నాన్న, ఇండియా తాత, మిస్ అరేనా, ప్రిన్సిపల్ జేకబ్… అరే, వాళ్ళెవరు? ఇంకా కలవని కాలేజ్ ప్రొఫెసర్ చారు, కోచ్ డిల్లన్… అర్థం చేసుకుంటాడనుకున్న పార్ట్నర్ సన్నీ…అడాప్ట్ చేసుకున్న పిల్లలు కోరీ, ఫర్దీన్…అలా‌ అలా పేరుకుంటూ పోతున్నారు. హఠాత్తుగా ఇంత పెద్దదైపోయిందేంటి నా యుద్ధభూమి!

ఇంటికొచ్చాను. అమ్మ కారు బైటే ఉంది. అమ్మకేం చెప్పాలి? ఎలా చెప్పాలి?

ఆమెతో ఎప్పుడూ హిట్ ఆర్ మిస్సే. మూడ్ ని బట్టీ చెప్పాలి. “అమ్మా!” కిచెన్లో వెతికాను.

ఆఫీస్ లో ఎలా అయ్యిందో కనుక్కున్నాక చెప్పాలి… “అమ్మా, హెలో” బ్యాక్ యార్డ్ లో చూశాను… కిచెన్లో ఏదైనా హెల్ప్ చేస్తూ చెప్పాలి.

‘నేను చాలా ఏళ్ళగా చెబ్దామనుకుంటున్నానమ్మా’ లేదు.

‘డూ యూ లవ్ మీ మా?’ ఛ.

‘ఇక్కడ కూర్చో, నీకొకటి చెప్పాలి’ సరిపోదు.

అసలు అమ్మకి నేనెందుకు చెప్పుకోవాలి? తనే తెలుసుకోవాలి కదా అన్నీ?

ఇల్లంతా నిశ్శబ్దంగానే ఉంది ఇంకా. వాళ్ళ బెడ్రూంలోకి తొంగి చూశాను. లేదు.

మెల్లగా బ్యాగ్ పెడదామని నా రూంలోకెళ్లి హఠాత్తుగా ఆగిపోయాను. నా బెడ్ మీద కూర్చునుంది అమ్మ. చీకట్లో. తన పక్కనే బెడ్ మీద స్కర్ట్ లూ, టాప్ లూ, బ్రా లూ, కాస్మెటిక్స్…అన్నీ చిందర వందరగా పడేసున్నాయి. నా ఒంట్లో అణువు కదలట్లేదు. అమ్మ రెండు చేతులూ రిథమిక్ గా లిప్స్టిక్ క్యాప్ తీసి మళ్లీ పెడుతున్నాయి. ఆ సన్నటి ‘టిక్, టిక్’ శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎదురుగా శూన్యంలోకి చూస్తోంది తను. నాలో ఓ ఇమాజినరీ పెండ్యులమ్ పై నుంచి కిందకి వేగంగా ఆడుతోంది. నా కాలు లైట్ గా నేలని ట్యాప్ చేయడం మొదలుపెట్టింది. నోరు గట్టిగా లాక్ చేసుకునుంది.

ఐదు నిమిషాలు మౌనంగా గడిచాయి ఇద్దరి మధ్యా.

“ఎవరా అమ్మాయి?” అంది కళ్లు తుడుచుకుంటూ తను.

అర్థం కానట్టు మొహం పెట్టాను.

“షెల్లీ నా? అదే నా నీ గర్ల్ ఫ్రెండ్?”

నాకు మతిపోయింది. అమ్మకర్థమైంది ఇదా!

“వాట్, నో! తను జస్ట్ ఫ్రెండ్ మా”

“ఊరికే ఇద్దరూ లోపలికెళ్ళి తలులేసుకోవడాలూ, నువ్వు సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడాలూ, ఈ డ్రెస్సులూ, కాస్మెటిక్స్…టెన్త్ లోనే నీకు గర్ల్ ఫ్రెండ్ కావాల్సొచ్చిందా?”

“అమ్మా చిల్, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావ్.”

దిగ్గున పైకిలేచింది ఆ మాటతో. నా బట్టలన్నీ బెడ్ మీద నుంచి విసిరేసింది.

“దరిద్రుడా! చదువుకోరా అని పంపిస్తే ఇవా నువ్వు చేసేది? ఈ దేశానికొచ్చిన ఐదేళ్ళకే ఇంత వస్ట్ గా తయారయ్యావా?”

మాట మాటకీ భయం పెరిగిపోతోంది నాలో. సన్నగా ఒణుకు మొదలైంది. కాలు ట్యాపింగ్ ఎక్కువైంది.

జుట్టు ముడేసుకుంటూ ఇప్పుడు నా వైపు విసురుగా వస్తోంది అమ్మ.

“మా..” అన్నాను టెన్షన్ గా వెనక్కి వెళుతూ.

నన్ను దాటుకుని రూం బైటికెళ్లి, హడావిడిగా పైకెళ్లిపోయింది వాళ్ళ బెడ్రూంలోకి.

ఐదు నిమిషాలు ఏవో వెతుకుతున్నట్టూ, కింద పడేస్తున్నట్టూ సౌండ్స్ వచ్చాయి పైనుండి. నాకంతా అయోమయంగా ఉంది. అంతే విసురుగా మళ్లీ కిందకొచ్చింది అమ్మ. చేతిలో స్క్రూలని ఫిట్ చేసే డ్రిల్లింగ్ మెషిన్ తో! అదెందుకు తెచ్చింది?! వచ్చి హఠాత్తుగా ఆ డ్రిల్ మెషిన్ తో నా రూం డోర్ కున్న స్క్రూలని తీయడం మొదలుపెట్టింది.

నాకు దడగా ఉంది అమ్మనలా చూస్తే. అమె కోపం నాకలవాటే, కానీ ఇంత బాధ అలవాటు లేదు.

“ఈ దరిద్రపు డోర్ బిగించుకోని ఇష్టమొచ్చినట్టు చేస్తున్నాడు లోపల.” తిట్టింది ఎవరినో తిడుతున్నట్టు.

“అమ్మా, ప్లీజ్ మా, తియ్యద్దు.” ఏడుస్తున్న గొంతు.

“ఇండియాలోనే ఉంటే ఇలాంటి చెత్త వేషాలేసేవాడా?” ఎవడితోనో మళ్లీ.

డ్రిల్ చేస్తూనే ఉంది. డోర్ పై పార్ట్ ఊడిపోయింది. వేలాడుతోందిప్పుడు.

“మా, ఒక్కసారి చెప్పేది వినుమా” చేతులు జోడిస్తూ అన్నాను.

“అసలాయన్ననాలి. ఈ స్కూల్ మంచిదని తెచ్చి ఇక్కడ పడేశాడు. వీడు చేస్తున్నవి తెలిస్తే తల బాదుకుంటాడు.”

“ఆపు మా, ప్లీజ్, ప్లీజ్” నా గొంతు నన్ను మోసం చేసింది. తెలియకుండానే ఏడవటం మొదలుపెట్టింది.

ఒక స్క్రూ ఎంతకీ కదల్లేదు. అమ్మ నా మీద కోపం దాని మీద చూపించింది. చివరికి డ్రిల్ మెషిన్ పక్కన పడేసి, గోడకానుకుని అక్కడే కూర్చుంది.

అలా ఎంతసేపు ఎదురెదురుగా కూర్చున్నామో తెలీదు. ఎందుకింత ట్రబుల్ నావల్ల ఆమెకి? ఎప్పటిలానే ఇదంతా నాలోనే దాచేసుకుంటే ఎవరికీ బాధుండదు కదా. కానీ ఎప్పటికైనా అమ్మకైతే చెప్పాలి కదా. అప్పుడైతే బాధ తక్కువగా ఉంటుందా?

మెల్లగా లేచి ఆమె పక్కన కూర్చున్నాను.

“అమ్మా, అమ్మా”. తలూపింది ఏంటని.

“నేనే, నేనే అమ్మాయిని మా”

నోరు తెరిచి చెప్పడం తప్ప ఇంకేం సాక్ష్యమూ లేదు నా దగ్గర చూపించడానికి.

విచిత్రమైన జంతువుని చూసినట్టు చూసింది నన్ను. అర్థం కాలేదామెకి.

“నేను అమ్మా…” ఫాట్ మని చెంపదెబ్బ! అర్థమైంది ఆమెకి.

క్షణంలో మరో చెంపదెబ్బ. రెండు చెంపలూ చేతుల్లో పెట్టుకున్నాను తల దించుకుంటూ.

“అడిగినవన్నీ చేస్తుంటే, మాయరోగాలు. కొత్తకొత్తవి తగిలించుకుంటాం తెచ్చుకుని మరీ.”

పైకి లేచి సోఫాలో కూర్చింది మెల్లగా. అప్పుడు గుర్తుకొచ్చింది ఆమె మోకాలునొప్పి గురించి. కింద కూర్చోలేదసలు. పాపం.

“మీ నాన్నని రానీ, మొత్తం అమ్మిపారేసి ఇండియాకెళ్లిపోదామని చెప్తా. ఈ దరిద్రాలన్నీ తీరిపోతాయ్.”

అక్కడైతే నేను మళ్లీ అబ్బాయినైపోతాననుకుంటోందా!

“అసలేమైంది రోహాన్ నీకూ, ఇండియాలో బానే ఉన్నావుగా?”

“అక్కడ కూడా అనిపించే…”

“నోర్ముయ్!” హుంకరించింది. అది ప్రశ్న కాదైతే.

“వాడెవడో మారిపోయాడు, అదెవత్తో మారిపోయింది అని స్కూల్లో చూసీ చూసీ ఎక్కించుకున్నట్టున్నావ్. పైగా అది పెద్ద ఫ్యాషనిప్పుడు మీకు.”

కానీ నేనెవరో లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చిందే ఈ స్కూల్లో నాకు!

“నిజంగానే మా…” దీనంగా అన్నాను.

తనేమీ అనలేదు. లేచి మెల్లగా పైకెళ్లిపోయింది.

అమ్మ నా ప్రపంచాన్ని తన ప్రపంచంగా మార్చుకుని బతికింది ఇన్నాళ్లూ. రోహన్ ఇలా చదువుతాడూ, అలా ఆడతాడూ, సెన్సిటివ్ గా ఉంటాడూ, బాగా బిహేవ్ చేస్తాడూ…పెద్దయ్యాక మంచి కంపెనీలో వర్క్ చేస్తాడు, కోడల్నీ మనవళ్లనీ తెస్తాడూ…ఇలా ఉంటాయి ఆమె ఆలోచనలు. రోహన్ అనే మనిషి కన్నా, రోహన్ అనే భావన మీద నమ్మకం ఎక్కువ పెట్టుకుందామె. అవన్నీ ఒక్క మాటతో కూల్చేస్తే ఊరుకుంటుందా? కొడుకు మీద కన్న కలల్ని తిరిగి కూతురిగా కనమంటే ఒప్పుకుంటుందా? ఇదొక చావు అమ్మ దృష్టిలో.

మొదటి జన్మనిచ్చిన అమ్మే నా రెండో జన్మ మీద కళ్ళెర్రజేస్తే? పెంపకంలో ఎక్కడో పొరపాటు జరిగిందని తనను తానే నిందించుకుంటుంటే? నా వల్ల కాలేదు.

లేచి ఇంటి వెనక్కి వెళ్ళాను మెల్లగా.

*

“మీ ఇంట్లో కూడా ఒప్పుకోలేదా అయితే?” అడిగింది రూహీ‌ నా కళ్లల్లోకి చూస్తూ.

ఎంత అందంగా ఉందో.

ఆమె మణికట్టు మీదే ఉన్నాన్నేను.

నిట్టూర్చాను. “ఇంత వికృతంగా ఉన్నావ్! ఫోవే సీతా అవతలకి.” మూకుమ్మడిగా అరిచాయా గొంగళ్ళు నా మీద. ఎంత బతిమిలాడినా వినలేదు. నాకెటుపోవాలో అర్థం కాలేదు.

కోపం వచ్చింది. యుద్ధం చేయాలనుంది కానీ ప్రత్యర్థెవడూ లేడే!

నిస్సహాయంగా పైకి చూశాను. దొరికాడు.

రివ్వుమని పైకెగిరాను.

యుద్ధమో మరణమో తేల్చుకోమన్నప్పుడు, యుద్ధాన్నే ఎంచుకున్నాను.

“నీ ఇష్టమొచ్చినట్టు మా శరీరాల్నీ, మనసుల్నీ మార్చేసే హక్కెవరిచ్చారు నీకు?” అరిచాను.

మౌనం పైనుండి.

దూసుకు పోతున్నాను.

“మార్చేసి, మా కర్మకి మమ్మల్నొదొలేసి, చోద్యం చూస్తున్నావా?”

“ ”

మేఘాలను తాకుతున్నానిప్పుడు.

“మా శరీరాలకీ, మెదడుకీ సంబంధం పెట్టకపోవడం ముమ్మాటికీ నీ తప్పే. నువ్వే కిందికొచ్చి అందరి దగ్గరా నీ తప్పొప్పుకోవాలి!”

హోరున వీస్తున్న గాలి మాత్రమే సమాధానంగా వచ్చింది.

అలా ఎంత పైకి పోయానో తెలీదు. ఆయాసంగా ఉంది, ఊపిరాడట్లేదు, రెక్కలు కదలడం మానేశాయి. హఠాత్తుగా కిందకి పడిపోతున్నాను. శరీరం అల్లకల్లోలంగా ఉంది కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. పడుతూ పడుతూ ఉన్నట్టుండి ఠక్కున ఆగిపోయాను. ఏదో మెత్తటి పూల గుత్తుల మీద పడినట్టనిపించింది. ఆశ్చర్యపోతూ కళ్లు తెరిచాను. చుట్టూ సీతాకోకలు. కొన్ని వేల సీతాకోకలు. ఎరుపూ, పసుపూ, నలుపూ, పెద్దమచ్చలవీ, చిన్నచుక్కలవీ…అన్నీ నన్ను చుట్టుముట్టాయి.

“కొత్త పిల్లవా?”

“ఎవరున్నారంట పైన?”

“పిచ్చిదానివా?”

మీద పడిపోయాయి. “ఆగండ్రా!” వెనకనుండి అరుపు. పక్కకి జరిగి దారిచ్చాయవి భయపడి.

వంకాయ రంగులో మెరిసిపోతున్న, ఓ పెద్ద సీతా గంభీరంగా ఎగురుకుంటూ వచ్చింది నా వైపు.

“ఏమ్మా, ఇంటి దగ్గరెవరూ రానివ్వలేదా?” అంది నా గడ్డం పట్టుకుని.

తలూపాను అడ్డంగా.

“మమ్మల్నీ ఎవరూ గుర్తుపట్టలేదు తెలుసా?” అంది అందరి వైపూ చెయ్యి చూపిస్తూ. తలలూగాయి చుట్టూ.

పెద్ద సీతా నన్ను దగ్గరికి తీసుకుంది. మెల్లగా తన రెక్కలతో నా కన్నీళ్లు తుడిచింది.

ఇదంతా కొత్త నాకు.

“మాతో వస్తావా?” అంది. తలూపాను.

“కొత్త పిల్లకి మన స్వాగతం చూపించండ్రా.” ఉత్సాహంగా అరిచింది పెద్ద సీతా.

అంతే, నా చుట్టూ ఉన్న సీతాలన్నీ రివ్వున పైకెగిరాయి. చేతులు పట్టుకుని గాల్లో వలయాలు చేసుకుంటూ తిరిగాయి. అన్నీ కలిసి ఓ పెద్ద సీతాకోక రూపంలోకి మారాయి. ఎంత బలం!

తరువాత చీమల్లా ఒకదాని వెనక ఒకటొచ్చి నిలబడ్డాయి నిలువు కర్రల్లా. వంగపండు రంగువన్నీ ఓ పక్క చేరాయి, ఎరుపువన్నీ మరో చివర నిలిచాయి, పసుపూ, నీలం, ఆకుపచ్చా మధ్యలో చేరాయి. క్షణాల్లో కళ్ళెదుట తయారైన ఇంద్రధనుస్సు!

పెద్ద సీతా రెక్క పట్టుకుని నన్ను మెల్లగా దానివైపు తీసుకెల్తోంది.

“ఈ ప్రపంచంలోనే మనంత అందమైన ప్రాణి లేదు తెలుసా.” అంది గర్వంగా.

వానపాముగాడన్న వరం, నా జీవితం పదిలంగా దాచిన రహస్యం ఇదేనా అయితే! ఎలా కృతజ్ఞతలు చెప్పాలి దానికి?

మెల్లగా వెళ్లి ఎర్రవాటిలో చేరిపోయాను నవ్వుకుంటూ, అటూ ఇటూ చేతులు గట్టిగా పట్టుకుంటూ.

*

నా కథ చెప్పి కళ్ళు తెరిచేటప్పటికి, నన్నొదిలేసి రూహీ తిరిగి ఇంట్లోకెళ్లిపోతోంది. చెంపలమీది కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టు తెలుస్తోంది వెనక.

“మా అంత సులభం కాదేమో రూహీ మీ మనుషుల్లో.” అరవబోయా కానీ ఆమె చుట్టూ మొలుస్తున్న బలమైన రెక్కల్ని చూసి ఆగిపోయాను.

*

పాణిని జన్నాభట్ల

4 comments

Leave a Reply to Aparna Thota Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి కథ ,నచ్చింది.
    .
    కొడుకు మీద కన్న కలల్ని తిరిగి కూతురిగా కనమంటే ఒప్పుకుంటుందా? చాలా నచ్చింది ఈ .లైన్

    శుభాకాంక్షలు పాణిని జన్నాభట్ల గారు .

  • మీ కథలోని అంశాన్నీ, కథ నడిపిన విధానాన్నీ రెండిటినీ నిర్ద్వంద్వంగా తీవ్రంగా నిరసిస్తున్నాను.
    అందమైన ప్రతీకతోనూ, కవితాత్మక సుందరమైన భాషతోనూ, ప్రణాళికా బద్ధంగా రాశారు. ఆకట్టుకునే విధంగా. ఈ విషయం గురించి అసలు తెలియని వారినీ, ఏదో చూచాయగా తెలిసిన వారినీ, అవును కదా, అంతే కదా, నిజమే కదా అని భ్రమింప జేసేటట్లు. పైగా కథలోనే ఆ పిల్లవాడి స్వగతంగా చెప్పిన మాటల్లో అస్తిత్వ ప్రస్తావన కూడా తెచ్చారు కాబట్టి ఇది deliberate గా రాసిందే అని తెలియజేస్తున్నది.అందుకే ఇంత తీవ్ర నిరసన అవసర మయింది.

    ముందుగా ప్రతీక అసంబద్ధత. గొంగళి పురుగు ప్యూపాగా, తరవాత సీతాకోక చిలుకగా పరిణమించడం సర్వత్రా ప్రకృతిలో జరిగే విషయం. మగవాడిగా పుట్టిన వ్యక్తి స్త్రీ గా మారాలి అనుకోవడం సర్వత్రా జరిగే విషయం కాదు. ప్రకృతి సహజం అసలు కాదు. పూర్తిగా అసంబద్ధమైన ప్రతీక.

    ప్రపంచంలో ట్రాన్స్ వ్యక్తులు ఉన్నారు, నిజమే. జనాభా లెక్కల్లో చూసుకుంటే ఒక శాతంలో చిన్నాతి చిన్న భిన్నం వారి లెక్క.
    వారి గురించి కాదు ఈ కథ కానీ, తత్ఫలితమైన నా విమర్శ కానీ. ఏదో తన మానాన తన చదువు ఆట పాటలు చేసుకుంటున్న ఒక మధ్య తరగతి యువకుడు తన చుట్టూ సమాజంలో ప్రబలిన లింగ మార్పిడి ప్రచారపు గందర గోళానికి లోబడి తనను తాను భ్రమింప జేసుకోవడం. దీనిలో సహజమైన ప్రవృత్తి, ప్రకృతి చేసే వత్తిడి ఏమీ లేవు, టీనేజి వయసు భ్రమ తప్ప. ఒక పేద టీనేజర్ అబ్బాయి లేటెస్ట్ నైకీ బాస్కెట్ బాల్ బూట్లు చూసి ఎలాగైనా వాటిని సొంతం చేసుకోవాలనే లాంటి ఆబ. ఈ భ్రమకి, ఆబకి ఇంకొంచెం బలం కలిగిస్తుంది తల్లిదండ్రులు, సమాజము ఆ ప్రవర్తనను వ్యతిరేకిస్తారు అనే భావన. There is nothing noble or revolutionary or liberating in this so called struggle.

    అమెరికన్ సమాజంలో ట్రాన్స్ సమస్యను చర్చించాల్సిన సమస్య అని అంగీకరించినా, దాన్ని గురించి రాయాలంటే, చిన్న కథ అయినా, ఎంత అవగాహన సంపాదించాలి? ఎంత రీసెర్చ్ చెయ్యాలి? అందమైన సీతాకోక చిలుక రెక్కలు మొలిచాయి అని conclude చేసినంత తేలిక కాదు. నిజంగా ట్రాన్స్ అయిన వ్యక్తి బయటికి రావడం, తదనుగుణంగా రూపాంతరం చెందడం, తదుపరి జీవితం … ఇదంతా struggle యే. పోరాటమే. అందులో విశ్రాంతి కానీ, అంతిమ విజయం కానీ ఉన్నట్టు కనబడదు. ఇటువంటి నిజమైన struggle కి అందమైన ముసుగు వేసింది ఈ కథ. This is misleading and unethical in my opinion.

    పైగా .. మగ నించి ఆడ కి మారడం పట్ల ఈ సమాజంలోనే ఎన్నో అభ్యంతరాలు చర్చిస్తున్నారు – మత, సామాజిక అంశాలకి దూరంగానే. ఉదాహరణకు, మగ శరీరంతో తదనుగుణమైన బల సామర్థ్యాలు ఉన్న వ్యక్తి తాను స్త్రీని అని చెప్పి బల సంబంధమైన పోటీలలో పాల్గొన వచ్చా?
    ఎన్నో శతాబ్దాలుగా స్త్రీలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చిన్న చిన్న విజయాలు trans rights లాంటి false narrative తో కాలరాయ బడుతున్నాయి.

    అమెరికా జీవితాన్ని గురించి కథ రాస్తున్నారని సంతోష పడేలోపలే, ఇటువంటి irrelevant, hyped and falsehood-riddled కథనాన్ని ఎలివేట్ చేశారు. మీ ముందుటి కథల అభిమానిగా ఇది నన్ను విపరీతంగా నిరాశ పరిచిన అంశం.

    • మరి ట్రాన్స్ జెండర్స్ ఎలా బ్రతకాలి ? తనలాంటి వారితో కలిసి బ్రతకడానికి ప్రయత్నించడం తప్పు కాదు కదా ! same sex marriages మెల్లగా పూర్తిగా అంగీకరించబడతాయేమో! ఎవరో ఒకరు గళం విప్పబట్టే కదా సతీసహగమనం లాంటి ఎన్నో దురాచారాలు పోయాయి .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు