కంటికి కనిపించేదంతా సత్యం కాదు

తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి కథల ప్రపంచం-2

క్రిందటి సంచికలో కరువు వస్తువుగా తీసుకుని శాస్త్రి గారు రాసిన కథల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లైఫ్ ఫిలాసఫీ మూల వస్తువుగా మొదట సంపుటిలో అయన రాసిన ‘భగవంతం కోసం’, ‘శైత్యాంతం’  , ‘బరువు సామాను’, ‘జెన్’ ల గురించి పరిశీలిద్దాం.

 

మనిషి బయట లోపలి అస్తిత్వ ప్రయాణమే ‘భగవంతం కోసం’.

అన్నీ ప్రయాణాలే, జీవితం రైలు అయిపోయింది. ప్రయాణం లో ఎవడో భుజం మీద తల పెట్టి చొంగ కార్చుకుంటూ నిద్ర పోతాడు. అవతలికి నెట్టేసినా మళ్ళీ వాలిపోతాడు. మరొకడు మహా పిరుదుల లోయల్లోంచి సుడిగాలిలా గాలి వదులుతుంటాడు. నిద్ర, మెలకువ, రైలు హోరు, భగవంతం గారి కోసం ఈ ప్రయాణం అంతా. ఎందుకు భగవంతం ఆలా ఏడిపిస్తాడు? నలిగి చిరిగిపోయిన ఆన్ని ఋతువుల ఆనవాళ్లలో వలసపిట్టలా కార్డు ముక్క వచ్చి వరండాలో వాలుతుంది, వచ్చి కలవమని.   చివరిగా ఈ రాజమండ్రి   ప్రయాణం. అసలు భగవంతం అందరికి రాస్తాడా ఉత్తరం, వచ్చి కలవమని. సంతోషం లాడ్జి లో మజిలీ. కనబడిన ప్రతివాడిని అడుగుతున్నాడు భగవంతం గారు తెలుసా అని, వాళ్ళెవరికీ భగవంతం గారు తెలిసినట్లు గాని అవసరం ఉన్నట్లు గాని కనబడట్లేదు.

ఎప్పుడో గతంలో నాన్నని  పొట్లం గట్టి పూజాద్రవ్యాలతోపాటు గోదాట్లో పడేసాను, ఆయన్ను చేపలు తినేసి ఉంటాయి,, దాన్ని జాలర్లు పట్టుకుంటారు, దాన్ని జాలర్లు పులుసు వండుకుంటారు, ఎంతమందిలో నాన్నగారు కలిసిపోయారో.   మళ్ళీ ఇన్నేళ్లకు భగవంతం కోసం. లాడ్జి లో మంచం పక్కన చిన్న టేబుల్, దాని సొరుగు ఎంత లాగినా రాదు.  ఉదయం 10 గం|| కు     గోదావరి వడ్ఢదుకు వెళ్ళాను. అవతల చాకళ్లు రాళ్లమీద బాది బాది ఆడాళ్ళని, మొగాళ్ళనీ మళ్ళీ గోదాట్లో పిండేసి అడ్డంగా మడిచి, మెలేసి, పిండి, పిండి, భళ్ళున దులిపి, తాళ్లకు వేలాడేస్తున్నారు. తాళ్లకు ఊగుతున్న వాళ్ళు, వాళ్ళ పక్కనే కుప్పలా మరికొంతమంది. నలిగిపోయిన ఈ జీవితాలు వెతికి భగవంతం అవసరం లేదేమో.   ఎవరో  గురూజీ  శిష్యులు వారెవరికీ,   భగవంతం అంటే ఎవరో తెలియదు, అవసరం లేదనుకుంటాను. గోదావరిలో పడవ ప్రయాణం,  అందరితో  సంభందాలు తెగిపోయాయి . గోదావరిలో తానొక్కడే.  చల్లటి గాలికి శరీరం చల్లబడింది కానీ లోపల ఆందోళన చల్ల బడలేదు.  మళ్ళీ భగవంతం కోసం వెతుకులాట. ఎవరో కూరలమ్మి తెలుసంటే, ఉదయం నుంచి వచ్చి కూర్చున్నాడు. ఆవిడకి తెలుసన్నది భగవంతం కాదు భూషణం గారట. తుప్పలు, మురికి, పెంట, వాటిని దాటిన ఇల్లు, జీవితం లాగే. కాళ్ళీడ్చుకుంటూ కనబడతాడో, అసలున్నాడో, లేడో భగవంతం. మళ్ళీ సంతోషం లాడ్జి లో, మళ్ళీ టేబుల్ సొరుగు లాగాడు గట్టిగా బలంగా, ఎప్పుడూ ఎవరూ తీయడానికి ప్రయత్నించకపోడం వల్ల బిర్ర బిగుసుకుపోయిన టేబుల్ సొరుగు, మొత్తానికి ఊడి చేతికి వచ్చింది, అందులో ఖాళీ అగ్గిపెట్టె సగం కాలిన కొవ్వొత్తి. భగవంతం లోపలెక్కడో ఉండి ఉంటాడు (తనలోనే  లోపల ఎక్కడో ఉండి ఉంటాడు) బిర్ర బిగుసుకుపోయిన మనిషి అంతరంగాన్ని కొవ్వొత్తి వెలిగించి చూసుకుంటే కనిపించవచ్చు  భగవంతం. జీవిత ప్రయాణంలో ఉతుకులూ, మాలీషులు, దుర్గంధాలతో మూసుకుపోయిన అంతరాంతరాలని గట్టిగా లాగి చుడండి. మిమ్మల్ని మీరు దర్శించుకోడానికి వెలిగించుకోడానికి ఓ అగ్గిపెట్టె చిన్న కొవ్వొత్తి ఖచ్చితంగా దొరుకుతాయి.

* * *

అనుభవం లోకి రాణి ఏ జ్ఞానమైనా సత్య శోధనకు పనికిరాదని సున్నితంగా చెప్పినది ‘శైత్యాంతం’

చుట్టూ వ్యాపించిన సీతువులో వేడి కాఫీ ప్రాణానికి హాయిగా ఉంటుంది. కప్పు ఖాళీ అవ్వగానే సుఖం హరించుకుపోతుంది, అంటే ఏ సుఖమైనా అంతే అన్నమాట. ఒక దుఃఖమే నిజం, చావు నిజం. అరగంట పైగా ధ్యానం చేసినా ఆవిడ ఆలోచనలు ఒకే ఆవరణలో ఉన్నాయి. ఆవిడ ప్రతినెలా మొదటివారం అందరికి ధ్యానం, విపాసనా పద్దతి, జిడ్డు కృష్ణమూర్తి, ఇతర తాత్విక విషయాలు మాట్లాడుతుంది. ఏ పొరకి ఆ పొర విడదీసి ఇంగ్లీష్ లో చర్చిస్తుంది. వాళ్ళు తనివితీరా వింటారు. వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ సూన్యం ఆవరిస్తుంది. మాట్లాడటం ఆమెకు విముక్తి, కారు ప్రమాదంలో పోయిన భర్తని ఇంకా మర్చిపోలేదు.

కృష్ణాజీ గాని, రమణుడుగాని, ఇతర తాత్విక పుస్తకాలు, ఆమె ఇతరులకు ఉపదేశాలు ఇవ్వడం కోసం మాత్రమే పనికి వస్తాయి. తన ప్రశ్నలు, అనుమానాలు, జవాబులు, తర్కాల నుంచి బయట పడేలా అవి ఎప్పుడు చేయలేదు. చల్లటి సీతువులో బోస్టన్ నుంచి కొడుకు మాట్లాడే మాటలు మాత్రమే కాస్త వెచ్చటి శాలువాను కప్పుతాయి.  ఐతే అందరూ ఆవిడని మాతాజీ అని, మరోటని గౌరవించినా , అనుభవంలోకి రాని ఏ సిద్ధాంతాలు ఆవిడా ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక పొయ్యాయి. చెల్లెలు, మరిది పోరగా వాళ్ళు నమ్ముకున్న బాబా ఆశ్రమానికి ఎంతో విముఖత తోనే వెళ్ళింది. ఆయన ఉపన్యాసాలు ఇవ్వరు, వయసు మీద పడకముందు సైకిలు మీద తిరుగుతూ, అందరిపనులు చేసిపెట్టి, దిక్కు లేదు అనుకునేవారికి దిక్కుగా నిలిచాడు అని చెప్పారు. అందరిని నవ్వుతూ పలకరించి యోగ క్షేమాలు కనుక్కుని ఆప్యాయంగా చేతిలో ఒక స్వీట్ పెట్టి పంపించే ఆయన, జీవితాన్ని తప్ప పెద్దగా చదువుకోలేదని తెలిసింది. కృష్ణాజీలా  సొగసైన ఇంగ్లీష్, ఓ మార్మికత తో కూడిన మాటలు మాటలాడటం ఆయనకు చేతకాదు. పక్కా జనం భాషలో మాట్లాడుతూ వారిలో మమేకమైపోడం ఆవిడకి ఆశ్చర్యం అయిపోయింది. ఐతే సత్య దర్శనాలు లాంటి పెద్ద పెద్ద విషయాలు ఆయనకీ తెలియవు, ఎదో దేవుడిని నమ్ముకోండి అని చెప్పడం తప్ప. ఆరోజు రాత్రి ఆశ్రమం లో ఆవిడకి నిద్ర పట్టడం లేదు, ఓ మెత్తటి పసి పిల్లల లాంటి కర స్పర్శ ఆమె చేతికి తగిలింది.

ఆయన కళ్ళల్లో గొప్ప దయ, ప్రేమ, ఆశ్చర్యమైన కాంతి కనిపించాయి. బుద్ది తో సంబంధం లేని ఆత్మీయత ఏర్పడింది మనసులో. పడుకోండమ్మా మంచి నిద్ర పడుతుందన్న బాబాగారి మాటలు ఆవిడలో జన్మ జన్మల దుఃఖాన్ని బయటకు వచ్చేలా చేసింది. ఎప్పుడూ నేనంత ప్రశాంతంగా నిద్ర పోలేదు, మనసు తేలికగా, ప్రశాంతంగా సముద్రం మీద లేచే మబ్బు తునకలాగ వుంది. మార్మిక మైన మాటల్లో కాకుండా జీవితాన్ని ప్రాక్టికల్గా ఎలా చూడాలో ఆవిడకి అర్థమయ్యింది. ఒక రోజని వెళ్ళినావిడ సత్యాన్ని తెలుసుకుని  వేసవి అంతా అక్కడే గడిపేసింది ‘శైత్త్యాంతం కథలో’.

* * *

యింటివారి  అల్లుడు బదిలీ అయ్యి వస్తున్నాడు, ఇల్లు ఖాళీ చేయాలి. అతని చేతగాని తనాన్ని పదే పదే గుర్తు చేస్తుండే భార్య మాటలు, అతని జీవిత సారాన్ని ముందుకు పరచినట్టే ఉంటుంది. మొత్తానికి ఖాళీ చేసే రోజు రానే  వచ్చింది. ఇల్లంతా  అట్టపెట్టెలు, సామాను  ఈ సామానంతా ఇంతకాలం తానే మోస్తున్నాడా, వీపు మీద ఎవరో ట్రంకు పెట్టెలు పెడుతున్నారు. జీవితం నిండా పరుచుకున్న సామాను రాశిగా ఏర్పడి దర్శనం ఇస్తోంది.   ఏ ఒక్క వస్తువు తీసి పారేయడానికి భార్య ఒప్పుకోలేదు. పాత బట్టలు, పాత ఎలక్ట్రికల్ సామాను వేటినీ వదలట్లేదు. అన్నిటిని చుట్టబెడుతోంది భార్య. ఉన్న నాలుగు గదుల్లో సందు లేకుండా సామాను కుక్కడమే సంసారమా, అనుకున్న అతనికి ఈ సన్నాసి బుద్దులు ఉండబట్టే ఇలా తయారయింది అన్న జవాబు. కొత్తగా వెళ్లబోయే ఇంటిని చూద్దామని వెళ్ళాడు. చల్లగా విశాలంగా నిశ్శబ్దంగా ఉంది. గదులన్నీ తిరిగాడు. ప్రశాంతంగా వుంది. ఇది నా కొత్త అస్థిపంజరం, అందులో కూర్చున్నట్లు వుంది. విశాలమైన ప్రశాంతమైన జీవితంలా వుంది, కానీ కుదరదు, వీటన్నిటిని సామాను తో నింపేస్తుంది. వద్దనుకున్నా ఏ ఒక్కటీ వదిలించుకోలేము జీవితంలో. సామానులైనా, జ్ఞాపకాలైనా, దుఃఖ శకలాలైనా వాటి బరువుకింద పడి నలిగిపోవడమే జీవితం. మెల్లిగా లారీ కదిలి అతని వీపుమీద పాకింది, అంటూ ముగుస్తుంది బరువు సామాను.

***

హార్మొనీ అఫ్ లైఫ్ కి యంత్రం ఒక సింబల్. ఇదే ‘జెన్’ కథలోని సారాంశం.

‘ఆఫీస్ లో గొడవ స్కూటర్లకి తెలియవు. బయలు దేరేముందు  మనమే తెలుసుకోవాలి. ఆదివారం పూట  ఒక అరగంట సేపు బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి’. నాయుడుగారు బండి సరిగ్గా నడవట్లేదనే  వాళ్ళ అబ్బాయి తో అనే మాటలివి. బండి అయినా జీవితం అయినా ఒక్కటే అన్నది నాయుడుగారి అభిప్రాయం. బండి మీద పోతుంటే పర్ఫెక్ట్ గా స్మూత్ గా ఉండాలి, శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, పరిగెత్తేటప్పుడు సుఖంగా ఉండద్దూ, ట్రాఫిక్  ఎంత ఉన్న మధ్యలోంచి మెత్తగా వెళ్ళిపోవాలి. సౌండ్ వింటే అర్థం కావాలి, పర్ఫెక్ట్ సౌండ్ ఉంటె మెషిన్ కూడా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. జీవితం కూడా  అంతే. మన నుంచి వచ్చే కోపాలు, అరుపులు, చికాకులు కూడా మనలో తెలియని లోపాలని చెప్పేవే, మెషిన్ లో లాగా. నాయుడుగారి చెయ్యి పడితే ఎలాంటి  యంత్రమైన మాట వినక తప్పదు. ఇంజక్షన్ తీసుకుంటున్న రోగిలా యంత్రం నీరసంగా మూలిగి కాసేపటికి పూర్ణాయుద్దయం తో బయట పడుతుంది. సమస్య ఎక్కడవుందో, దాన్ని ఎలా పరిష్కరించుకోవలో  తెలిసిన మనిషి కాబట్టి ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో జీవితం గడిపేస్తారాయన. మరి కొడుకో, ఎప్పుడూ నడుపుతున్న వాహనాన్ని తిట్టుకోవడమే,  లేకపొతే భార్య మీద రుసరుసలు. అసలు కారణం వేరే ఏదైనా ఉంటుంది. ఇంత వయసులో కూడా నాయుడుగారు, పనికిరాక తుక్కులో అమ్మేయాలనుకున్న యంత్రాన్ని తీసుకు వచ్చి దానికి ఆయన అమ్మతల్లి అని అమ్మ దేవత పేరు పెట్టుకున్నారు, దాన్ని ఓపిగ్గా  తన జీవితాన్ని సవరదీసినట్టే లాలిస్తూ బతిమాలుతూ, దాన్ని  తిరిగి బతికించడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఆయనకేం  ప్రయోజనం, అన్నది కాదు ప్రశ్న, దాన్ని సక్రమంగా గాడిలో పెట్టామా లేదా అన్నదే ఆయనకు ముఖ్యం.

కాకినాడ దగ్గర పచ్చటి మొగ్గల్లాంటి మడ చెట్ల అడవులూ, వాటిని చీలుస్తూ జారిన ఏరులు నాయుడుగారి జ్ఞాపకాల పడవల్లో ఎప్పుడూ ఊగుతూ ఉంటాయి. ప్రకృతి వివిధ జీవరాశులతో సాధించిన హార్మొనీ నుంచి నేర్చుకున్న పాఠాలే  నాయుడుగారి  జీవితంలోను ప్రతిబింభించాయి.

ఏ ప్రతిఫలం ఆశించకుండా నిర్వికారంగా తన పని తాను చేసుకు పోయినప్పుడే జీవితం నిశ్చలంగా సాగిపోతుంది, ఇది జెన్ కథ.

***

Note: ఈ కథలు చిన్ని పరిచయాలు తప్ప విశ్లేషణలు కావు. నిజానికి భగవంతం కోసం, జెన్ కథల మీద సంపూర్ణ విశ్లేషణలు వచ్చినట్లు గుర్తు. 

*

'ఛాయ' మోహన్ బాబు

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మోహన్ గారు చేసిన కథా పరిచయాలు చాలా బాగున్నాయి. పతంజలి శాస్త్రి గారి కథలు వెంటనే చదవాలనిపించేలా ఉన్నాయి పరిచయాలు. కొత్త తరం పాఠకుల కోసం ఇలాంటి ప్రయత్నం జరగాల్సిందే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు