కౌగలింత క్షణాలు స్వప్నానికి కలతనిద్రలా వెంటాడుతున్న తరుణం. నెత్తుటి మరకలు కనిపించవు, ఆర్తనాదాలు నాలుగు గోడలు దాటి వినిపించవు. పాలను నీటిని వేరుచేసే హంసలా, ఎవరో ప్రాణాన్ని శాంతిని విడదీసి చావును చోద్యంగా మార్చిన ఘట్టం. ఇప్పుడు ఆయుధాలు నీటి గుణాన్ని అలవరచుకున్నాయి, వాటికి రంగు రూపం లేకుండా పోయింది. జాడలు వదలకుండా జడివాన జీవననాడితో పుడమిని విడిచి అదృశ్యమవుతుంది.
ఇంతకీ యుద్ధ నీడలు పరుచుకోలేదు, ఏ దేశము మరో దేశాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నాలు కంటికి కనిపించలేదు. యుద్ధాల పిక్సెల్స్ మారుతున్నాయి, ఇప్పుడు ఏ దేశం మరో దేశంపై యుద్ధం చేస్తున్నట్లు ప్రకటించదు. ఇప్పుడు ఎవరి చేతుల్లోని న్యూక్లియర్ బటన్ పెట్టుకుని తీరగాల్సిన అవసరము లేదు. ఒకరు మరొకరి దేశపు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లోకి దొరలా చొరబడొచ్చు, ఆ కరెన్సీని అతలాకుతలం చేస్తూ ఆకలిని వ్యాప్తి చెయ్యొచ్చు. ప్రభుత్వాలను నిస్సహాయ స్థితిలోకి నెట్టొచ్చు.
ఒకానొక దేశంలో పుట్టిన వైరస్, ప్రపంచం మొత్తం వ్యాపించిన తరుణంలో రోజుకి 3000+(on an average) కొత్త కేసులు నమోదవుతూ, 600+(+or-) చావులను చూస్తున్న దేశంలోంచి COVID-19 గురించి రాస్తున్నాను. ‘రవి అస్తమించని సామ్రాజ్యం…’లో ఈ దుస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్ దేశంలో East Midlands రీజియన్ లో UK చరిత్రలో Northamptonది చాలా ప్రత్యేకమైన స్థానం. 1675లో నగరంలో సింహభాగం అగ్నికి ఆహుతి అయ్యింది, ఆ తరువాత కాలంలో Phoenix పక్షిలా తిరిగి తనని తాను నిర్మించుకుంది.
ఇప్పుడు చరిత్ర నుండి ప్రస్తుతానికి వస్తే, నేను జనవరి మాసం -2°c temperatureలో ఒకానొక అర్థరాత్రి ఈ నగరానికి లండన్ నుంచి వచ్చాను. సన్నగా మంచు వర్షంలా కురుస్తుంది, చుట్టూ అందమైన కన్నులు మాట్లాడుతున్నాయి. ట్రాష్ బిన్స్ మీద సగం ఆరిన చితిలా సిగరెట్ పీకలు, ఎవరో homeless నల్లజాతీయుడు ‘Big Monkey…’ పాటను ఉత్సాహంగా పాడుతున్నాడు. నాలుగు అడుగుల వేసి చూస్తే, మరో వ్యక్తి వయోలిన్ మీద విషాద గీతాన్ని ఆలపిస్తున్నాడు. ఎవరో ఎవరికీ తెలియదు, కానీ ఒకరికి ఒకరు ఆహారాన్ని పంచుకుంటూ మరొకరి ఆకలిని తీరుస్తున్నారు. ఇక్కడ పలకరించడం ఒక చిరునవ్వు ఖర్చు అంతే, కానీ ఎవరి పలకరింపును మరెవరూ విడిచిపోరు.
ఇప్పుడు బయటకు వెళ్ళి దాదాపు 20రోజులు, ఇక్కడ ఆంక్షలు అంతగా విధించలేదు, అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు self-isolationకి వెళ్ళడం మంచిదని అనుకున్నాం.
నేను మీతో నా UK అనుభవం పంచుకునే సమయానికి నమోదైన మొత్తం కేసులు 60,733; చనిపోయిన వ్యక్తుల సంఖ్య 7,097. ఈ ఒక్క రోజు (08April2020) నమోదైన సంఖ్య 5,491 మరియు ప్రాణం కోల్పోయిన వారి సంఖ్య 938. అందరూ ఇంటిలోనే ఉండడంవల్ల ప్రపంచం త్వరగా ఈ వైరస్ బారినుండి బయటపడుతుంది. మన కోసం మన ఆత్మీయుల కోసం ఇంకొంత కాలం సహనంతో మీ ప్రభుత్వాలకు సహకరించండి.
*
Add comment