ఓసారి తండాకి వెళ్ళి రావాలి

నా పేరు హాథిరామ్ సభావట్.
చిన్నప్పటి నుండే సందర్భోచితంగా, సమాజం గురించిన కవితలు రాయడం అలవాటు. అలా రాసిన కవితలతో నల్లింకు పెన్ను అనే కవిత సంపుటి తీసుకొచ్చాను. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ  చదువుతున్నాను. 
మనుషులతో పంచుకోలేని మనసులోని భావాన్ని భావజాలాన్ని కవిత్వంగా రాస్తుంటాను. కవిత్వం అనేది మనిషిని మనిషిగా చిత్రించి పీడితుల పక్షాన నిలబడి, వర్తమాన కాలాన్ని భవిష్యత్తరాలకు చరిత్రగా అందించేటట్లు ఉండాలి.

 

1.

ఓసారి వెళ్ళి రావాలి –

ప్రతిసారీ తను అడిగేది

తండా బాగుంటుందంట కదా

హృదయాలు ముక్కలయ్యేలోపు

మనుషులు జ్ఞాపకాలయ్యేలోపు

ఓసారి అట్ల తీసుకెళ్లి రావచ్చు కదా

అని  పోరు పెట్టిన ప్రతిసారి

అందమైన కథలల్లి తనకు చెప్పేవాణ్ణి

జొన్న రొట్టెల రుచుల కథల్ని

ఒకటే చిరునామున్న మనుషుల కథల్ని చెపుతూ

తూజ్ మార్ తండేర్ రాణి అంటూ

తనను ఊహల్లో తెలియాడేలా చేసేవాడ్ని

మళ్లీ ఈసారి తను అడిగింది

ఈసారైనా తీసుకెళ్లవా అని

ఎప్పటిలా అందమైన కథలు చెప్పలేదు

పచ్చటి ప్రేమకు పురుడోసిన భూమి కథలు చెప్పలేదు

ఈసారి ఊహల్లో తేలి ఆడించే కథలు చెప్పలేదు

చప్పుళ్ళు చేసి అరిగిపోయిన బలియా కథలు చెప్పాను

కాళీ అద్దాల్లో నిలిచిపోయిన ఆకలి ముఖాల కథలు చెప్పాను

విద్వేషాలు పంచిపోయిన జెండాల కథలను

ఎస్టేట్ రాళ్ళు మింగేసిన గెట్టు రాళ్ళ వ్యథలను

మా జొన్న రొట్టేలన్ని పట్నం పొద్దులైన కథలను

చూపించడానికి తనతో

ఓసారి వెళ్ళి రావాలి

చితికెక్కిన చితికిన బతుకుల్ని చూపించి రావాలి

విధ్వంసకులే పాలకులైతే

మిగిలే విషాదాన్ని చూపించి రావాలి

 

*తూజ్ మార్ తండేర్ రాణి(నువ్వే నా తండా రాణి)

*బలియా – బంజారా స్త్రీలు వేసూకునే తెల్లటి గాజులు

*కాళీ – బంజారా స్త్రీలు వేసూకునే అద్దాలు కూడిన రవిక

 

2.

ప్రకంపనలు –

ఈ నేల పై

గన్నులే కాదు

బన్నులు కూడా

పచ్చి నెత్తుటిని

కక్కే బాలింతలే…!

 

మా ముంగిళ్లన్ని

విద్వేషాపు ప్రకంపనలకు

కూలిపోయిన గోడల కింద

శిథిలాలే…!

 

ఇక్కడ

మా గుడ్డలన్ని

నిరసన జెండాలైతే

మా దేహాలు

రక్తపు పూతతో

కప్పబడి ఉంటాయి..!

 

******

ఈ మైదానాల్లో

మా బాల్యాలు అన్ని

గ్రానైట్కు వేలాడే పిన్నుల్లాంటివే

కాని మీకు ఇక్కడ

మసిబారిన మొహాలేం కనిపించవు..!

 

ఎందుకంటే

మా మొఖాలన్ని

తెల్లని ఫాస్పరస్తో

మేకప్ చేయబడి ఉంటాయి…!

***********

 

ఈ కల్లోలానికి గుర్తులుగా

మా దేహాన్నే

మూజియం చేసి

కొన్ని తూటాలను

కాసిన్ని గన్ పౌడర్ ను మోస్తూ

 

ఆ మత కట్టడాల కింద

మానవత్వం దహించుకుపోగా

మిగిలిపోయిన

కొన్ని మానవత్వ శకలాలను

మూటగ కట్టి

మమ్మల్ని మనుషులుగా గుర్తించే

తెల్లని వాకిళ్ళ కోసం బయలుదేరాము….!

*

హాథిరామ్ సభావట్

1 comment

Leave a Reply to రూపరుక్మిణి. కె Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఊరి కథల్ని చెప్పి ఊరు చూపించకపొతే ఎట్లా చిన్నోడా… బావుంది కవిత

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు