మాటంటే గొంతు పుట్టని పిండితే
ఉబికే శబ్దపు బొట్లు కాదు
స్వర పేటికని కత్తిరిస్తే రాలి పడే బాధా శకలాలు కాదు
గుచ్చుకునే ముల్లో గుండెలో దిగే గునపమో కాకూడదు కాకూడదు
వేటగాడి బాణమో
గజదొంగల చురకత్తో
కానివ్వొద్దు కానివ్వొద్దు
మాటంటే బుగ్గల్ని ప్రేమగా నిమిరే
నెమలీక కావాలి
నీ వేలు బలంగా పట్టుకున్న
పాపాయి పిడికిలి కావాలి
గుండె మీద భరోసాగా తల వాల్చి నిద్రపోయే
సాహచర్యం కావాలి
మాటంటే ఓ గొప్ప అనుభవం
మాటంటే ఓ మనోఙ్ఞ అనుభూతి
నల్లమబ్బుల్ని కరిగించే శీతల వాయులీనాలు
ప్రియుడి కౌగిలి లాంటి
తల్లి ఒడిలాంటి భద్రస్పర్శ
మాటంటే నేరస్తుడి చేతిలోని వేటకొడవలి కాదు
వైద్యుడి చేతిలోని స్పాల్పెల్!
మాటంటే నాలుక గాలితో చేసే గారడి కాదు
శరాఘాతంతో శిధిలమైన హృదయంలో ప్రాణం ఒంపు దివ్యౌషథం
మనస్సరోవరంలో నుండి పైకి దుమికే చేపపిల్ల
చూపుకి దృష్టికి, బతుక్కి జీవితానికి తేడా తేల్చి చెప్పే సాధనం
ఇన్నెందుకు
మాటంటే మాటలా
అది ఉక్కు దర్వాజాలను ఊపిరితో తెరవగలిగిన ఓపెన్ ససేమ్
*
2.
రా….!
భూమండలాన్ని వెలిగించడానికి నిరంతరం కాగడానై కాలుతున్నదాన్ని
కాలాతీత వ్యక్తిని
నా అస్థిత్వం నుండే రోజులు ఆకుల్లా రాలుతుంటాయి
ఏదీ ప్రత్యేకం కాదు నాకు
పొయ్యీ నేనే పొయ్యి మీద ఎసరూ నేనే
ఉత్పత్తికీ నేనే పునరుత్పత్తికీ నేనే
నాకు నేనే నీకూ నేనే
అనేకంని ఏకం చేసేది నేనే
ఒకే ఒక్క విశ్వాన్ని బహుళం చేసేది నేనే
ఏదని ఇస్తావు ఎంతని ఇస్తావు నాకు?
ఏమని చూస్తావు ఎక్కడని చూస్తావు నన్ను?
నాకంటూ ఓ రోజు కేటాయించి
నాలుగు గచ్చకాయలు ముందేసి సంబరాలు చేసుకోమంటావు
నిన్నే భూమ్మీదకు తెచ్చినదాన్ని
పొగడ్తల నాగస్వరంతో నన్నే పాముబుట్టలో కూరాలనుకుంటావు
నీ దండలు వద్దు దండాలూ వద్దూ
అవసరాన్ని బట్టి పట్టుబట్టలు చుట్టే
నీ మాయావి విద్యలూ వద్దు
రా… నీకు చేతనైతే ..రా
ఎలపల దాపల కుడి ఎడమల భుజానికి భుజమవుదాం
బిగించిన కరచాలనమవుదాం
వదులుకోలేని ఆలింగనమవుదాం
మాయాలోకం నుంచి భూగర్బంలోకెళ్దాం
భూగర్భం నుండి ఆకాశాన్ని చీల్చుకుంటూ
మనిషితనపు నిజమైన లోకంలోకి ఎగిరిపోదాం
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
తల్లి ఒడి లాంటి భద్ర స్పర్శ
భూమండలాన్ని వెలిగించడానికి నిరంతరం కాగడానై కాలుతున్నదాన్ని
కాలాతీత వ్యక్తిని
నా అస్థిత్వం నుండే రోజులు ఆకుల్లా రాలుతుంటాయి
Very nice poem రజిత గారు 👌👏
రెండు కవితలు ఎక్సలెంట్ ,మీకు సారంగ వెబ్ పత్రకకు అభినందనలు
వెరీ నైస్ జీ
రామ్
రెండు కవితలు బాగున్నాయి