అతడెప్పుడూ ఓడిపోలేదు
కాలం నది ఈదుతూ అలసి సొలసి పోలేదు
కాలం వెంట పరుగులు తీసే నడక ఆపినంత మాత్రాన
అడుగుల్లో అంతర్లీనమైన ప్రతిధ్వని
విన్పించనంత మాత్రాన
ఎవరూ ఓడిపోయినట్టు కాదు
ఎత్తుపల్లాల ఎగుడుదిగుడుల్లో
వేగంగా శరవేగంగా నడక సాగించనంత మాత్రాన
నడక పడవలా మారి తడబడినంత మాత్రాన
నడిసంద్రంలో మునిగిపోయినట్టేనా
భానుడు మబ్బులు చాటున తొంగిచూచి
కాంతి విహీనం కావడాన్ని ఆక్షేపించలేం కదా
ప్రతిపథంలో విజయబావుటా ఎగురవేయలేం కదా
మెట్టపల్లాల్లోను, చిత్తడి చెరువుల్లోను
నడక వేగం నిమ్మళిస్తుంది కదా
అరకు దున్నే రైతన్నకు అలసటన్నది అంటదు కదా
కలుపు తీసే కూలన్నకు అలసత్వం సాగదు కదా
ఎండమావుల జ్వాలలో పనిచేసే క్షణం
మనసు యంత్రంపై మనోగీతమై ముద్రణ
సొగసుల కలనేత రంజింపజేస్తుందా
అందుకే కలిసొచ్చే కమ్మని కాలం కోసం
కళ్ళను కాయలు చేసి
చూపుల దళ్ళ కిరీటాల బాహువుల్తో
కంటి వెలుకొసల్ని వేణువులు చేసి
మీటగల్గాలి
కమ్మని ఋతువును కలగనే కార్యర్థి
నాయకత్వం ధీరోధాత్తమై
శూన్యంలో సైతం స్వప్నాల్ని పండిస్తుంది
మనిషిని పురోగామినిగా ప్రణమిల్లుతుంది
ఉడుము తడిమితే పట్టు బిగించి
ఉరుకున పరుగున కొత్త వాక్యమై పూచి
జేగంట మ్రోగుతుంది
పనిలో నిమగ్నత ఉదాసీనతపై
యుద్ధభేరి మ్రోగించి
సన్నద్ధత మగ్నత కేతనంగా మారితే
వెలుగుపూల వసంతం భువిలో
వెలసినట్టే కదా!
*
Add comment