‘ఆ జుత్తేటి రా అలా గుంది ..సచ్చినోడా, చూడలేకపోతున్నా, కొద్దిగెల్లి కటింగు చేయించుకో కొడకా.. అస్సలు బాలేదురా, నీకు పుణ్యముంటాదిరా కొడకా ” అంది మరిడి లక్ష్మి కొడుకు సన్నిబాబుతో.
సన్నీ అని ఫ్రెండ్సు పిలుస్తూ, సన్యాసినాయుడు అని ఆధార్ కార్డులో, సన్నిబాబు అని ప్రేమగా తల్లి పిలుచుకునే ఆ గుంటడు లేచీ లేవగానే తన కొత్త షూ తుడుచుకొని, ఫోనోసారి చూసి టీవీ ప్లగ్గు కున్న వైరు ఊడబీకి అక్కడ ఫోను చార్జింగు పెట్టాడు.
మరిడి మాట్లాడుతుండగానే సన్నిబాబు తన బైకు కూడా తుడుచుకోవడం మొదలెట్టాడు.
కాసేపటికి బ్రష్షు నోట్లో పెట్టి తమ ఇంటిముందు నుంచి వెళుతున్న కాలవ దగ్గర వూయడం మొదలుపెట్టాడు.
‘ ఇంతలో సన్నీ.. ఓ సారిటు రా బే ‘ అని పిలిచిన ఆ ఫ్రెండుతో దగ్గరకెళ్ళి మాట్లాడి ఆ టూత్ బ్రష్షు అలాగ నోట్లో పెట్టుకుని వాడ్ని తీసుకొని బైకుమీద వెళ్ళిపోయాడు.
ఇంచు మించు ప్రతిరోజూ ఇదే తంతు ఉంటుంది కాబట్టి మరిడి లక్ష్మి ఒకసారి చూసి తన పనిలో పడిపోయింది.
ఆవిడ ఎన్ని మాటాడినా, తిట్టినా గుంటడు ఒక్కటి కూడా చెవికెక్కించుకోడు. ఆవిడకు కొడుకంటే చాలా ప్రేమ, యెందుకంటే వాడు పుట్టగానే అత్తగారు సచ్చిపోయింది, దాంతో మరిడి లక్ష్మి ఆనందానికి అంతులేదు.
‘ పెళ్లయిన ఈ రెండేళ్లు రాసిరంపాన పెట్టావు కదే ముసిలి ముండా ‘అని మనసులో తిట్టుకున్నా ముసిల్దాన్ని సాగనంపేటప్పుడు ‘ అత్తా.. నా అత్తా.. నన్ను కన్నతల్లిలా సాకావు కదే అత్తా ‘ అని గట్టిగానే ఏడిసింది.
పురటాలువి అలా ఎక్కువ ఏడకూడదమ్మా అన్నారు ఇంటి చుట్టుపక్కల వున్న దయగల తల్లులు.
ఇంక ఆ చిన్నింట్లో మొగుడూ తానే మిగిలారు.. అప్పటికే సంపాదన తక్కువైన మరిడి మొగుడు మరి నోరెత్తలేదు.
బిడ్డ పుట్టాక అత్త అడ్డులేదు కాబట్టి కాబట్టి సన్యాసి నాయుడు అని తన తండ్రి పేరెట్టుకుంది. దాంతో ఆమెకు పిల్లాడంటే మరీ ప్రేమ పెరిగిపోయింది. పిల్లాడికి తన పేరు పెట్టాక మరిడి తండ్రి సన్యాసి నాయుడు వూర్లో తను వ్యవసాయం చేస్తున్న అరెకరం మడిచెక్క ఆ గుంటడికే ఇస్తానని అందరిముందూ నామకరణం ఫంక్షన్లో తాగేసి చెప్పాడు.
మరిడి లక్ష్మి పెందుర్తి జంక్షన్ దగ్గర పళ్ళమ్ముతుంది. చిన్న తట్టలో పెట్టుకొని ఆయా కాలాల్లో దొరికే పళ్ళు అమ్ముతుంది.
పెందుర్తిలో పళ్ళమ్మాలంటే నోరుండాలి ముందు. అది మరిడి కి దండిగా వుంది. పీసు పీసు బేరమాడినోళ్ళకి.. వొంకరగా మాటాడినోళ్ళకి తన మాటలతో కచోడీలు తినిపించేస్తుందని తోటి వీధి వ్యాపారులు అంటుంటారు.
అంతా ఆనందంగా ఉందనుకుంటే మరిడి లక్ష్మికి పెద్ద సమస్య వొచ్చిపడింది.
గుంటడికి చదువు సరిగా అబ్బింది కాదు. యెంత సేపు ఆటలే ఆటలు, ‘తొమ్మిదో తరగతి లో ఒక గుంటను ప్రేమిస్తున్నానని రోజూ దాని వెంట పడీవోడు అంట.’ బడి లో పెద్ద గొడవే అయ్యింది.
ఆ పిల్ల ఈ గుంటడు రోడ్డు పక్కన మాట్లాడుకోవడం పిల్ల తండ్రి ఒకసారి చూసేడట. ఆళ్ళ పిల్ల బంగారం అని వీడే ఎదవ అని చెప్పి అతను వొచ్చి హెడ్ మాస్టారు దగ్గర పెద్ద గొడవే పెట్టాడు.
మరిడి స్కూలికి వెళ్లే టైముకి గుంటడు తప్పు చేసినోడులా రెండు చేతులూ కట్టుకోని వున్నాడు. పిల్ల తండ్రి పెద్దగా అరుస్తున్నాడు.
ఆడు సన్నిబాబును దాదాపు కొట్టబోయినంత మీదకొస్తే అతన్నుంచి పిల్లాడ్ని తప్పించడానికి ఆడి నోరు మూయించడానికే మరిడి లక్ష్మే సన్నిబాబుకి రెండు తగిలించింది, ఈ గొడవకి స్కూల్లో గుంటలంతా ఇటే చూడటం మొదలుపెట్టారు, దాంతో ఇద్దరికీ తలకొట్టేసినట్లయిపోయింది.
సన్నిబాబు ఆ అవమానంతో ఇక బడికి వెళ్లడం మానేసాడు.
ఆ రాత్రి పిల్లాడి చదువు పాడైపోయినందుకు మరిడి ఒకటే ఏడుపు. మొగుడు మాత్రం ఇవేమీ పట్టనట్లు అటు తిరిగి తొంగున్నాడు.
ఆ సాయంత్రం నుంచి పిల్లాడు ఇంట్లో పడుకోడం మానేసాడు, దగరలో వున్న ఫ్రెండు రూములో పడుకుంటానని తినేసి ఎలిపోతాడు.
తెల్లారగట్టే వొచ్చి మళ్ళీ ఇంట్లో కాసేపు పడుకుంటాడు. అలా బడి మానీసి ఇప్పటికి నాలుగో సంవత్సరం అవుతోంది. వుంటానికి పదిహేడేళ్లే గాని పెద్దోడిలా అయిపోయాడు.
అలా ఆ రోజు రూముకెళ్లినోడు కాస్తా పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కేటరింగు పనులకు అలవాటుపడ్డాడు.
‘’ఏమ్మా మరిడీ మీ గుంటడు పనులకు ఎల్తన్నాడంట గదా?” అని ఎవరైనా అడిగితే..
‘’ఆ.. ఏం పనుల్లేవె… ఒలేయ్.. అవీ ఒక పనులే కేటరింగ్ పనులకు ఎల్తుంటాడు జేబు ఖర్చులికి’’ అని సముదాయించుకొస్తుంది.
అలా సంపాయించిన డబ్బులతో ఈ ఎం అయి తో ఫోను, ఒక సెకండ్ హ్యాండ్ బండీ కొనుక్కున్నాడు.
‘పిల్లాడికి ఏ అలవాట్లు లేవు కానీ చిన్న వయసులో వొస్తున్న డబ్బులతో ఏటైపోతాడో అని మరిడి లక్ష్మికి బెంగ.’
ఎక్కడ చూసినా ఈడి వయసు గుంటలు బండి మీద హైవే లో యాక్సిడెంట్లయి సచ్చిపోవడం. మొన్న ‘నాయుడు తోటలో ఇలాంటి వయసు గుంటలు ముగ్గురూ ఒకే బండి మీద ఎల్తన్నారట, కొత్త బండట, ఆ టయిములో బండి స్పీడు నూట ఇరవై కిలోమీటర్లట, పేపర్లో వేశారు, డివైడరుకి గుద్దుకొని ఆ రోడ్డు మీదే సచ్చిపోయారు.
సచ్చిపోయాక ఆళ్ళ ఫ్రెండ్సంతా కలిసి ముగ్గురికి ఫ్లెక్సీ ఏయించారు. పైగా తాగేసి ఒకటే ఏడుపులు.
అల్లు దూరపు చుట్టాలు కావడంతో ఆరోజు దినకార్యానికి మరిడి లక్ష్మి కూడా వెళ్ళింది
ఆ పిల్లలంతా తాగీసి వున్నారు, ఒక్కడికీ వాటం సరిగా లేదు.
ఇది కాక అరకో, పాడేరో, సీలేరో రెండేసి రోజులు బల్లేసుకొని ఎల్లిపోయిన వొయిసిన గుంటలు అక్కడ నీళ్ళలోకి దిగి గల్లంతైపోవడం ఆ తల్లితండ్రుల శోకం చూడలేకపోతోంది.
‘మొన్న పురుషోత్తపురం గుంటలు ఇద్దరు తాగేసి ఈతకని మేఘాద్రిగెడ్డ డాములో దిగి సచ్చిపోయారు, మరిడి కులపోల్లె ఆలు, ఆరోజు నుంచి రెండు మూడు రోజులు మనసు మనసులో లేదు.’
పిల్లాడికి మరిడికి మాటలు పెద్దగా వుండవు.
ఆ దినకార్యానికి వెళ్లొచ్చినప్పటినుంచి మారిడి కడుపంతా దేవేస్తుంది.. ‘ఒక్కగానొక్క నలుసు ఏమీ కాకుండా కాపాడు కనకమాలచమీ ..సింహాద్రి అప్పన్నా’ అని ఒకటే మనసులో వేడుకుంటుంది.
తమ గ్రామ దేవత మారిడిమాంబకు కొబ్బరికాయకొట్టి అరటిపళ్ళు సమర్పించి పెద్ద బొట్టు పెట్టుకుని ” అహ ఏం కాదులే.. పిల్లాడొచ్చేస్తాడు.. ఆడి ఫోను పోయుంటాది ” అని సరిపెట్టుకుంటుంది.
‘ ఇదిగో చోడవరం కాటరింగు పనిమీద ఎల్లొత్తానన్న పిల్లాడు రెండురోజులైనా ఏ కబురూ లేదు, పిల్లాడి ఫోను పనిచేయటం లేదు. ఆడి గురుంచి ఎవర్నడగాలో తనకి తెలీటం లేదు.’
ఆ రోజు సాయంత్రం నాలుగవుతోంది.
కుయ్.. కుయ్.. మని వికారమైన శబ్దం చేస్తూ అంబులెన్స్ ఒకటి ఆ ఆ చెరువు కబ్జా చేసి కట్టుకున్న కార్మికనగర్ లో కి రాలేక రాలేక వస్తోంది., దారంతా బిందెలు, టూ వీలర్ బండ్లూ అడ్డుగా వున్నాయి.
ఏదో ధ్యాసలో వున్న మరిడి లక్ష్మి గాభరెత్తిపోయి వీధి చివరనున్న ఆంబులెన్సుకి ఎదురెళ్ళిపోయింది. ‘ కొడకా..నా కొడకా.. అని ఒకటే ఏడుపు లంకించుకొని కింద పడి దొర్లడం మొదలుపెట్టింది ‘
దాంతో గాభరాపడ్డ ఆడాళ్ళంతా ఆటే చూడగా అందులోని ఒక మహాతల్లి “ఏటే ఏమయ్యిందే ఎందుకలాగా పొర్లు దందలెట్టేట్టున్నావు, సచ్చినోడు మన మజ్జి సూరి ఆల మావయ్య ..బాగా తాగేస్తాడు కదా నిన్న కె జీ హెచ్ లో పోనాడు, ఆడ్నుంచే ఈ అంబులెన్సు “ అంది.
“ఆ ఏటీనేదు..ఏటీనేదు….ఏదో గాభరా అయిపోంను” అంది.
గుండెలదిరిపోతుండగా వేగంగా గుమ్మం దగ్గరకొచ్చి కూర్చొని “ కొడకా .. ఎక్కడున్నావురా .. తొందరగా రా తండ్రీ .. అమ్మా మరిడిమాంబ తల్లీ పిల్లడింటి కొచ్చేస్తే యెర్ర కోడిపెట్ట కోసేత్తాను తల్లీ అని దన్నవెట్టుకుంది. “
కాసేపలాగ ఏడిసీ .. ఏడిసీ .. పడుకుంది, పోయి లెగిసి మొఖం చెంగుతో తుడుసుకొని రెండు సార్లు కాల్వలోకి ముక్కు చీదింది.
వాడంతా , ఊరంతా, అంతా చీకటి అలముకుంది.
పెందుర్తి జంక్షను నుంచి గోపాలపట్నం వరకు మాత్రం రోడ్డుపక్క కబ్జా చేసి కట్టిన మాల్సు అపార్టుమెంట్ల వెలుగులతో జిలుగు.. జిలుగు మంటోంది.
జనమంతా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తొందరగా ఇంటికెళ్లాలన్న ఆదుర్ధాతో దూరిపోయి, వొంకర టింకరగా ఆ రోడ్లు మీద వెళ్లిపోతున్నారు.
కొంత మంది పగలు, మరికొంతమంది రాత్రుళ్ళు సరిగా కనిపించని గోతులు, స్పీడు బ్రేకర్లు, డివైడర్లు గుద్దుకొని చచ్చిపోతున్నారు.
రెండు సర్వీసు రోడ్లు, ఒక మెట్రో రోడ్డు కూడా జనానికి సరిపోవడం లేదు, ఎగుడు దిగుడు ఎత్తుపల్లాలు గల ఆ రోడ్లలో ఎలాగ వెళ్లాలో సన్నిబాబు లాంటి పిల్లలకు చెప్పినోడు లేక ఆళ్ళ ప్రాణాలు పోతున్నాయి.
మరిడి వీధి చివరకు చూపులంటించి చూస్తా వుంది.
ఎప్పుడో అర్ధరాత్రి వొచ్చి పడుకుంది.
మొగుడప్పటికే ఒక ‘మ్యాన్షనోసు నిబ్బు’ వేసుకొని పడుకొని వున్నాడు.
సన్నిబాబు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు.
మరిక ఎప్పటికీ రాడు కూడా…
క్యాటరింగ్ పని అయిపోయి ఆ అర్ధరాత్రి చోడవరం నుంచి తిరిగొచ్చేటప్పుడు వెంకన్నపాలెం గోతుల్లో పడిపోయి తలకు దెబ్బతగిలి చచ్చిపోయాక కె జి హెచ్ మార్చురీలో సన్నిబాబు శాశ్వతంగా నిద్రపోతున్నాడు.
చచ్చిపోయినోడి దగ్గర ఫోనూ ..పర్సు ఆ చీకట్లో ఒక తాగుబోతు లేపేయడం వలన పోలీసులు గురుతు పట్టని శవాల జాబితాలో కె జి హెచ్ లో ఉంచారు.
*
Add comment