ఆకైనా కదలని నడివేసవి రాత్రిలో
ఉన్నట్టుండి తాకే గాలితెమ్మెరలా
అప్పుడప్పుడూ
నువ్వు గుర్తొస్తావు
నిండుకొలనుల్లాంటి నీ కళ్ళూ
లేత తాటిముంజలంత తేటగా కదలాడే నీ పెదాలు
ముద్దగా ముద్దుగా కదలాడే నీ పెదాలూ
మల్లెపూరేకు విచ్చుకున్నంత మెత్తగా మత్తుజల్లే నీ నవ్వూ
కొత్తచివుళ్ళ కాంతితో మెరిసే నీ దేహమూ గుర్తొస్తాయి
యింకేవీ కాదు,
ఒఖ్ఖడినయి నీ వొడ్డుకు చేరినపుడు
అలల్లా చెంపల్ని తాకి నను సేదదీర్చిన నీ కురులు గుర్తొస్తాయి
నడుస్తూ నడుస్తూండగానే చీకటయిపోయిన కాలాల్లో
మన మనసుల్లో మొలిచిన నక్షత్రాల మెరుపులు గుర్తొస్తాయి
నా చందమామా,
దిక్కు తెలియక, ఉక్కిరిబిక్కిరయీ
మరింకేవో ఉన్మత్త లోకాల మాయలో పడి
యిట్లా చేయి విడిపించుకొని వచ్చేశానుగానీ,
నిన్ను ముట్టుకున్న ప్రతిసారీ
నా వేళ్ళచివర్లలో పుట్టుకొచ్చిన పావురేగుల రెక్కల చప్పుళ్లు
అప్పుడప్పుడూ గుండెలో ప్రతిధ్వనిస్తాయి.
*
చిత్రం: చంద్రం
Add comment