“ఒక తప్పిపోవడం గురించి” కథలో మురళిలో శారీరకంగా వెల్లడయిన మానసిక మార్పులు, అవి అతని కుటుంబ జీవితంలోనూ, చుట్టుపట్ల కలిగించిన పరిణామాలు, అతనిలో వెల్లడయిన చిత్రకళ ప్రధానంగా కనిపించే మూడు అంశాలు. సర్వసాక్షి కథనంలో వెల్లడయిన ఈ కథలో మురళి అంతరంగమూ, బాహ్యప్రపంచమూ సహజీవనం చేస్తాయి. ఆ రెండు ప్రపంచాల మధ్య ఉండే తెరని ఈ రచన తరచుగా దాటుతూ కన్పిస్తుంది. ఉదాహరణకి, కనుపాపల వెనక … కళ్ళు తెరిచేసరికి అంటూ మురళిలో మానసిక భావనల వర్ణన అతనిలోకి పరకాయ ప్రవేశం చేస్తే తప్ప జరిగేది కాదు.
ముందు పేర్కొన్న అంశాలలో మురళి బాధల వివరణలు Guy de Maupassant రాసిన Le Horle కథనీ, వెలువడిన చిత్రకళ Van Goghనీ, రోగి, అతి దగ్గరి చుట్టాన్నీ జ్ఞప్తికి తెచ్చాయి.
Le Horle కథలో సిఫిలిస్ వ్యాధికి గురయిన వ్యక్తి చివరి దశలో బాధల వ్యక్తీకరణ ఉంటుంది. Maupassant చరమదశలో రాసిన ఆ కథని, అతను అనుభవించిన బాధలని వెల్లడించాడని అనుకోవడంవల్ల విమర్శకులు, విశ్లేషకులు ఆ కథకి ప్రత్యేక స్థానాన్నిచ్చారు. “రవి గాంచనిచో కవి గాంచున్” అన్న నానుడి ప్రాచుర్యంలో ఉన్నా గానీ, మురళిని బాధిస్తున్న రోగం గూర్చి అతని మెదడులో ప్రవేశించి వర్ణించడం మాత్రం సాహసం చెయ్యడమే. ఎందుకంటే, తన పరిస్థితి ఇదీ అని ఎవరికీ తెలుపలేనితనం అతనిది. ఇప్పుడు ఆమెకి తెలిసిన మనసుకి తలుపులు పడిపోయాయి. ఆ తలుపుల వెనకాల ఏవో గరుకు తోకలూ, పదును కోరలూ ఉన్న మృగాలు తిరుగుతాయి. అతని మీద పడి గీరుతాయి, రక్కుతాయి, కొరుకుతాయి. అతను పెట్టే కేకలు మాత్రమే బైటకి వినపడతాయి.
ఈ నాలుగు వాక్యాల్లో చివరిది మాత్రమే గీతకే కాక మిగిలిన ప్రపంచానికి కూడా ప్రదర్శింపబడిన విషయం. మిగిలినవి అతని ఆలోచనలు అన్నది రచనలో వెల్లడయిన ఊహ. అందరికీ అర్థమయ్యే లోకం లోకి వచ్చి, ఆ లోకంలో ఒకడిగా కనిపించాలన్న ఆత్రం అతని ముఖం మీద ఒక వెర్రి నవ్వు లాగా అంటుకునేది. అన్న వాక్యంలో ఆ సాహసం తేటతెల్ల మవడమే కాక ఎబ్బెట్టుగా కూడా అనిపిస్తుంది. అతని లోపలెక్కడో ఇంకో మనిషి ఈ ప్రదర్శనని చూస్తూ, “నువ్వు మామూలుగా ఉండటాన్ని కూడా సరిగ్గా నటించ లేకపోతున్నావురా” అని జాలి పడుతున్నట్టు– అతని వెర్రి నవ్వు వెనకా, తడబడే మాటల వెనకా– కళ్ళలో ఒక దీనత్వం కదిలేది. అన్న వాక్యాలని, “అతనెవరు, అతని లోపలి మనిషెవరు” అని లేవనెత్తే తాత్త్విక ప్రశ్నని పక్కన పెడితే, ఆ సాహసానికి పరాకాష్ఠగా చెప్పచ్చు.
అతని మెదడులో అనూహ్యంగా జరిగే ఏవో కెమికల్ మార్పుల మీద తన మనశ్శాంతి ఆధారపడటం గీతకి కొత్తగా అలవాటు పడాల్సిన విషయమైంది. అన్న వాక్యంలోని కెమికల్ మార్పుల ప్రస్తావన సైకియాట్రిస్ట్ ని కలిసిన తరువాత వచ్చుంటే సహజంగా ఉండేది; ముందు రావడంవల్ల రచయితకుమల్లేనే గీతకు కూడా బ్రెయిన్లో జరిగే విధివిధానాల మీద అవగాహన ఉన్నట్టు కన్పిస్తుంది కానీ ఆమె వృత్తిపరమైన ప్రస్తావన కథలో లేకపోవడంవల్ల అది రచయితకున్న ఎరుకవల్ల లేదా తీసుకున్న స్వేఛ్చ వల్ల మాత్రమే నని అనిపిస్తుంది.
చిన్నతనంలోనే కాక పెళ్లి విషయంలో కూడా రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టరు తండ్రి మురళితో ప్రవర్తించిన తీరు కలిగించిన మానసిక వేదన ఎట్టకేలకు అతని మెదడులో విస్ఫోటాన్ని కలిగించిందని సూచీప్రాయంగా కథ తెలుపుతుంది. చైల్డ్ అబ్యూజ్ అడల్ట్ లైఫ్ లోని క్రిమినల్ ప్రవర్తనకి కారణం అని క్రితం శతాబ్దం చివరలో కోర్టు కేసుల్లో ముద్దాయి తరఫున వాదించి కొన్ని సార్లు గెలిచారు కూడా. కానీ, కథకి ఈ పిట్టకథ అవసరం లేదనిపిస్తుంది. అలాగే, చిత్రకళ మీద ఆయనకున్న చిన్నచూపు కూడా (అవుట్ డోర్ స్కెచింగ్ గ్రూపులో చేరాడని తెలిసినప్పుడూ).
ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ తర్వాత మురళి మెదడు చాలావరకూ జ్ఞాపకాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒక్కోసారి ఏదో పాత జ్ఞాపకం లీలగా రాజుకున్నా గానీ అందుకునే లోపే మాయమయ్యేది. ఈ రెండు వాక్యాలలో ప్రస్తావించబడిన జ్ఞాపకాలు లేకపోవడం, ఖాళీగా ఉండడం రచన ఆథెంటిసిటీకి సంబంధించినవి – అంటే, కుండ బద్దలు కొట్టినట్టు రచయిత అంత స్పష్టంగా ఎలా చెప్పగలడు అన్న ప్రశ్నని లేవనెత్తేవి. జ్ఞాపకాలు మెదడులో ఎక్కడ నిక్షిప్తమౌతాయో న్యూరాలజిస్టులు కనుక్కున్నారు గానీ వాటిని ఎలా బయటకి తీస్తామో, కొన్ని జ్ఞాపకానికి రాకపోవడం నిక్షిప్తం చేసినవాటిని చేరుకోలేకపోవడం వల్లనా లేక అక్కడ ఏమీ లేకపోవడంవల్లనా అన్న ప్రశ్నలకి మాత్రం సమాధానాలు ఇంకా దొరకలేదు. కానీ ఇలాంటి మురళి మెదడులో సుడి తిరిగే ఆలోచనలు కొల్లలుగా కథలో కనిపిస్తాయి. కథ సగంలో గీత అతన్ని ట్రీట్మెంట్ సెంటర్లో వదిలి వెళ్ళిన తరువాత మాత్రం చాలా.
మచ్చుకి:
లోపల్నించి భయం పీకుతున్నా- ఇంకా ఎక్కడో మిగిలిన మగతనపు కుటుంబపెద్ద అవశేషాల్లోంచి తన ఈ రాతని కూడా గంభీరంగా ఒప్పుకుని తల ఊపి లోపలికి నడిచాడు. … జ్ఞాపకాలు దెబ్బతినటం వల్ల చివరకు ఆలోచన కూడా హాస్పిటల్ గోడలకి ఇవతలే తిరిగేది. … అప్పుడప్పుడూ మంచానికి జారబడి కూర్చుని తన పరిస్థితి గురించి ఆలోచించాలని ప్రయత్నించేవాడు. … మురళికి అదే పెయింటర్ ఈ కొత్త ప్రపంచంలో బతికుంటే ఏం చేసేవాడా అన్న ఆలోచన వచ్చింది. …
పాత వుడ్ బ్లాక్ ప్రింటుల్లోని అందం మురళికి కన్నీరు తెప్పించింది. … ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మురళిని బొమ్మలు గీసే పిచ్చి పట్టుకుంది. “అందం కన్నీరు తెప్పించింది” అని మురళి స్వయంగా ప్రస్తావించడం వేరు, ఇలా రచయిత చెప్పడం వేరు. గీత సమక్షంలో గానీ కాకపోనీ, మురళి డాక్టర్లతో ఏం మాట్లాడాడో ఎక్కడా చెప్పబడలేదు. మురళి మూగపోయాడు అని కూడా రచయిత ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ “పిచ్చి” వాడుక రచయిత నిజంగా శ్రధ్ధతో చేసిందేనని అనుకోబుధ్ధి కావట్లేదు. “యావ” అనడం సరయిన ప్రయోగం అనిపిస్తుంది.
టాబ్లెట్స్ నోట్లో పెట్టుకుని నర్సుకి నోరు తెరిచి చూపించాక కూడా ఎలా వాటిని నర్సు కన్నుగప్పి ఊసేయచ్చో, ఒక్కోసారి అసలు నోటి లోకి కూడా పోనివ్వకుండా కనికట్టు చేసి ఎలా జేబుల్లో దాచేయచ్చో… ఈ ట్రిక్స్ అన్నీ ఆ పేషెంట్ ఒక మెజిషియన్ తన విన్యాసాల గుట్టు బైటపెడుతున్నట్టు గర్వంగా చెప్పాడు. ఇది ఆస్కార్ బహుమతి పొందిన One Flew Over the Cuckoo’s Nest సినిమాలో సంఘటనని గుర్తు చేసింది. అలాగే, ఒక రోజు ఆ ట్రీట్మెంట్ జరిగిన గది లోంచి నర్సు వీల్ చెయిర్లో మురళిని తోసుకుంటూ బైటకు తీసుకు వస్తుంటే– అతని చూపుల్లో తనపట్ల అసలేమీ లేకపోవటాన్ని గీత మొదటిసారి చూసింది. అన్న వాక్యాలు కూడా ఆ సినిమాలో చక్కగా దృశ్యీకరణ చేయబడి కనిపిస్తాయి.
వరుసగా ఒక మూడు రోజుల పాటు మందులు వేసుకోకుండా బైటికి ఊసేసాక– మురళి మెదడు మతితప్పినవాడికి మాత్రమే సాధ్యమయ్యే ఇంటెన్సిటీని సాధించింది. ఇది రచయిత జొరబడి చేసిన అనవసర వ్యాఖ్య. “మతితప్పినవాడికి మాత్రమే సాధ్యమయ్యే ఇంటెన్సిటీ” గూర్చి ప్రపంచం అంతా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నదా? కొందరు ఆటిస్టిక్ మనుషులు అరుదైన టాలెంటుని కలిగి ఉంటారని తెలుసు గానీ అందరు మతి తప్పినవాళ్లూ అంతే టాలెంటునీ, అదే ఇంటెన్సిటీనీ, కలిగి ఉంటారని ఎక్కడా ప్రస్తావన కనిపించదు.
మురళిలో ఉన్న రుగ్మత గూర్చి ఒక డాక్టర్ లేదా పరిశోధకుడు వచనంలో జొరబడి పాఠకులకు విశదీకరించకపోవడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే, ఆ రుగ్మత మురళి మాటల ద్వారా కొంతయినా వ్యక్తమయితే పాఠకునికి అది పూర్తిగా రచయిత చేతిలో గోరుముద్ద పెట్టి తినిపించినట్లయేది కాదు. Van Gogh అంత గొప్ప చిత్రాలు గీయడానికి అతని మానసిక పరిస్థితి కారణం కావచ్చు – కొందరు ఆటిస్టిక్ వ్యక్తుల అసామాన్య సమర్థత లాగా. దాని గూర్చి ఈనాడు తెలియడానికి కారణం మాత్రం అతను తన తమ్ముడికి రాసిన ఉత్తరాలు.
“I am unable to describe exactly what is the matter with me; now and then there are horrible fits of anxiety, apparently without cause, or otherwise a feeling of emptiness and fatigue in the head.…and at times I have attacks of melancholy and of atrocious remorse” [The Complete Letters of Vincent van Gogh. Minnetonka, MN, Bullfinch Press, 2000]. “There are moments when I am twisted by enthusiasm or madness or prophecy, like a Greek oracle on the tripod. And then I have great readiness of speech” [Van Gogh-Bongers JG (ed): Vincent van Goghs Briefe an seinen Bruder. Frankfurt am Main, Germany, Insel Verlag, 1988]. (Both references found here.)
At Eternity’s Gate సినిమాలో Van Gogh జీవితాన్ని బాగా చిత్రీకరించారు. అలాంటి చెప్పగలిగిన వ్యక్తిత్వం కొంతయినా మురళికి ఆపాదించి వుంటే అది పాఠకులు కథ చదివి అతని యాతనని అర్థంచేసుకోవడానికి సహాయపడేది. అలా లేకపోవడం, ఈనాటి కమర్షియల్ సినిమాని గుర్తుచేసింది: వాళ్ళు తీస్తారు, మనం చూస్తాం.
రోగి అతని తరఫువాళ్ళకి కలిగించిన బాధల గూర్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీత తన దారి తను చూసుకోవడానికి తండ్రి సహాయం దొరకడం ఆమె అదృష్టం. అలాంటి అదృష్టం వరించని వ్యక్తి మాకు దగ్గరి చుట్టం. తల్లిదండ్రులు అకస్మాత్తుగా మరణించడంవల్ల దాయాదులు పూనుకుని కుదిర్చిన పదవ తరగతి పూర్తిచెయ్యని ఒక కుర్రాడితో ఏడడుగులు నడిచింది. ఉద్యోగం లేకపోయినా ఒకడే కొడుకు కావడం, స్వంత ఇల్లు, కొంత పొలం ఉండడం ఆ పెళ్లిని సాధ్యం చేసింది. పసుపు పారాణి ఆరకముందే అతని అరుపులకీ, కేకలకీ, ఏడుపులకీ భయపడి పంచాయితీ పెట్టిస్తే తెలిసిన దేమిటంటే, అతనికి అది సాధారణమే నని అతని చుట్టుపక్కలవాళ్లు చెప్పడం. పెళ్లయితే పిచ్చి కుదురుతుందని అతని తల్లిదండ్రులు ఆశించారట!
మరీ ఉధృతంగా ఉంటే – ఏడుపుతో కలిపి స్వంత వాళ్లనే కాక ఆ వీధిలో వాళ్లనందరినీ బూతులు తిడుతుంటే – గదిలో పెట్టి తాళం వెయ్యడం, దానివల్ల ఫలితం లేకపోతే కాళ్ళూ, చేతులూ కట్టి హాస్పిటల్ కి తీసుకు వెళ్ళి ఎలెక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళు చేసిన పనులు. అతని జీవితమంతా అలానే నడిచింది. షాక్ ట్రీట్మెంట్ తరువాత కొన్నాళ్లు మామూలుగానే మాట్లాడేవాడు. మామూలుగా ఉన్నప్పుడు భార్య మా ఇంటికి తీసుకువచ్చినప్పుడు అతనితో సంభాషించాను. అతని రోగం గూర్చి అతను డాక్టర్లతో ఏం చెప్పేవాడో తెలియదు గానీ, తెలిసిందల్లా జీవించడానికి ఆ స్త్రీ పడ్డ నరకయాతన. డబ్బుకోసం ఇంట్లో భాగం అద్దెకిస్తే ఇతని అరుపులకి భయపడి నెల తిరగకుండా ఖాళీ చేసేవాళ్ళు. చేతగాని భర్త అవడంతో అవడంవల్ల ఆమె అందరివల్లా మోసపోయింది. ఇళ్ళకి వెళ్ళి పిల్లలకి ట్యూషన్ చెప్పబోతే అక్కడ మగవాళ్ళు చెయ్యి పట్టుకున్నారు. పొలం కౌలు చేసేవాళ్ళు డబ్బుగానీ ధాన్యంగానీ సగం ఇస్తే గొప్ప. అలాగని పొలాన్ని అమ్మకానికి పెడితే సగం ధర కూడా ఇవ్వలేదు. ఒక వైద్యనారాయణుడు ఆడబ్బుని తన పేర బాంకులో వేసుకున్నాడు. ఆ ఇంటికి శనిపట్టిందని ఒక ప్రబుధ్ధుడు దాన్ని అతి చవగ్గా స్వాధీనం చేసుకున్నాడు.
# # #
మనిషి ప్రవర్తనకి కొన్ని సరిహద్దులు ఎలా ఏర్పడ్డాయో తెలియదు గానీ ఆ హద్దుల కావలి ప్రవర్తనని ఈనాడు చిన్నప్పటి నించే గమనిస్తూ, పిల్లలు కూడా “పిచ్చి”వాళ్ళ మీద రాళ్ళు విసరడానికి తయారవుతుంటారు. సాధారణంగా కనిపించేవాళ్ల కయినా ఆ ప్రవర్తన ఏనాడు ఎలా మారుతుందో, అది సునామీ లాగా భూకంపం లాగా భరించలేని దెప్పుడు, ఎందుకు అవుతుందో ఎవరికీ తెలియని విషయం. చేత నయిందల్లా బాధితులు గీత లాగా శకలాల నేరుకుని ముందుకు సాగడం. మురళి లాంటి శకలాల భారం మాత్రమే ఈనాడు సమాజానికి ఎరుక. ఎక్స్-రే తీసి దొరికిపుచ్చుకున్నట్లుగా ఆ రుగ్మతకి కారణాన్ని, చికిత్సనీ కనుక్కునే దాకా ఎంత సృజనాత్మకత జోడించినా గానీ దాన్ని ఊహాగానంలాగా కాక పరిశోధకులకి వదిలేయడం సమంజసం.
*
Add comment