జాతి వివక్ష అవలక్షణాలు ఒక్కొక్క చోట ఒక్కోరకంగా అవతరిస్తాయి. వీటికి రంగు, రూపులు ఏవయినా చివరకు గమ్యం ఒకటే. ముఖ్యంగా జాతి వివక్షకు కాలం చెల్లని రోజుల్లో. ఇప్పటికీ అమెరికాలో ఆ వివక్ష వల్లే పోలీసుల కాల్పులలో ఆఫ్రికన్ అమెరికన్లు చంపబడ్డారన్న ఫిర్యాదుల గూర్చీ, ఆ కాల్పులకు నిరసనగా “బ్లాక్ లైవ్స్ మాటర్” అన్న ఉద్యమం రూపు దిద్దుకోవడం గూర్చీ వింటూంటాం. అలాంటిది, యాభై ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని – దేశంలో ఒక మారుమూల ప్రదేశంలో అయినా గానీ – తెలుసుకోవడానికి “ది మాచ్” కథని చదవాలి.
కథాస్థలం: యువనేరస్థుల కారాగారం, Eleanor (ఊరు), Florida (రాష్ట్రం)
కథాకాలం: పంధొమ్మిది వందల అరవై దశకం.
“నికెల్” అని పేరున్న ఈ స్కూలు (కారాగారం)లో శ్వేతజాతీయులూ, ఆఫ్రికన్ అమెరికన్లూ, వాళ్లతోబాటు అక్కడక్కడా తెల్లరంగు అనిపిస్తుండే మెక్సికన్లూ బందీలుగా ఉంటారు. ఇక్కడకు పంపబడే ఈ రెండు జాతుల పిల్లలలోనూ ఎవరికో ఎక్కడో అరా కొరాకి తప్ప తల్లిదండ్రుల మాట అటుంచి రక్తసంబంధీకులు కూడా ఉండరు. పదిహేడేళ్ల వయసుదాకా ఉండే పిల్లల్లో దాదాపు ఎవరూ బడి మొహం కూడా చూసినవాళ్లు కారు. ఒకటికి రెండు కలిపితే మూడు అని కూడా తెలియని అమాయకులు కూడా వీళ్లల్లో ఉంటారు. వాళ్లల్లో గ్రిఫ్ ప్రథముడు. అయితే, ఎలుగుబంటి వంటి అతని ఆకారం, దృఢత్వమూ కూడా అతని ప్రత్యేకతలు. బాక్సింగులో ఎటువంటి ప్రత్యర్థి నయినా చిత్తు చెయ్యగల సామర్థ్యం అతనికి ఉన్నది. (“Like an electric toaster or an automated washing machine, boxing was a modern convenience that made his life easier. … He was not graceful. He was not a scientist. He was a powerful instrument of violence, and that sufficed.”) ఫిబ్రవరిలో “నికెల్”కి వచ్చిన అతను ఆ సంవత్సరమే డిసెంబర్లో పాల్గొన్న బాక్సింగ్ మాచ్ వివరాలు ఈ కథాంశం.
ఈ మాచ్ కోసం ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలు ఎంతో ఎదురు చూస్తున్నారు. గ్రిఫ్ అక్కడకు వచ్చే ముందర ఆక్సెల్ పార్క్స్ అన్న కుర్రాడు తెల్లతని మీద బాక్సింగ్ లో గెలిచాడు. గ్రిఫ్ ఈసారి బిగ్ చెట్ అనే తెల్ల కుర్రాణ్ణి తప్పకుండా ఓడిస్తాడని వాళ్ల అంచనా. వివక్ష రంగు నల్లమబ్బులో నిండా మునిగిన వాళ్లకి ఈ గెలుపులు తళుక్కుమంటూ నయినా వెలిగే ఆశాజనక మయిన వెండి కిరణాలు. మాచ్ గూర్చి చెప్పే ముందర మనుషుల గూర్చీ, కాలం గూర్చీ కొన్ని వివరాలు –
అక్కడి నేరస్థులలో రంగులు ఉన్నాయి గానీ, అధికారులు మాత్రం పూర్తిగా తెల్లదొరలే. మాట వినని వారిని వెనకకు తీసుకువెళ్లి ప్రత్యేకమయిన ఆదరణను చూపుతారు. “You could change the law but you couldn’t change people and how they treated each other.” అన్న వాక్యాన్ని బట్టీ, కథాకాలం అమెరికాలో 1964లో పౌరహక్కుల చట్టాన్ని అమలులో పెట్టిన తరువాత అని అర్థ మవుతుంది. అయితే, “Nickel was racist as hell—half the people who worked there probably dressed up like the (Ku Klux) Klan on weekends—but, the way Turner saw it, wickedness went deeper than skin color.” అన్న వర్ణనని బట్టీ ఆ చట్టాన్ని ఎలనర్ అన్న ఆ ఊళ్లో ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆ బాక్సింగ్ మాచ్ అక్కడివాళ్లకి ఆకర్షణ. అందులో గ్రిఫ్ గెలవాలని ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలు కోరుకుంటుంటే, అక్కడి అధికారవర్గం ఆ ఏడాది ఆ మాచ్ ని పందెంగా చూసి, తమకి కావలసినవాడు గెలిచేందుకు సన్నాహాలు చేసింది. వాటికి (ఈ కథలోని టర్నింగ్ పాయింట్స్ కి) టర్నర్ అనే కుర్రాడు ప్రత్యక్ష సాక్షి. “నువ్వు ఓడిపోవాలి!” అని గ్రిఫ్ తో సూపరింటెండెంట్ స్పెన్సర్ అనడం అతను స్పష్టంగా విన్నాడు.
లీగ్ మాచెస్ లో గ్రిఫ్ తన వరుసలోని ప్రత్యర్థులని ఓడించి ఫైనల్ కు చేరుకున్నాడు. బిగ్ చెట్ తెల్లవాళ్ల వైపునించీ వచ్చి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. ఆకారంలో ఇద్దరూ సరితూగే వాళ్లే. “The two fighters were the same height and build, hacked from the same quarry. An even match, the track record of colored champions notwithstanding.” బిగ్ చెట్ తట్టుకుని నిలబడ్డా గానీ మొదటి రౌండులో గ్రిఫ్ వాణ్ణి ఉతికేశాడు. “The black giant battered the white boy without mercy, absorbed his opponent’s counterassault, jabbed at the kid’s face as if punching his way through the wall of a prison cell.” రెండవ రౌండులో బిగ్ చెట్ బాగానే ప్రయత్నించినా గానీ, చూసేవాళ్లకి ఆ రౌండ్ కూడా గ్రిఫ్ గెలిచాడనే అనిపిస్తుంది. ఇంక చివరి రౌండులో గ్రిఫ్ ఏకంగా మట్టి కరిస్తేనే గానీ సూపరింటెండెంట్ స్పెన్సర్ ఇచ్చిన ఆదేశాన్ని అతను అమలుపరచినట్టు అవదు. ఆ రౌండులోనే కాక ముందరి రౌండ్లలో కూడా బిగ్ చెట్ ప్రయత్నంలో లోపమేమీ లేదు. గ్రిఫ్ ని దెబ్బమీద దెబ్బ కొట్టాడు. అసలే ఒకటికి రెండు కలిపితే మూడు అని తెలియని గ్రిఫ్ అమాయకత్వం! దానికి తోడు బిగ్ చెట్ వర్షించిన దెబ్బలు!! గ్రిఫ్ అమాయకత్వమూ, ఆ దెబ్బలకు దిమ్మతిన్న మెదడు రెండూ కలిపి అతని భవిష్యత్తుని నిర్ధారించాయా అని టర్నర్ అనుకోవడంలో తప్పేమీ కనిపించదు.
అంతాన్ని ఊహించడం సులభమే గానీ, మెచ్చుకోవడానికి, హత్తుకోవడానికీ రచయిత వాక్యాలని చదవాలి. ఇది స్వర్గీయ రావిశాస్త్రి గారికి తప్పక నచ్చే సారో కథ.
https://www.newyorker.com/magazine/2019/04/01/the-match
రచయిత వివరాలని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
https://en.wikipedia.org/wiki/Colson_Whitehead
గ్రిఫ్ ని మరిచిపోవడానికి, ఆ గ్రీఫ్ నుండి బయటపడటానికి ఒక పెగ్గు వేసుకోవాలేమో!