![](https://magazine.saarangabooks.com/wp-content/uploads/2018/12/ganga1-256x300.jpg)
గంగాధర్ చాలా తక్కువ మాట్లాడేవాడు. అంత త్వరగా దేనిగురించీ తన అభిప్రాయం చెప్పేవాడు కాదు. అతడి గురించి తెలుసుకున్నదంతా కొన్ని సంవత్సరాల స్నేహంతో తెలుసుకున్నదే. కవులలో Walt Whitman అంటే అమిత ఇష్టం. అలానే కథకులతో మపాసా. హైదరాబాదుకు Whitman వస్తే .. చార్మినార్ కు తీసుకెళ్తా అనేవాడు. అలానే ఓ కవిత రాసాడు. ఇటాలియన్ దర్శకుడు పసోలినీ అంటే ప్రాణం. అతడు తీసిన “మామా రోమా” సినిమా పదే పదే చూసేవాళ్ళం. ఇంకా తన దగ్గర థియో ఏంజిలో పౌలోస్ – యులిసిస్ గేజ్, Tin Drum సినిమాలుండేవి. చేహోవ్ వార్డ్ నెం.6 నా చేత తనే చదివించాడు. స్టెంధాల్ the red and the black పుస్తకం చదవమని ఇచ్చాడు. నా కోసం ఒక కవిత రాయమంటే మపాసా మీద కవిత ఒకటి రాసిచ్చాడు. అంత చిన్న వయసులో అన్ని పుస్తకాలు ఎలా చదివాడా అన్న ఆశ్చర్యం కలిగేది. ఇవన్నీ అతడి స్నేహంలో నేను తెలుసుకొన్నవే కానీ అతడికి జ్ఞాన ప్రదర్శన ఎప్పుడూ లేదు. అతిగా ప్రచారం చేసుకునే తెలుగు కవులంటే కూడా గంగాధర్ చిరాకు పడేవాడు. నిప్పులు చెరిగేవాడు.
![](https://magazine.saarangabooks.com/wp-content/uploads/2018/12/ganga2-660x1024.jpg)
నేను చూసిన చివరి రోజుల్లో (ఆగస్టు 2011) మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. ఒంటరితనం ఎక్కువైంది. ఆరోగ్యం గురించి పట్టించుకోక పోవడం, అధిక శ్రమ చేత దృఢంగా ఉండేవాడు కాస్తా కృశించిపోయాడు. చివరికి తనను ఎవరో వెంటాడుతున్నారు వంటి hallucinations మొదలయ్యాయి. ఒకసారి ఇంటికి వెళ్తే మామూలు మనిషవుతావని తన ఊరికి వెళ్లి రమ్మని చెప్పాను. 2012 సంవత్సరం తరవాత అతడు కనపడటం మానేసాడు. కొన్ని కారణాలచేత మళ్ళీ నేను ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాను. ఒక్కణ్ణే మిగిలాక తెలిసిన వాళ్ళందరికీ చెబుతూ వచ్చాను. అంతరాంతరాల్లో ఏదో కీడు శంకిస్తున్నా తెలుగువాళ్ళకు దూరంగా ఏ బెంగుళూరులోనో ఏ చెన్నైలోనో తలదాచుకుని ఉంటాడనుకున్నాగాని స్వంత ఊరిలోనే ఇలా జీవితాన్ని ముగిస్తాడని కలలో కూడా అనుకోలేదు. ఇక అతడికోసం వెతకాల్సిన పనిలేదు. ఇక ఎవర్నీ అతడి గురించి అడగాల్సిన పనిలేదు.
మునుముందు మనకు మరింత మంది గంగాధర్‌లు కావాలి. అలాంటివాళ్ల కోసమే ఈ కవిత్వ పుస్తకం.
చిత్రకొండ గంగాధర్ కవితలు
ఎందుకున్నారో
1
ఈ భూమి మీదే, ఈ పెనుమూల
నిదురలేని రాత్రిలో
శాంతంగా
సిగరెట్ కాలుస్తో నిలబడి వున్నాను
ఆకలి చెట్టు పక్కన
ఆకులన్నీ చలివానకి ముడుచుకుపోయి
అంతులేని నిశ్శబ్దం వహించాయి
వాటి నిశ్శబ్దం
నాకు తెలీదు
2
వందేళ్ళ క్రితం నేనిక్కడలేను
నా నాన్న కూడా
కానీ
నా నాన్నకు నాన్న
యిక్కడే, యిదే చలికాలపు రాత్రిలో
మద్యంతో మాంసంతో
కూర్చుని వున్నాడు
నాలాగే తన ఇరవయ్యేళ్ళ యవ్వనంలో
(1997)
{చిత్రకొండ గంగాధర్ కవిత్వ సంపుటం ‘ఆత్మహత్యా సదృశ దేశదిమ్మరి ఆఖరి కోరిక పత్రశకలం’ నుంచి}
బలిష్టమైన బీడీ
గడియారం శిరస్సు మీద శిరోజాలు తెల్లబడ్డాక
యీ కన్నీళ్ళు అనవసరం
కోవెల మండపం మీద
కొందరు ముసలివాళ్ళు కూర్చుని వున్నారు
అందరి ముఖాలూ ఒకేలాగా లేవు
ముసురుపట్టిన ఈ సాయంకాలపు కోవెల ఆవరణలో
వేపచెట్టు ప్రక్కనుంచి పచ్చని చీర ధరించిన యువతి గొడుగు వేసుకుని వెళ్తోంది
ముసలివాళ్ళ మధ్య
నేనొక ఆగంతుకుని లాగా కూర్చుని వున్నాను
అందరూ తెల్లని దుస్తులు ధరించి వున్నారెందుకో?
బహుశా, రంగులు దహనమవ్వడమే జీవితం
వంద సంవత్సరాల తర్వాతా
రంగులు కాలిపోయిన ఈ ముఖాలు శాశ్వతం
ఈ వేపచెట్లూ, కోవెల మండపంలోని
ఈ ప్రశాంతతా శాశ్వతం
యిప్పుడిప్పుడే
చీకటి అలుముకుంటోన్న
ఈ సాయంకాలపు ఆకాశంలోకి నక్షత్రాలింకా రాలేదు
నేను నా అపురూపమైన బీడీని వెలిగించి కౌగలించుకున్నాను
దాంతోపాటే వెళ్ళిపోయాను పారవశ్యంగా నడుచుకుంటూ
(1999)
ఒక్కసారి గా గంగాధర్ జ్ఞాపకాల తో మనసు బరువైపోయింది. చాలా దగ్గర స్నేహితులైన వారి దగ్గర మాత్రమే కవిత్వం పంచుకునే వాడు.కవిత్వంలానే పరిచితంగానూ అపరిచితంగానూ ఉండే వాడు. కవిత్వం తెలియని దగ్గర స్నేహితులు కూడా అతని కవిత్వాన్ని భలే యిష్టపడే వాళ్లు.
ఫేస్ బుక్ లో గంగాధర్ గారి కవిత ఒకటి బాగా ఆకర్షించింది నన్ను… అతడి గురించి ఆసక్తి రేకిట్టించింది.. సారంగా లో అతడి కథ చదివాక చాలా భాధగా ఉంది..కవి కి మరణం ఉండొచ్చు కానీ కవితకి మరణం ఉండదు..
ఈ పత్ర శకలం చదువుతుంటే నా మనసు శకలాలు గా విడిపోయింది. గంగాధర్ లాంటి మిత్రుడికి మిత్రుడై నందుకు నాకంటే మీరు అదృష్టవంతులు- కృష్ణుడు
అవును.. అతన్ని ఇక వెతకఖ్ఖర్లేదు…
గుండె తేలికపడిందా.. మరింత బరువెక్కిందా.. అర్థం కాదు…
నేనూ ఇలాగే ఉండాలనుకున్నానేమో ఒకవేళ..
ఇంతకుముందెక్కడో తనని చదివిన ఫీలింగ్!
చిత్రకొండ.. నేను పుట్టి పెరిగిన ఊరు. గంగాధర్ గారి గురించి చదువుతుంటే మనసు బరువెక్కింది. మనసు.. శరీరం.. ఒక దానితో ఒకటి నిరంతరం పోరాడుతూ . ఆశలకు వాస్తవానికి పొంతన కుదరక.. ఇలా ఎంతోమంది గంగాధర్ లు
అయ్య! ఆనందం …. ఇలాటి మనిషి, మగాడు ఉన్నందుకు
అరెరే! మరణించారా అని.
అయ్యారే ! అసమాన ప్రతిభ కు ఆశ్చర్యం.
Howard Roark లాటి వాడు అనిపించి
అహహ, బోలెడు సిద్ధులు , అవధూతల వలె సంపూర్ణ లక్ష్యం కల లోక నిరాసక్త సత్యదర్శనం గల వ్యక్తిని తెలుసుకున్న సంతోషంతో కన్నీళ్ళు….
ఏం శాశ్వతం…! ఇలాటి స్థితి ఏ మనిషి చేరుకున్నా మనమూ చేరుకున్నట్లే.
ధన్యోస్మి
అవును అజయ్, నువ్వు రాసింది చదివాక గుర్తొచ్చింది. నేనొకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు గంగాధర్‌ని కలిశాను. మనం ముగ్గురం కలిసే భోజనం చేశాం. నీ శ్రీమతి వడ్డించారు . చేపల కూర అని గుర్తు. ఆయన కవిత్వం నాకు తెలియదు కానీ ఆయన గుర్తున్నాడు. గంగాధర్ వల్లనే నేను గోర్కీ నా బాల్యం మూవీ చూడగలిగాను. గంగాధర్ గురించి చాలా ఆర్తిగా, టచీగా రాసావు .
గంగాధర్ గారి గురించి ఆర్తి తో కూడిన మీ వ్యాసం, మనసును కలచి వేసింది. ఎందుకో ఆలూరి బైరాగి గారు గుర్తుకొస్తున్నారు. అవును, రంగులు దహనమ వ్వడమే జీవితం కదా. తప్పిపోయిన కవితామూర్తిని వెదికి, అందిస్తున్న అజయ్ ప్రసాద్ గారికి పాఠకలోకం ఋణపడిఉంది.
అందరూ తెల్లని దుస్తులు ధరించి వున్నారెందుకో?
బహుశా, రంగులు దహనమవ్వడమే జీవితం
ఒక కవి కి మాత్రమే మరణం తరువాత జీవితం ఉంటుంది గంగాధర్ గారు తన అక్షరాలతో ఇంకా మన మధ్యలో నే ఉన్నారు తనకి ఇష్టమైన బీడీలు కాల్చుకుంటు సిగరెట్ లు ఉదుకుంటు తన అక్షరాలు మన ముందు పరిచి…!!