ఒక వాక్యం రాయాలి అంటే వెయ్యి వాక్యాలు చదవాలి

ప్రతిష్టాత్మక మైన రంగినేని ఎల్లమ్మ పురస్కారాన్ని ‘రెప్పవాలని రాత్రి’ కవితా సంపుటికి అందుకున్న సందర్భంగా  వంశీ కృష్ణ తో    ప్రసేన్  మాటా మంతీ

అనేక కోణాల సాహిత్య వ్యక్తిత్వం వంశీ కృష్ణది. ఇది ఈ కాలంలో అరుదైన లక్షణమే! వచనమూ, కవిత్వమూ మాత్రమే కాకుండా భిన్న కళారూపాల ఆచూకీ తెలిసిన వాడు వంశీ. కానీ, కవిగా వంశీది ప్రత్యేకమైన దారి. ఇటుగా నడిచి వచ్చి, వంశీని అందుకోవడం కష్టమే! ఉద్విగ్నత ఒక లక్షణంగా కనిపించినా, దానిక్కావాల్సిన హేతువేదో వెతుక్కునే పనిలో వుంటాడు. అనుభూతి అంచులు చూపిస్తూనే కార్యకారణాల బంధమూ చూపిస్తాడు. ఏ విషయాన్ని అయినా వూరికినే వొప్పుకున్నట్టు కాకుండా తనదే అయిన రీజనింగ్ కోసం తపిస్తాడు. అందుకే, వంశీ రచనలో ఒక మెరుపుతో పాటు ఆలోచనల నిదానత్వమూ వుంటుంది. రంగినేని పురస్కారం సందర్భంగా చిన్న సంభాషణ-

ఒక సామాజిక ప్రయోజనాన్నో, ఒక మానసిక ఉద్విగ్నతా సంస్పందననో ఆశించి రాసే రాతలకూ తూకాలు కొలతలు వేసి ఇచ్చే అవార్డులకూ సాహిత్య సంబంధం నిజంగా ఉన్నదా ?

 తూకాలు , కొలతలు వేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు కదా! కనుక ఇచ్చే పురస్కారాలకి , తీసుకుంటున్న రాతకి నడుమ ఏదో  ఒక సంబందం  అయితే ఉంటుంది. అయితే అది సాహిత్య సంబంధమా ? లేక మరొక సంబంధమా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే . . అభ్యుదయ కాముకుడు గురజాడ  విశిష్ట పురస్కారాన్ని చాగంటి కోటేశ్వర రావు కి ఇచ్చినప్పుడు , అజంతా పురస్కారాన్ని మరొక ఫెమినిస్ట్ పోయెట్ కి ఇచ్చినప్పుడూ మీరు వేసిన ప్రశ్న లాంటి ప్రశ్నలు చాలా తలెత్తాయి. వేటికీ సరి అయిన  జవాబు దొరకలేదు . నిన్న చేసిన సభకి ఇవాళ పేపర్ లో పడే ఫోటో కి వుండే విలువ లాంటి విలువ మాత్రమే ఉంటున్న కాలం లో పురస్కారాలు నిజమైన రచన విలువను పెంచనూ లేవు. తగ్గించనూ లేవు . అయితే అన్ని పురస్కారాలని ఒకే గాటన కట్టేయలేము .

 నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, నేను అరిస్తే వాయిద్యం లాంటి హైపర్బోలాలతో కాకుండా సామాన్యుడికి అర్ధమయే భాషలో మీ కవిత్వం గురించి రెండుముక్కల్లో చెప్పండి.

 మీరు చెప్పిన రెండు విశేషణాలలో ఒక దానిని తిలక్ , మరొక దానిని శ్రీ శ్రీ తమ కవితలలో సందర్భవశాత్తు ఉపయోగించుకున్నారు . ఆ విశేషణాలని పాఠకులు ఆమోదించారు కనుక అవి నిలబడి పోయాయి. నా కవిత్వం గురించి సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో మీరు చెప్పమంటున్నారు . కానీ నా కవిత్వం గురించి నేనే చెప్పుకోవడం నాకు అంతగా నచ్చని విషయం . నా కవిత్వం గురించి పాఠకులు  ఏమనుకుంటున్నారు  అన్నది ముఖ్యం. డబ్బు పిట్ట  వచ్చినప్పుడు నాది గ్లోబల్ వ్యతిరేక కవిత్వం అన్నారు . కొన్ని నేను లు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సంవేదన  అన్నారు . ఇప్పుడు రెప్ప వాలని రాత్రి లో వున్నదంతా బ్రాహ్మణీయ భాష అంటున్నారు . వస్తువు తన రూపాన్ని తానే వెతుక్కుంటుంది అనే మాట వాస్తవం అయితే నేనెప్పుడూ ఒకే వస్తువుకు పరిమితం కాలేదు . అందుకే నా కవిత్వ భాష డబ్బుపిట్టలో ఒకలా , రెప్పవాలని రాత్రి లో ఒకలా , అమ్మ లేదు లో ఒకలా , మీరా పదాలు లో ఒకలా ఉంటుంది

మీరు అడిగారు కనుక ధైర్యం చేసి ఒక మాట చెపుతా !  ” నా కవిత్వం పెదవులతో చదవాల్సింది కాదు . హృదయం తో చదవవలసింది”

 కవిత్వం కావచ్చు, కథ కావచ్చు ఇప్పుడు రాస్తున్న చాలామంది తమ రచనా నిపుణతను భావోద్వేగం గా నటిస్తున్నారని నేనంటే మీ సమాధానం?

 ఈ మాట వందకు వంద శాతం నిజం. అయితే ఈ నటన ఇప్పటిది కాదు . భావ కవిత్వం నాటిది.  ఇంకా వెనక్కి వెళితే ప్రబంధ యుగం నాటిది . అసలు కవిత్వమే ఒక పెద్ద అబద్దం . ఒక పెద్ద నటన . నటుడు పోషించిన పాత్రలన్నీ అతడి స్వంతం కానట్టే , కవి సృష్టించిన కవిత్వమంతా , కథకులు సృష్టించిన పాత్రలన్నీ ఆ కవుల, కథకుల సొంతం కాదు . వాళ్ళ సహజ వ్యక్తిత్వాలు కాదు . కానీ మనకు అబద్దం పట్ల వుండే ఒక గొప్ప ఫాసినేషన్ అబద్దాన్ని నిజం గా నమ్మేట్టు చేస్తుంది.

కేవలం సాధారణ ఉపమాన ఉపమేయ రూపకాల ఊతకర్రలతో ఇప్పటి కవులు కవిత్వాన్ని పలచన చేసి కుంటుతున్నారేమో కదా?

కప్పి చెప్పేది కవిత్వం . విప్పి చెప్పేది విమర్శ అన్నారు సి.నారాయణ రెడ్డి . ఉపమాన , ఉపమేయ , రూపకాల  ఊతం  లేకుండా కవిత్వం ఉండదు . ఆమె ఏడ్చింది అంటే ఏడ్చినట్టు ఉంటుంది . ఆమె కళ్ళు శ్రావణ మేఘాలు అయ్యాయి అంటే కవిత్వం లా ఉంటుంది . కవిత్వం పలుచన కావడానికి కారణాలు చాలా వున్నాయి . అయితే మీరు చెప్పిన దాంట్లో మరొక ముఖ్య అంశం కూడా వుంది . మన కవులలో చాలామందికి మెటఫర్ కీ ప్యారడాక్స్ కీ తేడా తెలియదు . అర్ధాంతర న్యాసం అంటే అసలే తెలియదు . ఇవన్నీ తెలియాలా అని ఎదురు ప్రశ్నించవచ్చు. కానీ తెలియని దాన్ని తెలిసినట్టు నటిస్తే కవిత్వం లో తేలికగా దొరికిపోతారు . కవిత్వం లో వాడే విశేషణం , వాక్యాన్ని సంలీనం చేసే అలంకారం కవిత్వ వాక్యాన్ని బలోపేతం చేయాలి , బలహీన పరచకూడదు. అలా బలహీన పడటాన్నే మీరు కుంటటము అంటున్నారేమో . ఇప్పుడు గజల్స్, హైకు, రుబాయీలు విస్తృతంగా రాస్తున్నారు కదా వాటిని సరిగ్గా గమనించండి  ఆ ప్రక్రియా తాత్వికతే మన కవులకు అర్ధం కాలేదు అనిపిస్తుంది .

90 శాతం కవులు మంచి వచనం ఎందుకు రాయలేకపోతున్నారు?

 నిరలంకారమైన వాక్యం రాయండి అని చేరా పదే  పదే  చెప్పేవారు. కానీ వివిధ  దిన పత్రికలకు సంపాదకత్వం వహించి పాఠకులను నిరంతరం గమనిస్త్తూ వచ్చిన కే . రామచంద్రమూర్తిగారు దర్పణం కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మంచి మాట చెప్పారు . కవిత్వ తడి లేని వాక్యం పాఠకుడిని  అంతగా ఆకట్టుకోదు అని. అది వాస్తవం కూడా . మన దురదృష్టం ఏమిటంటే మీరు చెప్పినట్టు 90 శాతం కాదు కానీ చాలామంది మంచి వచనం రాయలేరు. మంచి వచనం రాయాలి అంటే సాధన ఉండాలి. కవిత్వం అయితే ఐదు నిమిషాల్లో రాసి , ఆరో నిమిషం లో ఎఫ్ బి లో పెట్టి ఏడో  నిమిషం లో లైకులు లెక్క వేసుకోవచ్చు. కానీ వచనం రాయాలి అంటే అలా కాదు . వాక్యం మీద కూర్చోవాలి . తెలుగు లోనే కాదు ఇతర భాషల్లో కూడా మంచి వచనం రాసే వాళ్లంతా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ లేఖలు రాసిన అనుభవాన్ని పొందిన వారే . ఇప్పుడు ప్రేమ వున్నది కానీ ప్రేమ లేఖలు లేవు , ఒట్టి  ఎమోజీలు తప్ప. ప్రేమ లేఖ రాయడమంటే అదొక తపస్సు . అదొక సాధన . అదొక ధ్యానం . ఆ తపస్సు, సాధన ధ్యానం తరువాతి జీవితం లో మంచి వచనం రాయడానికి దోహదపడుతుంది . ప్రేమలేఖలు అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు రాసేవే కాదు. కృష్ణమూర్తి రాసిన లేఖలు , సూరి నాగమ్మ రాసిన లేఖలు ఏవైనా చూడండి. వాటి వెనుక ఎంత సాధన ఉంటుందో తెలుస్తుంది

కవుల్లో అక్షరాస్యత పెంచడానికి ఎటువంటి పథకాలను మీరు సూచిస్తారు? ఇక్కడ అక్షరాస్యత అంటే చదవడం, అధ్యయనం,అర్ధం చేసుకోవడం, అన్వయం అని నా ఉద్దేశ్యం?

 నేను అక్షరాస్యుడనేనా  అన్నది పెద్ద ప్రశ్న. గతం లో పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు , పోయెట్రీ అప్రిసియేషన్  లాంటి కార్యక్రమాలు ఉండేవి . వాటిల్లో పాల్గొని గెలిస్తే చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవారు . బుక్ కల్చర్ నుండి లుక్ కల్చర్  లోకి వచ్చాము కదా! ఈ ట్రెండ్ కొంత కాలం ఉంటుంది . నేను చెప్పేది ఏమున్నది ? ఎంత ఇన్ టేక్  ఉంటే అంత అవుట్ పుట్ ఉంటుంది.  ఒక వాక్యం రాయాలి అంటే వెయ్యి వాక్యాలు చదవాలి . వంద వాక్యాలు తుడిపేయాలి.

*

ప్రసేన్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “కవిత్వం పెదవులతో చదవాల్సింది కాదు
    హృదయంతో చదవాల్సింది..”
    అభివాదములండి

  • ఎటు తిరిగి ఎవరు మాట్లాడినా అందరూ కవిత్వాన్నే టార్గెట్ చేసి మాట్లాడతారు. కవిత్వమంటే అయిదారు నిముషాల్లో రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఏడో నిముషం నుంచి లైక్ ల కోసం ఎదురుచూడడమా , మెజారిటీ కవిత్వం ఇలాగే ఉందా అనేది నా ప్రశ్న, వచనం రాయడం చాలా గొప్ప పని అందుకు నిజంగా చాలా పరిజ్ఞానం కావాలి, జ్ఞానమూ ఉండాలి అందుకోసం కవిత్వ విలువని తగ్గించడం నాకు నచ్చలేదు. అవార్డ్ గ్రహీత, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఇద్దరూ కవులే.వాళ్ళకి మనం చెప్పేది ఏముంది. కవిత్వం కళ్ళముందే చులకన అయిపోతుంటే చూసి నిస్తేజంగా నిలబడి పోవడం తప్పా…. అవార్డ్ పొందినందుకు అభినందనలు వంశీకృష్ణ గారు…..

  • మీరన్నది వాస్తవం. అసలేమీ చదవకుండనే రాసుకపోతున్నరనిపిస్తున్నది తేలిపోయే రచనలను చూస్తుంటే.

  • “మంచి వచనం రాయాలి అంటే సాధన ఉండాలి. కవిత్వం అయితే ఐదు నిమిషాల్లో రాసి , ఆరో నిమిషం లో ఎఫ్ బి లో పెట్టి ఏడో నిమిషం లో లైకులు లెక్క వేసుకోవచ్చు. కానీ వచనం రాయాలి అంటే అలా కాదు . వాక్యం మీద కూర్చోవాలి.” —

    generalised statement.మంచివచనం రాయాలంటే మంచి వచనం ఎలా చదవాలో, మంచి కవిత రాయాలంటే ఎంతో (జీవిత, పుస్తక) అధ్యయనం అవసరం. అయిదు నిమిషాల్లో రాసే కవిత వున్నట్టే, అయిదు నిమిషాల్లో రాయగలిగే వచనాలు కూడా ఉంటాయి.

  • ప్రశ్నలు సమాధానాలు ఆలోచనా యుక్తమే గాక తర్వాత తరానికి ప్రేరణదాయకంగా ఉన్నాయి.
    పిబిడివిప్రసాద్

  • చాలా మంచి విషయాలు పంచుకున్నారు. ఒక్కొక్క వాక్యమూ ఒక ముత్యంలా ఉంది. ఒక వాక్యం రాయాలి అంటె వెయ్యి వాక్యాలు చదవాలి, నూరువాక్యాలు తుడిపివేయాలి🙏🙏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు