మొన్న బెంగుళూర్ నుంచి విమానంలో వస్తుంటే ఎన్నో ఆలోచనలు. ఎగురుతూన్న విమానాన్ని చూస్తేనే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. విమానం ఎక్కినా అంతే. పల్లెటూరివాళ్లం కదా సత్తెపెమాణంగా అబ్బురపడతామేమో.
అలాంటప్పుడు పాలగుమ్మి పద్మరాజు గారి హెడ్ మాష్టారు కథ గుర్తొస్తుంది. అది పైలట్ కెప్టెన్ రావ్ కథ. మనుషుల మంచిచెడుల మెలివేత ఎరిగిన
కథ. వాటిలోని మేలును విప్పి చెప్పిన కథ.
ఆ కథ గుర్తొస్తే నాకు కనువిప్పు గా అనిపిస్తుంది. ప్రతీసారీ. ఎందుకంటే ఎప్పటికప్పుడు కళ్లు మూసుకుపోతూనే ఉంటాయి ఇతరుల విషయాల్లో న్యాయనిర్ణయాలు చెయ్యడానికి సిద్ధంగా. కళ్లుమూసుకునే ప్రతీవారి మంచిచెడుగులూ మాటాడేస్తాం. అలాంటప్పుడు ఈ కథ లాంటివి గుర్తొస్తే కాసేపేనా కళ్లు తెరుపుడు పడతాయి.
కెప్టెన్ రావు అసలు పేరు సుబ్బారావు. హైస్కూల్లో హెడ్మాష్టార్ ఒక్కరే ఒరే సుబ్బులూ అని పిలిచేవారు.
సుబ్బులు అల్లరిచిల్లరిగా ఉండేవాడు. వాళ్లమ్మ చదువుకోసం అతన్ని హెడ్ మాస్టర్ ఇంట్లో పెట్టింది.ఆయన అతని తండ్రికి స్నేహితుడు. తండ్రిపోయాక తల్లి అతని అల్లరికి భయపడి మాష్టారి దగ్గర పెట్టింది. మాష్టారి వీధి గదిలో మరో ముగ్గురు సహాధ్యాయులతో ఉండేవాడు
అతిసాదాగా ఉంటూ విద్యార్థుల ప్రతి చిన్న చర్యనీ పసిగట్టే మాష్టారు సుబ్బారావు కి అంత గమ్మున అంతుపట్టలేదు. అతని అల్లరిని ఆయన గమనించి నవ్వుతూ హెచ్చరిస్తూనే ఉన్నారు.
భోగం కులం నుంచి వచ్చి జస్టిస్ పార్టీలో చేరిఅక్క చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి కుటుంబాలు ఏర్పరచుకున్న జనార్థనరావు ఆయనకు మిత్రుడు. వాళ్ల అమ్మాయి నాగమణి స్కూల్ లో చదువుతూ ఉండేది. పంతుళ్ల తో సహా విద్యార్థులు ఆ పిల్లని ఏదోవిధంగా చులకన చేస్తూఉండేవారు
ఒకసారి తెలుగుమాష్టరు క్లాస్ లో “కొందరి తండ్రులెవరో తెలుసుకోలేరు” అని నాగమణి వంశంగురించి వెటకారం చెయ్యబోతే వరండాలో ఉండి వింటున్న మాష్టారు వచ్చి మనందరికీ మన అమ్మలు చెప్పింది తప్ప మనకు మాత్రం తెలుసా తండ్రెవరో అని పిల్లల ముందే మందలించారు.
ఆ నాగమణి నే సుబ్బారావు అనాలోచితంగా అవమానించాడు. ఆమె తండ్రీ స్కూల్ మాష్టర్ లూ సుబ్బారావు మీద కక్ష కట్టి రస్టికేట్ చేయించమని హెడ్ మాష్టారి ని పదేపదే అడిగేరు. హెడ్మాష్టార్ సరేసరే నంటూ వాయిదా వేస్తూవచ్చారు. ఈ సమయంలో కుర్రవాడు భయంతో పశ్చాత్తాపం తో కుంగిపోవడం గమనిస్తూ పై వాళ్ళకి ఫిర్యాదే చెయ్యలేదు. అందరికీ నచ్చచెప్పేరు. సుబ్బారావు కి మాష్టారు చేసినదేమిటో ఆ తెలిసీ తెలియని వయసు లో అర్ధమైంది.
ఐచ్చికంగా సుబ్బారావు నాగమణి ని క్షమాపణ కోరేడు.
ఇదంతా అయ్యాక సుబ్బారావు చదువులో పడి కెప్టెన్ రావ్ అయ్యాడు. కారణం హెడ్ మాష్టారు. రావ్ తన అల్లరిచిల్లరి స్వభావం తో జులాయికాకుండా అతనికే తెలీకుండా మార్చారు.
కెప్టెన్ అయ్యాక కూడా రావ్ లో అల్లరి అలానే ఉంది. కానీ అతనిలో హెడ్ మాష్టారు నిండిపోయిఉన్నారు. అల్లరి రావ్ జులాయి కాకుండా మందలిస్తూ ఉంటారు. రావ్ లో ఇలా ఒక మాష్టర్ (ఆచార్యుడు లేదా గురువు) ఎలా ప్రవేశంచాడు ఎలా దారి తప్పినప్పుడల్లా తిరిగి మార్గం గుర్తు చేస్తాడూ అన్నది పద్మరాజు గారు ఈ కథలో అనితరసాధ్యంగా రాశారు. అనితరసాధ్యం అన్నది అక్షరసత్యం
మాష్టారు గొప్పచదువరి, చమత్కారి.” గాంధీగారు మన సుబ్బులు గాడి లాంటి వాళ్ళని చాలా మందిని చూసి ఉంటార్రా. అందుకే మానవులంతా సోదరులు అని పుంలింగమే చెప్పేరు.” అని మానవులంతా సోదరులు అనేగాంధీజీ వ్యాసం పాఠం చెప్తూ ఒక విసుకు విసిరేరు. విసురుతూనే లోపాలు ఎత్తిచూపుతూ చేరదీసుకోవడం ఆయనకు తెలుసు.
మనుషుల బలహీనతలు లోపాలూ గమనించి వాటిని మన్నించడం లేదా అంగీకరించడం ఆయనదగ్గరే చూశాడు రావ్. చల్లని చూపుతో కరుణించడం కూడా.
అయినా రావ్ కి నేలమీద పెద్దగా నియమాలు లేవు. కానీ గాల్లో అలా కాదు.
తాను కో ఫైలట్ గా ఉన్నవిమానాన్ని కెప్టెన్ రూంగ్డా నడుపుతున్నాడు.
విమానం నడక తప్పింది. రూంగ్టా కంగారు పడ్డాడు. రావ్ హెచ్చరిస్తున్నా వినలేదు ఎనభయ్ లక్షల విమానం, వెలలేని ఎనభై మంది ప్రాణాలు.
రూల్స్ అధిగమించి రావ్ రూంగ్టా గవద మీద బలంగా కొట్టి పక్కకి తోసి విమానం చేతిలోకి తీసుకుని అందరూ భయం నుంచి తేరుకునే లోగా జాగ్రత్తగా నేర్పుగా లాండ్ చేశాడు.
ఇదంతా చదవాల్సిందేగాని నేను తిరిగి రాయగలిగింది కాదు. ఎందుకంటే అదంతా పైలెట్ పద్మరాజు గారిలా రచయిత పద్మరాజు గారు రాసేరు కాబట్టి
మొన్నటి విమాన ప్రయాణంలో ఫైలట్ చెప్పేడు తాను లాండింగ్ లో ఎక్స్ పర్ట్ నని. ఎంత హాయిగా దింపేడో. అందుకే నాకు ఆ విమాన ప్రయాణంలోపద్మరాజు గారి కెప్టెన్ రావ్ గుర్తొచ్చాడు.
అక్కడ పద్మరాజు గారు కొన్ని మాటలు రాస్తారు. అవి యథాతధంగా ఇవి.
నేలమీద నీతినియమాలు, మంచిమర్యాదలూ గాల్లో పనిచెయ్యవు. రూల్ ప్రకారం రూంగ్డా ని ధిక్కరించడం నేరం. అతడు కంగారు వల్ల ప్రయాణీకులందరినీ చంపేసినా సరే నేను అడ్డుపడకూడదు. రూల్స్ అతిక్రమించి ఆనాడు అందరినీ కాపాడేను. రూల్స్ అతిక్రమించడం, ఆ సమయానికి నా మనసు చెప్పినట్టు చేసేయడం నా స్వభావం. ఇవి రావ్ మాటలు.
కానీ తర్వాత వెళ్లి రూంగ్టాని క్షమాపణ అడుగుతాడు.
అది లోపలున్న మాష్టారి అంశ.
విమానం నడపడం గురించి రావ్ అవగాహన పద్మరాజు గారు ఇలా చెప్తారు.
నేలలాంటిది కాదు గాలి. నేలమీద నడవడం అలవాటు పడ్టవాళ్లకి గాలిలో ప్రయాణం చెయ్యడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఎంత తరిఫీదు పొందినా సరే.
గాలివిమానాన్ని మోస్తుంది. కానీ చటుక్కున అప్పుడప్పుడు వదిలేస్తుంది. చంటిపిల్లాణ్ని ఎగరేసి పట్టుకున్నట్టు. అప్పుడు గాలిమీద నమ్మకం ఉన్నవాళ్ల కి భయం వెయ్యదు. కొందరికి పాతికేళ్లు విమానం నడిపినా ఆ నమ్మకం కుదరదు. ఎప్పటికప్పుడు గాలి వాళ్ళకి కొత్తశత్రువు లా అనిపిస్తుంది
ఆ రోజు రూంగ్టా కి అదే జరిగింది. గాలి విమానాన్ని ఊపేస్తోంది. గాలితో యుద్ధానికి దిగేడతను. గాలి ప్రాకృతిక శక్తి. దానిముందు మనిషి చేసిన యంత్రం ఏపాటిది
ఆ విషయం తెలిసిన వాడు కెప్టెన్ రావ్. అలాంటి
సత్యం తెలియడానికి వెనక ఉన్నది హెడ్మాష్టారి ప్రభావం
రావ్ ఎయిర్ హోస్టెస్ లతో చనువుగా ఉంటాడని భార్యకి కోపం. కాదని నవ్వుతూ బుకాయిస్తాడు. ఆనవ్వు వెనక రావ్ హెడ్మాష్టారూ ఇద్దరూ ఉన్నారు. చనువు నిజమే. కానీ అంతవరకే. భార్యని వదలలేని ఇష్టం.
పద్మరాజు గారి కథల్లోమనిషి లోని ప్రకృతి గానీ విశ్వం లోని ప్రకృతి గానీ బలీయమైనవని వాటితో యుద్ధంకాక మచ్చిక చేసుకుని అదుపులోకి తెచ్చుకోవడమే ఉత్తమమైన మార్గమనే సూచన ఉంటుంది.
రావ్ లోని అల్లరిప్రకృతి లేదా ప్రవృత్తి ని గుర్తించి దయతో చేరదీసి దార్లో పెట్టారు మాష్టారు. అది రావ్ కి అర్ధమైంది. ఆయన అతనిలో భాగమైపోయారు. విపత్సమయాల్లో బయటికొస్తారు. అతన్ని ఆపద నుంచి బయట పడేస్తారు.
అందుకే ప్రాకృతిక శక్తి ఐన గాలితో పోరాడకుండా నేర్పుగా మచ్చిక చేసుకుని విమానాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు.
రావ్ భార్య కమల కూడా రావ్ గాలిలాంటి వాడని గ్రహించింది. అతన్ని అర్థం చేసుకుంది. అప్పడామె చల్లని చిరునవ్వులో రావ్ కి మాష్టారి మొహం కనిపిస్తుంది.
ప్రతీ వారికీ జీవితంలో ఇలా ప్రభావం చూపగల గురువు ఉండాలి.వారు ఎక్కడున్నాసరే జీవితంలో భాగంగా చేసుకుని నిత్యం వెంట నిలుపుకోగలగాలి
అనిపించింది చిన్నప్పుడు ఈ కధచదివినప్పుడు.
ఈ కథనిండా పద్మరాజు గారు మరెన్నో విషయాలు చెప్పారు. కీలకమైన అంశాలు సరళమైన మాటల్లో. నాకు పద్మరాజు గారే హెడ్ మాష్టారు అనిపిస్తాడు.
ప్రపంచ కథానికల పోటీ నిర్వహించిన హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక గాలివాన కథకు బహుమతిని ఇవ్వడం పెద్దవిషయం కానేకాదు
విమానం నడపడం మీద ఇంత సాంకేతిక పరిఙ్నానంతో తెలుగులో ఎవరేనా కథ రాసేరా.దానితో సమాంతరంగా మానవ స్వభావాన్ని ఇంత విశదంగా సమతూకంతో మరే భాషలోనైనా ఎవరైనా, ఎవరైనా చెప్పేరా?
ఇంతకన్న రాయలేను. రాస్తే కనక కథ లోని శిల్పనైపుణ్యాన్ని పాడుచేస్తాను. అల్లికను వదులుచేసేస్తాను.
నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఈ కథ చదివితే తప్ప ఆ ప్రభావం ఏమిటో తెలియదు
ఈ కథ చదివిన వారిదే భాగ్యం.
*
|
|
|
మనం చదువుకున్న సాహిత్యం మనతో కూడా ప్రయాణం చేస్తూ,సందర్భానుసారముగా ఒక మార్గదర్శిలాగా దారి చూపుతుంటుంది. పద్మరాజు గారి కథ వీరలక్ష్మి గారికి విమానంలో ఉండగా గుర్తుకు రావడం అలాంటిదే.కెప్టెన్ రావు లాంటి పైలట్ .ఆయన పూర్వగాథ, ఆయన తాలూకు స్పాంటెనిటీ గుర్తుకు రాగానే విమాన ప్రయాణం ఒక ఉత్సాహం కలిగించే అంశంగా అయిపోతుంది. మనల్ని మనం ఉత్తేజితుల్ని చేసుకోవటానికి సాహిత్యం ఎప్పుడూ మనకి తోడు ఉంటుంది.
పద్మారాజుగారి కథను వీరలక్ష్మి గారు గుర్తు చేసుకోవటం ,మనకు ఈ శేఫాలికలో అందించటం యొక్క ఉద్దేశ్యం కూడా అదే అనుకుంటాను.
సంక్లిష్ఠమైన కథను కూడ సులభంగా నెరేట్ చేయడంలో సహజసుందర శైలి వీరలక్శ్మీ దేవిగారిది…. గతకాలపు సాహిత్యంలోని ఆణిముత్యాలను అక్షర శేఫాలికలు గా చేయడం అది చదవడం నా భాగ్యం.