భూమిని మాట్లాడనివ్వు కవితా సంకలనం గత రెండేళ్ళలో రాసిన కవితలతో వచ్చినది. ఈ రెండేళ్ళ కాలంలో దేశ వ్యాప్తంగా జరిగిన రాజ్య పీడనను ఎదుర్కొన్న సమూహాల గురించి కార్పరేట్ హిందూ ఫాసిస్టు పాలనలో కాశ్మీర్ నుండి మణిపూర్ మీదుగా ఉత్తరాది నుండి దండకారణ్యం మీదుగా పీడిత కులాలు, మైనారిటీ తెగలు ఆదివాసీలు ఎలా అణచివేతకు గరవుతూ తీవ్రమైన హింసకు బలయిన సంఘటనలు, న్యాయస్థానాలు పాలక వర్గాలకు కొమ్ము కాస్తూ ఇస్తున్న తీర్పుల వలన జరుగుతున్న విస్థాపన విధ్వంసం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. అలాగే పాలస్తీనాపై అమెరికా అండతో ఇజ్రాయిల్ చేస్తున్న జాతి నిర్మూలనా యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న పసిపాపలు, స్త్రీలు, రచయితలు, జర్నలిస్టుల మరణాలు నన్ను తీవ్రమైన దుఖానికి గురి చేసాయి. ఇవే ప్రధాన వస్తువులుగా రాసిన కవితల సమాహారం భూమిని మాట్లాడనివ్వు.
ఇప్పటివరకు ఇది ఐదో పుస్తకంగా వచ్చింది. నా మొదటి సంపుటి వెన్నెలదారి నుండి భూమిని మాట్లాడనివ్వు వరకు ఒక్కొక్కటి ఒక్కో ఫాంలో వస్తున్నది. ఇది నేను నాకు నేను సరళీకరింపబడుతూ వస్తున్న క్రమంలోనే వున్నదని అనుకుంటున్నాను. Formless form అనే చైనా జెన్ సూత్రం నన్నెక్కువగా inspire చేస్తుంది. కావాలని రాయడం కవిత్వం చేయాలని ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. మనసులోని తీవ్రమైన దుఃఖం ఆగ్రహమో కలిగినప్పుడు వచ్చే భావాన్ని నిలువరించుకుంటూ నిగ్రహిస్తూ సరళంగా వ్యక్తపరచడం అలవాటయింది. చదవగానే పాఠకునికి అర్థం కావాలని కోరుకుంటాను. ప్రత్యేకించి ఒక ఫార్ములాలో రాయాలనుకోలేదు. కానీ ప్రతీసారీ మరింత సున్నితత్వం పదునెక్కుతున్న వాక్యమన్నది తెలుస్తోంది. ఇందులో సఫలీకృతం కాగలిగానో లేదో పాఠకులు నిర్ణయించాలి.
ఈ కవిత్వం వెనక బలంగా పనిచేసే సంఘటనలు అన్నీ ప్రజలను విస్థాపనకు గురిచేస్తున్న కార్పొరేట్ పాలకుల దమన నీతి, ఎక్కడా నిలవ నీడ లేకుండా నిరాయుధులైన ఆదివాసులను ఆకాశయుద్దంతోనూ వేటాడుతున్న రాజ్య హింస, లక్షలాది సైన్యంతో దండకారణ్యాన్ని చుట్టుముట్టి ప్రజలకు నేతృత్వం వహిస్తున్న ప్రజా యోధులను కనీస వైద్య సౌకర్యానికి నోచుకోకుండా హత్య చేస్తున్న క్రూర రాజ్య స్వభావం, దళిత ముస్లిం జాతులపై జరుగుతున్న కుల మత దురహంకార దాడులు, మణిపూర్లో మైతీ మెజారిటీ తెగ బీజేపీ అండతో కుకీలపై చేస్తున్న జాతిహనన యుద్ధం, పాలస్తీనా పసిపాపల ప్రాణాలను తీస్తూ జాతినిర్మూలనకు యుద్ధం పేరుతో విరుచుకుపడుతున్న అమెరికా ఇజ్రాయిల్ దాడి ఇవే నేపథ్యంగా నాలోని దుఃఖాన్నీ, ఆగ్రహాన్ని అసహనాన్ని అసమర్థతను అనువదించినదే భూమిని మాట్లాడనివ్వు.
*
భుమిని మాత్లడనివ్వు పుస్తకం కొసం ఎడురుచూస్తుండగా, ఈ పరిచ యం చదివాకా పుస్తకం ఎప్పుడొస్తుందా అన్న అత్రుత ఎక్కువయింది
ధన్యవాదాలు గురూజీ. పోస్టయింది.