ఒక ప్రమాదకరమైన క్రీడ గురించి….

మనుషులని వేటాడితేనే అది క్రూరత్వమా, జంతువులని వేటాడితే అది మాత్రం హింస కాదా అన్న ప్రశ్న కూడా కథని చదివాక వస్తుంది.

ది మోస్ట్ డేంజరస్ గేమ్ (1924)

Richard Connell / రిచర్డ్ కానెల్

(అమెరికన్; 17 October 1893 – 22 November 1949)

రిచర్డ్ కానెల్ 1924లో రాసిన ఈ కథ ఎన్నో కథాసంకలనాలలో స్థానం సంపాదించుకుంది. సాహసకథల జాన్రాలో ఈ కథకి ఒక స్థిరమైన స్థానం ఉంది. చూడటానికి మామూలు క్రైమ్ కథలాగా ఉండే ఈ కథలో తరచిచూడవలసిన అంశాలున్నాయి.

చివరి వరకూ – నిజానికి చివరి పదం వరకూ – ఒకే ఉత్కంఠతో చదివించే కథ ఇది. క్రైమ్/అడ్వెంచర్ సాహిత్యాన్ని కాలక్షేపపు సాహిత్యం (escapist literature) గా పరిగణించడం మామూలే అయినా, ఈ కథలో ఆ కాలక్షేపపుతనాన్ని మించిన విశేషాలున్నాయి. అందుకే ఈ కథ ఈ నెల కథాంతరంగంలో.

ముందు కథ చదివేయండి. ఆ తర్వాత కథమీద విశ్లేషణ చదవండి.

Richard Connell – The Most Dangerous Game

తెలుగు వెర్షన్: ఇది నౌడూరి మూర్తి గారు చేసిన అనువాదం. అనుమతించినందుకు ఆయనకు ధన్యవాదాలు!

రిచర్డ్ కానెల్ – ప్రాణంతో చెలగాటం

**

కథ చదివారుగా? చాలా తేలిగ్గా అర్థం అయ్యే కథ కాబట్టి, కథాసంగ్రహాన్ని మళ్లీ విడిగా ఇవ్వడం లేదు. గెలవడం ఇక అసంభవం అన్న పరిస్థితుల్లో రైన్స్‌ఫర్డ్ ఈ ఆటని నెగ్గడం అన్నది కథలోని మలుపు. అయితే, అది చౌకబారు కొసమలుపులా కాకుండా, కా.రా.మాస్టారి పరిభాషలో కొసమెరుపులా ఆవిష్కారం అవుతుంది.

రిచర్డ్ కానెల్ పేరు రచయితగా చాలామందికి తెలియకపోయినా, ఈ కథ మాత్రం చాలా ప్రాచుర్యం పొందింది. 1919లో సీరియస్‌గా రాయడం మొదలుపెట్టిన కానెల్ఆ తరువాతి ముప్పై ఏళ్లలో దాదాపు మూడువందల కథలూ, నాలుగు నవలలూ రాసాడు. తన రచనలతో పాఠకుల ఆదరణ పొందగలిగినప్పటికీ, విమర్శకుల దృష్టిని మాత్రం ఆకర్షించలేకపోయాడు. నిజానికి ఈ కథకి ఉన్న ఆదరణతో పోలిస్తే, దీనిమీద వచ్చిన విమర్శ అతిస్వల్పం అని విమర్శకులే అంగీకరించారు. సుజాన్ కాలిన్స్ రాసిన హంగర్ గేమ్స్ నవలలకీ (వాటి ఆధారంగా తీసిన చిత్రాలకీ) మూలాలు ఈ కథలో ఉన్నప్పటికీ ఆ నవలలూ, సినిమాల మీద వచ్చిన విమర్శలలో ఈ కథ ఎక్కడా ప్రస్తావించబడకపోవడమే విచిత్రం.

ఈ కథ 1924లో ప్రచురించబడటానికి రెండు దశాబ్దాల ముందునుంచీ లాటిన్ అమెరికన్ దేశాల మీద అమెరికా ఆధిపత్యాన్ని చూపిస్తూ, వాళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఉంది. ఈ జోక్యం లాటిన్ అమెరికన్లకి ఇష్టం లేకపోయినా, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల దృష్ట్యా నోరుమెదపలేని పరిస్థితి తలెత్తింది. యూరప్ ప్రయత్నించి వదిలేసిన పనామా కాలువ నిర్మాణం (1904-1914) కూడా అమెరికా తన వ్యాపార అవకాశాల కోసం చేసిందే. కరీబియన్, లాటిన్ అమెరికన్ దేశాల మీద అమెరికా, ఇతర అగ్రదేశాలు చూపించిన జోక్యం, చేసిన దోపిడీలతో ఆ అగ్రదేశాలు ఆధిపత్యాన్ని సంపాదిస్తున్న కొద్దీ, ఈ బలహీన దేశాలు వాళ్లమీద ఆధారపడక తప్పలేదు. తమని దోచేస్తున్నవాళ్ల మీదనే ఆధారపడక తప్పని పరిస్థితి, ఆయా దేశాల్లో పేదరికాన్ని సృష్టించింది. ఈ కథలో రైన్స్‌ఫర్డ్ పడింది సరీగ్గా ఈ కరీబియన్ నీళ్లల్లోనే!

వేటాడటంలో ఉన్న హింస, క్రూరత్వాల గురించి ఈ కథ ప్రశ్నలని రేపుతుంది. మనుషులని వేటాడితేనే అది క్రూరత్వమా, జంతువులని వేటాడితే అది మాత్రం హింస కాదా అన్న ప్రశ్న కూడా కథని చదివాక వస్తుంది.

 కథలోని ఘర్షణ

సంఘర్షణని రకరకాల రూపాలలో – మనిషికి ప్రకృతితో, మనిషికి మనిషితో, చివరికి మనిషికి తనతో తనకే ఘర్షణ – చూపించిన కథగా ఇది అమెరికన్ స్కూళ్లల్లో చాలా ప్రాచుర్యం పొందింది. సముద్రంలో పడిపోయిన రైన్స్‌ఫర్డ్, సాహసంతో ఈది, ప్రకృతితో చేయబోయే పోరాటంగా కథ ప్రారంభంలో అనిపిస్తుంది. తీరా, జరోఫ్‌ని కలుసుకున్నాక, అతని వింత మనస్తత్వం తెలిసాక, ఘర్షణ స్వరూపం మారి, అది మనిషితో మనిషి సంఘర్షించడంగా రూపాంతరం చెందుతుంది. మనుషుల్ని వేటాడటాన్ని సైద్ధాతికంగా నిరసించిన రైన్స్‌ఫర్డ్, చివరికి తన విలువలతో తనే వ్యక్తిగత స్థాయిలో ఘర్షణ పడి, ఆ ఘర్షణలో ఆట తాలూకు నియమాలని సైతం ఉల్లంఘించి, జరోఫ్‌ని వేటాడి మరీ అంతమొందించడం అనే మార్పునీ, కొత్త ఘర్షణనీ కథలో ప్రవేశపెట్టడం ఈ కథలోని విశిష్టత. ఈ అంతరంగ ఘర్షణ సార్వజనీనమైన ఘర్షణ. అందులోని నైతికానైతికాలు బేరీజు వేసుకోవడం పాఠకుడికి రచయిత ఇచ్చే హోమ్‌వర్క్!

 కథ ముగింపు

ఈ కథ ముగింపు తర్వాత మనకు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఆ రాత్రి జరోఫ్‌ పరుపుమీద హాయిగా పడుకుని, ఆ హాయిని సంపూర్ణంగా అనుభవించిన రైన్స్‌ఫర్డ్ కూడా జరోఫ్‌లాగా మరో హంతకుడు కాబోతున్నాడా? అతను ఎలా మారాడు, ఒకవేళ మారితే ఎందుకు? రైన్స్‌ఫర్డ్ ఈ ఆటలో గెలిచినప్పటికీ, జరోఫ్ అతనిని వదిలేయడం ఖాయమైనప్పటికీ అతను జరోఫ్‌ని చంపేసాడు. ఆ చంపడం కూడా ఆత్మరక్షణ కోసం కాదు, కేవలం హత్యే. ఇది ప్రతీకార చర్యా? లేదూ, వేటని ఆనందించడానికి అతను జరోఫ్ స్థాయికి దిగజారుతున్నాడా? జరోఫ్ సరదా గురించి తెలుసుకున్నప్పుడు మొదట్లో రైన్స్‌ఫర్డ్ అభ్యంతరం చెబుతాడు. కానీ ఆ తరువాతి కథాక్రమంలో రైన్స్‌ఫర్డ్ మాత్రం చేసిందేమిటి? అతను జరోఫ్ తాలూకు కుక్కని చంపుతాడు; జరోఫ్ మనిషి ఇవాన్‌ని కూడా చంపుతాడు. ఈ హత్యల పట్ల అతనికి ఎలాంటి పశ్చాత్తాపం ఉన్నట్టు కథలో కనబడదు. జరోఫ్‌ని బంధించి సంబంధిత అధికారులకి రిపోర్ట్ చేసి ఉన్నట్టయితే, జరోఫ్‌కి చట్టప్రకారం శిక్ష పడివుండేది. కానీ, తను మొదట్లో నిరసించిన హింసనే అతను ఆశ్రయించి, చట్టాలని కూడా విస్మరించి, తను విధించదలచుకున్న శిక్ష తను విధించేసాడు. బహుశా, ఈ ఆట ఆడే క్రమంలో రైన్స్‌ఫర్డ్ కూడా కొంత మార్పుకి గురి అయివుండాలి. జరోఫ్‌ని చంపేసాక, ఇతర బందీలని విడుదల చేసే విషయమై అతను ఆలోచిస్తున్నట్టు కథలో ఎక్కడా ప్రస్తావన రాదు. అసలు వాళ్లని విడుదల చేసే ఉద్దేశం ఉందా, లేక హాయిగా నిద్రపోయిన ఆ రాత్రి తర్వాత అతను ఆ దీవి మీదనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడా? సమాధానం ఏదైనా కావొచ్చు కానీ, అలాంటి సంభావ్యత అంటూ ఒకటి ఉందని గమనించడం పాఠకులుగా మనకి అవసరం.

కథ-పాత్రలు

వేటగాడే వేటాడబడటం అనేది నిజానికి చాలా అరిగిపోయిన కథాంశం. రిచర్డ్ కానెల్ ఆ అంశాన్ని తీసుకుని తీర్చిదిద్దిన విధానం, కథని నడిపిన తీరూ, కథకి అవసరమైన వర్ణనలూ, పాఠకుడిలో రేకెత్తించే ఉత్కంఠా, కథకి అవసరమైనంత మేరకే ఉపయోగించిన సంభాషణలూ – ఇవన్నీ కథకి బలాలుగా మారాయి. ముఖ్యంగా, ఈ కథలో ఇమిడిఉన్న అంతరార్థాలు ఈ కథని మామూలు క్రైమ్/అడ్వెంచర్ కథగా కాకుండా, అంతకుమించిన కథగా చూడటానికి దోహదపడతాయి. కథలోని రెండు ముఖ్యపాత్రలూ రెండు ప్రాపంచిక దృక్పథాలకి ప్రతీకలుగా నిలబడి, ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలోని రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి.

ధైర్యవంతుడూ, యువకుడూ, సాహసవంతుడూ అయిన సాంగర్ రైన్స్‌ఫర్డ్ పేరులోనే ఒక గమ్మత్తుంది. రైన్స్‌ఫర్డ్ అనే ఫామిలీ నేమ్ అతను ఒక మంచికుటుంబం నుంచి వచ్చాడు అన్నది సూచిస్తే, సాంగర్ అనే పేరుని స్పానిష్ మూలం sangre తో చూస్తే, దానికి రక్తం అనే అర్థం ఉంది. ఇంగ్లీష్ sanguine పరంగా చూస్తే, ఆశావహమైన దృక్పథం అనే అన్వయం వస్తుంది. అతనిలోని రెండు రకాల పార్శ్వాలకీ ఇదొక సూచన! మొత్తానికి రైన్స్‌ఫర్డ్ అమెరికన్ ప్రజాస్వామిక విలువలకి ఒక ప్రతినిధిగా, స్వావలంబన కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. తన జాగ్రత్తలు తను తీసుకోగలిగిన మనిషి. ఎవరికీ లోబడి ఉండే మనస్తత్వం కాదు. దేన్నైనా మట్టుబెట్టడానికి జంకే స్వభావం కాదు కానీ, మనుషులని అనవసరంగా చంపడం పట్ల విముఖత ఉంది. వాటిగురించి అతనికి కొన్ని నైతిక సూత్రాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, సినికల్‌గా కనిపించే జరోఫ్‌కి పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి రైన్స్‌ఫర్డ్.

1917లో జరిగిన బోల్షెవిక్ విప్లవంలో రాచరికపు రష్యన్ జార్ తరఫున నిలబడి ఇంపీరియలిజానికీ, బానిసత్వానికీ మద్దతుగా, యుద్ధం కూడా వేటాడే ఆటగా పోరాటం చేసిన జరోఫ్ అక్కడ బలహీనపడ్డాక, తన వంశస్థులు సంపాదించిన ఆస్తితో కెరీబియన్ ద్వీపానికి చేరుకున్నాడు. ఉన్న ఆస్తులని అమెరికన్ స్టాక్ మార్కెట్లో పెట్టుకుని దానిమీద బతికేస్తున్నాడు. ఒక రాజప్రాసాదం, బానిసలాంటి సేవకుడు. తన పూర్వతరాలు అనుభవించిన వైభోగాన్ని ఇక్కడ పునఃసృష్టించుకుని రాజఠీవిని అనుభవిస్తున్నాడు. తాతతండ్రుల ఆస్తుల మీదా, బానిసలాంటి ఈవాన్ మీదా, బూజుపట్టిన భావజాలాల చట్రాలమీదా ఆధారపడినవాడు. అమెరికన్ అయిన రైన్స్‌ఫర్డ్ మొదటి ప్రపంచయుద్ధం తరువాతి ఆశావహ పరిణామాల వైపు చూస్తుంటే, జరోఫ్ మాత్రం ఒక వెలుగు వెలిగిన తన పాతరోజుల మీదే తన దృష్టిని పెట్టుకుని ఉన్నాడు. లండన్‌లో కుట్టించుకున్న సూట్లూ, స్టార్చ్ పెట్టి ఇస్త్రీ చేసివున్న సిల్క్ దుస్తులూ, యూరోపియన్ సిగరెట్లూ, సిగరెట్ కేసులూ అతని జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.

తను వేటాడేది మనుషులని అన్న విషయం రైన్స్‌ఫర్డ్‌కి అవగతమైపోయాక, జరోఫ్ ప్రవర్తనలోనూ మాటతీరులోనూ తేడా వస్తుంది. ఇప్పుడతను మరింత ప్రమాదకరమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఉదాహరణకి, అతను తను ఏర్పాటు చేసిన లైట్లతో ఓడలని ఆకర్షించి అవి రాళ్లని ఢీకొని మునిగిపోయే విధానాన్ని అతను వర్ణిస్తున్నప్పుడు అతని విషస్వరూపం ఎన్ని విధాలుగా విస్తరించి వుందో అర్థం చేసుకోవచ్చు (“జనరల్ నవ్వేడు. ‘అవి చూసి అక్కడ రేవు ఉందనుకుంటారు. నిజానికి అక్కడ ఏ రేవూ లేదు. కత్తిలా పదునైన అంచులున్న రాళ్లు సముద్ర రాక్షసిలా నోళ్లు తెరుచుకుని ఉంటాయక్కడ. నేను ఈ కాయని నలిపినట్టు అవి ఎంత పెద్ద ఓడనైనా నలిపెయ్యగలవు.’ జనరల్ ఒక వాల్‌నట్ కాయను నేలమీద వేసి బూటుతో పొడిపొడి చేశాడు.”). తర్వాతి కథలో రైన్స్‌ఫర్డ్‌ని వేటాడే పద్ధతిలోనూ ఈ క్రూరత్వాన్ని చూడొచ్చు. వేటాడబడుతున్నవాడు విలవిలలాడటం చూస్తే జరోఫ్‌కి ఆనందంగా ఉంటుంది. అందుకే దొరికినవాడిని చంపకుండా వాయిదా వేసి, పరిగెడుతున్నవాడికి మరింత ఆందోళన కలిగించడం.

తననెవ్వరూ ఓడించలేరనే ధీమానే జనరల్ జరోఫ్‌కి ప్రాణాంతకమయింది. వేటాడటానికి అతను మనుషులని ఎంచుకున్న కారణం వాళ్లు “సాహసం, యుక్తి, తార్కికంగా ఆలోచించగల శక్తీ …” కలిగివుంటారు కాబట్టి. సైద్ధాంతికంగా మనుషులకి ఇవి ఉంటాయని జరోఫ్ అనుకున్నప్పటికీ, సరీగ్గా వాటినే తక్కువ అంచనా వేయడం అతను చేసిన పొరపాటు. తన వినోదానికి అవి పనికొస్తాయి అనుకున్నాడే తప్ప, సరీగ్గా వాటినే వాడుకొని తను వేటాడేవాడు తప్పించుకోగల అవకాశం ఉందన్న తర్కాన్ని విస్మరించాడు. మూడు సందర్భాల్లో రైన్స్‌ఫర్డ్‌ని ఉపేక్షించి, తన వినోదాన్ని మరింత పొడిగించుకోవాలనుకున్నాడు. కానీ, ఈ పిల్లీ ఎలుకా ఆటలో జరోఫ్‌కి జరుగుతున్న నష్టం పెరిగిపోతూ వచ్చింది. మొదట జరోఫ్ భుజానికి గాయం అయింది. తర్వాత అతని కుక్కల్లో ఒకటి చచ్చిపోయింది. తర్వాతి వంతు ఇవాన్‌ది.

జరోఫ్ మరణానికి మరో కారణం – వేట గురించి ఇద్దరికీ ఉన్న పరస్పరాభిప్రాయాలు. అది ఆట అన్నాడు జరోఫ్. కాదన్నాడు రైన్స్‌ఫర్డ్. అయితే, కథ జరుగుతున్న క్రమంలో దానిగురించి రైన్స్‌ఫర్డ్ ఎక్కడో అభిప్రాయం మార్చుకున్నాడు. అతను అలా అభిప్రాయం మార్చుకున్నాడన్న విషయం జరోఫ్‌కి తెలిసే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైన్స్‌ఫర్డ్ ఆడుతున్న ఆట మరింత ప్రమాదకరమైనదనీ, దానివల్ల ఇద్దరి ప్రాణాలకీ సమానమైన రిస్క్ ఉందనీ జరోఫ్ గమనించుకోలేకపోయాడు. అతని అతిశయమే అతన్ని తాత్కాలికంగా గుడ్డివాణ్ణి చేసింది. జరుగుతున్న వరుస నష్టాలని విశ్లేషించుకోగలిగినట్టయితే, జరోఫ్ కొద్దిగా ముందుగానే ఈ విషయాన్ని పసిగట్టగలిగేవాడు.

కథలో రెండు పాత్రలకీ ఇంకో రెండు మగపాత్రల తోడు ఉంది. రైన్స్‌ఫర్డ్ మిత్రుడు విట్నీ, మరో అమెరికన్. కథ ప్రారంభంలో ఇద్దరూ వేటాడటం గురించీ, నైతికత గురించీ, కరుణ గురించీ సమస్థాయిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లా మాట్లాడుకుంటారు. సమానత్వం అనేది ఇద్దరికీ ప్రాతిపదిక. పరస్పర అవగాహన, గౌరవం అనేవి వాళ్లకి సహజమైన మామూలు విషయాలు. జరోఫ్ దగ్గర ఉన్న పాత్ర ఈవాన్ ఒక బానిస. ఆ బానిసత్వానికి అదనపు ప్రతీకలుగా అతను మూగ, చెవిటివాడు కూడా. అతను జరోఫ్‌తో సంభాషించలేడు. ఒకవేళ మూగవాడు కాకపోయినా, అతని బానిస స్థితి అతన్ని మాట్లాడనివ్వదు. బానిసగా ఉండటమే అతని పని. కథ చివర్లో ఈవాన్ చనిపోయినప్పుడు, అతను చనిపోయాడే అని జరోఫ్ బాధపడడు. ఒక పనిమంతుడైన బానిస పోయినందుకు బాధపడతాడు; అతని స్థానంలో ఇంకొకరిని ఎలా తెచ్చుకోవాలా అని బాధపడతాడు. మనుషులతో అతని సంబంధం అంత దౌర్భాగ్యంగా ఉంది.

మారుతున్న ప్రపంచ స్థితిగతులని సూక్ష్మంగా ఈ కథ చూపించగలిగింది. జరోఫ్ లాంటి పాత ప్రపంచపు మనుషుల్ని తోసిపారేయడానికి రైన్స్‌ఫర్డ్ లాంటి ఆధునిక ప్రపంచపు మనుషులు వస్తున్నారనే ఒక సూచనని కూడా కథ చేస్తోంది.

 అమెరికా అసహనం

కథలో జరోఫ్ తను వేటాడే మనుషుల గురించి ఇలా అంటాడు: “భూమి మీద ఎందుకూ కొరగాని చెత్తని నేను వేటాడుతాను. ఉదాహరణకి దారి తప్పిన ఓడల మీది నల్లవాళ్లూ, చైనీయులూ, తెల్లవాళ్లూ, సంకరజాతివాళ్లూ. వాళ్లకంటే ఒక్క జాతి గుర్రం గాని, వేటకుక్క గాని వెయ్యిరెట్లు విలువైనవి.” సరీగ్గా ఇలాంటి అభిప్రాయాలే ఈ కథ ప్రచురించబడిన కాలంలో అమెరికన్లకి ఉండేవి. కొత్తగా వలసలు వస్తున్న జాతులు అమెరికాని ముంచెత్తుతున్నాయనీ, అందువల్ల అమెరికన్ జీవనశైలి ప్రమాణాలు పలచబడుతున్నాయనీ వాళ్ల ఆందోళన. 1924 లో వలసల మీద యూరోపియన్ దేశాలకి కోటాలు నిర్ణయించింది అమెరికా (The Immigration Act of 1924). ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలనుంచి వలసలని నిరోధించే స్థాయిలో ఆంక్షలు విధించింది. అయితే, ఈ భావాలని సంభాషణ రూపంలో జరోఫ్ ద్వారా చెప్పించడం వల్ల ఇది రచయిత (అమెరికన్) స్వంత అభిప్రాయం కూడా అయివుండవచ్చు అని మనం అనుకోవడానికి వీలులేకపోయినప్పటికీ, వలసల పట్ల అమెరికా అప్పటి అసహనాన్ని ఈ కథ ఎత్తిచూపిస్తూ ఉండటం ఒక విశేషమైతే, అలాంటి అసహనాన్నే అమెరికా ఇప్పటికీ చూపిస్తూ ఉండటం గమనార్హం.

 దృష్టికోణంలో చిన్న మార్పు

ఈ కథలోని కథకుడు – థర్డ్ పెర్సన్ సర్వసాక్షి కథకుడు. కథ మొత్తం రైన్స్‌ఫర్డ్ పరంగా నడుస్తున్నప్పటికీ (థర్డ్ పెర్సన్ కథనంలో ఒక పాత్రమీద దృష్టిని ఉంచి ఆ పాత్ర పరంగా కథ చెప్పటాన్ని ఫోకలైజేషన్ అంటారు), కథ చివర్లో ఆ ఫోకలైజేషన్‌లో చిన్న మార్పు వస్తుంది. జరోఫ్ డిన్నర్ చేయడం దగ్గర్నుంచీ కథకుడి ఫోకస్ జరోఫ్ మీదకి మళ్లుతుంది. ఈ ఫోకస్ అనేది కెమేరా కన్ను లాంటిది. ఇప్పుడు యాక్షన్ ఎక్కడ జరగబోతోందో, దానిమీదకి కెమేరా మళ్లింది. వేటాడే వేటగాడు ఎలా వేటాడబడబోతున్నాడో చూపడంలో ఆ వేటగాడు ఆసక్తికరమైన పాత్ర అవుతాడు కాబట్టి ఫోకస్‌లో మార్పు వస్తుంది.

 కథాసంవిధానం

కాలంతో రచయిత చేసే విన్యాసాన్ని ఈ కథలో మనం చూడవచ్చు. యాక్షన్, హారర్ కథలలో ఇలాంటి ప్రయోగం కనిపిస్తుంది. కథలో మలుపులని చాలా వేగంగా కథనం చేసి, ఉద్వేగభరితమైన క్షణాలలో ఆ కథనాన్ని నిదానింపజేయడం మనం గమనించవచ్చు. రైన్స్‌ఫర్డ్ చెట్టుమీద దాక్కున్నప్పుడూ, ఆ తరువాత నీళ్లలోకి దూకినప్పుడూ ఇలాంటి నిదాన కథనం కనిపిస్తుంది. ఆ ఉద్వేగపు క్షణాలని వర్ణించడానికి కథని స్లో-మోషన్‌లో నడిపిస్తాడు రచయిత. ఆ ఉద్వేగాన్ని పాఠకుడికి పూర్తిగా చేర్చడానికి వాడే టెక్నిక్ ఇది. ఆ పరిస్థితుల్లో ఒక్క సెకండ్ కాలం కూడా ఒక గంటలాగా గడుస్తుంది- అటు పాత్రకీ, ఇటు పాఠకుడికీ కూడా. కథ ముగింపులో కథనాన్ని మళ్లీ వేగవంతం చేస్తాడు రచయిత. రైన్స్‌ఫర్డ్, జరోఫ్‌ల చివరి సన్నివేశంలో వాళ్ల పోరాటాన్ని కూడా అసలు వర్ణించడు. కేవలం కొద్ది సంభాషణల అనంతరం హటాత్తుగా ముగింపు వాక్యానికి వెళ్లిపోతాడు. అక్కడ కూడా, ఎవరు గెలిచారన్న ఉత్కంఠ పాఠకుడిలో చివరి వరకూ నిలపడం కోసం గెలిచిన పాత్ర పేరుని వాక్యం చివరివరకూ చెప్పడు. “రైన్స్‌ఫర్డ్ అంత చక్కని పరుపు మీద ఎప్పుడూ పడుకోలేదు,” అన్నట్టు వాక్యం ఉండదు. ఆ రైన్స్‌ఫర్డ్ అనే మాట వాక్యం చివర్లోనే ఉంటుంది (“ఇంతకన్నా చక్కని పరుపు మీద తను ఇంతకు ముందెప్పుడూ పడుకోలేదని అనుకున్నాడు రైన్స్‌ఫర్డ్‌.”). అక్కడివరకూ ఎవరు గెలిచారన్నది తెలుసుకోవడానికి పాఠకుడు ఎదురుచూడాల్సిందే!

కథ నిర్మాణంలో ముందుగా ఆకట్టుకునేది ప్రారంభ సన్నివేశం, అందులో వాడిన పదచిత్రాల ఇమేజరీ. సంభాషణల దగ్గర్నుంచి, నేపథ్యం మీదుగా, దూరంగా ఎక్కడో వినిపిస్తున్న హింసధ్వనుల వరకూ కథనం తగిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. రైన్స్‌ఫర్డ్ సముద్రంలోకి పడిపోవడమే ఒక ఊహించని షాకింగ్ సంఘటన కాగా, అప్పుడు మునిగిపోతున్న నీళ్ల మధ్య దూరం నుంచి “విపరీతమైన బాధతో, ప్రాణభయంతో..” వినిపించిన కేక, వాతావరణాన్ని మొత్తం భీతావహంగా మార్చడమే కాకుండా, దూరంగా కనిపించే ద్వీపం ఇప్పుడు అతనున్న ప్రమాదకరమైన స్థితికి భిన్నమైనదేమీ కాదని పాఠకుడికి కూడా అనిపించేలా చేస్తుంది. ఇక్కడ్నుంచి కథ మరింత ఉత్కంఠ రేపుతుంది. ఆ ద్వీపం చేరుకున్నాక, రైన్స్‌ఫర్డ్ గమనించినదేమిటంటే, ఒక పెద్ద జంతువుని ఒక చిన్న గన్‌తో కాల్చి చంపారని. ఆ ద్వీపం ఎంత భయంకరమైనదో పాఠకుడికి అర్థం అయినంతగా రైన్స్‌ఫర్డ్‌కి అర్థం అయినట్టు కనిపించదు. పాత్ర అవగాహన స్థాయి కంటే, పాఠకుడి అవగాహన స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల రాబోయే కథలోని పరిణామాల పట్ల పాఠకుడు ఎక్కువ ఆతృత కలిగివుంటాడు.

 స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్

ఉనికి కోసం జరిగే పోరాటం (struggle for existence)కి మంచి ఉదాహరణగా ఈ కథని చెప్పుకోవచ్చు. చాలా సాదాసీదాగా, కాలక్షేపపు క్రైమ్/అడ్వెంచర్ కథగా కనిపించే దీని అడుగున డార్విన్ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు మరో లేయర్‌గా ఉండటం ఈ కథలోని మరో విశేషం. డార్వినిజం గురించి ఈ కథ ప్రత్యక్షంగా ఎక్కడా ప్రస్తావించకపోయినా, దాని ఉదహరణలు మాత్రం పరోక్షంగా మనం అక్కడక్కడా చూడవచ్చు. ఉదాహరణకి జరోఫ్ తన వినోదపు సిద్ధాంతాన్ని చెబుతున్నప్పుడు, రైన్స్‌ఫర్డ్ “నేను వేటగాడినేగానీ హంతకుడిని కాను,” అంటాడు. దానికి బదులుగా జరోఫ్, “జీవితం బలవంతులది. జీవించాలంటే బలం కావాలి. ఆమాటకొస్తే అవసరమైతే దాన్ని ముగించడానికీ బలం కావాలి. బలహీనులందరూ ఈ భూమిమీద బలవంతులకి ఆనందాన్ని ఇవ్వడానికే పుడతారు. నేను బలవంతుడిని. నాకు దొరికిన ఈ బహుమానాన్ని నేను ఎందుకు వాడుకోకూడదు? నాకు వేటాడాలనిపిస్తే, ఎందుకు వేటాడకూడదు?” అంటాడు. ఇంకా, దానికి సమర్థనగా తను చెత్తా చెదారాన్ని ఏరివేస్తున్నాననీ చెబుతాడు – అనవసరమైన అవశేషాలని ఖండించి జాతిని ఉద్ధరిస్తున్న ఉదాత్తమైన ధోరణిలో.

ప్రకృతిలోని సహజ సూత్రాల ప్రకారం, సమాన శక్తులు ఉన్న రెండు జాతులు తలపడుతున్నప్పుడు, ఏదైనా ఉపయోగకరమైన ఒక చిన్న భిన్నత ఉన్న జాతిది పైచేయి అవుతుంది. పెద్ద చెవులు ఉన్న ఆఫ్రికన్ కుక్కలూ, పొడుగు మెడలు ఉన్న జిరాఫీలూ బతికిబట్టగట్టడానికి అదే కారణం – ఆ భిన్నత. మూడురోజుల వేట తర్వాత రైన్స్‌ఫర్డ్ తెలుసుకున్న భయంకరమైన సత్యం ఏమిటంటే, తను జరోఫ్ మీద నెగ్గడం అనేది జరగని పని అని. జరోఫ్ తనతో తాపీగా ఆడుకుంటున్నాడు. తనకీ యుద్ధాలతోనూ, వేటలతోనూ పరిచయం ఉన్నా ఇప్పుడు వేటగాణ్ణి తప్పించుకుని పారిపోవాల్సిన పరిస్థితి, ఏ మార్గమూ లేని దుస్థితి దాపురించింది. ఇలాంటప్పుడు, జరోఫ్ చేతికి దొరకడం కంటే, తన జీవితానికి తనే ముగింపు చెప్పుకోవడం సరైన చర్య అని భావించిన రైన్స్‌ఫర్డ్ కొండ శిఖరం మీదనుంచి దూకేస్తాడు. అక్కడిదాకా వచ్చిన జరోఫ్, జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. “తన వేట తనని తప్పించుకుని పారిపోయాడు. దానికి కారణం ఆ అమెరికన్ తన ఆట పూర్తిగా ఆడకపోవడమే,” అని జరోఫ్ భావించాడు. సరీగ్గా ఇక్కడే జరోఫ్ చాలా సాదాసీదాగా ఆలోచించడం వల్ల, అతను అనాలోచితంగా ఆ ‘ఉపయోగకరమైన ఒక చిన్న భిన్నత’ ని రైన్స్‌ఫర్డ్‌ పరం చేసేసాడు. కాకపోతే ఈ భిన్నత భౌతికమైనది కాదు. ఇద్దరూ శారీరకంగా సమవుజ్జీలే. కానీ రైన్స్‌ఫర్డ్ తనకి అలవడిన స్వేచ్ఛాలోచన వల్ల పరిస్థితిని అంచనా వేయగలిగాడు. అవతలివాడికంటే ‘చిన్న భిన్నత’తో, తనకి ‘ఉపయోగకరమైన’ పద్ధతిలో ఆలోచించగలిగాడు (“అతనికి తప్పించుకోడానికి అతి చిన్న అవకాశం ఇవ్వగలిగిన ఒక ఆలోచన తట్టింది.”). కథలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం. జరోఫ్ నుంచి తప్పించుకోగలగడం అనేది ఇహ సాధ్యపడే విషయం కాదు కాబట్టి, తను ఆత్మహత్య చేసుకున్నట్టు జరోఫ్‌ని నమ్మించాలనుకున్నాడు. అది నమ్మితే గనక, జరోఫ్ పాక్షిక విజయగర్వంతో కొంచెం ఏమరుపాటులో ఉంటాడు. ఆ సమయాన్ని తను ఉపయోగించుకోవచ్చు అనేది రైన్స్‌ఫర్డ్ ఆలోచన. కానీ, తను నీళ్లల్లోకి దూకాక బతికి బట్టగడతానని అతను కూడా పూర్తిగా అనుకుని ఉండకపోవచ్చు. కానీ, బతకగల అవకాశం లేకపోలేదు. అందుకే, అది ‘అతి చిన్న అవకాశం’ అనుకున్నాడు రైన్స్‌ఫర్డ్; దానినే అమలుచేసాడు. ఇలా భిన్నంగా ఆలోచించగలిగిన అడ్వాంటేజ్ వల్ల, అతను ఈ పోటీలో విజయం పొందడానికి అర్హత సంపాదించుకున్నాడు. డార్విన్ survival of the fittest సిద్ధాంతంలోని natural selection ఇదే!

కథ చివర్లో, “విశాలమైన భోజనంబల్ల మీద ఆ రాత్రి జనరల్ జెరోఫ్ ఒక్కడే కూచుని మంచి భోజనం చేశాడు.” దాదాపు నలభైమంది కూచుని ఒకేసారి భోజనం చేయగల విశాలమైన బల్ల అది. పాత భావజాలాలని (కనీసం, దుస్తులు ధరించే పాత భేషజాలని కూడా) వదిలిపెట్టలేని జరోఫ్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. నిజానికి మారుతున్న ప్రపంచపు పోకడలతో పోలిస్తే, ‘అరుదైన’ జాతివాడు అయ్యాడు. డార్విన్ సిద్ధాంతాల ప్రకారం, అరుదైన ప్రతిదీ నశించడానికి సిద్ధంగా ఉంటుంది. Rarity is the precursor to extinction. అరుదైపోవడం అంతరించిపోతుందనడానికి సూచన. కథలో కూడా అలానే జరిగింది.

అసలు ఈ కథ శీర్షికలోనే ఒక శ్లేష ఉంది. గేమ్ అంటే ఇద్దరు ఆడుకునే ఆట. అంటే శీర్షిక అర్థం- చాలా ప్రమాదకరమైన ఆట అని. కానీ, గేమ్ అనే పదానికి ‘వేటాడబడేది’ (వేట) అని మరో అర్థం కూడా ఉంది. ఈ అర్థంతో శీర్షికని చూస్తే – అన్నింటికన్నా ప్రమాదకరమైనది మనిషిని వేటాడటం అనే ధ్వని వస్తుంది. ఇంకొక్క అడుగు ముందుకేస్తే, వేటాడే మనిషిని వేటగా పెట్టుకోవడం అసలు అత్యంత ప్రమాదకరమైన ఆట అని అర్థం అవుతుంది. నిజానికి, కొంచెం లోతుగా ఆలోచిస్తే, అన్నింటికంటే ప్రమాదకరమైనది – జీవపరిణామం. ఎంత బలమైనదైనా, పరిమాణంలో ఎంత పెద్దదైనా, కొత్తగా వస్తున్న మార్పులకి తట్టుకోలేని ఏ ప్రాణి అయినా పరిణామక్రమంలో నశించక తప్పదు. పాత రాచరికపు అలవాట్లని వదిలేసుకుని, కొత్త ప్రజాస్వామిక విధానాలకి తనను తాను సిద్ధం చేసుకోలేని జరోఫ్ ఈ పరిణామ క్రమంలో అంతరించిపోయాడు.

 కొసమెరుపులు

ఎప్పుడు రాయడం ప్రారంభించారు అన్న ప్రశ్నకి రచయిత ఒకసారి సమాధానం ఇస్తూ, అసలు రాయకుండా ఉన్నది ఎప్పుడో తనకు గుర్తులేదని అన్నాడు. పది సంవత్సరాల వయసులోనే బేస్‌బాల్ ఆటల మీద వార్తలని తన తండ్రి నడిపే పత్రిక కోసం రాయడం ప్రారంభించాడు రిచర్డ్ కానెల్. కాబట్టి, ఈ కథలోని ఆట మీద రాయడానికి అతను ఎంత అర్హుడో మనం అర్థం చేసుకోవచ్చు!

ఈ కథని సినిమాగా 1932లో ‘కింగ్‌కాంగ్’ (1933) సినిమా సెట్స్ మీదే తీసారట. ఒకే నిర్మాణ సంస్థ కాబట్టి, అందులో నటించిన నటులే ఇందులో కూడా నటించారు. అలా ఈ సినిమా వెర్షన్‌లోకి ఒక హీరోయిన్ కూడా అదనంగా వచ్చి చేరింది. అయితే, ఈ పాత్ర వల్ల ఒక సినిమాటిక్ సదుపాయం ఉంది. జరోఫ్‌‌కి అందకుండా పారిపోతున్న రైన్స్‌ఫర్డ్ అంతరంగంలోని ఆలోచనలని బయటకి చెప్పడానికి (కథలో చెప్పినట్టుగా సినిమాలో చెప్పలేరు కాబట్టి) ఈ హీరోయిన్ పాత్ర పనికివస్తుంది.

‘Free advice is worth the price’ అని ఎవరో ఓ అనుభవజ్ఞుడు అన్నాడు. అయినా సరే, ఉండబట్టలేక ఒక ఉచిత సలహా: ఈ కథ చదివాక కథ మీకు నచ్చినట్టయితే, అంతటితో ఆగిపోండి. ఆ సినిమా చూసి నాలాగా నిరుత్సాహపడకండి!

 

పై వ్యాసం రాయడానికి ఈ క్రింది విమర్శకుల వ్యాసాలు తోడ్పడ్డాయి:

Abigail L. Montgomery • Jim Welsh • Michael J. Meyer • Patrick James & Frank Harvey • Rena Korb • Terry W. Thompson

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దీవి, ఝరోఫ్ తో ఈ కధని ఇదివరకే కొన్ని సార్లు చదివానన్న గుర్తు వచ్చింది. ఇక విశ్లేషణ…సరే… కధకి మకుటంలో గేమ్ భలే సూచిక, అర్ధాలు తెలిసిన వారికి. మీ పుణ్యమా అంటూ మళ్ళీ మరో సారి చదివాను. నెనరులు. చి న

  • వాళ్లిద్దరిమధ్యా ఫైట్ కట్ చేసి,ఇచ్చిన క్లైమాక్స్ అదిరింది. ఇంక రమణమూర్తిగారి విశ్లేషణ కథని స్కేన్ చేసింది.

  • రమణమూర్తి గారూ,
    పాటకి పల్లవి ప్రాణం అంటారు. అలాగే కథకి శీర్షిక ఆయువుపట్టు. దీన్ని రచయిత చాలా సమర్థవంతంగా వాడుకున్నాడు.

    ఈ కథలో విట్నీకీ, రైన్స్ఫర్డ్ కీ అమెజాన్లో వాళ్ళు జరుపబోయే వేట గురించి జరుగుతున్న సంభాషణ ఒకచోట గమ్మత్తైన మలుపు తిరుగుతుంది. జాగువార్ లను వేటాడటం వేటగాడికి ఆనందాన్నిస్తుందన్నది నిజమే గాని, ఆ ఆనందం ఆటగాడికే తప్ప జాగువార్ కి కాదు అని విట్నీ అన్నప్పుడు, రైన్స్ఫర్డ్ అతన్ని మందలిస్తాడు … అతడు మంచి గురిగలిగిన వేటగాడు కనుక వేటగాడిలా మాటాడమనీ, తాత్త్వికుడిలా మాటాడవద్దనీ. అంతే కాదు, జాగువార్ ఏమనుకుంటుందో ఎవడికి కావాలి? అని కూడా అంటాడు. దానికి “జాగువార్ కి కావాలి” అని విట్నీ అన్నప్పుడు , “జాగువార్ కి అటువంటి అవగాహన ఉండదు” అంటాడు రైన్స్ఫర్డ్. దానికి విట్నీ, “అలా ఆలోచించగల తెలివి లేకున్నా, ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, బాధ కలుగుతుందన్న భయం, మృతువంటే భయం,” అంటాడు. అప్పుడే ఈ కథలోని ముఖ్యాంశం ఏమిటో అర్థమై దీన్ని రచయిత ఎలా ముందుకి తీసుకువెళతాడా అన్న కుతూహలం నాలో రేకెత్తించింది. చాలా కథలు మొదటిసారి చదివినప్పుడు చాలా బాగున్నట్టు అనిపించినా, రెండవసారి, మూడవసారి విమర్శనాత్మక దృష్టితో చూసినప్పుడు తేలిపోతుంటాయి. కానీ, మాయా బజార్ సినిమాలా, ఈ కథని ఎంత నిశితంగా విమర్శించి చూస్తే అంత రసవత్తరంగా కనిపిస్తుంది నాకు. సంప్రదాయ సాహిత్యంలో / నాటకంలో కథాంశాన్ని సూత్రప్రాయంగా సూచించడం కావ్య లక్షణం.

    ఇక ఈ కథగురించి మీరు చేసిన విశ్లేషణ … విశ్వవిద్యాలయాల్లో చేసే (చెయ్యవలసిన) డెజెర్టేషన్ కి ఏమాత్రం తీసిపోదు. మీకు నా హృదయపూర్వక అభినందనలు. నా అనువాదం ఉదహరించినందుకు మీకు కృతజ్ఞతలు.

    • థాంక్స్, మూర్తి గారూ! కథ ఎలా జరగబోతోందో ముందే హింట్స్ ఇవ్వడం వల్ల పాఠకుడికి కుతూహలాన్ని కలిగించడమే కాకుండా, కథలోకి సూటిగా వెళ్లిపోవడం ఈ కథలోని విశిష్టాంశం. అనవసరమైన వర్ణనలతో కాలయాపన చేయడం జరగదు. అలానే, కథకి మల్టిపుల్ లేయర్స్ ఉన్నప్పుడు, ఒక్కోసారీ ఒక్కొక్క పొర విడివడుతున్నప్పుడు, ఆ కథ అందించగల తృప్తి వేరే స్థాయిలో ఉంటుంది. సినిమా కూడా అలాంటిదే!

      మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు!

  • ఆసాంతం కన్నార్పకుండా(అతిశయోక్తి)చదివించింది.రోమాలు నిక్కబొడుచుకోవటం అంటే ఇదే కదా.కంటితో చూసేటప్పుడు చాలాసార్లు ఇది అనుభవంలోకి వచ్చింది కానీ చదివేటప్పుడు తొలిసారి.
    మీ విశ్లేషణ అద్భుతం ఎప్పటిలాగే.

  • రమణమూర్తి గారూ – నేను ఇంతకుముందు ఈ కథని చదివాను గానీ మీరు పరిచయం చెయ్యడంవల్ల చాలామంది తెలుగువాళ్లకి దీన్ని చదివే అవకాశం కలిగింది. విపుల మయిన విశ్లేషణ. అభినందనలు. అయితే, అది కొన్నిచోట్ల కథతోనూ, బహుళ జనామోదమయిన అభిప్రాయాలతోనూ విభేదిస్తోంది.

    “An idea that held a wild chance came to him, and, tightening his belt, he headed away from the swamp.” మూలకథలోని ఈ వాక్యంలో ఎక్కడా ఆత్మహత్య అన్న ప్రసక్తే లేదు. అంటే, “జరోఫ్ చేతికి దొరకడం కంటే, తన జీవితానికి తనే ముగింపు చెప్పుకోవడం సరైన చర్య అని భావించిన రైన్స్‌ఫర్డ్ కొండ శిఖరం మీదనుంచి దూకేస్తాడు.” అన్న మీ వాక్యానికి ఆధారం నాకు కథలో దొరకలేదు. దానికి సరయిన అర్థం మీరే “అతనికి తప్పించుకోడానికి అతి చిన్న అవకాశం ఇవ్వగలిగిన ఒక ఆలోచన తట్టింది.” అని తరువాత ఇచ్చారు. కనుక ఈ రెండు అభిప్రాయాలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.

    “డార్విన్ సిద్ధాంతాల ప్రకారం, అరుదైన ప్రతిదీ నశించడానికి సిద్ధంగా ఉంటుంది. Rarity is the precursor to extinction. అరుదైపోవడం అంతరించిపోతుందనడానికి సూచన. కథలో కూడా అలానే జరిగింది.” అన్నారు. I think this is a huge stretch. పాఠకులు దేన్ని ఒప్పుకుంటారు అన్న విషయంపై సరయిన అవగాహన ఉండడంవల్ల మాత్రమే రచయిత ఆ ముగింపు ఇచ్చారు అనేది నా బలమయిన నమ్మకం. ఒక పాత్రని విలన్ అని రచయిత ప్రతిపాదించిన తరువాత ఆ పాత్ర గెలవడానికి ఎక్కడా ఆస్కారం ఉండకూడదు. లేకపోతే, ‘మంచే గెలవాలి, చెడు ఓడిపోవాలి’ అనే పాఠకులు ఒప్పుకోరు మరి! ఉదాహరణకు, రామ, రావణ యుద్ధంలో ఎవరు గెలవాలి అన్న ప్రశ్నకు ప్రపంచ మంతటా అధిక సంఖ్యలో ప్రజలకి ఆమోదకర మయిన జవాబు ఒకటే ఉంటుంది కదా!

    “కథ ముగింపు”లో మీరు లేవనెత్తిన ప్రశ్నలు నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. మొదటగా, “జరోఫ్ అతనిని వదిలేయడం ఖాయమైనప్పటికీ” అన్న అభిప్రాయానికి వస్తే – “You have won the game.” అని జరోఫ్ అన్నాడు తప్పితే, అతను అంతకుముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటా డనడానికి కథలో ఆధారం లేదు. ఒకవేళ నిలబెట్టుకున్నాడనే అనుకుందాం. రెయిన్స్‌ఫర్డ్‌ని ఆ ద్వీపాన్నుండీ సురక్షితంగా బయటకు పంపిన తరువాత ఆ భవనంలో బంధింపబడ్డవాళ్ళతో మొదలుపెట్టి జరోఫ్ ఆ ఆట ఆడుతూనే వుంటాడు గదా! అది ఎలా సమ్మత మవుతుంది? అప్పటిదాకా జరోఫ్ చేసిన ఎన్నో హత్యల సంగతేమిటి? అలాగే, “ఆ చంపడం కూడా ఆత్మరక్షణ కోసం కాదు, కేవలం హత్యే. ఇది ప్రతీకార చర్యా? లేదూ, వేటని ఆనందించడానికి అతను జరోఫ్ స్థాయికి దిగజారుతున్నాడా?” అని ప్రశ్నించారు. రాముడు రావణుణ్ణి చంపాడా లేక హత్యచేశాడా? అది కూడా, ఆత్మరక్షణ కోసమా లేక ప్రతీకారచర్య గానా? రావణుణ్ణి చంపిన తరువాత రాముడు ఎవరినో ఒకరిని చంపాలన్న ఆలోచనతోనే ఉన్నాడా? అలాగే, “అతను జరోఫ్ తాలూకు కుక్కని చంపుతాడు; జరోఫ్ మనిషి ఇవాన్‌ని కూడా చంపుతాడు. ఈ హత్యల పట్ల అతనికి ఎలాంటి పశ్చాత్తాపం ఉన్నట్టు కథలో కనబడదు.” అన్నారు. మొదట, “చంపుతాడు” అని statement of fact ని ఉటంకించిన మీరే తరువాతి వాక్యంలో దాన్ని హత్యగా పేర్కొన్నారు. నరకాసురుణ్ణి చంపిన కృష్ణుడు తను హత్య చేసినందుకు పశ్చాత్తాపపడా లంటారా? పైగా, కుక్క చావూ, ఇవాన్ చావూ కాకతాళీయాలే తప్ప ప్రత్యేకంగా అతను పని గట్టుకుని చేసినవి కావు కదా? కుక్కకు బదులు జరోఫ్ ఆ గుంటలో పడివుంటే కథ అక్కడితో సమాప్తం! ఏ పత్రికలోనూ ప్రచురింపబడేదే కాదు కూడాను! పైగా ఆ కుక్కా, ఇవాన్ ఇద్దరూ కూడా రెయిన్స్‌ఫర్డ్‌ ఏమాత్రం సమ్మతించని వేటకి తోడ్పడుతున్నారు గనుక వాళ్లకి ఆ తలరాత తప్పదు. అంతే గాక, జేమ్స్‌బాండ్ సినిమాల్లోనే గాక ప్రతీ భారతీయ సినిమాలో కూడా అతి బలవంతులయిన అనుయాయులు చచ్చిన తరువాతే గదా నాయకుడు ప్రతినాయకుడితో తలపడ గలిగేది? కాదంటారా? కాకపోతే, సీతాపహరణంతో ఏ సంబంధమూ లేని రాక్షస సైన్యంతో బాటు ఇంద్రజిత్తూ, కుంభకర్ణుడూ మొదలయినవాళ్లందరినీ చంపడంవల్ల రాముణ్ణీ, లక్ష్మణుడినీ, హనుమంతుడినీ హంతకులనే అనాలి. ఇదే గాక, రావణుడి బాధనించీ లోకాలని రాముడు రక్షించినట్లే, ఆ ద్వీపం పక్కగా తిరిగే నావికులని జరోఫ్ బారి నుండీ రెయిన్స్‌ఫర్డ్‌ తప్పించ గలిగాడు గదా!
    “జరోఫ్‌ని బంధించి సంబంధిత అధికారులకి రిపోర్ట్ చేసి ఉన్నట్టయితే, జరోఫ్‌కి చట్టప్రకారం శిక్ష పడివుండేది.” అన్నారు – జరోఫ్ అన్నమాట ప్రకారం ఒకవేళ రెయిన్స్‌ఫర్డ్‌ని ద్వీపాన్నుండీ బయటకు చేర్చి వుంటే. మానవులని వేటాడే అలవాటు చేసుకున్న జరోఫ్ కోరికోరి ఎవరో వెయ్యబోయే శిక్షకోసం ఆ పని చేస్తాడని అనుకోవడం అసంబద్ధంగా ఉన్నది. అయినా, సంబంధిత అధికారు లెవరు? వారి ప్రసక్తే కథలో లేదు గదా!

    “ఉనికి కోసం జరిగే పోరాటం (struggle for existence)కి మంచి ఉదాహరణగా ఈ కథని చెప్పుకోవచ్చు.” అన్న మీ అభిప్రాయం, తరువాత వెలువరించిన “తను మొదట్లో నిరసించిన హింసనే అతను ఆశ్రయించి, చట్టాలని కూడా విస్మరించి, తను విధించదలచుకున్న శిక్ష తను విధించేసాడు. బహుశా, ఈ ఆట ఆడే క్రమంలో రైన్స్‌ఫర్డ్ కూడా కొంత మార్పుకి గురి అయివుండాలి.” అన్న దానితో పొసగక విస్మయాన్ని కలిగించింది. ఆ ద్వీపంలో కేవలం జరోఫే చట్టం అయినప్పుడు మీరు ఏ చట్టం గూర్చి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఏ ప్రభుత్వ పాలన పరిగణనలోకీ రాని ద్వీపాలు క్రితం శతాబ్దం మొదలులో చాలా ఉండేవి. (ఈనాడు కూడా, ప్రభుత్వ పాలనలోకి వచ్చినా భారతదేశ చట్టాలని అమలు చెయ్యడానికి వెళ్లడం అటుంచి, నాగరిక ప్రజలు అడుగు పెట్టని అలాంటి ద్వీపాలు అండమాన్ నికోబార్ లకి దగ్గరలో ఉన్నాయని ఒక సంఘటనవల్ల ఈమధ్య వార్తల్లో వచ్చాయి గదా!) ఒకవేళ ఏదో ఒక ప్రభుత్వ పాలనలోకి ఆ ద్వీపం వస్తుందని అనుకున్నా గానీ రెయిన్స్‌ఫర్డ్‌ పరిస్థితిలో ఉన్న ఎవరయినా చెయ్యా లనుకునేది ముందు ప్రాణాలతో బయటపడడం. అదే గదా ఉనికి కోసం జరిగే పోరాటం! రెయిన్స్‌ఫర్డ్‌ కూడా జరోఫ్ దారిలోకి వెళ్లవచ్చునంటూ పేర్కొన్న “సమాధానం ఏదైనా కావొచ్చు కానీ, అలాంటి సంభావ్యత అంటూ ఒకటి ఉందని గమనించడం పాఠకులుగా మనకి అవసరం.” అభిప్రాయం, గ్లాసు సగం నిండి వుంది, లేదా సగం ఖాళీగా ఉన్నది అన్న సంభావ్యత పోలికతో ఉన్నా గానీ, కథ మొదట్లో దాదాపు నలభై-యాభయ్యేళ్ల వయసున్న రెయిన్స్‌ఫర్డ్‌ నోట్లోంచి వెలువడ్డ అభిప్రాయాలు కేవలం మూడు పగళ్లు, రాత్రుల తేడాతో అంత మార్పు చెందుతాయి అనడానికి కథలో నిదర్శనం లేదు. అందువల్ల ఆ సంభావ్యతకు ఒకటిలో వెయ్యవ వంతు కూడా అవకాశం లేదనిపిస్తుంది.
    చివరగా మీరు పేర్కొనని అంశం, పడకగదికి వెళ్లేముందు జరోఫ్ చదివిన పుస్తకం. అతని వ్యక్తిత్వానికి, ఆ పుస్తకానికీ సంబంధం ఏమిటన్నది రచయిత చెప్పలేదు గానీ, వికిపీడియాలో దొరికిన క్రింది వివరం ప్రకారం అది సరయినదే.

    Marcus Aurelius – Meditations, the writings of “the philosopher” – as contemporary biographers called Marcus, are a significant source of the modern understanding of ancient Stoic philosophy.

    • ముందుగా, ఇంత సమయం తీసుకుని విపులంగా ప్రశ్నలని రాసినందుకు ధన్యవాదాలు, శివకుమార్ గారూ! మరో పదిరోజుల వరకు తీరిక దొరకని పరిస్థితుల్లో ఈ రిప్లైని వాయిదా వేద్దామా అనుకున్నాను కానీ, అది సమంజసం కాదని మీరు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నాను.

      <>
      ప్రారంభ వ్యాసంలో, ఈ వ్యాసాల స్కీమ్ గురించి చెప్పాను. ఒక కథ మీద వచ్చిన వివిధ విమర్శలని ఆసక్తి ఉన్న పాఠకులకి అందించాలని ఈ ప్రయత్నం. కాబట్టి, సహజంగానే వివిధ విమర్శకుల మధ్య విరుద్ధాభిప్రాయాలు ఉండటం జరుగుతుంది. ఆమోదయోగ్యమైన పాత్ర అని మనం అనుకున్నా, అందులో ఫలానా లోపాలున్నాయి అని చూపించే విమర్శలూ ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలని పక్కనపెట్టి, అన్నింటినీ (దొరికినంతవరకూ) అందించాలని ఈ ప్రయత్నం.

      <>
      “Rainsford knew he could do one of two things. He could stay where he was and wait. That was suicide. He could flee. That was postponing the inevitable.” రెండు సందర్భాల్లోనూ దొరకబోయేది చావే. అప్పుడు, “For a moment he stood there, thinking. An idea that held a wild chance came to him, and, tightening his belt, he headed away from the swamp.” ఇక్కడ అతను ఆలోచించిందేమిటో రచయిత చెప్పలేదు. అది సబ్‌టెక్స్ట్. ఇరవై అడుగుల ఎత్తునుంచి దూకినప్పుడు అతను బతకొచ్చు (బతికినా, మళ్లీ జరోఫ్ చేతికి దొరక్కుండా అక్కడ ఉండగలడా?), లేదా చనిపోవచ్చు. రెండిట్లో ఏదైనా జరగవచ్చు. చనిపోతే, అది ఆత్మహత్య. బతికితే, తరవాత ఏం చేయాలన్నది ఆలోచించుకోవచ్చు. జరోఫ్ చేతికి దొరకడం మాత్రం ఆత్మహత్యాసదృశం అని అనుకున్నాడు కాబట్టే, బతకడానికి సగం సంభావ్యత మాత్రమే ఉన్న పని – నీళ్లలోకి దూకడం – చేసాడు.

      <>
      టెర్రీ థాంప్సన్ అనే విమర్శకుడి దృష్టి అది (“Although Darwinism and Natural Selection are never mentioned outright in the story, they provide the subliminal engine for the main conflict and are alluded to as background for the ‘game.’”). అందుబాటులో ఉన్న సిద్ధాంతాల ఆధారంగా కథలని విమర్శించడం, అందుబాటులోకి వస్తున్న కొత్త సిద్ధాంతాల ఆధారంగా కథలని పునర్మూల్యాంకనాలు చేయడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. మీరనుకున్నదానికే ఇది మరో సిద్ధాంతం ఆధారంగా సమర్థింపు.

      <>
      రైన్స్‌ఫర్డ్ ఆట గెలవడానికి ముందు జరోఫ్‌ని చంపగలిగివుంటే, దాన్ని ఆత్మరక్షణ కింద భావించవచ్చు. గెలిచాక అతన్ని చంపడం అనేది ప్రతీకార చర్యో లేక చంపడంలో అతను ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టడమో తార్కికంగా అయివుండాలి. శిక్ష తను విధించాల్సిన అవసరం ఏమిటి? మీరు ఇంకోచోట కూడా అడిగినట్టు, ఆ ద్వీపాన్ని అప్పటివరకూ ఏ దేశమూ పట్టించుకోని పరిస్థితే ఉన్నా, ఈ విషయం రిపోర్ట్ కాబడ్డాక, జరుగుతున్న మారణహోమం దృష్ట్యా కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటారే! శిక్ష విధించడాన్ని తన చేతిలోకి రైన్స్‌ఫర్డ్ తీసుకోవడం పట్ల విమర్శకుల అభ్యంతరం. నా వ్యక్తిగత అభ్యంతరం కూడా. (ఈ సందర్భంలో ఇక్కడ హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ అత్యాచారం కేసుని ఒక్కసారి గుర్తుచేసుకోండి. జరిగిన ఎన్‌కౌంటర్‌ని నేను వ్యక్తిగతంగా ఖండిస్తాను. అలా ఖండించేవారిని సమర్ధిస్తాను.)

      <>
      <>
      ఈ కథలో రైన్స్‌ఫర్డ్ మార్పుకి గురయ్యాడు అన్నది నిర్వివాదాంశం. చావుని ఎదుర్కొంటున్నవాడు అలాంటి మార్పుకి గురికావడం అసహజం కూడా కాదు. ఇద్దరు మనుషులని చంపిన అతను హాయిగా నిద్రపోవడమే దానికి అంతిమ నిదర్శనం. అతను ఇలాంటి మార్పుకి ఎప్పుడు, ఎందుకు, ఎలా గురయ్యాడు అన్నది ఈ కథమీద జరిగే చర్చల్లో కామన్ ప్రశ్న. ఆ సందర్భంలో రాసినది మీరు ఉదహరించిన ఒక అభిప్రాయం (ఇది వ్యాసం మొదట్లోనే వస్తుంది). థాంప్సన్ చేసిన విమర్శ (డార్విన్ సిద్ధాంతం ఆధారంగా) విడిగా రాసాను. రెండింటినీ కలపలేదు. ముందే చెప్పినట్టు, వివిధ అభిప్రాయాలు వ్యాసంలో ఉంటాయి.

      <>
      హాయిగా పడుకున్నవాడి విషయంలో ఆ సంభావ్యత ఎందుకు ఉండదు? ఉంటుంది. ఆ సంభావ్యత సున్న అయితే కాదు గదా!

      • Sorry, the above reply omitted the quoted text. You can read the complete reply here:

        bit.ly/reply-tss

      • మీరిచ్చిన “దిశ” ఉపమానం సరయినది కాదు. తనని చంపడానికి పూనుకున్న జరోఫ్ ని రెయిన్స్‌ఫర్డ్‌ చంపడం దిశ తనమీద అత్యాచారం చేసిన/చెయ్యడానికి ఒడిగట్టిన ఆ నలుగురినీ ఆమె రాతితో తల పగులగొట్టి చంపడం లాంటిది. అంతే తప్ప ఆమె మరణం తరువాత వేరెవరో నేరస్థులకు శిక్ష వెయ్యడం వంటిది కాదు. (అయితే, ఒకవేళ ఆమె విజయవంతంగా వాళ్లని రాళ్లతో కొట్టి చంపగలిగినా, Albert Camus రాసిన The Stranger లో లాగా ఆమె వాళ్లని స్పృహ పోయేదాకా కొట్టిన తరువాత, చంపడం ఎందుకు, వెళ్లి పోలీసులని తీసుకుని రావచ్చు గదా అని కొందరు విమర్శకులు వాదించవచ్చు, పైగా అలా చెయ్యకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నందుకు న్యాయస్థానం ఆమెకు శిక్ష వెయ్యవచ్చు కూడా! విమర్శకులు ఏమాత్రం ప్రయోజనం లేని సిద్ధాంతాలు, ప్రతిపాదనలలో మునిగిపోయి సాధారణ జీవనంతో సంబంధాలు మరచిపోతారని వాళ్లని వ్యంగ్యంగా living in ivory towers అని ఇక్కడ అంటూంటారు. Dictionary.com నిర్వచనం: live in an ivory tower -To lead an impractical existence removed from the pressures and troubles of everyday life: “Like most college professors, Clark lives in an ivory tower.” అందుకని మీరు కోట్ చేసిన విమర్శకుల అభిప్రాయాన్ని ప్రామాణికంగా కాక కేవలం అభిప్రాయంగానే స్వీకరిస్తాను.) దిశ విషయంలో లాగానే రెయిన్స్‌ఫర్డ్‌ ఎదుర్కొన్నది కూడా asymmetric warfare నే. ఆమె మీద దాడి చేసింది నలుగురు. రెయిన్స్‌ఫర్డ్‌ కి కేవలం వేటాడే కత్తి నిచ్చి, జరోఫ్ తన దగ్గర ఒక పిస్తోలునీ, వేటాడే కుక్కలనీ, భీకర మయిన ఇవాన్ నీ ఉంచుకున్నాడు.

        మీరు రెయిన్స్‌ఫర్డ్‌ ఇద్దరిని “చంపాడు”, “హత్యచేశాడు” అనడం తమాషాగా అనిపిస్తుంది. ఇవాన్ ని అతను కత్తి పుచ్చుకుని ఎదురుగా నిలబడి పొడిచి చంపలేదు. చంపడానికి వెంటాడుతుంటే తనని కాపాడుకోవడానికి రెయిన్స్‌ఫర్డ్‌ చేసిన ప్రయత్నాల్లో బలయ్యాడు. “నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?” అని చీమ చేత అనిపించారు కూడా కదా మన కథల్లో? ఆ చీమది ప్రతీకారమా లేక ప్రకృతి సహజ మయిన చర్యా? “One of us is to furnish a repast for the hounds.” అని జరోఫ్ చివర్లో అనడాన్నిబట్టీ మన తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ లో చూపినట్టు వాళ్లు యుద్ధం చేశారని తెలుస్తుంది. అంతే తప్ప, జరోఫ్ కిటికీ దగ్గరకి వెళ్లి “రా, నన్ను ఆ కుక్కలకి వెయ్యడానికి ఇక్కడి నుంచీ తొయ్యి!” అన్నట్టు, రెయిన్స్‌ఫర్డ్‌ అతని ఆదేశాన్ని శిరోధార్యం చేసినట్టూ కాదు. అంటే, అక్కడ కూడా రెయిన్స్‌ఫర్డ్‌ గెలవడానికి కొంత ఆస్కారం ఉన్నదంతే.

        సముద్రంలో పడిన తరువాత ఎంత దూరాన ఒడ్డు ఉన్నదో కూడా తెలియకుండా ఈతకొట్టి అక్కడకు చేరి, ఆ తరువాత మూడు రోజులు సరయిన నిద్రాహారాలు లేకుండా వేటాడబడి చివరకు నిస్త్రాణతో నిద్రపోయిన అతన్ని ఇద్దరు మనుషులని చంపిన తరువాత హాయిగా నిద్రపోయా డన్నారు. అతను జేరోఫ్ లాగా మారడానికి సంభావ్యత సున్నా కాదని కూడా. అవి మీ అభిప్రాయాలు. దానితో నేను ఏకీభవించకపోయినా గౌరవిస్తాను. అలాగే, మీరు నిర్వివాదాంశం అన్నదాన్ని కూడా.

        మీరు వెంటనే జవాబు ఇవ్వక్కరలేదు. మీకు వెసులుబాటు అయినప్పుడే ఆ పని చెయ్యండి.

      • చిన్న సవరింపు. రాళ్లతో కొట్టి చంపినది కామూని అనుకరిస్తూ యండమూరి రాసిన “అంతర్ముఖం”లో. The Stranger లో చంపినది తుపాకీతో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు