ఒక నదీ నేనూ ..

ప్రసిద్ధ రచయిత, చిత్రకారుడు శీలావీర్రాజు అవార్డు ఇవాళ శ్రీరామ్ పుప్పాల అందుకుంటున్న సందర్భంగా..

మా రమి సంవత్సరన్నర కిందట ఈ కవితకు నా మనస్సులో బీజం పడింది. కారణమిదీ అని చెప్పలేను గానీ, ఏదో ఒక నిస్సత్తువ, బాధ, అసహనం లోలోపల గింగిర్లెత్తిపోయేది. కవి మిత్రుడు ‘ఖబర్ కే సాత్’ కధకుడు వాసు ‘కవిత్వం అంటే ఒక ఉద్వేగంతో రాసేది కదా, ఇంతకాలం ప్లాన్ చేసుకుని రాస్తామా’ ? అని అడిగినప్పుడూ నాలో ఎడతెగని ఆలోచన రేగింది. కవిగా నాలో ఒక పరిణామక్రమాన్ని వెతుక్కుంటూ రాసిన వాక్యాలివి. రెండు పెద్ద పండగలు గడిచి పోయాయి. వాళ్ళు బయటకొచ్చేస్తే నేనూ ఇది ముగించేయ గలననుకున్నాను. వాళ్ళింకా రాలేదు. మనం ఎదురుచూస్తూనే ఉన్నాము. ఈ కవిత కూడా ఆ ఎదురుచూపులతోనే ముగిసింది. ఆ నొప్పి మానలేదు.

కోరేగావ్ గురించి మొదట తెలుసుకున్నప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. బ్రిటీషు వాళ్ళకు మనవాళ్ళు సాయపడ్డం, పడ్డమే కాదు మనల్ని మనమే ఓడించుకోవడం ఎంత తెలివి తక్కువ పని కదా అని అనుకున్నాను. అప్పటికి దేశభక్తి గురించి నాకంత మట్టుకే జ్ఞానం ఉండింది. దళిత ఉద్యమాల సారమూ, సామాజిక చరిత్ర అంతంత మాత్రంగానే నాలో ఇంకి ఉండవచ్చును. చరిత్రని పోటీ పరీక్షలకోసం చదివిన దానికీ; మనో వికాస క్రమంలో అధ్యయనం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంటుంది. ఇందుకు ఎన్ వేణుగోపాల్ కలిగించిన ఎరుక మరువలేను. అటు తర్వాత, కోరెగావ్ నేపధ్యంలో వచ్చిన చాలా పుస్తకాలు సేకరించాను. ఈస్ట్ ఇండియా కంపెనీ కలోనియల్ విస్తరణ గురించిన పుస్తకాలు చదివాను. అంబేద్కర్ మహాశయుడి రచనల వాల్యూం 17 లో కూడా ఈ కోరేగావ్ ప్రస్తావన కోసం తిరగేశాను. వీటన్నింటిలోని విషయం అర్ధం చేసుకోవడంలో నే పొందిన సాఫల్యత గురించి చెప్పలేను గానీ, ఈ కవిత నన్ను విఫలం చేసిందని మాత్రం అనుకోవట్లేదు. ఈ మాటల్లో స్వోత్కర్ష వెతక్కండి.

కోరేగావ్ చరిత్ర నన్ను మానవ జీవితం చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరిగేట్టు చేసింది. అది ఎన్నిసార్లో లెక్క వేసుకోలేదు గానీ, ప్రతిసారీ ఒక కొత్త ప్రపంచంలోకి మాత్రం నన్ను నెట్టి వేసింది. చాలా ఇబ్బందికి గురయ్యాను. ఒక కవిత రాయడం కన్నా వ్యక్తిత్వపరంగా నాకు నేను పూరించుకోవలసిన ఖాళీలను గుర్తించాను. ఈ దేశపు అట్టడుగు వర్గాలు అనుభవించిన దుర్మార్గమైన దుర్భరమైన కాలాన్ని గురించి, పీష్వాల గురించి, చత్రపతి శివాజీ గురించి అనేక సత్యాలను తెలుసుకున్నాను. గతాన్ని వర్తమానాన్నీ తరచి తరచి నేను జీవిస్తున్న దేశాన్ని ఇష్టంగా చూసేందుకు ఒక అద్దం ముక్క కోసం వెంపర్లాడాను. అది భీమా నది రూపంలో దొరికింది. ప్రజా పోరాటాలు తోడొచ్చాయి. ఊళ్ళల్లో స్మారక స్థూపాలు కల్లోకొచ్చాయి. వివక్షల నడుమ కన్నీటిలో తడిసిన చుండూరులు, కంచికచెర్లలు దారి చూపించాయి. ఈ దేశపు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులు, ఇక్కడి చెరసాలలు, ఉరికొయ్యలు, ఎవరు నన్ను బంధిస్తున్నారు, ఎక్కడ నా స్వేచ్చ హరించబడుతోందీ ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ అన్వేషణే 1818 వ సంవత్సరంలోకి తీసుకువెళ్ళి నన్నీ దీర్ఘ కవితగా రూపాంతరం చెందేలా చేసింది.

భీమా కోరేగావ్ ఉదంతం చుట్టూ తిరుగుతున్న అవకాశవాద రంగుల నాటకం తెలిసి వచ్చింది. వైరుధ్యాలు మరింత బోధపడ్డాయి. ఒక పదహారు నక్షత్రాల పాలపుంత మరల మరలా నా ప్రాపంచిక దృక్పధాన్ని తట్టి లేపింది. మేధావి వర్గంలోనే కాదు, నా చుట్టూ ఉండే మిత్రులూ, కుటుంబం, సామాన్య ప్రజానీకం వగైరా శ్రేణుల్లో జరిగే ఏ చిన్న విప్లవాత్మక చర్యను కూడా నిశితంగా పరిశీలించాను. ఆలోచనా విధానం పై సామాజిక జీవన ప్రభావాల్ని అర్ధం చేసుకోవడానికి కోరేగావ్ చాలా ఉపయోగ పడ్డది. ఈ క్రమంలోనే మానవ సంబంధాలపై పడుతున్న ఒక విచిత్రమైన ఒత్తిడిని గమనించాను. బహుశా దాన్ని తట్టుకోవడానికి, అందులోంచి నేనూ విముక్తం కావడానికే ఈ దీర్ఘ కవిత రాసుకున్నాను.

రాజకీయ తాత్వికత, భావజాల స్పష్టతల్లో పరిణితి గురించేమో గానీ, కోరేగావ్ తీసుకు వస్తున్న సామాజిక చైతన్యానికి నే పడ్డ సంబరం మీకు తప్పక ఇందులో కనిపిస్తుంది. ఈ సందర్భంలో స్వచ్చమైన మనిషే మనకెంత మార్గనిర్దేశకుడవుతున్నాడో అర్ధమయ్యింది. ఆలాంటి వాళ్ళ మీద ప్రేమ కొద్దీ ఈ దీర్ఘ కవిత రాసుకున్నాను.

సాంద్రతని దృష్టిలో ఉంచుకుని, ప్రక్రియా పరంగా దీర్ఘ కవితే మేలనిపించింది.  ఈలాంటి దీర్ఘ కవితల్లో, వాటి సుదీర్ఘతే కళాత్మక రూపానికిగల సౌందర్యం అనిపిస్తుంది. వజ్రాయుధం, ఆసుపత్రి గీతం, కొయ్యగుర్రం, సముద్రం, మగ్గం బ్రతుకు, కల్లంచుల బువ్వ, శ్రీకాకుళం, మొదలైనవెన్నో దీర్ఘ కవితలు చదివాను. కొన్ని ఇంగ్లీషువి కూడా పైపైన తిప్పేశాను. శ్రీశ్రీ, వివి, అనామధేయుడు, గంటేడ, గోపీ, ఎమ్మెస్, యెండ్లూరి, ఛాయరాజ్ లాంటివాళ్ళ దీర్ఘ రచనలు చాలా ఉత్తేజాన్ని, స్పూర్తినీ, కలిగించాయి. అన్నింటికన్నా ఎన్ కే – లాల్ బనో గులామీ చోడో బోలో వందేమాతరంలోని ప్రవాహ లక్షణం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ ప్రేరణతోనే కోరేగావ్ చారిత్రక స్పూర్తిని కవిత్వీకరించేందుకు సాహసించాను. దీర్ఘ కవిత లక్షణాల గురించి, నిర్మాణం గురించి అధ్యయనం చేసే క్రమంలో మిత్రుడు పెళ్ళూరు సునీల్ ‘దీర్ఘ కవితా వికాసం’ గ్రంధం ఎంతగానో ఉపకరించింది. చాలా నేర్పింది. అందుకు ముందుగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా విలువైన పరిశోధన చేశాడు.

ఈ కవితా వస్తువు తీసుకున్నప్పటి నుంచీ దీని చుట్టూ ఉన్న అనేక పార్శ్వాలని ఎప్పటికప్పుడు నేను అవగాహన చేసుకోవడం చాలా కష్టమయ్యేది. సాహిత్య సృజనకు కేవలం కల్పన ఉంటే సరిపోదు, దృక్పధం కూడ చాలా ముఖ్యమని; అందుకు సామాజిక, కళా సిద్దాంతాల గురించి కాస్తంతైనా తెలిసి ఉండాలని చెప్పే వాళ్ళు కావాలి. నాకు ఈ విషయంలో విరసం బాధ్యుడు పాణి, కాకినాడ లోని అద్దేపల్లి ప్రభు, కొలహాపూర్ లోని శ్రీనివాస మూర్తి చాలా సహాయం చేశారు.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిస్సందేహంగా 1818 చారిత్రాత్మక తప్పిదాలనూ దౌర్బల్యాలను చిత్రిక పట్టిన గొప్ప పుస్తకం.. ప్రతి ఖండికలోనూ మీ కష్టం కనిపిస్తుంది చదువుతుంటే.. చదువిన ప్రతి ఒక్కరూ ఒకింత ఆశ్చర్యం గానూ దుఃఖం గానూ.. ఫీలవుతారు.. ఆలోచనలో పడుతారు.. కవిత్వాన్ని నిబద్ధత తో ఒక తపస్సులా నిర్వహిస్తున్న శ్రీరమ్ గారికి అభినందనలు🌹💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు