సిక్కిం యాత్రలో చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే మా ప్రయాణం మొత్తం తీస్తా నదీ తీరం వెంటే నడవడం.
ఎం.ఆదినారాయణ గారు ‘భ్రమణకాంక్ష’లో తాను పుట్టిన వూర్లోని గుండ్లకమ్మ వాగు వెంబడి నడకతో ప్రయాణం చేసి నదీ మూలం కనుక్కుంటాడు. ఆ నది తీరం వెంబడి వూర్లని పలకరించి వస్తాడు. అది చదివిన తరువాత అనిపించింది. ఒక నదిని అర్థం చేసుకోవాలంటే మొదలునుంచి తుది నించి దానితో ప్రయాణాలు చేయాలి.
నాకు సిక్కిం యాత్రలో కాకతాళీయంగా తీస్తానది వెంట ప్రయాణం చేసి టిబెట్ సరిహద్దుల్లో అది పుట్టిన స్థలం వరకు చూడటం జరిగింది.
మైదాన ప్రాంతంలో నది ఎలా వుంది, రాను రాను అది ఎలా మార్పులు చెందుతూ వచ్చింది అనేది తెలుసుకోడం మనల్ని మనం తెలుసుకోడం లాంటిది. ఒక్క నదిని తుదకంటా వెతుక్కుంటూ పోతే నా వుద్దేశంలో ప్రపంచంలోని అన్ని నదులు తమని తాము మన ముందు ఆవిష్కరించుకుంటాయి. నదీ మూలాల్ని వెతుక్కుంటూ పోవడం ఆత్మ మూలాల్ని వెతుక్కోడం లాంటిది. .
ఒకచోట తీస్తానది తీరం వంపులు తిరుగుతూ ఎంతో అందంగా వుంది. కోసుగా తీరాన్ని కోసుకుని మలుపులు తిరిగిన నదీ సుందరి. కృష్ణశాస్త్రిగారి ‘నదీసుందరి’ గోదావరి గురించి రాసిన పద్యం గుర్తొచ్చింది.
మా గురువు గారు ఇస్మాయిల్ నేనెప్పుడు ఖాళీగా దొరికినా నదీ సుందరి పాట పాడమనేవారు. నేను పాడుతుంటే తన గురువు కృష్ణశాస్త్రి గుర్తొచ్చి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేవారు. ఆయన ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యేవారో అప్పుడు అర్థం అయేది కాదు.
కాని ఇపుడు తెలుస్తోంది, వయసు పెరిగిన కొద్ది మనం కోల్పోయిన క్షణాలు వ్యక్తుల విలువ తెలిసి వచ్చి ఎంత వేదన కలుగుతుందో…
తెల్లని గులక రాళ్ళు, మంచు రంగు పూసుకున్న తెల్లని మట్టి, మధ్యలో గల గలా ప్రవహిస్తున్న
తెలుపు నీళ్ళ తీస్తానది. నేనింతకు ముందు బదరీలో చూసిన అలకనందకి, మనాలీలో చూసిన బియాస్ కి అందంలో ఏ మాత్రం తీసిపోదు.
హిమాలయ నదులకున్న సౌందర్యం అంతయింతా కాదు. పాలరాతితో చెక్కిన సౌందర్యం యీ నదులది. అడుగడుగూ అందమే, అణువణువూ అద్భుతమే.
ఆ సౌందర్యాన్ని చూసి చలించిన మా ఆవిడ, అబ్బాయి నదిలోకి దిగి ఆడుకోవాలని కోరిక వెలిబుచ్చారు. నేను ఒప్పుకోలేదు. ప్రతి దానికి అధికారిలా ఏమిటి అభ్యంతరాలు అని విప్లవం లేవనెత్తారు. నేను ఒక బోర్డు చూపించాను. జలవిద్యుత్ కేంద్రాలు ఎగువలో వున్నందు వలన నదిలో ఆడటం ప్రమాదం అని రాసి వుంది.
నీళ్ళని నదిలోకి వదలడం అక్కడ తరచుగా జరుగుతుంది. ఇక్కడ నది మీద ప్రేమతో మనం అజాగ్రత్తగా వుండకూడదు.
తీస్తానది అనేక మలుపుల్లో గతంలో నేను పాపికొండల్లో గోదావరిలో విహరించిన సందర్భాలు కూడా గుర్తు వచ్చాయి.
ఇప్పటి వరకు నాకు ఒక అభిప్రాయం ఏమిటంటే ప్రపంచంలో అన్నిటి కన్నా అద్భుత సౌందర్యం గోదావరిదే, అదీ పాపికొండల దగ్గర గోదావరిని మించిన సౌందర్యం ఎక్కడా వుండదు అని.
తీస్తానది మలుపుల్లో నేను చూసిన సౌందర్యం మా అభిప్రాయాన్ని కొంచెం సవరించింది. హిమాలయ పర్వతాల్లో ప్రవహించే నదులకి ఒక ప్రత్యేక రంగు, రూపు, అందం, హెుయలు, ఒక్కోనదిది ఒక్కో అందం. ఇంకో దానితో దీన్ని పోల్చి, అది ఎక్కువ తక్కువ అని చెప్పడానికి మనకి హక్కు లేదు.
సౌందర్యాన్ని ఎన్ని రకాలుగా ఉపాసించ వచ్చో అన్ని రకాలుగా అనుభవించి పలకరించడం మన వంతు. ఇది నేను నేర్చుకున్న పాఠం.
ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ‘మల్లి’ అనే వూరి దగ్గర రివర్ రాఫ్టింగ్ (River rafting) తెప్ప మీద నదిలో ప్రయాణం బాగా ప్రసిద్ది చెందిందని చెప్పాను. ఈ ‘మల్లి’ అనే వూరు పశ్చిమ బెంగాల్ లో వుంది. తీస్తానదికి అవతలి వేపు ‘మల్లి బజార్’ అనే వూరు వుంది. నది యీ వూరిని రెండుగా విభజించింది. మల్లి బజార్ సిక్కింలో వుంది. పశ్చిమ బెంగాల్ కీ, సిక్కింకి మధ్యలో తీస్తానది సరిహద్దు.
రెండు రాష్ట్రాల మధ్య, రెండు దేశాల మధ్య సరిహద్దు నదిగా కలిగి వుంటం చాలా సహజంగా వుంటుంది. ప్రపంచంలో ఎన్ని సరిహద్దులు వున్నా నది సరిహద్దుగా కలిగినవి మటుకు అత్యంత సహజంగానూ, అందంగానూ అద్భుతంగానూ వుంటాయి. సహజంగా సరిహద్దుల్ని ఇష్టపడని నాలాటి వాళ్లకి కూడా, నది సరిహద్దుగా వుండటం ఎందుకో అది ఒక కాంప్రమైజ్.
కొండ దారుల్లో నెమ్మదిగా పైకి ఎగబాకుతూ సాయంత్రానికి మేము గాంక్ చేరాము. మేము దిగిన మాటలు తాఓడిలిక్ గాంగ్ టక్. ముఖ్య రోడ్డు M6 మా లో వుంది.
–
ఇప్పటి వరకు మొత్తం ప్రయాణం తీస్తానది పక్కనే జరిగింది. నది మలుపుల్లో తిరుగుతూ, కొండదారుల్లో ప్రయాణించాము.
కొన్ని చోట్ల తీస్తా వురుకులు పరుగులు తీసింది. ఇంకొన్ని చోట్ల జలాశయంలో నిలబడి వుంది. ఇపుడే మంచు కరిగి తెల్లగా ప్రవహిస్తున్న హిమానీ నదం అందం ఆశ్చర్య చకితుల్ని చేసింది.
అక్కడక్కడ ఒడ్డున నిలబడి నదిని చూడటం చాలా బాగుంటుంది. ప్రవహిస్తున్నది ఏదైనా అత్యున్నతంగా వుంటుందనిపిస్తోంది. కదిలేదేదైనా స్వచ్ఛంగా వుంటుందనిపిస్తోంది. నీళ్ళయినా జీవితమయినా కదలకుండా ఒకే చోట వుంటే అది వృధా అయిపోతుందనిపిస్తోంది. ఈ ఆలోచన నాలో యాత్రా కాంక్షని బలీయం చేసింది.
చిన్నప్పుడు కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో కృష్ణానది ఒడ్డున నిలుచుని నదిలో ప్రవహించే నీళ్ళని గమనించడం గుర్తొచ్చింది. అరకులో మారెడుమిల్లి అడవుల్లో నేను తిరిగినపుడు నాకూడా ప్రయాణం చేసిన అనేక జలపాతాలు అపుడు నాకు గుర్తుకు వచ్చాయి. మారేడు మిల్లినించి చింతూరు వరకు ప్రయాణించేటప్పుడు రోడ్డు పక్కనే ప్రవహించిన ఒక జలపాతం గుర్తొచ్చింది. దాని పేరు నేను ఎవర్నీ అడగలేదు. తెలుసుకోలేదు.
గాంగ్ టక్ కి వచ్చే దారిలో మమ్మల్ని ‘తాజ్ డెలిక్’ ట్రాకెల్ డెస్క్ నుంచి మర్నాడు మేము చూడాలనుకుంటున్న ప్రాంతాల వివరాలు అడిగాం. సిక్కింలో గాంగ్ టక్ తప్పిస్తే మిగతా అన్ని ప్రాంతాలకి వెళ్ళటానికి ‘పర్మిట్ తీసుకోవాలి. దీనికి ముందు రోజే గుర్తింపు కార్డు, ఫొటోలని ఇచ్చి అప్లయి చేసుకోవాలి.
ట్రావెల్ డెకు చెందిన వందనకి మా ముగ్గురి వివరాలు వాట్సాప్ లో పంపించి మర్నాడు నాధుల్లా పాస్ కి పర్మిట్ తీసుకోమని చెప్పాము.
మేము సాయంత్రం గాంగ్ టక్ చేరేసరికి మంచు ఎక్కువగా పడటం వలన నాధుల్లాకి ఎవరికీ పర్మిట్ ఇవ్వటం లేదని, కానీ సాధుల్లాకి దగ్గర్లోని Tsongo సరస్సు వరకు అనుమతి దొరికిందని తెలిసింది.
గాంగ్ టక్ నుంచి నాధుల్లా వరకు దారి పాత సిర్రోడ్ లో ఒక భాగం.
హెటల్ తాషిడెలిక్ లో మాకిచ్చిన గది రెండో అంతస్తులో వుంది. వీటిని టెర్రెసు గది అంటారు. ఈ గది నించి మొత్తం గాంగ్టక్ అంతా కనబడుతుంది.
మర్నాడుదయం పావని నను లేపి బాల్కానిలోకి తీసికెళ్ళింది. అక్కడి నించి కనబడిన దృశ్యం చూసి చలించిపోయాను. బంగారు కాంతిలో కనబడుతున్న హిమాలయాలు ఉదయ సూర్యుని కాంతి మంచు మీద పడి బంగారు రంగులో కనబడుతుంది. ఆ కొండల మధ్యలోంచి మేఘాల కన్నా ఎత్తుగా నిలబడ్డ కాంచనజంగా పర్వతం. ఆ అద్భుత దృశ్యం చూసి మేమిద్దరం అలా నిశ్శబ్దంగా చాలా సేపు నిలబడి పోయాం. తర్వాత తేరుకుని టీ చేసుకుని వచ్చి అక్కడే కుర్చీల్లో కూర్చుండి పోయాం.
‘వందన’ నించి ఫోను వచ్చే వరకు మాకు ఏవీ గుర్తురాలేదు. హిమాలయాలు, అదీ కాంచన జంగా అంత దగ్గరగా చూడలేదు ఇంతకు ముందు. తయారవమని నాధుల్లా దారిలో Tsongo సరస్సు వరకు వెళ్ళాలంటే త్వరగా బయల్దేరాలని చెప్పింది. దాంతో ఇద్దరం కాంచనజంగా సమక్షం నించి కదిలాం .
‘నాధుల్లా’ గాంగ్టక్ నుంచి 54 కి.మీ దూరంలో వుంది. టిబెట్కు ఇది ముఖ్యరహదారి. ఈ దారిలో అంతా మంచుకొండలే. ఉదయాన్నే తొమ్మిదిన్నరకి మొదలయిన మా ప్రయాణం హిమాలయ పర్వతాల్లోకి సాగిపోయింది.
నేనింతకు ముందు దక్షిణ భారతంలో నీలగిరి కొండల్లోను, కొడైకెనాల్, కూర్గు, టేక్కిడి, మున్నాలలో విహరించిన కొండలకి హిమాలయాలకి ముఖ్య భేధం ఏమిటంటే,
హిమాలయాల్లో కొండలు దాదాపు నిటారుగా గోడలా నిలబడి వుంటాయి. ఇలా వుండటం వలన కొంచెం నీళ్ళు తగిలిన అక్కడ మట్టి, రాళ్ళు రాలిపడటం దీని వలన అత్యంత ప్రమాదకరంగా ప్రయాణం సాగుతుంది. ఇంకోటి ఏమిటంటే, మిగతా పర్వతాల్లో వాలు ఎక్కువగా వుండటం వలన జనావాసాలు, గిరిజన తండాలు ఎక్కువగా వుండటం జరుగుతుంది. కానీ హిమాలయాల్లో జనావాసాలు వుండటానికి యోగ్యమయిన, వాలు లేదా పల్లపు ప్రాంతాలు తక్కువ. మంచుతో కప్పబడిన చోట్ల నివాసం దుర్లభం. .
మేము వెళ్ళిన దారిలో గ్రామాలు గానీ జనావాసాలు గానీ లేవు. ఎక్కడయినా రోడ్డు పక్క దుకాణాలు, టీ షాపులు వున్నా అవీ తక్కువే.
ఇటువంటి దుర్లభమైన రహదారిని, సరిహద్దు రోడ్ల సంస్థ బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ చాలా బాగా
సంరక్షిస్తున్నారని చెప్పాలి. ఎక్కడో ఒక చోట తప్పిస్తే రోడ్లు బాలేదు అని మాకు అనిపించలేదు.
ఇంత కష్టతరమైన భూభాగంలో చాలాచోట్ల సైనిక స్థావరాలు కనబడ్డాయి. 12000 అడుగుల ఎత్తులో వున్న యీ పాతసిల్కు దారిలో రానుపోను ఎక్కువగా సైనిక వాహనాలే కనబడ్డాయి. చాలా చోట్ల జారిపోతున్న కొండ చరియల వలన మూసుకు పోయిని రహదారిని గంటల సమయంలోనే మళ్ళీ సిద్ధం చేసే సరిహద్దు రహదారి సంస్థ వారికి యాత్రికులు రుణపడి వుండాలి. అదేరకంగా ఇంత చలిలో ఆక్సిజన్ సరఫరా తక్కువగా వున్న యీ ప్రాంతంలో చైనాతో మన సరిహద్దుల్ని కాపాడుతున్న సైనికులకి కూడా హ్యాట్సాఫ్.
(ఇంకా వుంది)
అభివందనలు, సర్,ముందుగా, యాత్ర విశేషాలు తో,మేము ేచూడలేని, అవకాశం లేనిమాతో…పర్యటన చేయంచారు.. ధన్యవాదాలు.👍👌..
ధన్యవాదాలు
ధన్యవాదాలు
అద్భుతమైన వర్ణన. నా చిన్నప్పుడు తెలుగు బుక్ లో కాశ్మీర దేశ యాత్ర పాఠం గుర్తుకు వచ్చింది.
ధన్యవాదాలు
అద్భుత వర్ణన. ఇది చదువుతుంటే మా కళ్ళతో చూసిన ఫీలింగ్. చిన్నపుడు తెలుగు బుక్ లో కాశ్మీర దర్శనం అనే పాఠం గుర్తుకు వచ్చింది సర్.
Thank u
ప్రయాణాలు ఇలా ఉండాలి ,వాటి గురించి ఇలా నెమరు వేసుకోవాలి .వ్యక్తిగా మీ భావుకతను ఇలా పైకి లేపిన ప్రయాణం బాహ్యంలోకి మాత్రమే కాదు ,అంతరంగంలోకి కూడా అనిపించింది .నదుల సంగమంలా మీ జీవితంలోని ప్రయాణాలన్నీ కలిపి చూసిన అనుభూతిని కలిగించారు రవిప్రకాష్ .
థాంక్బు ఆంటీ
మా గాంగ్ టాక్ ప్రయాణం గుర్తుకు వచ్చింది. చాలా బాగా రాసారు.
థాంక్యూ మేడం
మీరు రాసినది చదువుతుంటె ఆ దృశ్యాలు మా కళ్ళముందు కదిలిపోయాయి. మేము ఆ నదిని ఆ దృశ్యాల్ని వీక్షించాము. బదరినథ్, కేదారనాథ్,వ్యాలి ఆఫ్ ఫ్లవర్స్ చూసిన కారణంగా, ఆ హిమాలయాల అందాలు, ఆ నదుల సోయగాలు, ఆ జలపాతాలు అన్నీ అద్భుతం. ధన్యవాదాలు మీకు!!!
Thank u Madam
థాంక్యూ