ఒక దీక్షగా చదవాల్సిన నవల

కొత్త శీర్షిక ప్రారంభం

ర్సీ హోవార్డ్  న్యూబి అనే ఆంగ్ల రచయిత రాసిన ‘సంథింగ్ టూ ఆన్సర్ ఫర్” అనే నవలకు మొదటి బూకర్ ప్రైజ్ 1969లో లభించింది. నిజం చెప్పాలంటే ఇంత కష్టమైన రచనను నేను ఇప్పటిదాకా చదవలేదు. దీన్ని అర్ధం చెసుకోవడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. అయినా నవలను పూర్తిగా అర్ధం చేసుకోగలిగానని చెప్పలేకపోతున్నాను. చివరకు దీని రివ్యూలను వెతికితే నేను ప్రస్తుతం ఉన్న స్థితిలోకంటే ఇంకా అయోమయంలో ఉండి రాసిన వ్యాసాలే అవి అన్నీ. చాలా మంది అసలు దీనికి బూకర్ ఎందుకు వచ్చిందని, మరి కొందరు అసలు ఈ బూకర్ ప్రసక్తి లేకపోతే ఇంత కష్టం మేం పడేవాళ్ళం కాదని బాహాటంగానే చెప్పుకున్నారు.

రచయిత రెండవ ప్రపంచ యుద్దం లో పాల్గొన్న వ్యక్తి. మిలటరీ నుండి బైటకు వచ్చాక కైరోలో ఇంగ్లీషు భోధకుడిగా పని చేసారు. 23 నవలలు, 6 నాన్ ఫిక్షన్ లు రాసారు. ‘సంథింగ్ టూ ఆన్సర్ ఫర్”వీరి పదిహేడవ నవల. బూకర్ ప్రైజ్ ప్రకటించిన మొదటి సంవత్సరమే ఈ నవల ఆ ప్రైజ్ గెలుచుకుని చరిత్రకు ఎక్కింది. దీని కాపీలు కూడా చాలా కాలం లభ్యం కాలేదు. వీరి ఇతర పుస్తకాలలో కొన్ని ప్రస్తుతం దొరుకుతున్నా వేలలో వాటి వెల ఉంది. ఈ మధ్య రీప్రింట్ అయిన ఈ పుస్తకాన్ని నాకు అమెజాన్ లో దొరికింది.

కాని ఈ పుస్తక పఠనం చాలా కష్టంగా సాగింది. రచయిత శైలి చాలా సంక్లిష్టంగా ఉంది. వీరి ఇతర పుస్తకాలు నేను చదవలేదు కాబట్టి ఇది వారి సహజ శైలా లేదా ఈ ఒక్క పుస్తకం విషయంలో కథనం కోసం ఈ శైలిని వారు ఎన్నుకున్నారా అన్నది నేను వివరించలేను. చాలా సందర్భాలలో నడుస్తున్న విషయాలలో ఎంత నిజం ఉంది, ఎంత కల్పన ఉంది అన్న విషయం మీద స్పష్టమైన అవహాగనకు పాఠకులు రావడం కష్టం.

ఈ నవలలోప్రధాన పాత్ర పేరు టౌన్రో. మిలటరీ లో కొంత కాలం పని చెసిన అనుభవం ఉన్న వ్యక్తి ఇతను. ప్రస్తుతం టౌన్రో ఓ ఫండ్ డిస్ట్రిబ్యూటర్.  ప్రభుత్వానికి సంక్షేమ పధకాల కోసం ధనికుల నుండి వహ్చిన చందాను ఉపయోగించలేని పరిస్థితులలో తిరిగి ఆ దాతలకు దాన్ని చెర్చడం అతని పని. చాలా సందర్భాలలో ఆ దాతలు ఆ డబ్బును స్వీకరించని పరిస్థితులలో ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచడం కోసం అతను పని చేస్తున్నాడు. ఇది విన్నప్పుడు ఇటువంటి ఓ ఉద్యోగం నిజంగా ఉంటుందా లేదా ఆ దేశ ఆర్ధిక వ్యవ్యస్థ మీద రచయత వేసిన సెటైరా ఇది అన్నది స్పష్టం అవదు. ఎమైనా ఈ డబ్బును అతను స్వప్రయోజనాలకు వాడుకుంటూ ఉంటాడు. అంటే సహజంగా కొంత స్వార్ధం, అవకాశవాదం ఉన్న వ్యక్తి అతను.  1946 లో యుద్దం లో పని చేస్తున్నప్పుడు పోర్ట్ సెయిడ్‌లో ఖౌరీస్ బీచ్  వద్ద ఓ గుడిసె ముందు గుర్రం మీద వెళ్తుండగా టౌన్రో క్రింద పడిపోతాడు. ఆ ఇంటి యజమాని ఎలిఖౌరీ అనే వ్యక్తి, అతని భార్య శ్రీమతి ఖౌరి ఇతనికి సపర్యలు చేస్తాడు. ఆ స్నేహం వారి మధ్య  కొంత కాలం సాగుతుంది.

తన దేశం వెళ్ళిపోయిన టౌన్రో కి ఓ రోజు మిసెస్ ఖౌరీ నుంచి కబురు వస్తుంది. తన భర్త ఎలీ మరణించాడని అతని ఆస్థి లావాదేవీల విషయంలో తనకు సహాయం కావాలని, అందుకని ఒక సారి తమ దేశం వచ్చి తనకు సహాయపడమని ఆమె అర్ధిస్తుంది. టౌన్రో దీన్ని తన జీవితంలో వచ్చిన ఓ సదావకాశంగా వినియోగించుకోవాలనుకుంటాడు. భర్త చనిపోయి అసహయా స్థితిలో ఉన్న ఓ వితంతువుకు సాయపడే నెపంతో తానూ లాభపడవచ్చని అతనికి అనిపిస్తుంది. వెంటనే పోర్ట్ సేడ్ బయలుదేరతాడు.  పోర్ట్ సేడ్  ఈశాన్య ఈజిప్ట్‌లో మధ్యధరా సముద్ర తీరం వెంబడి 30 కిమీ  విస్తరించి ఉన్న నగరం. సూయజ్ కెనాల్ యొక్క ఉత్తర ముఖద్వారం ఇది. ఈ నగరానికి ఈ పేరు 1855లో వచ్చింది. దీనిని గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యన్ సామ్రాజ్యం, ఆస్ట్రియా, స్పెయిన్ మరియు పీడ్‌మాంట్‌లతో కూడిన అంతర్జాతీయ కమిటీ ఎంపిక చేసింది. ఫ్రెంచ్ పదం పోర్ట్ (మెరైన్ హార్బర్) మరియు సెయిడ్ (ఆ సమయంలో ఈజిప్ట్ పాలకుడి పేరు) కలిపి ఈ నగరానికి ఆ పేరు వచ్చింది. ఈ నవల కథను అర్ధం చేసుకోవాలంటే కొంత చారిత్రిక నేపధ్యాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకే అంత వివరంగా ఈ సమాచారం ఇక్కడ ఇస్తున్నాను. అలా ఈజిప్ట్ ప్రాంతానికి చెందిన ఈ ప్రాంతం పై అన్ని దేశాల ప్రభావం ఉంది అన్నది అర్ధం అవుతుంది.

కొంత ఆలోచించిన తర్వాత, శ్రీమతి ఖౌరీ పంపిన కైరో విమాన టికెట్ ను అందుకుని టౌన్రో పోర్ట్ సేడ్ కి బయలుదేరతాడు. దారిలో రోమ్ లో అతను ఆగవలసి వస్తుంది. ఇక్కడ ఓ ఇజ్రాయిల్ జర్నలిస్ట్ అతనికి పరిచయం అవుతాడు. టౌన్రో ఇంగ్లీషు వాడని తెలిసి ఆ జర్నలిస్టు ఇంగ్లండ్ పై తనకున్న కోపాన్ని బయటపెడతాడు హోలోకాస్ట్‌ను నిరోధించడంలో బ్రిటిష్ ప్రభుత్వం విఫలమైందని ఇతను ఆరోపిస్తాడు.  జర్మన్ కాన్సెన్ట్రేషన్ కాంపు లకు యూదులను పంపి హత్య చేస్తున్నారన్న సమాచారం ఇంగ్లండుకు ముందే అందిందని, కాని ఆ దేశం దీన్ని ప్రపంచానికి తెలియపరచలేదని, ఆ హత్యలను ఆపగలిగి కూడా ఇంగ్లండ్ ఆ పని చేయలేదని అతను కోపంగా అన్నప్పుడు ఇజ్యాయిల్ కు సంబంధించిన ప్రజలలో కొంత భాగం ఇంగ్లండ్ గురించి ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకుని టౌన్రో ఆశ్చర్యపోతాడు. ఇంగ్లండు ఇలాంటి పని చేయదని ఆ జర్నలిస్టుతో వాదిస్తాడు టౌన్రో.

కైరోలో  దిగినప్పుడు అతను ఆ దేశానికి ఎందుకొచ్చాడో చెప్పమని ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి అడిగితే, వితంతువు అయిన తన స్నేహితుని భార్య  శ్రీమతి ఖౌరీని తాను వివాహం చేసుకోదలిచానని టౌన్రో హస్యం ఆడతాడు. అతని ఈ భాద్యతా రహిత జవాబు అతని మనసులోని స్వార్ధాని బైటపెడుతుంది.  అది అక్కడ ప్రభుత్వ విచారణకు కూడా దారితీస్తుంది. దీని కోసం అతన్ని ఓ సెల్‌లో ఉంచుతారు. పోర్ట్ సేడ్ కు బైలుదేరే రైలు వెళ్లిపోయాక అతను విడుదలవుతాడు.

చివరకు ఎలాగో ఆ ఊరు చేరిన ఆతను వెంటనే మిసెస్ ఖౌరీ  ఇంటికి వెళ్లడు. ఓ హోటల్ లో బస చేస్తాడు. మొదటిసారి అక్కడ ఒంటరితనాన్ని అనుభవిస్తాడు టౌన్రో.

టౌన్రో ఇక్కడ సార్జెంట్‌గా గతంలో పనిచేసినప్పుడు తరచుగా వెళ్లిన ఒక బార్‌ని సందర్శిస్తాడు. బార్ యజమాని క్రిస్టస్ అతనిని గుర్తు పడతాడు. అతనితో ఒంటరిగా మాట్లాడాలని ఇతర కస్టమర్లను బయటకు పంపేస్తాడు. టౌన్రో క్రిస్టస్ ను ఎలీ మరణం గురించి అడుగుతాడు. మిసెస్ ఖౌరీ చాలా కష్టపడి తన భర్త మృతదేహాన్ని పాతిపెట్టడానికి లెబనాన్‌కు తీసుకువెళ్లినట్లు క్రిస్టస్ అతనికి చెప్తాడు. ఆమె చర్యల కారణంగా, కల్నల్ నాసర్ సూయజ్ కాలువను ఈజిప్ట్‌ భూబాగంగా పరిగణించవలసి వచ్చిందని చెబుతాడు.  టౌన్‌రో ఈ విషయాన్ని నమ్మలేకపోతాడు. అక్కడ విపరీతంగా తాగుతాడు. ఉదయం ఒంటి మీద బట్టలు లేని స్థితిలో అతను మేలుకొంటాడు. అతనిపై స్థానికుల దాడి జరుగుతుంది ఈ క్రమంలో అతని తలపై బలమైన గాయం అవుతుంది. ఒక కన్నుకి కూడా గాయం అవుతుంది. సైన్యంలోని అధికారులు అతన్ని గమనించి చికిత్స చేయిస్తారు.

దీని తరువాత నవలలో సంఘటనలలో క్రమంగా స్పష్టత లోపిస్తుంది. ఎది నిజం ఏది అబద్దమో తెలియని అయోమయానికి పాఠకులు చేరుకుంతారు. టౌన్రో తన జాతీయతను గుర్తుంచుకోలేని స్థితికి వెళతాదు. శ్రీమతి ఖౌరి తన భర్త హత్యకు గురి అయ్యాడని భావిస్తుంది. అతను ఆయుధాలను సప్లై చేస్తూ ఉండేవాడు. తనను తాను ఈజిబ్ట్ నాగరికుడిగా ప్రకటించుకున్నా ఈ ఆయుధాల వ్యాపరం మానేవాడు కాదు. ఇక శ్రీమతి ఖౌరీ తాను ఇంగ్లండు దేశీయరాలినని చెప్పుకుంటూనే ఈజిప్ట్ ఇపుడు తన దేశంఅని అంటుంది. కాని ఇంగ్లండు పై అపారమైన ప్రేమ, విశ్వాసం కనబరుస్తుంది.

టౌన్రో తాను ఇంగ్లండు వాడిని కాదని తాను ఐరిష్ వంశస్థుడినని చెప్పుకోవడం మొదలెడతాడు. అతని తల్లి అతనికి అప్పుడప్పుడూ గుర్తుకువస్తూ ఉంటుంది. ఇక నవలలో వచ్చె అరబ్బులు అటు బ్రిటీష్ దేశస్థులనూ, జర్మన్లను అసహ్యించుకుంటూ ఉంటారు.  టౌన్రో ఎలీ లాయర్ అబ్రానావెల్ ను కలుస్తాడు. ఇతను యూజిప్ట్ దేశానికి చెందిన యూదుడు. ఇతని కూతురు లీ అమెరికన్ పాస్పోర్ట్ కలిగి ఉంటుంది. ఆమె భర్త మతి చలించి విదేశాలలో ఆసుపత్రిలో ఉంటాడు. ఈమెను టౌన్రో ప్రేమిస్తాడు. టౌన్రో ఎలిని ఓ వీధిలో  తిరుగుతుండగా చూస్తాడు. అతను బ్రతికే ఉన్నడని నమ్ముతాడు. కాని అతన్ని తాను ఖననం చేసానని శ్రీమతి ఖౌరో చెబుతుంది. ఆ స్థలం చూపిస్తుంది కూడా. మరి అతన్ని సముద్రంలో ఖననం చేయడం గురించి తాను వినడం తన ఊహా, వాస్తవమా అన్నది టౌన్రోకి, పాఠకులకూ అర్ధం కాదు. టౌన్రో ని గుఢచారిగా అరెస్టు చేస్తారు. ఆ సమయంలో ఈజిప్ట్, బ్రిటీష్ సైనికుల మద్య తుపాకి కాల్పులను అతను గమనిస్తాడు.  ఎవరిది దేశప్రేమో, ఏది ఉన్మాదమో, ఏది నమ్మకమో, ఏది భాద్యతో అతనికి అర్ధం కాదు. సైనంలో ఉన్నప్పుడు తానూ సైనికుడిగా తుపాకి పట్టినా ఇంత మంది దేశస్థుల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణంలో ఓ సివిలియన్ గా ఎవరు ఏ పక్షం ఎందుకు తీసుకున్నారో అర్ధం కాని అయోమయపు స్థితిలో మౌనంగా యుద్దంలో నేలరాలుతున్న మనుష్యులను అతను గమనిస్తూ ఉంటాడు.

మధ్యలో ఎలీ సమాధిని తవ్వి అతని శవాన్ని బైటకు తీసుకువచ్చి సముద్రంలో ఖననం చేస్తాడు.  నవల చివరలో, వాస్తవం  ఏమిటో, ఊహ ఏమిటో తెలియని స్థితికి పాఠకులు చేరుకుంటారు. టౌన్రో చివరకు ఏ దేశ పౌరుడయినా తన ప్రభుత్వ నైతికతకు బాధ్యత వహించలేడని,  తాను స్వంతంగా చేసే పనులకు మాత్రమే అతను జవాబుదారిగా నిలుస్తాడని, మిగతాదేది అతని చెతిలో ఉండదని తెలుసుకుని ఒంటరిగా మిగిలిపోతాడు.

ఓ అత్యాశతో టౌన్రో ఆ దేశానికి వస్తాడు. అతని కన్ను ఎలి ఆస్థి మీద ఉంటుంది. తాను బ్రిటీష్ దేశస్థుడినని కాబట్టి ఆ అస్థి తన పేరున పెట్టమని అతను శ్రీమతి ఖౌరి పై ఒత్తిడి తీసుకొస్తాడు. ఆమె లాయర్ కూడా తాను ఆ దేశ పౌరుడిని కాబట్టి తన పేరున ఆ అస్థి పెట్టించుకోవాలనుకుంటాడు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ ప్రదేశంలో పౌరులుగా జీవించే అందరిలో తమ అస్థిత్వం పట్ల ఎన్నో అనుమానాలు కనిపిస్తాయి. తమ స్వంత దేశంపై కొందరికి, తాము కొన్నేళ్ళుగా ఉంటున్న దేశమే తమది అనే నమ్మకం మరొకొందరికి, కాని సందర్భానుసారంగా యుద్ద వాతావరణంలో ఎవరికి ఎటువైపు ప్రెమ భక్తి ఉన్నాయో అర్ధం కాని స్థితి వీరందరిదీ. ఇదే చోట ఉంటూ పూర్వికుల దేశం పై మూఢ భక్తి కొందరికి. ఈ దేశం మాది అప్పుడు మమ్మల్ని ఇక్కడివారిగా ఎందుకు చూడరనే కోపం మరొ కొందరికి, ప్రతి ఒక్కరిలో ఈ అస్థిత్వ అనుమానాలు కనిపిస్తూ ఉంటాయి. వారి పరస్పర ప్రేమలు, అనుబంధాలు అన్నీ ఈ అనుమానల చూట్టూ తిరుగుతూ, ఒకరినుండి మరొకరిని దూరం చేస్తూ ఉంటాయి. వీటి  మధ్య కథ నడుపుతూ  మనల్నీ అదే అయోమయం లోకి రచయిత తీసుకువెళుతున్నారేమో అనిపిస్తుంది.

సూయజ్ కెనాల్ క్రైసిస్ 1956 అక్టోబర్ లో మొదలయింది. సూయజ్ కెనాల్ ఈజిప్ట్‌లోని ఒక కృత్రిమ సముద్ర జలమార్గం, ఇది మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రానికి సూయజ్ యొక్క ఇస్త్మస్ ద్వారా కలుపుతూ ఆఫ్రికా ను ఆసియా నుండి విభజిస్తుంది. ఇది ఐరోపా, ఆసియాల మధ్య కీలకమైన వాణిజ్య మార్గం.  ఈ కాలువ ఈజిప్టు ప్రభుత్వానికి చెందినది, అయితే యూరోపియన్ వాటాదారులు, ఎక్కువగా బ్రిటిష్ మరియు ఫ్రెంచ్, కంపెనీలు ఇందులో రాయితీ కలిగి ఉన్నారు. తరువాత అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ దానిని జాతీయం చేసే ప్రయత్నం చేయడం సూయజ్ సంక్షోభానికి దారితీసింది. ఈ నవల కథ మొత్తం ఈ సంక్షోభం సమయంలో నడుస్తుంది. ఆ సమయంలో అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్న అన్ని దేశాల వాళ్లు ఈ రాజకీయ సంక్షోభంలో అనుభవించిన ఆందోళన ఈ నవలలో కనిపిస్తుంది.

అలా 1956లో ఈజిప్ట్‌పై బ్రిటీష్-ఫ్రెంచ్-ఇజ్రాయెల్ దండయాత్ర జరిగింది. ఇజ్రాయెల్ 29 అక్టోబర్‌న దాడి చేసింది.  తిరాన్ జలసంధి మరియు అకాబా గల్ఫ్‌ను తిరిగి తెరవాలనే లక్ష్యంతో ఈ దాడి జరిగింది. సంవత్సరం పాటు ఈజిప్టు దిగ్బంధనం ఇజ్రాయెల్ మార్గాన్ని మరింత నిరోధించింది కాల్పుల విరమణ కోసం ఉమ్మడి అల్టిమేటం జారీ చేసిన తర్వాత, యునైటెడ్ కింగ్‌డమ్,  ఫ్రాన్స్ నవంబర్ 5న ఇజ్రాయెల్‌తో  చేరాయి, ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దేల్ నాసర్‌ను పదవీచ్యుతుణ్ణి చేయాలని, సూయజ్ కెనాల్‌పై నియంత్రణను తిరిగి పొందాలన్నది వీరి ఉద్దేశం.

దండయాత్ర ప్రారంభమైన కొద్దికాలానికే, ఈ మూడు దేశాలు యునైటెడ్ స్టేట్స్,  సోవియట్ యూనియన్ నుండి అలాగే యునైటెడ్ నేషన్స్ నుండి కూడా తీవ్రమైన రాజకీయ ఒత్తిడికి గురయ్యాయి. సూయజ్ కాలువ అక్టోబరు 1956 నుండి మార్చి 1957 వరకు మూసివేయబడింది. అమెరికన్లు,  సోవియట్‌లను ప్రపంచ అగ్రరాజ్యాలుగా స్థాపించిన ప్రచ్ఛన్న యుద్ధం నేపథ్యంలో సూయజ్ సంక్షోభం బ్రిటిష్ వారికీ,  ఫ్రెంచ్ వారికి అంతర్జాతీయ అవమానానికి దారితీసింది. ఇది నాజర్ స్థితిని కూడా బలోపేతం చేసింది.

పోర్ట్ సెయిడ్ లో ఈ వ్యాపార లావాదేవీల కారణంగా అన్ని దేశాల వాళ్లు ఉన్నారు. మనదే భూభాగం అనే ఆందోళన ఈ యుద్ద వాతావరణం వారందరికీ కలిగించింది. ఎలీని సమాధి చేసినా, ఈ ఆందోళనను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనుభవిస్తున్న టౌన్రో అతని సమాధిని తవ్వి సముద్రంలో అతన్ని ఖననం చేయిస్తాడు లేదా చేయించాలనుకుంటారు. నవల టౌన్రో నరేషన్ తో నడుస్తుంది. అతని మానసిక స్థితి ఆధారంగా అతను నిజం చెబుతున్నాడొ ఊహిస్తున్నాడొ అర్ధం కాదు. కాని అతని ఆలోచనలలో ఈ ఆస్థిత్వం పట్ల అయోమయం ప్రకటితమవుతుంది. నవలలో వచ్చె ప్రతి పాత్ర ఈ అయోమయం చూట్టునే తిరుగుతుంది. అన్ని దేశాలకు వ్యాపార కేంద్రమయిన సుయిజ్ కెనాల్ పై పోరు అక్కడి ప్రజలలో కలిగించిన అలజడి రచయిత నవలకు కథా వస్తువు. ఈ అలజడిని అనుభవించిన టౌన్రో ఐరిష్ తల్లికి, ఇంగ్లీష్ తండ్రికి జన్మించిన వాడు. తల్లి తండ్రులు విడిపోతే తల్లి వద్ద పెరుగుతాడు. తలకు అయిన గాయం ప్రభావం, లేదా అక్కడ ఎదుర్కుంటున్న పరిస్థితుల ప్రభావం వల్లనూ కావచ్చు తన అస్థిత్వం ఏంటి అన్న ఆందోళన అతనిలోనూ పెరిగిపోతుంది.. అప్పటి దాకా బ్రిటీష్ వాడిని అని చెప్పుకున్న అతను, బ్రిటీష్ పాస్ పోర్ట్ ఉన్న అతను తరువాత తాను ఐరిష్ దేశస్తుడినని బ్రిటీషర్ ను కాదని చెప్పుకోవడం మొదలెడతాడు. బ్రిటీషర్లపై అక్కడి ప్రజలలో కనిపించే విముఖత అతన్ని ఈ స్థితికి తీసుకొస్తుంది. యుద్దం మనిషిలో కలిగించే అలజడిని చర్చించిన నవలగా “సంథింగ్ టూ ఆన్సర్ ఫర్” నవల నాకు అర్ధం అయింది.

జాతీయత, పౌరసత్వాన్ని మించి మానవ సంబంధాలు ఎదగవలసి ఉన్నదని కొన్ని సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది కూడా. ఏమైనా ఇది చాలా కష్టపడి చదివిన నవల, సంక్లిష్టమైన రచయిత శైలి, కథనం ఇబ్బంది పెట్టే మాట నిజం అందరూ ఈ నవలను పూర్తి చేయలేకపోవచ్చు. ఒక దీక్షగా చదివితే తప్ప నవల నేపధ్యమూ కొరుకుడు పడదు. కాని మొదటి బూకర్ ప్రైజ్ నవల చదివిన తృప్తి మాత్రం ఈ పుస్తకంతో మన సొంతం అవుతుంది.

*

జ్యోతి, పి.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి ప్రయత్నం. కష్టపడ్డారు. ఆ శ్రమ మొత్తం రివ్యూలో కనబడుతోంది. కొన్ని నవలలు, కవిత్వం … కేవలం ఒక టెక్ట్స్ లా, ఇండిపెండెంట్ గా చదివితే అర్థం కావడం కష్టం. ఆ కాలపు సామజిక, చారిత్రక సమస్యలు కొంత అర్థం కావాలి. 1920 లో తరువాతి యూరప్ తాత్విక సమస్యలకు లోనయ్యింది.

  • నమస్తే మేడం. మంచి శీర్షిక. తెలియని కొత్త విషయాలు ఎన్నో చెప్పారు. ముఖ్యంగా బుకర్ ప్రైజ్ పుస్తకాలు చదవాలని,వాటి గురించి తెలుసుకోవాలనే తపన మీ శీర్షిక ద్వారా నెరవేరుతోంది. చక్కటి శీర్షిక. కొనసాగించాలని కోరుతున్నాను. మంచి రివ్యూ రాశారు. మీకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు