ఒక తప్పిపోవటం గురించి

ఈ జీవితం హాస్పిటల్‌ గోడల లోపలి కొలతలకి తగ్గట్టు కట్ చేసిన జీవితం. జ్ఞాపకాలు దెబ్బతినటం వల్ల చివరకు ఆలోచన కూడా హాస్పిటల్ గోడలకి ఇవతలే తిరిగేది.

మురళి ఉచ్చ పోసుకుంటున్నాడు. ఆఫీసు టాయిలెట్ కలరా ఉండల వాసనతో, శుభ్రమైన టైల్స్‌తో, సింక్ ముందు మరకల్లేని పెద్ద అద్దంతో ఉంది. అప్పటి దాకా పైన ఉన్న లైట్లకేసి కొట్టుకుంటున్న ఒక రెక్కల పురుగు, ఆఖరిసారి కొట్టుకుని, ఇక ఎగరటం మానేసి, వచ్చి వచ్చి మురళి ముందున్న యూరినల్ పాట్‌లో పడింది, సరిగ్గా కన్నం దగ్గర.

ఉచ్చతో రెక్కలు తడిసి ఇక మళ్ళీ ఎగరలేకపోయింది. కన్నం దగ్గర ఉన్న కలరా ఉండల మధ్య అలాగే ఇరుక్కుపోయింది. ఆఖరు క్షణాల్లో అది అలా ఉచ్చలో పడి కొట్టుకోవటం మురళికి చూడబుద్ధి కాలేదు, ఉచ్చేమో ఆగేలా లేదు. తల వెనక్కి వంచి కళ్ళు మూసుకున్నాడు.

అప్పుడే—

కనుపాపల వెనక, కణతల మధ్య

ఏదో వెలుగు ఉఫ్‌ మని ఆరినట్టు

బిగ్ బేంగ్ రివర్స్‌లో జరిగినట్టు

బిగబట్టిన శూన్యం లబ్ డబ్ మని కొట్టుకుంటున్నట్టు

తల నిండా రంగు రంగుల కెమికల్ మార్పు

ఉచ్చ ఆగిన వణుకుతో కళ్ళు తెరిచేసరికి

—అంతా మారిపోయింది.

ఫ్లష్ కూడా నొక్కకుండా, ఎడమ పిడికిలి బిగించి, యూరినల్ పాట్స్ మధ్య ఉన్న సెరామిక్ పార్టిషన్‌ని ఒక్క గుద్దు గుద్దాడు. అది కదల్లేదు. రెండోసారి అంతే బలంగా, ఆ దెబ్బ తన చేతిని ఏం చేస్తుందో కూడా చూసుకోకుండా, మళ్ళీ గుద్దాడు. తర్వాత ఇక అలా గుద్దుతూనే ఉన్నాడు. వరస దెబ్బలకి సెరామిక్ పార్టిషన్ ఊగటం మొదలైంది. తొమ్మిదో దెబ్బకో పదో దెబ్బకో స్క్రూలు ఊడొచ్చేసి, కింద పడి, పగిలిపోయింది.

ఇదే టాయిలెట్‌లో ఇంకో యూరినల్ పాట్ ముందు నిలబడిన ఒక కొలీగ్ కళ్ళు పెద్దవి చేసి ఇదంతా చూశాడు. సెరామిక్ పార్టిషన్ కింద పడి బద్దలయ్యేసరికి, జిప్ పైకి లాక్కుని బైటికి పరిగెత్తాడు. బైట కనపడిన ఆఫీస్ బోయ్‌ని ఇటు రమ్మని సైగ చేశాడు. ఇద్దరూ టాయిలెట్లోకి తొంగి చూశారు. అప్పటికి మురళి సింక్ దగ్గర నిలబడి ఒక పింగాణి పెచ్చు తీసుకుని అద్దం బద్దలు కొడుతున్నాడు. ఇద్దరూ కలిసి ఫ్లోర్ మేనేజర్ దగ్గరికి పరిగెత్తారు.

***

జనరల్ మేనేజర్ ముందున్న సీట్లో మురళి తల దించుకుని కూర్చున్నాడు. మేనేజర్ తన కంపోజర్ మెయింటైన్ చేస్తూనే కుర్చీలో కూర్చున్నా గానీ అతని మొహంలో ఎక్సయిట్మెంట్ కనపడిపోతూంది. దాదాపు రోజూ ఒకేలా గడిచే ఆఫీసు రోజుల్లో ఈ రోజు ఇలా ఒక గమ్మత్తు జరిగేసరికి అతని పెదాల చివర్లలో చిన్నగా సంతోషం. ఆ గది బైట కూడా పెద్ద పనేం జరగటం లేదు. కొంతమంది క్యూబికల్స్ అంచుల మీంచి తల ఎత్తి మేనేజర్ రూము లోకి చూసి మళ్ళీ కూర్చుండిపోతున్నారు. కొంతమంది క్యూబికల్స్ గోడల మీద చేతులేసి కొలీగ్స్‌తో మాట్లాడుతున్నారు.

“పెర్సనల్ స్ట్రెస్ ఏదైనా గానీ అది వర్క్‌ని ఎఫెక్ట్ చేస్తున్నట్టయితే అది కూడా ఆఫీసుకి సంబంధించిన మేటరే అవుతుంది. వి ఆర్ హియర్‌ టు హెల్ప్ యూ మురళీ! ఎందుకు ఓపెన్‌గా మాట్లాడవు, షేర్ చేసుకోవు! తలపోట్లకి మెడికేషన్ ఏమైనా వాడుతున్నావా?”

మురళికి నిన్నటి దాకా ఉన్న లెక్కలు మారిపోయినట్టూ, మెదడు ఒక చీకటి గోడలున్న వేరే డైమన్షన్‍ లోకి తెరుచుకున్నట్టూ ఉంది. చేతికి కట్టిన ఫస్ట్ ఎయిడ్ బాండేజీ మీద ఫ్రెష్‌గా పాకుతున్న ఎర్రటి తడి మరక కూడా- అది తన రక్తం కాదన్నట్టూ, ఆ గుంజుతున్న నొప్పి ఈ శరీరానిదే తప్ప తనది కాదన్నట్టూ….

అదే ఆఫీసులో ఇంకో రూములో సేల్స్ ఇన్‌చార్జీ, హెచ్.ఆర్. మేనేజరూ కలిసి కంప్యూటర్‌లో మురళి ఫైల్ చూస్తున్నారు. ఎమర్జన్సీ కాంటాక్టుగా అక్కడ ఏ నంబర్ రాసుందో చూసి ఆ నంబరుకి కాల్ చేశారు.

మురళి భార్య గీత లిఫ్ట్ చేసింది.

ఆమె ఒక అరగంటలో ఆటో కట్టించుకుని ఆఫీసుకి వచ్చేసింది. నేరుగా మేనేజర్ రూము లోకి వచ్చి మురళి పక్కన కూర్చుంది. చేతికి బాండేజ్‌తో, చెమట్లకి తడిసిన జుట్టుతో, లోకం లెక్కల్లోంచి జారిపోయిన చూపుతో ఉన్న భర్తని చూసి— ఇవాళ పొద్దున్న ఆఫీసుకి బయల్దేరేటప్పుడు కూడా ఇంటికి పెద్దదిక్కు హోదాలో బైక్ మీంచి బై చెప్పిన భర్తని ఇప్పుడిలా చూసి— ఆమెకి ఏడుపు తన్నుకొచ్చింది. కానీ చుట్టూ పరాయివాళ్ళు ఉన్నారు కాబట్టి ఏడుపు దిగమింగుకుంటూనే, భర్తని తన మాటలతో మళ్ళీ ఈ లోకం లోకి రప్పించటానికి ట్రై చేసింది. ఆమె ఆ పనిలో ఉండగానే– జనరల్ మేనేజరూ, సేల్స్ ఇన్‌చార్జీ, హెచ్.ఆర్. మేనేజరూ చుట్టూ నిలబడి, ఆమెని క్యూరియస్‌గా ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు.

ఆమె ఇలా భర్త ఆఫీసుకి రావటం ఇదే మొదటిసారి. అతను ఇక్కడ అంతా బాగానే నెట్టుకొస్తుంటాడనీ, మడత నలగని ఫుల్ హేండ్స్ షర్ట్‌తో కొలీగ్స్ భుజాల మీద చేతులేసి నవ్వుతూ మాట్లాడుతుంటాడనీ, ఆఫీసు కారిడార్‌లో బూట్లు టకటక లాడించుకుంటూ ధీమాగా నడుస్తాడనీ ఊహించుకునే ఆమెకి— ఇప్పుడు అతను ఇలా కొత్తగా జూ లోకి తెచ్చిన జంతువు లాంటి బెదురు కళ్ళతో ఉండటం చూసి— మొత్తం ధైర్యమంతా జారిపోయింది. అతన్ని కాపాడుకోవాలన్న ఇన్‌స్టింక్ట్ నిద్ర లేచింది. భర్తని అర్జంటుగా ఈ ప్లేసు నుంచి ఇంటికి తీసుకుపోవాలి. ఎవరి ప్రశ్నలకీ సరిగ్గా జవాబు ఇవ్వలేదు. ఏమన్నా మాట్లాడినా కూడా మీరే దీనికి అంతటికీ కారణం అన్నట్టు కోపంగా మాట్లాడింది. భర్తని సీటు లోంచి లేపి నడిపించుకుని బైటికి తీసుకు వెళ్ళింది.

వాళ్ళిద్దరూ ఆ గది లోంచి బైటికి రాగానే, ఆమెకి కూడా పరిచయం ఉన్న మురళి కొలీగ్స్ ముగ్గురు క్యూబికల్స్ మధ్య లోంచి లేచి, వాళ్ళతోపాటు కింద దాకా వచ్చారు. వాళ్ళకి మురళితో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలీటం లేదు. అసలు వాళ్ళ కంటికి మురళి ఇలా ఇన్‌షర్ట్ లేకుండా ఆఫీసులో నడవటమే ఎంతో అన్నేచురల్‌గా ఉంది. అందుకే మురళిని కదపకుండా అతని భార్యకే ధైర్యం చెబుతూ మాట్లాడి వాళ్ళిద్దరినీ ఆటో ఎక్కించి పంపేశారు. తర్వాత ముగ్గురూ లిఫ్ట్‌లో పైకి వెళ్తున్నప్పుడు ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలో తెలీనట్టు చేతులు వేలాడేసుకుని నిలబడ్డారు. మనసులో వాళ్ళవాళ్ళ కుటుంబాలని గుర్తు చేసుకున్నారు.

కాసేపటికే ఆఫీసు టాయిలెట్‌లో విరిగిపోయిన అద్దం రిపేరు మొదలైంది. రిపేరుకి వచ్చిన కుర్రాళ్ళు రక్తం మరకలు చూసి ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు. టైల్స్ మీద రక్తం మరకల్ని తుడుస్తున్న స్వీపరు ముసలాయన ఏదో ఇంటిగుట్టు బైటికి పొక్కకుండా దాస్తున్నట్టు, “మీ పని మీరు చేసుకుని పొండ్రా, ఎందుకు ఆరాలు! ఏదో గాలి సోకిందంతే,” అంటున్నాడు.

***

ఆ రోజు రాత్రి ఇంట్లో మురళి లుంగీ కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. అతని ముందు గీత నిలబడి ఉంది, చంకలో మూడేళ్ళ పిల్లని ఎత్తుకుని. గీత మురళి కళ్ళల్లోకే చూస్తా ఉంది. మురళి మాత్రం తన ఎదర ఒక మనిషి లేనే లేదన్నట్టు ఆమె శరీరం లోంచి వెనక్కి ఎక్కడికో చూస్తున్నాడు.

అతన్ని అలా చూస్తే ఆమె గొంతు దగ్గర ఏడుపు గడ్డలా తోసుకొస్తుంది.

“మాట్లాడు చిన్నూ… ఏమైందిరా… ఎందుకీ మొండితనం?” అంటుంది. ఐనా అతను తన వైపు చూడకపోతుంటే చుబుకం కింద చేయి వేసి తల పైకి ఎత్తింది. గీత చంకలో ఉన్న పిల్లేమో నాన్న ముఖం చూసి నాన్న వైపు చేతులు చాపింది. మురళి ఇద్దరి వైపూ చూసి మళ్ళీ తల దించుకున్నాడు.

“చూడు చిట్టి నీ దగ్గరికి వస్తానంటుంది. ఇటు చూడు!” అని మళ్ళీ తల ఎత్తబోతే—

మురళి నవ్వటం మొదలుపెట్టాడు.

భుజాలు ఊపుతూ వెర్రి నవ్వు.

గీతకి ఆ నవ్వు చూసి ఒళ్ళంతా వణికింది. ఠాప్ మని మురళి చెంప మీద కొట్టింది. ఐనా నవ్వు ఆపకపోతుంటే, ఒకదాని తర్వాత ఒకటి మూడు సార్లు చెంప దెబ్బలు వేసింది. మురళి నవ్వు ఆగలేదు. కానీ మెల్లగా అతని కళ్ళల్లోంచి కన్నీరు చెంపల మీదకి కారటం మొదలయ్యింది. అది చూసి ఆమె ఆగిపోయింది. పిల్ల గుక్కపట్టి ఏడిచింది.

***

ఆ మరుసటి రోజే ఇంటికి గీత అమ్మా నాన్నా వచ్చారు. ఆ తర్వాతి రోజు మురళి వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. అలా నలుగురూ చుట్టూ చేరితే గీతకి కాస్త ఊరటగా ఉంది. కనీసం ఇప్పటికిప్పుడు తర్వాతి స్టెప్ ఏంటీ అన్న ఆలోచన చేయాల్సిన బరువు లేదు. అమ్మానాన్నలూ, మావగారూ కలిసి మాట్లాడుకుని మురళిని ఏ హాస్పిటల్‌లో చూపిస్తే మంచిదీ, డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి సర్దాలీ లాంటి విషయాల మీద ఆమె తరఫున కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆమె కలగజేసుకోకుండా వింటూ, తలాడిస్తూ ఉండిపోయింది.

మురళి తలలో ప్రమాదంగా పాకే పాముల చుట్ట. గీత తలలో చిక్కులు తెగని దారపు ఉండ. ఒక అందమైన పుస్తకం చదువుతూ, చాప్టర్ అయింది కదాని పేజీ తిప్పితే- వరుసగా, అయోమయంగా అన్నీ ఖాళీ పేజీలే ఎదురైనట్టు ఉంది గీతకి. ఇప్పటి దాకా తన ఇల్లూ, తన సంసారం, తన జీవితం అని ఎంతో నికరంగా నమ్మినదంతా కేవలం ఈ ఒక్క మనిషి మెదడు సరిగ్గా పని చేయటం మీద ఆధారపడి ఉందన్న నిజం— తను ఇప్పటి దాకా అసలు ఆలోచించనిది— ఇప్పుడు అదే పనిగా ఆలోచన లోకి వచ్చి వెళ్తా ఉంది.

ఒక్కోసారి మురళి ఉన్నట్టుండి కేకలు పెడతాడు, వస్తువులు విసురుతాడు, అతని నోటమ్మటా ఎప్పుడూ వినపడని బూతులు గాలి లోకి చూస్తూ తిడతాడు. ఇది జరిగినప్పుడు గీత గుండె పీల్చుకుపోయినట్టు బెదురు కళ్ళతో అతని వైపు చూస్తూ ఉండిపోతుంది. అతని మెదడులో అనూహ్యంగా జరిగే ఏవో కెమికల్‌ మార్పుల మీద తన మనశ్శాంతి ఆధారపడటం గీతకి కొత్తగా అలవాటు పడాల్సిన విషయమైంది. మామూలుగా ఐతే ఐదేళ్ళు కలిసి బతికిన తర్వాత అతని మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకి తెలుసు. అతనికి ఏం నచ్చుతుందో ఏ నచ్చదో తెలుసు. అలా ఒకరికొకరు ట్యూనైపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెకి తెలిసిన మనసుకి తలుపులు పడిపోయాయి. ఆ తలుపుల వెనకాల ఏవో గరుకు తోకలూ, పదును కోరలూ ఉన్న మృగాలు తిరుగుతాయి. అతని మీద పడి గీరుతాయి, రక్కుతాయి, కొరుకుతాయి. అతను పెట్టే కేకలు మాత్రమే బైటకి వినపడతాయి. బైట నుంచి ఆమె ఏ సాయమూ చేయలేదు. చేతగాని ఒంటరితనం. అతను అరిచీ అరిచీ అలసిపోయి నిద్రపోయినప్పుడు మాత్రమే అతను నిద్రలో పొందుతున్న శాంతి ఆమెనీ ఆవహించేది.

అందరూ కలిసి మురళిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడప్పుడూ వయొలెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడని చెబితే డాక్టరు హాస్పిటల్‌లో జాయిన్ చేసుకుని కొన్ని సెషన్లు ఎలక్ట్రిక్ షాకులు ఇప్పించాడు. ఒక రోజు ఆ ట్రీట్మెంట్ జరిగిన గది లోంచి నర్సు వీల్ చెయిర్లో మురళిని తోసుకుంటూ బైటకు తీసుకు వస్తుంటే– అతని చూపుల్లో తనపట్ల అసలేమీ లేకపోవటాన్ని గీత మొదటిసారి చూసింది. ఆసుపత్రికి తీసుకురాక మునుపు అతను ఎలాంటి కండీషన్‌‍లో ఉన్నా గానీ కనీసం కదిపితే గీత పట్ల కళ్ళల్లో ఒక పాత చనువు కనపడేది. ఇప్పుడు మాత్రం అదేమీ లేని గాజు కళ్ళు.

***

మురళి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, వాళ్ళిచ్చిన మందులు వేసుకోవటం మొదలుపెట్టాక, కేకలు వేయటం, వస్తువులు బద్దలు కొట్టడం తగ్గింది. ఆ మందుల వల్ల ఎప్పుడూ ఒక మత్తులో, మబ్బులో ఉన్నట్టు ఉంటాడు. ముద్ద నోట్లో పెట్టుకో అంటే పెట్టుకుంటాడు, మగ్గుతో ఒంటి మీద నీళ్ళు మీద పోసుకో అంటే పోసుకుంటాడు.

ఈలోగా గీత తండ్రి ఊళ్ళో బట్టల షాపుని కొడుక్కి ఒక్కడికీ వదిలేసి వచ్చేశానని కంగారు పడటం మొదలుపెట్టాడు. ఒక రోజు తల్లిదండ్రులిద్దరూ గీత చేతికి కొంత డబ్బు ఇచ్చి, అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేయమని, తమ్ముడ్ని పంపిస్తామని చెప్పి ఊరికి బయల్దేరారు. ఇక మావగారు మిగిలారు.

మురళి తండ్రి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొడుకుతో దగ్గరగా కూర్చుని ఎప్పుడూ మాట్లాడింది లేదు. మిగతావాళ్ళల్లాగ ఇప్పటి మురళి లోంచి పాత మురళిని బైటికి తీసుకురావాలన్న ప్రయత్నాలేం చేయలేదు. వచ్చినప్పటి నుంచీ ఈ మురళితో తనకి పరిచయం లేదన్నట్టే అంటీముట్టనట్టు ఉన్నాడు. కొడుకుతో ఈ సందర్భంలో ఎందుకో ఇలాగే ఉండాలని ఆ రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టరుకి గతం నేర్పింది.

ఒకసారి మురళికి ఎనిమిదో తరగతిలో ఒక పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పేరెంట్స్-టీచర్స్ మీటింగులో మురళి రిపోర్ట్ కార్డ్ చూసి తండ్రి ఏం మాట్లాడకుండా బైటికి వెళ్ళిపోయాడు. స్కూలు కారిడార్లలో తండ్రి వెనకాలే మురళి నిశ్శబ్దంగా నడిచాడు. చెట్ల కింద తండ్రి బైక్ స్టాండ్ తీస్తుంటే వెనక నిల్చొని, “సారీ నాన్నా!” అన్నాడు. తండ్రి జవాబు ఇవ్వకుండా బైక్ కిక్ కొట్టాడు. ఇద్దరూ బండి మీద నిశ్శబ్దంగా వెళ్ళారు. ఆ తర్వాత రెండు నెలల పాటు తండ్రి మురళితో ఒక్కమాట మాట్లాడ లేదు. మురళీ ఏమో మళ్ళీ పరీక్ష ఎప్పుడు వస్తుందా, అందులో మంచి మార్కులు తెచ్చుకుని మళ్ళీ నాన్నతో ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూశాడు. తర్వాతి రిపోర్ట్ కార్డులో మంచి మార్కులు చూసాకే తండ్రి మళ్ళీ మురళితో మాట్లాడాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు నాన్న నుంచి ఇలాంటి కోపం భరించడం మురళికి కాస్త సులువు గానే ఉండేది. అమ్మ చనిపోయాకా ఆ కోపం తనొక్కడే మోయాల్సి వచ్చి కష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి తనే లొంగాల్సి వచ్చేది. పెద్దయ్యాక తీసుకున్న నిర్ణయాల విషయంలో కూడా తండ్రి కోపం తట్టుకోలేక చాలాసార్లు వెనక్కి తగ్గాడు. కాలేజీ రోజుల్లో ఏదో అవుట్ డోర్ స్కెచింగ్ గ్రూపులో చేరాడని తెలిసినప్పుడూ (“పోయి రోడ్ల మీద సుద్దతో బొమ్మలేసి చిల్లర అడుక్కో అదే కరెక్ట్ నీకు!”), వేరే కేస్ట్ అమ్మాయిని ప్రేమించాడని తెలిసినప్పుడూ (“నీ బతుక్కి దాన్ని తార్చితే తప్ప బతకలేవురా!”)… ఇలా చాలా సందర్భాల్లో నాన్న కోపానికీ, ఆ కోపం వల్ల నాన్న నుంచి కలిగే దూరానికీ జడిసి మురళి నాన్న చెప్పినట్టే నడుచుకున్నాడు.

ఈ రోజు పొద్దున్న ఆయన హాల్లో పెద్ద సోఫాలో కూర్చుని గీత తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ పేపరు చదువుతూ, మధ్యలో ఒకసారి మురళి వైపు చూశాడు. మురళి టీ షర్టూ ఫేంటూ వేసుకుని, గీత రెడీ చేసినట్టే రెడీ అయ్యి, సోఫా పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని, ఒళ్ళో చేతులు పెట్టుకుని, ఓ పక్కకి చూస్తున్నాడు. అతని పెదాల మూల నుంచి కొంచెం సొల్లు తీగలా కిందకి కారుతుంది.

తండ్రి చదువుతున్న పేపరు నేల కేసి కొట్టాడు.

“ఎయ్! నోరు తుడుచుకో!”

లోపల పిల్లకి జుట్టు దువ్వి జడేస్తున్న గీత గబగబా బైటికి వచ్చింది.

“ఏమైంది మావయ్యా?”

ఆయన చూపుడు వేలితో మురళి వైపు చూపించాడు.

“ఆడి వాటం చూడు!”

గీత మురళి దగ్గరికి వెళ్ళి చున్నీతో మూతి తుడిచింది.

“అలా అరిస్తే ఆయనకి తెలుస్తుందా అండి!”

“అన్నీ వేషాలు!” అని గొణిగి పేపరు మళ్ళీ చేతుల్లో తీసుకున్నాడు.

“వేషాలా! ఏం మాటలవీ!”

“నీకు తెలీదు నువ్వూరుకో. చిన్నప్పటి నుంచీ ఇంతే! ఏదీ నా వల్ల కాదని చేతులెత్తేయడమే! ఏ బరువూ భుజాన ఎత్తుకోడు.”

“ఆయన కండీషన్‌ తెలిసీ అలా ఎలా మాట్లాడతారు మావయ్యా?”

“ఎందుకు తెలీదూ, ఆ డాక్టరు అంత పెద్ద రోగం పేరు చెప్పి అంత పెద్ద బిల్లేసాక కండీషన్ అర్థం కాకుండా ఎలా ఉంటుందీ! కానీ ఏంటి ఈ వయసులో నాకీ దరిద్రం అని బాధంతే! వీడు నాకేదో చేసి పెట్టేస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. కనీసం వాడి లైఫ్ వాడు నిలబెట్టుకుంటే చాలనుకున్నాను. అదీ చేయలేకపోతే బాధేయదా, కోపం రాదా! అలా ఆడంగోళ్లాగా ఒళ్ళో చేతులు ముడుచుకుని సొల్లు కారుస్తూ కూచుంటే ఇల్లు ఎలా నడుస్తుందీ అన్న ఇంగితం మనిషికి ఉండాలా వద్దా! ఓపక్క హోమ్ లోన్ ఉంది, బోలెడు పాలసీలు, రేప్పొద్దున్న పిల్ల ఫీజులు, దాని పెళ్ళి… వీడేమో… ఛీ!”

గీత ఏం అర్థం కానట్టూ, ఏ మాటా రానట్టూ కాసేపు ఆయన వైపు చూసింది.

“మీకంత ఇబ్బందిగా ఉంటే వద్దులెండి మావయ్య. నేను చేయగలిగిందేదో చేసుకుంటాను.”

ఆ తర్వాత రోజు ఆయన బేగ్ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.

***

ఊరు నుంచి వచ్చిన తమ్ముడి సాయంతో గీత మురళిని హాస్పిటల్‍కి తీసుకు వెళ్ళి తీసుకు వస్తా ఉంది. కానీ ఆ మందులు వల్ల ఏం పెద్ద ప్రయోజనం ఉండటం లేదు. రోజులు గడిచే కొద్దీ గీతలో ఇదంతా టెంపరరీ అన్న నమ్మకం తగ్గిపోతా ఉంది. ఏదో ఒక రోజు పొద్దున్నే మురళి ఎప్పటి లాగే నిద్ర లేచి ఆ పాత అందమైన నవ్వుతో కిచెన్‌లోకి నడుచుకుంటూ వస్తాడన్న భ్రమలు తొలగిపోతున్నాయి.

మురళి అప్పుడప్పుడూ మామూలుగా ఉండాలని ప్రయత్నించేవాడు. కానీ ఆ ప్రయత్నం చాలా అన్నేచురల్‌గా ఉండేది. అందరికీ అర్థమయ్యే లోకం లోకి వచ్చి, ఆ లోకంలో ఒకడిగా కనిపించాలన్న ఆత్రం అతని ముఖం మీద ఒక వెర్రి నవ్వు లాగా అంటుకునేది. ఆ ప్రయత్నం లోని లోపలి ఒత్తిడి వల్ల మాట తడబడేది. అతని లోపలెక్కడో ఇంకో మనిషి ఈ ప్రదర్శనని చూస్తూ, “నువ్వు మామూలుగా ఉండటాన్ని కూడా సరిగ్గా నటించ లేకపోతున్నావురా” అని జాలి పడుతున్నట్టు– అతని వెర్రి నవ్వు వెనకా, తడబడే మాటల వెనకా– కళ్ళలో ఒక దీనత్వం కదిలేది. గీత ఆ యాతన చూడలేకపోయేది.

డాక్టరు ఒక మూడు నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటరులో ఉంచితే నయం కావొచ్చు అన్నాడు. గీతకి ట్రై చేసి చూద్దాం అనిపించింది. ఐతే నెలకి రెండు సార్లు తప్ప విజిటింగ్ అలౌ చేయరు. ఫీజు కట్టేసి మనిషిని మూణ్ణెల్ల పాటు వాళ్ళకి అప్పజెప్పెయ్యాలి. గీత తల్లిదండ్రులూ, మావగారూ కూడా ఇదే మంచిదన్నారు.

రిహాబిలిటేషన్ సెంటర్ సిటీ శివార్లలో ఉంది. మురళిని జాయిన్ చేయటానికి గీత కూడా అతనితోపాటు వేన్‌లో వెళ్ళింది. వేన్ సిటీ లోంచి పోతున్నంతసేపూ మురళి కిటికీ లోంచి బైటకి చూస్తూనే ఉన్నాడు. సిటీ మార్నింగ్ రొటీన్‌లో ఉంది. స్కూల్ బస్ కిటికీల్లో యూనిఫారాలతో పిల్లలు, బండి వెనక డబ్బాలతో డెలివరీ బాయ్స్, వీపుకి లాప్‌టాప్‍ బేగ్స్‌తో ఎంప్లాయ్స్… అందరూ వాళ్ల వాళ్ల జీవితాలు వేసిన దారుల్లో సర్దిపెట్టిన రోజుల్లోంచి కట్టు తప్పకుండా ప్రయాణిస్తున్నారు. ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ తర్వాత మురళి మెదడు చాలావరకూ జ్ఞాపకాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒక్కోసారి ఏదో పాత జ్ఞాపకం లీలగా రాజుకున్నా గానీ అందుకునే లోపే మాయమయ్యేది. ఇప్పుడు కూడా అలాగే— ఈ వేన్ ఒక చౌరస్తా దగ్గర సిగ్నల్ కోసం ఆగినప్పుడు— ఒక జ్ఞాపకం రాజుకుంది. అది ఏదో ఒక రోజు నాటి జ్ఞాపకం కాదు. ఇదివరకూ, తనింకా ఈ మంద నుంచి తప్పిపోక ముందు, రోజూ పొద్దున్నే ఆఫీసుకి వెళ్తూ, ఇదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్ ఆపి, ఇలాంటి ఏటవాలు ఎండలోనే సిగ్నల్ కోసం ఎదురు చూసేవాడు. ఆ ఉదయాలన్నిటి కూడిక లాంటి జ్ఞాపకం ఇప్పుడు అతని తలలో తెరుచుకుంది. అలాంటి ఉదయాల్లో, బైక్ న్యూట్రల్‌లో పెట్టి, ట్రాఫిక్ పోల్ మీద ఎర్రటి అంకెల కౌంట్ డౌన్ వైపు చూస్తూ, అప్పుడు తను చేసిన ఆలోచనలన్నీ— గీత గురించో, పాప గురించో, వీకెండ్ ప్లాన్ గురించో, హౌస్ లోన్ గురించో, ఆఫీసు ఇంక్రిమెంట్ల గురించో అప్పటి తన ఆలోచనలన్నీ— ఇప్పుడు ఆ పాత కన్సెర్న్‌ తోనే మళ్ళీ తనలో రూపం తీసుకోబోతున్నట్టు… ఏదో మూల నుంచి ప్రయత్నపు పెనుగులాట. కానీ ఆ ప్రయత్నం పూర్తవటం లేదు. ఆ ఆలోచనలేవీ అతనిలో మళ్ళీ ఆ పాత సౌకర్యంతో వచ్చి కూర్చోలేకపోతున్నాయి, అతన్ని పూర్తిగా వశం చేసుకోలేకపోతున్నాయి. అంతరంగపు కంచె అవతలే వెలిగి ఆరే మిణుగురులు. లోపల పెను కలవరం… అందుకోలేని వైఫల్యం… ఉప్పొంగే నిరాశ. వేన్ కిటికీ వైపు నుంచి తల తిప్పి పక్కన కూర్చున్న గీత కళ్లల్లోకి చూశాడు. అతని కళ్ళల్లో కదులుతున్నదేదో గీతకి చప్పున అర్థమైనట్టు అనిపించి అతని ముఖం వైపుకి వంగింది, భుజం మీద చేత్తో రాసింది, ఏంటన్నట్టు తల ఆడించింది. ఈలోగానే మిణుగురులు ఆరిపోయాయి. కొవ్వొత్తి కొడి అంచున రాజుకున్న నిప్పు చుక్క మీదకి బూడిద పొర కట్టేసింది. గుప్పున శూన్యపు పొగ… మళ్ళీ అవే గాజు కళ్ళు. కిటికీ వైపు తల తిప్పేశాడు. ఆమె సీటు వెనక్కి వాలింది.

రిహాబిలిటేషన్ సెంటరులో కన్సల్టేషన్ రూములో డాక్టరుతో మీటింగ్ అవుతుండగానే ఇద్దరు వార్డు బాయ్స్ లోపలికి వచ్చి డోర్ దగ్గర నిలబడ్డారు. మురళిలో చిన్నప్పటి ఇంజక్షన్ భయం లాంటి ఫీలింగ్. గీత చేతి మీద చేయి వేశాడు. ఆమె ఆ చేతిలోని భయాన్ని అర్థం చేసుకుంటూనే డాక్టరుతో మామూలుగా మాట్లాడాల్సి వచ్చింది. మురళిని వార్డు బాయ్స్ లోపలికి తీసుకువెళ్తుంటే గీత వాళ్ళ వెనకాల వరండాలో కొంత దూరం నడిచింది. ఆఖరి తలుపు లోంచి లోపలికి తీసుకుపోయే ముందు ఒకసారి వార్డ్ బాయ్స్‌ని ఆగమని చెప్పి మురళి దగ్గరకి వెళ్ళి, “ఒక్క మూడు నెలలు ఓపిక పట్టు. మళ్ళీ మనం అంతా మామూలుగా ఉండొచ్చు. నేను రెండు వారాల తర్వాత వస్తాను,” అంది. వార్డ్ బాయ్స్ తన చేతిని మోటుగా పట్టుకున్న తీరుని బట్టి మురళికి తన పరిస్థితి మారుతుందని అర్థమైంది. లోపల్నించి భయం పీకుతున్నా- ఇంకా ఎక్కడో మిగిలిన మగతనపు కుటుంబపెద్ద అవశేషాల్లోంచి తన ఈ రాతని కూడా గంభీరంగా ఒప్పుకుని తల ఊపి లోపలికి నడిచాడు.

***

మూడు నెలలు ఒక్కద్దానివే సిటీలో రెంట్ కట్టుకుంటూ ఉండటం ఎందుకూ ఊరికి వచ్చేయమన్నారు గీత అమ్మానాన్నా. తమ్ముడు కూడా ఊళ్ళో పనులున్నాయి ఎక్కువ కాలం సిటీలో గీతకి తోడు ఉండలేను అన్నాడు. దాన్తో గీత ఊరికి బయల్దేరక తప్ప లేదు. ఆ రోజు అన్నీ సర్దుకుని బయలుదేరుతున్నప్పుడు, తను దేన్ని వదిలి వెళ్ళిపోతుందో ఒక్క గీతకే అర్థమైంది. లైట్లూ కుళాయిలూ కట్టిందో లేదో చూసుకుని, ఫ్రిజ్ కూడా కట్టేసి, దేవుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుని, కళ్ళు తెరిచి ఒకసారి చుట్టూ చూసుకుంది. కొన్ని పాత దృశ్యాలు మనసులోకి వచ్చాయి. ఈ ఇంట్లో జరిగిన పుట్టినరోజు సందళ్లూ, కిటికీల్లోంచి నీరెండ పడుతుంటే అగరొత్తుల వాసన వేసే ఆదివారం పొద్దులూ, బైట జడివాన తెర అవతల ప్రపంచం ఒకటుందని మర్చిపోయి ముగ్గురూ ఒకే మంచం మీద పొర్లిన సాయంత్రాలూ… ఇలాంటివి. ఆ ఇల్లు తాళం వేస్తున్నప్పుడు లైఫ్‌లో ఒకే ఒక్క ముఖ్యమైన విషయానికి తాళం వేసి శాశ్వతంగా వీపు చూపించి వెళ్ళిపోతున్నట్టు….

గీత ఊరికి వచ్చిన వారం రోజుల తర్వాత ఒక రోజు నాన్న వచ్చి బట్టల షాపు పక్కన ఒక షాపు ఖాళీ అయ్యేలా ఉంది తీసుకుందామా అన్నాడు. ఎందుకూ అని అడిగింది. ఆయన నిట్టూర్చి తను ఏమనుకుంటున్నాడో చెప్పటం మొదలుపెట్టాడు. “అల్లుడికి మరి ఎప్పుడు నయం అవుతుందో తెలీదు. ఈ మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత కూడా నయం అవ్వచ్చూ కాకపోవచ్చు. మీ నానమ్మ విషయం చూశావు కదా, ఆవిడని పాపం పెదతాతయ్య చివరి దాకా అలా దగ్గరుండి చూసుకున్నాడు. ఆవిడంటే ఆడది. ఇక్కడ అల్లుడి విషయంలో అది పూర్తిగా మనం తీసుకునే డెసిషన్ కూడా కాదు. మీ మావగారు ఏమంటారో కూడా చూడాలి. ఏదేమైనా గానీ నువ్వు నీ లైఫ్ గురించి ఇంక విడిగా ఆలోచించటం మంచిది. పసిపిల్ల ఉంది, దానికో దారి చూడాలి….” ఇలా కొంత సేపు మాట్లాడాక, ఇప్పుడు ఆ ఖాళీ అవుతున్న షాపుని అద్దెకు తీసుకుని అందులో గీత చేత ఒక బొటీక్ పెట్టించాలన్న ఆలోచన గురించి చెప్పాడు. తండ్రి మాటలకి గీతకి లోపల ఎంత కోపంగా అనిపించినా ఆ మాటల్లో కాదనటానికి కూడా ఏం కనపడ లేదు.

ఇప్పటికే రెండుసార్లు రిహాబిలిటేషన్ సెంటర్‌కి విజిటింగ్‌కి వెళ్ళి వచ్చింది. రెండుసార్లూ అక్కడి డాక్టర్ సేల్స్‌మెన్ లాగా హోప్‌ఫుల్‌ ముఖం పెట్టి మాట్లాడాడు. కానీ విజిటర్స్ రూములో మురళిని కలిసినప్పుడు మాత్రం అతని పరిస్థితిలో ఏం పెద్ద మార్పు కనపడ లేదు. రెండోసారి వెళ్ళినప్పుడైతే మురళి కళ్ళల్లో గుర్తు కూడా చాలా వరకూ తగ్గిపోయినట్టు అనిపించింది. ఆ రోజు మురళిని వదిలి వచ్చేటప్పుడు, ఒకసారి నర్సును బైటికి వెళ్ళమని చెప్పి, ఎక్కడో మొక్కి తెచ్చిన కాశీతాడుని అతని చేతికి కట్టింది. అతన్ని లేపి నిలబెట్టి గట్టిగా కావలించుకుని, తల వంచి నుదుటి మీద ముద్దు పెట్టి వచ్చింది.

***

మురళికి రిహాబిలిటేషన్ సెంటర్లో రోజులు మెలకువకీ, మత్తుకీ, నిద్రకీ మధ్య పెద్ద తేడా లేకుండా గడుస్తున్నాయి. వార్డులో ఉన్న మిగతా పేషెంట్లతో కలిసి ఒక కొత్త జీవితం మొదలైంది. ఈ జీవితం హాస్పిటల్‌ గోడల లోపలి కొలతలకి తగ్గట్టు కట్ చేసిన జీవితం. జ్ఞాపకాలు దెబ్బతినటం వల్ల చివరకు ఆలోచన కూడా హాస్పిటల్ గోడలకి ఇవతలే తిరిగేది. పొద్దున్నే లేవటం, క్యూలో నిలబడి వాళ్ళు ప్లేట్లో పెట్టే టిఫిన్ తినటం, తర్వాత పేరు పెట్టి పిలిస్తే లేచి వెళ్ళి టాబ్లెట్లు తీసుకుని వేసుకోవడం, తర్వాత నిద్ర వస్తే నిద్రపోవటం, మెలకువ వచ్చినప్పుడు మిగతా పేషెంట్లతో టైమ్ గడపటం….

పేషెంట్లు ఒక్కొక్కరూ ఒక్కో స్థాయి తెలివితేటలతో ఉండేవారు. కొంచెం ఎక్కువ తెలివి ఉండే పేషెంట్లు మిగతావాళ్ళని అదుపు చేయటమో, ఆటాడించడమో చేసేవారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కోసారి వార్డుబాయ్స్ చేత దెబ్బలు తినేవారు. పేషెంట్ల మధ్య చిన్న చిన్న గొడవలు టిఫిన్ దగ్గర క్యూలో చోటు కోసమో, బాత్రూం దగ్గర వంతు కోసమో, టీవీ రిమోట్ కోసమో జరిగేవి. టీవీ రిమోట్ మురళి చేతికైతే ఎప్పుడూ అందేది కాదు. అతను దాని కోసం ప్రయత్నం కూడా చేసేవాడు కాదు. టీవీ హాల్లో ఒక మూల కూర్చుని ఎవరేం ఛానెల్ పెడితే అది చూస్తూ కూర్చునేవాడు.

అప్పుడప్పుడూ మంచానికి జారబడి కూర్చుని తన పరిస్థితి గురించి ఆలోచించాలని ప్రయత్నించేవాడు. కానీ ఆలోచన సాగేది కాదు. చీకటి గదిలో నడవబోతే గోడలు తట్టుకున్నట్టు ఏదో అడ్డం పడేది. ఒక్కోసారి చచ్చిపోదాం అన్న ఆలోచన వచ్చేది. ఆ ఆలోచనలో మరీ కూరుకుపోకుండా ఆసరాగా పట్టుకుందామంటే మెదడులో ఏ ముఖ్యమైన జ్ఞాపకమూ దొరికేది కాదు. ఐతే చచ్చిపోవాలన్న కోరిక కూడా బతకాలన్న కోరికంత బలహీనంగానే ఉండేది. కాబట్టి సులువుగానే వేరే ఆలోచన వైపు వెళ్ళిపోయేవాడు. లేదంటే అసలు ఏ ఆలోచనా లేకుండా- వార్డులో స్నానాలూ, టిఫిన్లూ, టాబ్లెట్లూ, భోజనాలూ, నిద్రలూ అన్న సర్కిల్ లోనే తిరుగుతూ, శరీరం ఎలా చెప్తే అలా నడుచుకునేవాడు.

ఒక రోజు టీవీ హాల్లో ఎవ్వరూ లేక రిమోట్ మురళి చేతికి దొరికింది. దాన్ని తీసుకుని గది మూలకి పోయి కూర్చుని ఛానెల్స్ మార్చాడు. ఒక ఛానెల్‌లో ఎవరో గీసిన బొమ్మలు కనపడితే ఆగాడు. నైంటీంత్ సెంచరీకి చెందిన ఒక జపనీస్ పెయింటర్ గురించి డాక్యుమెంటరీ అది. ఆ జపనీస్ పెయింటర్ దేశమంతా తిరుగుతూ బొమ్మలు గీసేవాడట. ఒకసారి ఏదో చిన్న టౌనులో మకాం పెట్టి ఆ టౌను పేరుతో “వంద దృశ్యాలు” అని గీశాడు. రోజూ పొద్దున్నే డ్రాయింగ్ సామానుతో బయల్దేరే వాడట. ఆ టౌనులో ఉన్న ష్రైన్‌లూ, టీహౌసులూ, వంతెనలూ, చెర్రీ పూల చెట్లు, గుర్రపు బగ్గీలూ, ఓడ రేవులూ, టౌన్ వీధుల్లోంచి కనపడే మంచు పర్వతాలూ… ఇవన్నీ బొమ్మలు గీస్తూ ఒక ఏడాది పాటు అక్కడే ఉండిపోయాడట. అతను విడిది చేసిన బోర్డింగ్ హౌస్ ఉన్న వీధికి ఇప్పుడు అతని పేరే పెట్టారు. డాక్యుమెంటరీలో అతను గీసిన వుడ్ బ్లాక్ ప్రింట్‌లు వరుసగా చూపిస్తున్నారు. ఆ తర్వాత ఆ బొమ్మల్లో ఉన్న టౌన్ ఇప్పుడెలా ఉందో విజువల్స్ చూపిస్తున్నారు. ఆ పెయింటర్ బొమ్మల్లో అందమైన వెలుగు నీడల్లో కనపడిన ప్రదేశాలు ఇప్పుడు చాలా మారిపోయి కనిపిస్తున్నాయి. హై రైజ్ బిల్డింగులూ, అడ్వర్టయిజ్మెంట్ హోర్డింగులూ, కార్లూ, మెట్రో రైళ్ళూ, బేకరీలూ, రెస్టారెంట్లూ… వీటన్నిటి మధ్యా ఇన్‌షర్టులూ, స్కర్టులతో ఆడాళ్ళు మగాళ్ళు చకచకా నడుస్తున్నారు.

మురళికి అదే పెయింటర్ ఈ కొత్త ప్రపంచంలో బతికుంటే ఏం చేసేవాడా అన్న ఆలోచన వచ్చింది. బహుశా ఇప్పుడు కూడా అప్పుడు చేసిన పనే చేసేవాడేమో. ఏదో ఒక లాడ్జీలో దిగి, పొద్దున్నే బేగ్‌లో కుంచెలూ కేన్వాసులూ సర్దుకుని బయల్దేరి, టౌనంతా తిరుగుతూ, నచ్చిన చోటల్లా ఆగి బొమ్మలు గీసుకునేవాడేమో. టీవీ స్క్రీన్ మీద కార్ల వరస మెల్లగా కదులుతున్న ట్రాఫిక్ వారన, పేవ్మెంట్ మీద తలల ప్రవాహం మధ్యలో– ఆ జపనీస్ పెయింటర్ డ్రాయింగ్ సామాను మోసుకుంటూ నడుస్తున్నట్టు మురళి ఊహించుకున్నాడు. ఆ ఊహ మురళిని చాలా కదిలించింది. కాలాలు జరిగిపోతున్నా, శతాబ్దాలు మారుతున్నా, ఆ పెయింటర్ మాత్రం అలాగే ఒక్కడూ తన పని తను చేసుకుపోతున్నట్టు. ఈ ఊహ వచ్చిన తర్వాత స్క్రీన్ మీద చూపిస్తున్న ఆ పాత వుడ్ బ్లాక్ ప్రింటుల్లోని అందం మురళికి కన్నీరు తెప్పించింది. ఎవరో పేషెంట్ వచ్చి మురళి చేతుల్లోంచి రిమోట్ లాక్కునే వరకూ అలాగే లీనమైపోయి చూస్తూ కూచున్నాడు.

ఆ రిమోట్ లాక్కున్న పేషెంట్ ఇంకో ఛానెల్ మార్చాడు. ఆ ఛానెల్లో ఏదో న్యూస్ వస్తా ఉంది. కొద్ది రోజుల్లో ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమికి అతి దగ్గరగా రాబోతుందని న్యూస్ రీడర్ చెప్తున్నాడు. ఆ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనే అవకాశం ఉందా లేదా అన్న విషయం మీద నాసా వాళ్లు ఏమంటున్నారో చెప్తున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అలాంటి ఆస్టరాయిడే ఒకటి వచ్చి భూమిని ఢీకొట్టిందనీ, అప్పుడే భూమ్మీద డైనోసార్లతో సహా అనేక జీవాలు అంతరించి పోయాయనీ చెప్తున్నాడు. స్క్రీన్ మీద ఏనిమేషన్‌లో విజువల్స్ కనిపిస్తున్నాయి. డైనోసార్లు తీరుబడిగా చెట్లు మేస్తుంటే, వాటి పొడవాటి తలల వెనకాల ఆకాశంలో… మొదట చిన్నగా ఒక వెలుగు మొదలైంది. ఆ వెలుగు అంతకంతకూ పెద్దదై, దాని వెనక మంటల తోక పొడవుగా సాగి, ఎక్కడో కొండల అవతల భూమిని ఢీ కొంది. పెద్ద పేలుడు, ఆకాశమంతా పొగ, నిప్పుల వాన, డైనోసార్లు ఊపిరాడక చనిపోతున్నాయి… మురళి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మురళిని బొమ్మలు గీసే పిచ్చి పట్టుకుంది. డాక్టరుని బతిమాలి పెన్సిలూ, తెల్లకాయితాలూ తెచ్చుకున్నాడు. తన బెడ్ పక్కన ఉన్న టేబిల్‌ని మంచానికి దగ్గరగా లాక్కుని బొమ్మలు వేసేవాడు. కానీ అతను వాడే మందులు మెదడుని బరువుగా బిగదీసినట్టు పట్టుకుని ఎక్కువ పని చేయనిచ్చేవి కాదు. అదే వార్డులో టాబ్లెట్లు వేసుకోకుండా తప్పించుకునే టెక్నిక్ తెలిసిన ఒక పేషెంట్ దగ్గరకు వెళ్ళి అది ఎలాగో తనకు నేర్పమన్నాడు. ఆ పేషెంట్ మురళిని రహస్యంగా ఒక పక్కకి తీసుకెళ్ళాడు. టాబ్లెట్స్ నోట్లో పెట్టుకుని నర్సుకి నోరు తెరిచి చూపించాక కూడా ఎలా వాటిని నర్సు కన్నుగప్పి ఊసేయచ్చో, ఒక్కోసారి అసలు నోటి లోకి కూడా పోనివ్వకుండా కనికట్టు చేసి ఎలా జేబుల్లో దాచేయచ్చో… ఈ ట్రిక్స్ అన్నీ ఆ పేషెంట్ ఒక మెజిషియన్ తన విన్యాసాల గుట్టు బైటపెడుతున్నట్టు గర్వంగా చెప్పాడు. మురళికి ఈ టెక్నిక్ మొదట కొంచెం కష్టమైనా మెల్లగా అలవాటైంది. వరుసగా ఒక మూడు రోజుల పాటు మందులు వేసుకోకుండా బైటికి ఊసేసాక– మురళి మెదడు మతితప్పినవాడికి మాత్రమే సాధ్యమయ్యే ఇంటెన్సిటీని సాధించింది. అదే పనిగా బొమ్మలు వేయటం మొదలుపెట్టాడు. అందులో ఎక్కువ నగరం దృశ్యాలు ఉండేవి. మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫాంల మీద వెయిట్ చేసే మనుషులు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బైక్స్ మీద ఆగిన మనుషులు, కాన్ఫరెన్స్ రూముల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వినే మనుషులు, వీపులకి బిల్‌‍బోర్డ్‌లు తగిలించుకుని నడిచే మనుషులు, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సైటుల్లో సిమెంట్ దాకలు మోసే మనుషులు, పార్కుల్లో బిగ్గరగా నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొట్టే లాఫింగ్ థెరపీ మనుషులు, ట్రేడ్ ఫెయిర్లలో జెయింట్ వీల్ చుట్టూ ఏర్పాటైన టెంపరరీ వీధుల్లో తిరుగుతూ వస్తువులు బేరమాడే మనుషులు… ఇలా మనుషులు గుంపుగా ఉన్న బొమ్మలు ఎక్కువ గీసేవాడు. ఏ బొమ్మ గీసినా ఆ బొమ్మలో ఎక్కడో ఒక చోట మాత్రం ఆకాశానికి చోటు ఇచ్చేవాడు. ఆ ఆకాశంలో దూరంగా మంటల తోకతో దూసుకొచ్చే ఒక చిన్న గ్రహశకలాన్ని గీసేవాడు. అది గీస్తే తప్ప మురళికి ఆ బొమ్మ పూర్తయినట్టు అనిపించేది కాదు.

***

ఆ రోజు రాత్రి మురళికి నిద్ర సరిగా పట్టలేదు. వార్డులో లైట్లు ఆరిపోవటం, అందరూ మంచాలు ఎక్కడం, దుప్పట్లు కప్పుకోవటం, గురకలు పెట్టడం… ఇవన్నీ జరుగుతున్నా అతనికి మాత్రం నిద్ర మత్తు రాలేదు. అసలు భూమి వైపు గ్రహ శకలం దూసుకొచ్చే ఈ రాత్రి వీళ్ళంతా ఇంత నిశ్చింతగా ఎలా పడుకోగలుగుతున్నారో అతనికి అర్థం కాలేదు.

వీళ్ళంతా పిచ్చోళ్ళు కాబట్టే ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నారేమో! బహుశా ఈ హాస్పిటల్ గోడల బైట ఉన్న లోకమంతా ఈపాటికి భయంతో బిక్క చచ్చిపోయి ఆకాశం వైపు చూస్తూ ఆఖరి క్షణాలు లెక్కపెడుతుందేమో!

మురళి మంచం మీద నుంచి లేచాడు. మిగతా మంచాల మధ్య నుంచి చప్పుడు లేకుండా నడిచి తలుపు దగ్గరకు వెళ్ళాడు. రోజూ తలుపు పక్కన బెంచీ మీద నిద్రపోయే వార్డు బాయ్ ఇప్పుడు అక్కడ లేడు. వరండాలో వెలగాల్సిన లైట్ కూడా వెలగటం లేదు. బహుశా పిచ్చోళ్ళకి నిజం చెప్పి నిద్ర పాడు చేయటం ఎందుకని, పిచ్చోళ్ళంతా ఏ భయమూ లేకుండా నిశ్శబ్దంగా చచ్చిపోతేనే మంచిదని, ఇక్కడ అందర్నీ ఇలా వదిలేసి హాస్పిటల్ స్టాఫ్ మొత్తం ఎక్కడైనా తలదాచుకోవటానికి వెళ్ళిపోయారేమో!

చీకటి వరండాలో నడుస్తుంటే, పైన మేడ మీదకి పోయే మెట్లుండే చోట అలికిడైంది. మురళి గోడకి దగ్గరగా ఆనుకున్నాడు. మెట్ల మీద నుంచి ఒక ఆడామె, స్వీపర్ కావొచ్చు, నవ్వుతూ కిందకి దిగింది. ఆమె వెనక వార్డు బాయ్ పరిగెత్తుకుంటూ దిగాడు. ఇద్దరూ పక్క వరండా లోకి వెళ్ళిపోయారు.

“ఐతే వదిలేసి పోలేదు, మనుషులున్నారు!”

మురళి వాళ్ళు దిగి వచ్చిన మెట్ల వైపు తొంగి చూశాడు. అక్కడ ఇనుప గేటు కొంచెం తెరిచి ఉంది. గేటు సందు లోంచి ముదురు నీలంగా ఆకాశం. మామూలుగా ఆ గేటు ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండదు. మురళి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. గేటు మధ్య ఉన్న ఖాళీని పెంచకుండా, ఉన్న సందులోంచే దూరి డాబా మీదకి వెళ్ళాడు. డాబా మీద సోలార్ పేనల్స్ పరిచి ఉన్నాయి. వాటి మధ్య నిలబడి తల ఎత్తి చూశాడు. మబ్బులు లేని ఆకాశంలో పెద్ద పెద్ద నక్షత్రాలు కనిపిస్తున్నాయి.

టైమ్ ఎంత అయిందో తెలీదు. గ్రహశకలం భూమిని తాకే రాత్రి ఇదేనని మాత్రం తెలుసు. డాబా అంచున సిమెంట్ పిల్లర్స్ మీద ఒక వాటర్ టాంక్ ఉంది. అది ఎక్కడానికి మెట్లేం లేకపోవటంతో గొట్టాలు పట్టుకుని చాలా కష్టపడి పైకి ఎక్కాల్సి వచ్చింది. పైకి చేరాక ఆ అలసటతో కాసేపు అలాగే వాటర్ టాంక్ మీద వెల్లకిలా పడుకుండిపోయాడు. వీపు కింద గచ్చంతా టాంక్‌ నీళ్ళ ఆవిరితో వేడిగా ఉంది.

సిటీ లిమిట్స్‌ కాబట్టి బిల్డింగ్ చుట్టుపక్కలంతా చీకటి గానే ఉంది గానీ, దూరంగా సిటీ ఉన్న చోట మాత్రం వెలుగు ఆకాశం లోకి ఎగదన్నుతుంది. మురళి ఒత్తిగిలి పడుకుని, ఇంకా నిద్రపోని ఆ సిటీ వంక చూశాడు. తను పుట్టి పెరిగిన సిటీ. స్కూలుకెళ్ళి కాలేజీకెళ్ళిన సిటీ. ఉద్యోగం తెచ్చుకుని పెళ్ళి చేసుకుని బిడ్డని కన్న సిటీ. జీవితమంతా గడిపిన సిటీ. కొంచెం అడుగు తడబడినందుకు నిర్దాక్షిణ్యంగా బైటికి నెట్టేసింది! మురళి కంటి మీదకి చెమ్మ ఊరింది. దృశ్యం మసకబారింది. ఆ మసక బారిన దృశ్యంలో… ఒక నలుసు జరిగినట్టు… చిన్న వెలుగు చుక్క!

మురళి కళ్ళు నులుముకున్నాడు.

అదేంటి నక్షత్రమా?

చప్పున లేచి నించున్నాడు.

చూపు లోని శక్తి అంతా ఆ చుక్క మీదే ఉంచి చూస్తూ ఉండిపోయాడు.

అవును, అనుమానం లేదు, ఆ చుక్క పెద్దది అవుతా ఉంది, అంతకంతకీ…!

మొదట్లో నక్షత్రమేమో అనిపించింది కాస్తా ఇప్పుడు చూస్తూ చూస్తూ ఉండగానే దాదాపు చందమామ సైజులోకి పెరిగింది. కానీ కాలుతున్న చందమామ లాగ, దాని మీద మంటలు, దాని వెనక మంటల దారి… భూమి వాతావరణం లోకి గ్రహశకలం దూసుకొస్తా ఉంది! మురళి మంచుబొమ్మలా నిలబడిపోయాడు.

గ్రహశకలం పెద్ద వెలుగు తివాచీని భూమ్మీద పరుచుకుంటూ వస్తుంది. చెట్టూ చేమా కొండలూ గుట్టలూ అన్నీ మెరుస్తున్నాయి. అర్ధాంతరంగా సూర్యుడు ఉదయించినట్టు, అంతలోనే పట్టుతప్పి భూమ్మీదకి రాలిపోతున్నట్టు… ఆ గ్రహశకలం భూమిని తాకే ముందు కొన్ని క్షణాలూ మటుకు మురళి మెదడులో చాలా ఎక్కువసేపు గడిచాయి.

అతనికి గతం గుర్తొచ్చింది. అంటే తన గతం కాదు (తనకంటూ ఏమీ మిగల్లేదు), మొత్తంగా మానవ గతం… గుహల్లో బొమ్మలు గీయటం దగ్గర నుంచి, పచ్చి మాంసం తినటం దగ్గర నుంచి, అగ్గి కనిపెట్టడం దగ్గర నుంచి, చెక్క చక్రం దొర్లించడం దగ్గర నుంచి, విషం పూసిన బాణాలు వదలటం దగ్గర నుంచి, సైన్యాలు కోటలు తగలబెట్టడం దగ్గర నుంచి, బుద్ధ నిర్వాణం దగ్గర నుంచి, క్రీస్తు శిలువ దగ్గర నుంచి…

…తన దాకా!

ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. నెత్తి మీద పెచ్చు లేచిపోయి బుర్ర లోపల ‘ఇది నేనూ’ అనిపించేదంతా దుమ్ము రేగినట్టు బైటికి కొట్టుకుపోయి నేల మీద మట్టిలో కలిసిపోయే క్షణం… ఆ మట్టిలో అందరితోపాటే తనూ…! గీత, పాప, నాన్న, స్నేహితులు, తను ఇప్పటిదాకా చూసిన కలిసిన ప్రతి ఒక్కరూ…! ఈ రాత్రి ప్రేమది. తప్పిపోయినవాళ్ళందరినీ మందలో కలిపి, మంద మొత్తాన్నీ భూమి తనలో కలిపేసుకునేది. పుట్టినప్పటి నుంచీ సంతోషపెట్టినవీ బాధపెట్టినవీ అన్నీ ఇక ఇప్పుడు కాసేపటి తర్వాత అదే మట్టిలో ఉంటాయి. ఆ మట్టి అంతా ఒకే మంట కింద కాలి ఒకే లావాగా మారి వేలయేళ్ళపాటు అలాగే పారుతుంది. కరుకు మాటలూ ఇరుకు ఆలోచనలూ అన్నీ సమసిపోయే ఒకే పెద్ద పదార్థ ప్రవాహం… అదంతా మళ్ళీ ఎప్పటికో గడ్డకట్టి, ఆ నేల మీద మళ్ళీ ఎప్పుడో ఒకే చల్లటి వాన. ఇప్పుడిక తనకి బుర్ర పనిచేయటం పనిచేయకపోవటం, అందులో జ్ఞాపకం ఉండటం ఉండకపోవటం పెద్ద విషయం కాదు. అందరూ ఈ క్షణం నుంచి భూమికి ఒక జ్ఞాపకం. అంతే. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు.

దూరంగా గ్రహశకలం భూమిని తాకింది. భూమి మొత్తం అదిరింది. ఒక ధూళి మేఘం కొండంత పెద్ద అల లాగా పైకి లేచి తన వైపు దూసుకు వస్తుంది. మురళి చేతులు బార్లా చాపాడు. ఆ ధూళిలో తనూ కలిసిపోయి ఒక ఎండుటాకు కంటే ఏం ఎక్కువా తక్కువా కాకుండా కొట్టుకుపోవడానికి.

***

ఆ మర్నాడు ఉదయం— ప్రపంచం నిన్న రాత్రే అంతమైపోయిందని తెలియని ఆసుపత్రి వాళ్లు— మురళి శవాన్ని నేల మీంచి స్ట్రెచర్ మీదకి లేపి లోపలికి తీసుకు వెళ్ళారు.

*

మెహెర్

తెలుగులో కొత్త వచనానికి వర్ణమాల తిరగరాస్తున్న రచయితల్లో మెహెర్ మొదటి కోవ. మెహెర్ కథ రాసినా, వ్యాసం రాసినా ఆ వాక్యంలో తనదైన తేటదనం! ఉత్తమ చదువరీ, బుద్ధిజీవీ, నిర్మొహమాటి అయిన సున్నిత మనస్కుడూ ఆ వాక్యాల్లో స్ఫుటంగా కనిపిస్తాడు. మెహెర్ కథల పుస్తకం కోసం ఇప్పుడు ఎదురుతెన్నులు.

4 comments

Leave a Reply to ప్రగతి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కదిలించిన కథ. చాలా కాలం వెంటాడుతుంది.

  • మనందరిలో ఉండి ఇంకే చిన్న కుదుపు వచ్చినా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న ఆ ఎమోషన్ మురళి. Murali is not a charector , he is a resonance and thatcresonance scares the hell out of me right in this moment .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు