యవసాయం చేసీ చేసీ ఖర్చులెళ్ళక
ఎకరాల భూమినంతా పోగొట్టుకున్నాక ఇంకా
నీకు చిన్న ఖాయిష్ వుండేది నాయినా!
ఒక్క ఎకరం భూమైనా వుండాలని!
తీరలే! ఒక్క మడిచెక్కనైనా కంట చూడకుండానే
కడకు భూమిలోకి పోయినవు కదా నాయినా!
***
ఏం మారలేదు, ఇంకా లోపలికయింది
ఇపుడు ఎకరం రైతులంతా ఎట్లున్నారో తెలుసా నాయినా!
బతుకునంతా ఆ ఎకరం చుట్టూ తిప్పినా
బరువు దిగట్లేదు ఏమీ మిగలట్లేదు అండా ఆసరా లేదు
ఎదుగూ బొదుగూ లేదు రోజు రోజూ పోరు
వాళ్ళకు ఊరు దాటే తాహతు లేదు
దేశమేమో వాళ్ళ దగ్గరికి రాదు ఒక్క ఓట్లప్పుడు తప్ప!
గింజా పురుగూ ఎరువూ ఖర్చులే కాదు
ఇంటి కాయకష్టాన్నీ కలుపుకొని పంటకు ధర ఇవ్వాలన్న
పెద్దాయన స్వామినాధన్ మాటలు చట్టాలవవు
కానీ కొత్త సంతకాల్తో కొత్త చట్టాలొస్తాయి
ఉండడానికేం అవి నాజూగ్గా ఆకర్షణీయంగా వుంటాయి
రైతులకు మహాస్వేచ్ఛ ప్రసాదిస్తున్నట్లుంటాయి
పంటలకు ఇక రేటే రేటని ఊదరగొడతాయి
కాగితాలూ గణాంకాలే తప్ప గ్రామం చెమట తెలియని వాళ్ళు
మేధావుల వేషమెత్తి పెద్ద పెద్ద మాటల్తో
కొత్త సంతకాలకు వత్తాసు పలుకుతారు
సేవకులమని చెప్పి పీఠాలెక్కినవాళ్ళు
భుజాల మీది నుంచి అన్నిటినీ దులిపేసుకుని
మెరుగైన ధరల కోసం దూరాలకైనా పరుగెత్తండని
రైతులకు హిత బోధ చేస్తారు మార్కెట్ భాషలో!
నాయినా! ఇపుడు ఎకరం రైతులు ఎక్కడి కెళ్లగలరు
ఓ పది బస్తాల ధాన్యాన్ని మోసుకొని
ఓ పది రూపాయల నోటును పట్టుకుని-
ఇప్పటి దాకా చిన్న చితకా దళారులే అంగట్లో-
రేపు టైలూ కోట్లూ కార్పొరేట్లూ బిలియన్ల దిగ్గజాలు
పంటల్ని గుప్పిట పడతాయి
రూపాయికి కొని పదికమ్ముతాయి నాజూకైన ప్యాకింగుల్లో-
సకల యంత్రాంగాలు వాటి చుట్టే ప్రదక్షిణం చేస్తాయి-
ఊరు దాటలేక అంగళ్ళనందుకోలేక
ఎవడికి వాడే స్వచ్ఛందంగా
వున్న చారెడు భూమినీ అమ్ముకునేలా చేయడమే
గ్లోబల్ తెలివి!
వాళ్ళ కోసం ఉపాధి అని కొత్త పథకాలొస్తాయి రేపు
కొత్త సంతకాల్తో కొత్త భాష్యాల్తో!
****
నాయినా! ఇంకా నాలుగు నాళ్ళు పోతే
ఇక ఒక ఎకరం అనే మాట వుండదేమో నాయినా!
వందల ఎకరాలూ ఒక్కో కమతమై
నగరసామ్రాట్టుల పేరుమీదికి బట్వాడా అవుతాయేమో
ఇవాల్టి రైతులు రేపు దినసరి భత్యం కోసం
అన్నం పొట్లాల కోసం పొలాల్లో కూలీలై క్యూలు కడతారేమో
అట్లా అయితే వూళ్ళు బతకవు కదా నాయినా!
అన్నం ముద్దతో బతుకుతున్న
నాకు ఒక ఖాయిష్ నాయినా!
మొన్న పాద యాత్రలతో నగరాల వైపు నడిచిన రైతులు
ఇపుడు భూమి కోసం కొత్త సంతకం చేయాలని
నా ఖాయిష్ నాయినా!
నీ తరపున ఉన్నానంటే వాళ్ళ తరపునా ఉన్నట్టే కదా నాయినా!
*
ఎకరం భూమిని కన్నీళ్ళ చేలిమను చేశారు. కవిత బాగుంది.