ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలి
– షేక్ హుసేన్ సత్యాగ్ని . తొలి తెలుగు ముస్లిం కథారచయిత. కడపజిల్లా .
మొన్న ఫిబ్రవరి 12వ తారీకున తెలుగు సాహిత్య అకాడమీ పునర్ నిర్మించడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా కొలకలూరి ఇనాక్ ను ఎంపిక చేయగా, మిగిలిన ఉపాధ్యక్షుడు, సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసి ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రభుత్వ ఎంపిక చేసిన 11 మంది సభ్యులలో ఒక్కరుకూడా ముస్లిం సాహితీవేత్త లేకపోవడం మరీ అన్యాయం. తొలి ముస్లిం కథకుడు కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ మియా సాహెబ్ గారు 1927 లోనే కథలు రాశారు. ప్రాచీన సాహిత్యంలోనూ, ఆధునిక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ విశేషమైన కృషి చేసినట్టు వంటి ముస్లిం సాహితీవేత్తలను ప్రభుత్వ విస్మరించడం నన్ను బాధించింది. అలాగే రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఒకేఒకరికి అవకాశం ఇవ్వడం కూడా దారుణం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటివరకు రాయలసీమను అన్ని విషయాలలో విస్మరించినటువంటి ప్రభుత్వ పెద్దలు సాహిత్యంలో కూడా విస్మరించారనే వాస్తవాన్ని రాయలసీమ ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దీన్ని మరోసారి ఆలోచించి ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించాలి. అలాగే రాయలసీమ సాహితీవేత్తల కృషిని మరింతగా గుర్తించాల్సి ఉంది.
*
తెలుగు హిందువుల భాష?
-ఉషా ఎస్. డానీ
తెలుగు ప్రాంతీయ భాషా? మత భాషా? తెలుగును ప్రభుత్వం ఒక ప్రాంతపు భాషగా కాకుండా ఒక మత భాషగా భావిస్తోంది. తెలుగు భాషను సమర్ధంగా రాసే కవులు, రచయితలు హిందూయేతరుల్లోనూ చాలా మంది వున్నారు. తెలుగు వచనాన్ని, కవిత్వాన్ని గొప్పగా రాసే పది మంది సాహిత్యకారుల జాబితాను తయారు చేస్తే అందులో కనీసం నలుగురు ముస్లింలు వుంటారు. ఒకవైపు తెలుగు ప్రాచీన భాషయనీ, దేశంలో హిందీ, తమిళంతో సమానంగానో వాటిని మించో మాట్లాడేవాళ్ళు తెలుగువాళ్ళేనని మనం జాతీయ వేదికల మీద వాదిస్తూ వుంటాం. రాష్ట్రంలో భాషా అకాడమీ లను ఏర్పాటు చేసే సమయంలో మాత్రం హిందూయేతర మతస్తులను దూరంగా పెడుతుంటాం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగును హిందువుల భాషగా గుర్తిస్తోంది. ఇది తెలుగు భాషకు తీరని అపచారం. ప్రభుత్వం తెలుగును మత భాష అని బలంగా భావిస్తూవుంటే ఆ మేరకు ఒక ఉత్తర్వును జారీ చేసినా అది ఒక పధ్ధతిగా వుంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీలో సభ్యులుగా మాత్రమేగాక అధ్యక్షులుగా వుండదగిన అర్హతలున్న వాళ్ళు చాలామంది వున్నారు. కవుల్లో దేవిప్రియ, ఖాదర్ మొహియుద్దీన్, ముహమ్మద్ అఫ్సర్, కథకుల్లో ముహమ్మద్ ఖదీర్ బాబు, వేంపల్లె షరీఫ్ వున్నారు. తెలంగాణను కూడా పరిగణన లోనికి తీసుకుంటే ఖాజా, స్కైబాబ, అన్వర్ కూడా వున్నారు.
*
ఇనాక్ గారూ, ఏమంటారు?
-
లక్ష్మీనరసయ్య
ఇది ముస్లిమేతర సమాజం.ఇక్కడ ముస్లింలు అదృశ్య మానవులు.ఇతరులు. నిత్య పీడితులు.పీడితుల చేత పీడితులు. వివిధ కోణాలనుంచి వివిధంగా బాధితులైన వాళ్ళు కూడా ముస్లింలను వ్యక్త మానవులుగా చూడలేని స్థితి. ముస్లింల పట్ల ప్రభుత్వ , సామాజిక ,సాంస్కృతిక సంస్థల దృక్కోణం కూడా దీన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల విషయంలో ఇదే రుజువయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుల విషయంలోనూ ఈ వివక్ష కనపడుతుంది. ఖాదర్ మోహియుద్దీన్, ఉషాయస్ డానీ,ఖదీర్ బాబు, వేంపల్లి షరీఫ్, ఖరీముల్లా, హనీఫ్ – ఇలా కనీసం పాతికమంది ప్రసిద్ద కవులూ రచయితలూ వున్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో ముస్లిం సాహితీవేత్తల, కళాకారుల పాత్ర మరువలేనిది. సాహిత్యం ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తూ , ఈ ప్రాంత మానవ వికాసంలో తమ పాత్రను గొప్పగా నిర్వర్తిస్తున్న ఇంతమంది ముస్లిం రచయితల అస్తిత్వాన్ని గుర్తింప నిరాకరించి వారికి సాహిత్య అకాడెమీలో ప్రాతినిధ్యం లేకుండా చేయటం అప్రజాస్వామికం. బహుజన కధా పితామహుడు , అణగారిన కులాల సాహితీ రారాజు పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి అధ్యక్షతన ఉన్న ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో ఈ అన్యాయం జరగటం ఇంకా బాధాకరం. అలా అని ఆయన్ను వ్యక్తిగతంగా నిందించలేను. ఇది కేవలం ప్రభుత్వ చర్యో , అధ్యక్షుల పాత్ర కూడా ఇందులో ఉందో. ఏది ఏమైనా ఈ వివక్షను ఖండిస్తున్నా. ప్రజాస్వామిక వాదులంతా దీన్ని ఖండించాలని కోరుతున్నా.
*
నిరసన ప్రకటించాల్సిందే
-
బండ్ల మాధవ రావు
ఎట్టకేలకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో ముస్లింలకు రాయలసీమ వాసులకు తగిన ప్రాధాన్యం లేకపోవడాన్ని నిరసిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో లెజండ్స్ అనదగిన ఎందరో కవులు రచయితలు ముస్లింలలో ఉన్నారు. అలాగే రాయలసీమ నాలుగు జిల్లాలకు గాను కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించారు. దేవిప్రియ, ఖాదర్ లాంటివారు అధ్యక్ష పదవికి అర్హులు. వేంపల్లి షరీఫ్ లాంటి వారిని సభ్యులు గా నియమించి ఉంటే కడపకు, ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లయ్యేది. కొంతమంది సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నియామకాలు జరిగినట్లు తెలిసింది. వారికి ముస్లిం కవులు కనబడకపోవడం నిరసించాల్సిన విషయం. ఈ వివక్షను అందరూ ఖండిచాల్సిన అవసరం ఉంది.
*
వివక్షపై పోరాడతాం
-వేంపల్లె షరీఫ్, కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కార గ్రహీత
జాతి హనన కుట్ర
– రవికుమార్
ఏపీ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లుగా ఒక్క ముస్లిం మంత్రి లేరు. ఆ తర్వాత విమర్శలని ఎదుర్కోలేక ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత మంత్రివర్గమ్ లోకి తీసుకుంటామన్నారు. నిజానికి కేంద్రములో అధికారంలో ఉన్న బీజేపీ ముస్లింలకి వ్యతిరేకంగా చెప్పి మరీ చేస్తున్న వివక్ష, ఏపీ లో అవే మాకు మౌఖిక ఉత్తర్వులు అన్నట్లుగా అధికార తెలుగుదేశం ముస్లింలని అన్ని రంగాల్లోంచి గెంటేసే కుట్రని విధిగా అమలు పరిచింది. సరిగ్గా ఇదే ధోరణి సాహిత్య, సాంస్కృతిక సంబంధమైన అంశాల్లోనూ అమలు చేసింది. నాలుగున్నర ఏళ్లుగా లేని సాహిత్య అకాడమీ ని అకస్మాత్తుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక దళిత సాహిత్య వేత్తని ఛైర్మన్గా ప్రకటించి వేసింది. ఇప్పుడు సభ్యుల నియామకం చూసినప్పుడు అకాడెమీ సభ్యుల నియామకం కూడా ఆయన చేతుల్లో లేనట్టుగా తెలిసిపోతుంది. తెలుగు సాహిత్య సమాజంలో సుదీర్ఘ కాలంగా విస్తృతంగా కృషి చేసిన ఎందరో ముస్లింలు వున్నారు. కానీ, ఒక్కరినీ కనీసం సభ్యులు గా కూడా తీసుకోకపోవడం దారుణ వివక్ష. ఇందులో ఓ రకంగా సాహిత్యం లో జాతి హనన కుట్ర కనిపిస్తున్నది.
*
ఫాసిస్ట్ అకాడమీ!
-కవి కరీముల్లా
నవ్యాంధ్రలో సాహిత్య అకాడమీ ఏర్పాటు హర్షణీయమే అయినా ఏ ఒక్క ముస్లిం సాహిత్యకారునికీ కమిటీలో స్థానం లేకపోవటం పాలక వర్గాలకు ముస్లింల పట్ల చిన్నచూపు ఉండటమే కారణం.పీడక కులాలకు హిందూ మతోన్మాదం తలకెక్కడం కూడా మరో కారణం.తొలి నుండి ముస్లిం సాహిత్యకారులు పీడిత ప్రజల పక్షాన మాట్లాడటం పాలక వర్గాలకు మింగుడుపడని పరిస్థితి.ముస్లింల అస్థిత్వం,అభధ్రత,ఫాసిజాన్ని మా అక్షరాలతో దునుమాడటం పట్ల వాళ్ళకున్న వ్యతిరేకతే సాహిత్య అకాడమీలో ముస్లింలకు చోటు లేకుండా చేసింది.అన్ని రంగాల్లోనూ ముస్లింలను అణగదొక్కుతున్న ఫాసిస్ట్ భావజాలం ఇప్పుడు రాష్ట్ర సాంస్కృతిక శాఖ,సాహిత్య అకాడమీలలో తిష్ట వేసుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ ముస్లిం రచయితల సంఘం తరుపునుండి తీవ్రంగా ఖండిస్తున్నాం.సాంస్కృతిక శాఖ,సాహిత్య అకాడమీలు మమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకున్నా మేం పీడిత ప్రజల పక్షానే ఉంటాం.
*
ముందు …
-దగ్గుమాటి పద్మాకర్
అన్నిటికన్నా ప్రధానంగా సాహిత్య అకాడెమీని ఐసీయూలో నుంచి జనరల్ వార్డు లోకి, అక్కన్నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంది. సాహిత్య అకాడెమీ
హైస్కూల్ స్థాయి నుంచి విద్యా వ్యవస్థ తో సంబంధాలు ఏర్పరచుకోవాలి. కొత్త తరం పాఠకులను సృష్టించడంలో భాగం కావాలి. సాహిత్యం అనేది ఒకటుందని, దానివల్ల మనోవికాసం కలుగుతుందనే అవగాహనని హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్ధులలో కలిగించాలి. మంచి కథలు, కవిత్వానికి కొత్తతరం అండ ఉండేలా దారులు సాహిత్య అకాడెమీ వేయాలి. వీటన్నింటినీ మనం ముందు డిమాండ్ చేయాలి. ఆ తర్వాత ప్రాతినిధ్యం గురించి ఆలోచించవచ్చు అని నా అభిప్రాయం. ముందు గుర్రానికి చికిత్స చేస్తే ఆ తర్వాత బండిలో ఎవరెవరు ఎక్కాలో చూద్దాం. లేకుంటే ఈ పదవులు కూడా విజిటింగ్ కార్డులు వెసుకొవడానికె పనికొస్తాయి.
*
ముస్లిమ్ లు ఎందుకు గుర్తురారు?
-అనిల్ డాని
వేయక వేయక అంతా అయిపోయే ముందు ఈ అకాడెమీ లని వేశారు సరే బాగానే ఉంది అనుకుందాం, అన్ని వర్గాల వారికి అన్ని హంగులు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇక్కడ అంతా క్యాలిక్యులేషన్ వాతావరణమే తప్పా ఇంకోటి కనబడే అవకాశమే లేదు.సరే ఇప్పుడీ కమిటీ ఏం చేస్తుంది అనేదానిమీద కమిటీకి క్లారిటీ లేదు, అన్ని వర్గాలు అని అన్నప్పుడు ముస్లిమ్ లు ఎందుకు గుర్తురారు. అసలే మనం బీజీపీ మీద పోరాటం చేస్తున్న దశలో ఉన్నాం అలాంటపుడు ఆ వర్గం మీద మొదటి నుంచి పోరాటం చేస్తూ రాస్తూ తమ నిరసనలు తెలుపుతున్న ముస్లిం రచయిత ల అవసరం కూడా ఉంది కదా దాన్ని ఎలా విస్మరించారు, యావత్ దేశం మన బహుజనులు కధలు ,ముస్లిం కథల వైపు చూస్తుంటే మనం ఇంకా ఎక్కడో వినబడీ వినబడనట్టు ఉండడం మంచిది కాదు.
*
నిజమే , ఇంతమంది పేరున్న ముస్లిం సాహిత్య కారులు మన నవ్యంధ్రా (!) లో ఉన్నాప్పుడు ఒక్క ముస్లిం కూడా ఈ సాహిత్య అకాడమీ లో లేకపోవడం గర్హనీయమే, ఇప్పటికయిన ప్రబుత్వమూ , ఏర్పడ్డ అకాడమీ సభ్యులు, ఈ లోటును సవరించ వలసిన అవసరం ఉంది,
dinini nenu nirasistunnanu. 13 zillalaku pradanyata ivvalannadi na dimend
ఔరా .. తెలుగు సాహిత్యానికి ముస్లిం రచయితలు చేసిన, చేస్తున్న సేవ విస్మరించ తగునా! ఈ కమిటీని ఏర్పర్చిన వారికి తెలుగు సాహిత్యంలో ముస్లిం రచయితలు, కవులు ఎందరున్నారనే స్పృహ కూడా లేనట్టుంది. వీళ్ళెవరూ వజీర్ రెహ్మాన్ , ఇస్మాయిల్ , స్మైల్ లాంటి పేర్లు విని ఉండరు . “పుట్టుమచ్చ” లాంటి కవిత్వం ఉందని ఎరిగి ఉందరు . అదిసరే గానీ ఇనాక్, ఆర్. ఎం . ఉమా , రజని , రాసాని .. లాంటి ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా తుస్సు తుస్సు .. చిచ్చుబుడ్లే. రెండు అక్షరం ముక్కలు గెలికినంత మాత్రాన సాహిత్యం తెలిసినట్టు కాదబ్బా. బహుశా లాటరీ పద్దతిలో కమిటీని తీసినట్టున్నారే !!!!
మరింకేం ఇక లెక్కలు తియ్యండి
యాదవులు ఎంతమంది,
రెడ్డి వాల్లు ఎంతమంది ,
బలిజలు,
మాలలు,
మాదిగలు ..
ఎంతమంది వాల్ల జనాభాకి తగిన ప్రాతినిద్యం ఉందా లేదా,
ఇక నైనా ఈ చంక ఎక్కించుకొవడం ఆపుతారా
ఇప్పటికే అవసరానికి మించిన చర్చ చేసారు ,
ఉద్యొగాలలో చదువుల్లో నే కాకుండా చివరికి
సాహిత్యం లో కూడా మొదలెట్టారు
దీనిలో ఇనాక్ గారి పాత్ర ఏమీ లేదు. ఆయన పేరు కూడా కమిటీ సభ్యుల ఎంపిక లో భాగమే