ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మన్నె ఏలియా మర్రిచెట్టు కథతో గుర్తింపు తెచ్చుకున్నారు. అపచారం, జమిడిక వంటి కథలు ప్రముఖ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన జీవితాలతో పాటూ, అక్కడి సంస్కృతిని తన కథల్లో చూపిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఏలియా కథల్లో కూడా ఆ సంయమనం కనిపిస్తుంది. ఎక్కడా సమతుల్యం లోపించకుండా, ఒక పక్షం వహించకుండా….రెండు వైపులా మంచి-చెడు తరచిచూసే ఒక మధ్యవర్తిలా కథలు చెప్పుకుంటూ పోతాడు. తనకు గుర్తింపు తెచ్చిన మర్రిచెట్టు-కథ వెనక అనుభవాన్ని మర్చిపోలేని కథానుభవం శీర్షిక కోసం ఇలా పంచుకున్నారు.
చెట్టు అంటే నాలుగు కొమ్మలు, పది ఆకులు మాత్రమే కాదు….
చెట్టు అంటే నూటొక్క జ్ఞాపకాల కూడలి కూడా…
***
ఆదిలాబాద్ జిల్లాకి చెందిన నాకు సహజంగానే అడవితో, చెట్లతో విడదీయరాని అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచీ చెట్టుపుట్టతో ఆడుకుంటూ పెరిగాము కాబట్టి…చెట్లతో కూడా స్నేహితుల్లాంటి ఒక అనుబంధం ఉంటుంది.
ఇంట్లో ఉన్న చెట్టును చూస్తే చిన్నప్పుడు అమ్మ తన చీరను కొమ్మకు కట్టి ఊపిన ఉయ్యాల గుర్తొస్తుంది. తమ్ముడినో, చెల్లెనో…. ఏడుస్తుంటే ఊరడించడానికి నేను ఊపిన ఉయ్యాల మళ్లీ కళ్లముందు కనిపిస్తుంది.
స్కూల్లో చెట్టును చూస్తే….చెట్టు నీడలో అక్షరాలు దిద్దించిన మా సారు గుర్తుకు వస్తాడు. బడి అయిపోంగనే దోస్తులతో ఆడిన కోతికొమ్మచ్చి ఆట గుర్తొస్తుంది.
సెలవుల్లో అడివికి పోయి ఏరుకొచ్చిన తుమ్మబంక, ఇరికిపండ్లు, బతకమ్మ పండగకు ఏరుకొచ్చిన తంగేడు పూలు….గుర్తుకు వస్తాయి.
పరీక్షల్లో మార్కులు బాగా రావాలని , ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుకున్న ఊరిబయట చింత చెట్లు గుర్తుకు వస్తాయి.
ఇలా జీవితంలోని ప్రతి సందర్భంలో తెలియకుండానే చెట్టుతో ముడివేసుకుని ఉంటుంది.
మా ఊరు దండేపల్లి. మా ఊరి బస్టాపు దగ్గర ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆటోలు ఇంతగా లేని పూర్వం రోజుల్లో గంటకోసారి వచ్చే ఆర్టీసీ బస్సే మాకు ఏకైక రవాణా సాధనం. ఆ బస్సు వచ్చేదాకా పిల్లలు, వృద్ధులు ఎండనుంచి, వాననుంచి కాపాడి నీడనిచ్చేది ఆ మర్రిచెట్టు.
ఆ చెట్టుకిందనే దోస్తులు అనేక ముచ్చట్లు చెప్పుకుంటూ …..తమ కష్టసుఖాలు చెప్పుకునే వారు. దూర ప్రాంతాలనుంచి ప్రయాణం చేసి అలిసిపోయిన కొందరు చల్లదనానికి ఆ చెట్టుకిందనే కంటినిండా కునుకు తీసేవారు.
ఆ చెట్టకిందనే కొత్తపరిచయాలు జరిగేవి. మాటల ముచ్చట్ల మధ్యనే పెళ్లి సంబంధాలు ఆరాలు తీసేవారు. కొన్నిసార్లు చెట్టు కిందనే సంబంధాలు దాదాపుగా ఖాయం అయ్యేవి. పెండిళ్లు జరిగేటపుడు ….ఆడ, మగ పెళ్లి తరపువాళ్ల ఎదుర్కోళ్లు ఆ మర్రిచెట్టు కిందనే జరిగేవి. పెళ్లిళ్ల పంచాయితీలు, కాపురాల గొడవలు, ఊరి మనుషుల మధ్య గొడవలు, వాటి పరిష్కారాలు, పెద్దమనుషుల తీర్మానాలు అన్నీ ఆ చెట్టు కిందనే జరిగేవి. ఒక రకంగా ఊరి కార్యక్రమాలన్నింటికి కేంద్రంగా ఆ చెట్టు ఉండేది. బస్సులో వచ్చేవాళ్లకు ఆ చెట్టు చూడగానే మా ఊరు వచ్చిందని బస్సుదిగేవాళ్లు. ఒక రకంగా మా దండేపల్లికి ఆ చెట్టు ఒక అడ్రస్ గా మారిపోయింది.
నేను డిగ్రీ ఐపోయాక ….ఏదైనా జాబ్ చేయాలని ఆదిలాబాద్ టవునుకి వచ్చాను. అక్కడే జాబ్ చేసుకుంటూ కొంత కాలం ఉండిపోయాను. ఓ సారి పని ఉండి మా ఊరికి బస్సులో వెళ్లాను. చాలాకాలం తర్వాత మా ఊరు వెళ్లున్న సంతోషం మనసంతా నిండిపోయింది. టికెట్ తీసుకుని బస్సులో కూచుని మా ఊరు ఎప్పుడొస్తుందా అని కిటికీలోంచి ఎదురుచూస్తున్నాను….చాలా సేపు దాకా మా ఊరు రాకపోవడంతో నేను కరెక్టు బస్సే ఎక్కానా అని….అనుమానంగా కండక్టర్ దగ్గరికి వెళ్లి దండేపల్లి ఇంకా రాలేదా అని అడిగాను. ఆయన ఎప్పుడో దాటిపోయింది కదా అని అరిచి… బస్సు ఆపి మధ్యలోనే దింపేశాడు.
మా ఊరు నేను గుర్తుపట్టలేక పోవడం..నాకు షాక్ తగిలినట్టు అనిపించింది. రివర్స్ ఇంకో బస్సు ఎక్కి వచ్చి మా ఊరి బస్టాప్ దగ్గర దిగిన నాకు అసలు కారణం అర్థమైంది. మా ఊరికి కేరాఫ్ గా నిలిచిన ఆ పెద్ద మర్రిచెట్టు ఇప్పుడు లేదు. కొట్టేసిన చెట్టు వేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతమందికి నీడనిచ్చిన చెట్టును ఎందుకు కొట్టేశారో అర్థం కాలేదు.
ఊర్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే….ఒక మినిస్టర్ పర్యటన సందర్భంగా, రోడ్లు వెడల్పు చేయడానికి ఈ చెట్టు అడ్డంగా ఉందని కొట్టేశారట. వంద ఏండ్లుగా మా ఊరుకి స్వాగత ద్వారంలా నిలబడ్డ మర్రిచెట్టును….ఒక్కరోజు మంత్రి పర్యటన కోసం కొట్టేశారు. వాళ్లకు అది అడ్డంగా ఉన్న ఒక చెట్టులా మాత్రమే కనిపించింది తప్ప దాని వెనక ఉన్న…జీవితాలు కనపడలేదు.
ఊరు నుంచి వచ్చిన చాలాకాలం నన్ను ఆ చెట్టు వెంటాడింది. ఆ వేదనే నన్ను మర్రిచెట్టు కథ రాసేలా చేసింది. అప్పటిదాకా కథలు చదివిన అనుభవం ఉంది తప్ప కథలు రాసింది లేదు. నాకు తోచినట్లు ఏదో రాసుకున్నాను. ఏ పత్రికకు పంపలేదు. నా దగ్గరే పెట్టుకున్నాను. ఓసారి ఒక మిత్రుడు నేను రాసింది చదివి బాగుందని చెప్పి….పత్రికకు పంపించమని చెప్పాడు. అలా నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మలో నా మొదటి కథ మర్రిచెట్టు ప్రచురితమైంది.
సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ సంపాదకత్వంలో వచ్చిన ఉత్తమ తెలంగాణ కథల సంకలనం రంధి…లో ఆ కథ ఎంపిక కావడం మరింత సంతోషాన్నిచ్చింది. ఆ సంకలనంలో రావడం వలన చాలామంది ఆ కథను చదివి స్పందించారు. నల్గొండ నుంచి ఒక రిటైర్ ఇంజనీర్ ఫోన్ చేసి చాలాసేపు మాటాడారు. ఈ కథ చదివాక మా ఊరు గుర్తొచ్చిందని, మళ్లీ మా ఊరు పోతున్నానని చాలా ఉద్వేగంగా చెప్పారు. ఇంకా చాలామంది స్పందించారు. అలా నేను మరిన్ని కథలు రాయడానికి మర్రిచెట్టు కథ స్ఫూర్తినిచ్చింది. అందుకే నా కథల సంకలనానికి కూడా ఆ పేరే పెట్టుకున్నాను. నేను ఎప్పటికీ మర్చిపోలేని కథ మర్రిచెట్టు.
*
చెట్టు నాలుగు కొమ్మలు కాదు ” చానా బాగుంది బాగ రాశావు ఏలియ అభినందనలు
Thank you anna
Gud mrng Eliya marrichettu story cadhivinanu chala bagundhi child life gurthu chesinaru very happy ma village mamillu gurthu vachinavi CONGRATS🙏👌☘️☘️ GOD BLESS U
Really good. congratulations.
Thank you very much
అడవిలాంటి మనసున్న ఏలియా జన హృదయాలను బహు చక్కగా చిత్రీకరిస్తాడు. అడవి అంటే హరితాన్ని నింపుకున్న చెట్లే కాదు ఆ చెట్ల మాటున దాగిన కల్లోల కథా చిత్రాలను మనసు పొరల నుంచి వచ్చిన బాధలను కథనాలుగా పాఠకులకు అందిస్తాడు. ‘మర్రి చెట్టు’లా పరివ్యాప్తం అవుతూ మరిన్ని కథలు సాహితీవనంలోకి విస్తరించాలి.
Thank you very much venu
చెట్టు అంటే కొమ్మలు ఆకులు మాత్రమే కాదు. చెట్టుతో అనేక జీవితాలు ముడిపడి ఉంటాయని చక్కగా చెప్పారు సార్. మీరు మరిన్ని మంచి కథలు రాయాలని కోరుకుంటున్నాను
చాలా బాగుంది సర్