ఒక్కో కథా ఒక మంచి అనుభవం

మంచికథలుగా అందరి దృష్టిలోనూ స్థిరపడ్డ కొన్ని కథలని తీసుకొని, ఆ కథలని వాటిపైన ఉన్న విమర్శలతో సహా పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం.

మంచికథలు అన్నిరకాల పాఠకులకీ ఏదో ఒక స్థాయిలో అర్థం అవుతూంటాయి. ఎటొచ్చీ, మనకి అర్థం అయ్యేదానికీ, అర్థం కాకుండా మిగిలిపోయినదానికీ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కో కథకీ ఈ వ్యత్యాసపు దూరం మారుతూ కూడా ఉండవచ్చు.

మంచికథలతో ఉండే సమస్యలు రెండు రకాలు: ఒకటి, వాటిని అర్థం చేసుకోవడానికి దారులు రకరకాలుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, వాటికి మల్టిపుల్ ఇంటర్‌ప్రెటేషన్స్ ఇవ్వగలిగిన ఆస్కారం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకి బాగా అర్థం అయిందనుకున్న కథని మరో మిత్రుడితో చర్చిస్తూ ఉన్నప్పుడు, వాళ్లు అదే కథని అర్థం చేసుకున్న పద్ధతిని చూస్తే – ఆ పద్ధతి సహేతుకంగా అనిపిస్తే – మనం ఇలా ఎందుకు ఆలోచించలేకపోయామా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి, ఒక కథని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కొంత చర్చ జరగాలి. కొన్ని అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకోవాలి. కొత్త ఆలోచనా విధానాలని స్వాగతించగలగాలి. ఆ ఆలోచనా విధానాల్లో నవ్యతా, తార్కికతా, సంక్లిష్టతా, కొత్త రంగాల్లోకి వాటిని మళ్లించి ఆకళింపు చేసుకోగల సౌలభ్యతా ఉండాలి. అలాంటి ఆలోచనలను ఎదురెళ్లి కావలించుకోవాలి నిజానికి. వెరసి, మనకి కావలసింది పై విధానాల్లో కొత్త జ్ఞానాన్ని అందించగలిగిన మిత్రసమూహం. ఇది దొరకడం అనుకున్నంత సులువు కాదు.

రెండో సమస్య- ఒక కథలో ఉండే సున్నితమైన అంశాలు. చెహోవ్ ఒక కథలో గ్రే కలర్‌ని కథలో అక్కడక్కడా చల్లుతూ పోతాడు. ఆ రంగుని పట్టుకుని దాన్ని ఆ కథకి అలుముకుని కథని చదవడం మరో స్థాయి అనుభవం. కథని మామూలుగా చదువుతూ పోతున్నప్పుడు, కళ్లు కథ వెంట పరుగెత్తడం సహజంగా జరిగే విషయం. సరే, కథని రెండోసారో మూడోసారో పదిహేనోసారో చదువుతున్నప్పుడు కూడా, మనకి కనిపించగల అంశాలే కంటికి మళ్లీ మళ్లీ కనిపిస్తుంటాయి కానీ, కొత్త అంశాలని పట్టుకోవడం దాదాపుగా జరగదు. ఎందుకంటే, మన అవగాహనకి కూడా ఒక పరిమితి ఉంటుంది కాబట్టి. ఈ అవగాహన వైశాల్యాన్ని పెంచుకొని, మరిన్ని అతిసున్నితమైన అంశాలని కథలో గమనించగలిగితే, ఆ అంశాలు కథకి ఎంత దోహదం చేస్తున్నాయో తెలుసుకోగలిగితే, ఆ కథ కలిగించే అనుభవం మరింత విస్తృతంగా ఉంటుంది. కానీ, ఆ పరిధిని పెంచుకోవడం ఎలా?

మంచికథలని పరిపూర్ణంగా అనుభవించడానికి ఉన్న ప్రధాన సమస్యలు రెండైనా, పరిష్కారం మాత్రం ఒక్కటే. అది- ఆ కథలమీద లభ్యమయ్యే విమర్శలని చదవగలగడం. తెలుగుకథలకి సంబంధించి మనకి అలాంటి విస్తృతమైన విమర్శ లేదు కానీ, ప్రపంచ సాహిత్యంలో గొప్పవని చెప్పబడే చాలా కథలమీద అలాంటి విమర్శనా వ్యాసాలు లెక్కకు అందనన్ని ఉన్నాయి. ఆయా వ్యాసాలు ఆ కథలని కొత్తవెలుగులో చూపుతాయి. మనం ఉపేక్షించిన ఒక వాక్యమో, ఒక మాటో, ఒక కామానో ఫుల్‌స్టాపో ఆ వ్యాసాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడతాయి. మనం పూర్తిగా విస్మరించిన ఆ కోణంలోనుంచి ఆ కథని చూడటం అనేది ఆ కథని ఆస్వాదించడానికి మార్గం అవడం ఒక ప్రయోజనం. దీనికి మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. ఇలా క్రమం తప్పకుండా అలాంటి వ్యాసాలని చదువుతూ, కొత్తవెలుగుల్నీ కొత్త దారుల్నీ కనుక్కుంటున్నప్పుడు, మనకి తెలీకుండానే మనం కూడా ఆ విధానాల్లో తర్ఫీదు పొందుతున్నామన్నమాట. కొన్నాళ్ల తర్వాత మనం ఓ కథని చదివినప్పుడు, మనం దాన్ని పరిశీలించే పద్ధతి కచ్చితంగా మన పాతవిధానాల మాదిరిగా ఉండదు. ఆ పరిశీలన మరింత సమగ్రంగానూ, మరింత లోతుగానూ, మాటల వెనక ఉన్న అర్థాలను తరిచి చూసే విధంగానూ ఉంటుంది.

మంచి విమర్శ చదువరిని ఎడ్యుకేట్ చేస్తుంది. చదువరి సాహితీ స్థాయిని పెంచుతుంది. అవగాహనా సామర్థ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. సునిశితమైన చూపుని ఎక్కడ నిలపాలో తెలియజేస్తుంది. మంచి విమర్శ చదవడం వలన మనం మంచి విమర్శకులం కాలేకపోవచ్చు; కానీ, ఒక స్థాయి ఉన్న పాఠకుడిగా ఎదగగలుగుతాం.

***
అందుచేత-
మంచికథలుగా అందరి దృష్టిలోనూ స్థిరపడ్డ కొన్ని కథలని తీసుకొని, ఆ కథలని వాటిపైన ఉన్న విమర్శలతో సహా పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం. ఈ ప్రయత్నంలో ఇతర భాషల కథలు ఎక్కువగానూ, తెలుగు కథలు చాలా తక్కువగానూ ఉండవచ్చు. దానికి కారణం- మన కథలకి సంబంధించి అవసరమైనంత విమర్శా సాహిత్యం లేదు కాబట్టి.
ఈ ప్రయత్నంలో కొన్ని పద్ధతులని పాటించడానికి ప్రయత్నిస్తాను.

• కథ ఆన్‌లైన్‌లో లభ్యమయ్యేట్టుగా చూసుకోవడం. ఇంగ్లీష్‌లో సులభంగా కథని చదవగలిగినవారు, ఆ కథని అక్కడ చదివాకే ఇక్కడ మిగతా వ్యాసాన్ని చదవవచ్చు.
• కథాసంగ్రహాన్ని తెలుగులో ఇచ్చినప్పటికీ, అది అనువాదం కాదు కాబట్టి, కథలో ఉండే చాలా అంశాలు ఈ క్లుప్తమైన పరిచయంలో ఉండకపోవచ్చు. ఇబ్బంది లేకుండా కుదిరినంతవరకూ, విమర్శలో ప్రస్తావించబడ్డ విషయాలు, ఆ పరిచయంలో ఉండేట్టు చూస్తాను.
• ఆ కథకి సంబంధించిన విమర్శకుల పేర్లు కూడా నా వ్యాసంలో ప్రస్తావిస్తాను. ఆసక్తి, అవకాశం ఉన్నవాళ్లు వాటిని వెతికిపట్టుకుని చదవడానికి వీలుగా.

కాబట్టి-
వచ్చే సంచికనుంచీ ఒక్కో కథతో మళ్లీ కలుస్తాను!

*

లోగో చిత్రం: సృజన్ రాజ్

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీలాంటి వారి కోసం ఎదురుచుస్తూఉంటాం
    సార్,రండి హృదయపూర్వక స్వాగతం

  • బాగుంది ప్రవేశిక…
    కథాస్వాదనకూ, విశ్లేషణకూ మీ శీర్షిక కొత్త చేర్పునిస్తుందని ఆశిస్తున్నా.

  • మీ కథావిమర్శల పరిచయం కోసం ఎదురుచూస్తున్నా సార్

  • అభివందనలు, సర్!మీకధ అంతరంగం గురించిఎదురు చూస్తున్నాము, మంచి ఉపయోగము,మాలాంటిపాఠకులకు!

  • మంచి ప్రయత్నం సర్ మూర్తిగారు.., మీ కథా కథన విమర్శల on line workshop through Saranga : కథ/ కథనం గురించి అనేక కొత్తవిషయాలు తెలుసుకోవాలని కుతూహలంగ ఎదురుచూస్తాను..!

  • మంచి ప్రయత్నం మొదలెట్టారు .అభినందనలు .

  • మీ కోసం ఎదురు చుస్తూ ఉంటాం సార్.

    కారా మాస్టారు గారి శ్రీకాకుళం ‘కథానిలయం’ గురించి కూడా సందర్భానుసారం గా అడపా దడపా ఏవైనా చిన్న చిన్న వివరాలు, మాట సాయాలూ అడుగుతాం సార్

  • సాధారణంగా, ప్రతీ విశ్లేషణ వెనుక మన ఇష్టాఇష్టాలు, రాగద్వేషాలు, ఆయా రచయితలతోటి సాన్నిహిత్యం తాలూకు మోహమాటాలూ అన్నీ తగుమోతాదు లోనో, లేక హెచ్చుమోతాదులోనో తొంగిచూస్తూనే ఉంటాయి. వాటి జాడలు లేకుండా రాయడానికి ప్రయత్నిస్తారని ఆశ!

    • థాంక్స్, సాంబశివరావు గారూ! అవును, అలానే రాయాలనే నా ప్రయత్నం కూడా. కాకపోతే, ఎంచుకునే కథలన్నీ ప్రసిద్ధమైన విదేశీ కథలు. బాగున్న కథలనే ఎంచుకోవడం జరుగుతుంది! కథలతో బాటు, ఆయా కథావిమర్శలని కూడా పరిచయం చేయాలని ఈ ప్రయత్నం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు