మా సొంతూరు కలకొండ,మాడ్గుల మండలం. పాలమూరు జిల్లా(ప్రస్తుతం రంగారెడ్డి).
అమ్మనాయినలు ఎల్లమ్మ,కృష్ణయ్య.గొడ్డలి చేత పట్టుకొని పచ్చికట్టెలు కొట్టి ,అమ్మి ఇల్లును నడిపేది నాయిన.గుంతలు తీయడం,సపారాలు ఎయ్యడం,ఇట్లా ఎన్నో పనులు చేసేది.కొన్ని రోజులు వేరేవాళ్ళ దగ్గర గొర్లగాస్తూ జీతం చేసిండు.అమ్మ కూలికిపోయేది.నాట్లేయడం,కలుపుదీ
నాయిన కొన్ని రోజులు పట్నం వలసబోయిన తరువాత ఊరికి తిరిగొచ్చిండు.నా చదువుబాధ్యతనంతా చూసుకున్నది రాజవర్థన్ రెడ్డి సార్ .ఊర్లోనే ఏడవతరగతి వరకు చదువుకున్న.ఆ తరువాత గురుకులం పరీక్ష రాయించిండు మా రాజు సార్ .ఎనిమిదో తరగతి నుండి పదివరకు బి.సి. రెసిడెన్షియల్ నాగార్జునసాగర్ లో చదువుకున్న.ఇంటర్ కల్వకుర్తిలో.మా రాజు సార్ వాళ్ళ చిన్నమ్మ విమలమ్మ,మాణిక్యరెడ్డిబాపుల దగ్గర ఉంచిండు.అక్కడ ఎట్లున్న అనే దాని గురించి ఇంకాస్త వివరంగ కవితా నేపధ్యంలో చెబుతా.
కల్వకుర్తి ఉషోదయ జూనియర్ కాలేజిలో ఇంటర్ అయ్యాక టి.టి.సి హైద్రాబాబ్ లో నేరెడ్ మెట్ లో చేశాను.2012డిఎస్సీ లో జాబు వచ్చింది.ప్రస్తుతం అజిలాపురం గ్రామం,నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయుడిగ పనిచేస్తున్నాను.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటిలో డిగ్రి,పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ తెలుగు చేశాను.తెలుగుమీద ఇష్టం ప్రేమ ఏర్పడిందంటే మా తెలుగు టీచర్ల వలనే.ముఖ్యంగా సుజాత మేడం,డి.సి నరసింహులు,పరమేశ్వర్ ,రవిచంద్ర సార్ వాళ్ళు.
ఎం.నారాయణశర్మ గారు రాసిన “అస్తిత్వపుష్పాలు”చదివాక కొన్ని నానీలు రాశాను. 2016లో “తీరొక్కపువ్వు”పేరుతో నానీల సంపుటి తెచ్చాను.నానీల తర్వాత కవిసంగమం పరిచయమయ్యాక వచనకవిత్వం రాశాను.కవిసంగమం యాకుబ్ సార్ ప్రోత్సాహం మరువలేనిది.వచనకవితలన్నింటిని “దండకడియం”గ తీసుకొస్తున్నాను.
తొలివాక్యానికి నమస్కరిస్తూ…
బాపూ…మిమ్మల్ని చూసిపోదామని
ఈ పట్నమంతా గాలించి వచ్చిన
మిమ్మల్ని చూసినంక
మళ్ళీ ఇన్ని రోజులకు
సల్లచారుతో
కడుపునిండా తిన్నట్లుంది.
మీరు కల్వకుర్తిలో లేకున్నా
కల్వకుర్తికి పనిమీద పోయినప్పుడల్లా
ఎందరికో అన్నం బెట్టిన
మన ఇంటిని చూడాల్నని జీవి గుంజేది.
మనం కూర్చున్న చింతచెట్టు నీడన
ఒక్కడినే కూర్చోని
ఙ్ఞాపకాలతాడును పేనుకొని వచ్చేవాడిని
జైమిని భారతంలోని
ఉద్దాలక మహర్షి కథను
నవ్వించుకుంట నవ్వించుకుంట
మీ నోటితోటి చెప్పుతుంటే
వినిపోదామని వచ్చిన.
నా లేతమీసాల మొలక వయస్సులో కూడా
మా గోపిని జాగ్రత్తగా చూసుకొమ్మని
సారు వాళ్ళందరికి చెప్పి
కాలేజిలో చేర్పించిన
ఆ వెండిఙ్ఞాపకాలను పలువరిస్తూ వచ్చిన.
ఇంట్లో మీరు లేనప్పుడు
కార్తీక్ ను,శివను ఇల్లంతా తిప్పి
కాలేజిబ్యాగులో పండ్లువెట్టి పంపించిన
రామసీతవోలపండ్ల ఙ్ఞాపకాలల్ని
వొలుచుకుంటూ వచ్చిన.
బాదంచెట్టు వాకిట్లో
బండలమీద కూర్చోని రాసిన
నా తొలివాక్యానికి
నమస్కరిద్దామని వచ్చిన.
బాపూ…ఈ పట్నంల ఎట్లుంటున్నరు?
ఇంటిముందున్న ఎకరం పొలంలో
పిల్లలకోడి లెక్క తిరిగే మీరేనా
ఇట్లా కట్టేసినట్టున్నరు?
అమ్మా…
మైదాకుచెట్టుకొమ్మకు గట్టిన
ఇటుకపెడ్డ నెత్తినపడ్డప్పుడు
తండ్లాడుకుంట నెత్తిన పసుపురాసిన
నీ పసుపుచేతులతో
ఇప్పటి గుండెగాయాలను మాన్పవూ?
(ఇంటర్ లో నన్ను తమ ఇంట్లో పెట్టుకొని చదివించిన మాణిక్యరెడ్డిబాపు,విమలమ్మ లను చాలా రోజుల తర్వాత కలిసినంక)
కవితానేపథ్యం:
నా జీవితంలో ఇంటర్ కల్వకుర్తిలో చదవడం ఒక మైలురాయి.ఇంటర్మీడియట్ కోసం మా రాజవర్థన్ రెడ్డి సార్ విమలమ్మ,మాణిక్యరెడ్డి బాపు ఇంట్లో ఉంచిండని చెప్పిన కదా.అక్కడ అమ్మకు,బాపుకు ఇంట్లో చేదోడువాదోడుగా ఉంటూ చదువుకున్నాను.నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నరు.అక్కడున్న రెండేళ్ళు తిండికి ఏ లోటు లేకుండా పెరిగిన.ఇంటిముందు దాదాపు రెండెకరాల పొలం.ఇంట్లోనే కూరగాయాలు పండించేది బాపు.ఆవులకు ,బర్లకు కావలసినంత పచ్చగడ్డి .నిమ్మ,నేరెడు,జామ,మునగ,రామసీతా
వాటిని మాణిక్యరెడ్డి బాపుకి వినిపించేది.బాపు ఎంతో కష్టజీవి.ఎన్నో వందల శతకపద్యాలు నోటికి చెబుతుండే.ఎన్నో కథలు చెప్పేది.బాగా చదువలని తెల్లారుజామున ఐదింటికే లేపి చదువుకోమనేది.ఇంటర్ లో 902మార్కులతో పాసయ్యాను.నేను ఇంటర్ అయిపోయినంక కూడా కల్వకుర్తికి పోయినప్పుడల్లా ఆ ఇంటికి పోయి చూసొచ్చేది.కొన్ని రోజుల తరువాత ఆ ఇంటిని అమ్మి హైద్రాబాద్ వచ్చిండ్రు బాపువాళ్ళు.ఇల్లంతా కూల్చేసి ఇప్పుడు షాపులు పెట్టిండ్రు.నేను తిరిగిన ఆ చోట్లకు వెళ్ళి ఎంతో దుఃఖపడేది.అయ్యే …ఎంత గొప్ప చోటు కదా అని అక్కడే కాసేపు కూర్చోని వచ్చేది.చాలా రోజుల తరువాత సిటీలో ఉంటున్న అమ్మను,మాణిక్యరెడ్దిబాపును చూడడానికి పోయిన.ఒక్కసారిగా కల్వకుర్తి నా కండ్లముందట నిల్చింది.ఆ ఇంటితో ,అక్కడి చెట్లతో ఎంతో అనుబంధం నాకు.ఇప్పుడు ఆ స్థలాన్ని చూస్తే గుండెల్ని మెలిపెట్టె దుఃఖం. ఆ దుఃఖంలోంచి వచ్చిందే ఈ కవిత.
*
గోపాల్ కంగ్రాట్స్. గ్రేట్ టైం అహెడ్
ధన్యవాదాలు సార్ …చాలా సంతోషం
తమ్ముడు జయహో
అభినందనలు
అన్నయ్యా…అనేక ధన్యవాదాలు
గోపాల్.. నిండు అభినందనలు నీకు. చాలా సంతోషంగా ఉంది. 😊
అన్నా…ధన్యవాదాలు
స్వాగతిస్తున్న గోపాల్ 👏
ధన్యవాదాలు సార్ …చాలా సంతోషం
అభినందనలు గోపాల్
మనసును హత్తుకున్న కవిత గోపాల్ అన్న సూపర్.