ఒక్కలా !?

ధడాల్మని

ముఖమ్మీదే తలుపులు మూసేస్తావు

కారణం చెప్పవు

 

కిటికీ సందులోంచీ

వెలుతురు కట్టిన చారికతో

సంభాషణకి వుపక్రమిస్తాను

యినప తెరల లోపల

యేముందో

యెంత గింజుకున్నా తెలీదు

***

బయటా లోపలా తేడా లేదు

 

బతుకంతా వొక్కలా

ఆకాశం వొక్కటే

నేలే అనేకంగా ముక్కలైంది

వీథులన్నీ నిర్మానుష్యం జిడ్డోడుతున్నై

 

యే దీపస్తంభం ఆసరా కాదు

దారులు అగమ్య ఫలాలు

రెప్ప మాటున లెక్క తేలని మూగకలలు

***

మాటా

మౌనం

యేది బంగారమో యేది వెండో

నోట్లో మాత్రం మట్టి

మాటలున్నప్పటికన్నా

లేనప్పుడే తలపులు యెక్కువ

జ్ఞాపకాల్లోనే సమాధి

***

అంతటా పరుచుకోవాల్సిన కాంతి

వొక చోట ముడుచుకుంటుంది

చుట్టూరా చూసిందే

లోపలి నుంచి  పరిక్షేపమౌతుంది

ఐక్యత కోరే ఘర్షణలో

యెప్పట్లానే వేగుచుక్క పొడుస్తుంది

వెలుతురు పిట్టలు కొన్ని

 వేకువని మోసుకొస్తాయి

సూరీడై నిజం మండుతుంది

*

ఏ.కె. ప్రభాకర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతం ..చాలా మంచి కవిత ..అభినందనలు ప్రభాకర్ గారు ..

    – ముకుంద రామారావు
    హైదరాబాద్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు