ఖాళీ
రోజు ఉదయం అతను
రాలిన ఎండుటాకులా
ఇంటి నుంచి నడిచి వచ్చి
ఆ బాలికల ప్రాథమిక పాఠశాల ముందు
డి విటమిన్ కోసం
లేత ఎండ కాగుతుంటాడు
అతడు ఒక పదవీ విరమణ
పొందిన ఉపాధ్యాయుడు
జీవిత కాలం అంతా
ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడుగా
బడిని గుడిలా తల్లి ఒడిలా
భావించి ఆరాధించాడు
ప్రతి దినం పాఠశాల బోర్డును
పదేపదే తదేకంగా చూస్తూ
అక్షరాలను కలిపి చదువుకుంటాడు
దాని వెంట వెళ్లే వారు
అతనికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి
ఉదయపు నడకను ప్రారంభిస్తారు
ఇటీవలనే భార్య చనిపోయి
గుడ్డి కొంగలా ఒంటరిగా కుంటుతున్నాడు
బతుకు జ్ఞాపకాలన్నీ వేపకాయల్లా
కారు చేదును మిగిల్చాయి
ఆయన కూర్చున్న స్థలం
తేజోవంతంగా వెలిగి పోయేది
నడుస్తూ నడుస్తూ
ఒకరోజు వేకువ పూట
అటువైపు చూశాను
అతడు లేక వెలితి వెలితిగా ఉంది
అక్కడ మొలచిన చెట్టు కొమ్మకు
అతని శ్రద్ధాంజలి ఫోటో ఫ్లెక్సీ జీరాడుతుంది
*
రహస్యం
చిన్నపిల్లలు చాక్లెట్ కొనుక్కోను
మూల మీది కిరాణం షాప్ కు పోతూపోతూ
రూపాయి పోగొట్టుకొని వెతుకుతూ
బిక్క మొఖం వేసుకున్నట్టు
ఆనుపానులు తెలుసుకునేసరికి
బతుకు చేతులారా బేజారుతుంది
మందు గోళీలు ఎన్ని వేసినా
నడక ఎంత నడిచినా
మళ్లీమళ్లీ పుట్టుకొచ్చి
కర్రను కొంచెం కొంచెం కొరుక్కుతినట్టు
చెదలులా చక్కెర బీమారి
శ్రుతి మించిన గుండె లయకు
అణచివేసే బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్లు
బిగించిన పిడికిలి సడలుతుంది
నడక తప్పటడుగులు వేస్తుంది
ఇకనైనా నిలదుక్కుకుందాం అనుకునేసరికి
నిలువునా నీరుకారి మూతి విరుపు
బంగారు లేడి అయిపోతాం
అవయవాలు ఒక్కటొక్కటిగా
సహాయ నిరాకరణోద్యమం చేపడుతాయి
యవ్వనెవ్వనం ఎండమావిలా
ఒక విభ్రమ నిస్సత్తువ కలిగిస్తుంది
అసలుకే మోసం వచ్చి
స్టంట్లు హీరోలవుతాయి
జీరో విలువ కనుక్కునే సరికి
పక్కఅంకెలు అంతర్దానమవుతాయి
జీవిత రహస్యం తెలిసేసరికి
సమస్తం బహిరంగమైపోతుంది
ఒకే ఒక్క కవిత్వం మాత్రం
అక్షరాల నిన్ను నన్నూ బతికిస్తుంది
*
ఖాళీ
ఆతడు లేక వెలితి
అతడే ఉపాధ్యాయుడు
చాలా బాగుంది
really related to life
కవిత్వం బతికిస్తుంది