ఐదు దశాబ్దాల వర్కింగ్ విమెన్ ప్రయాణం సత్యవతి కథలు

దు దశాబ్దాలుగా తనకు తెలిసిన జీవితం గురించే సైలెంట్‌గా రాస్తూ ఉన్న రచయిత్రి సత్యవతి. మధ్యతరగతి జీవితానికి మరీ దూరం పోకుండా అటూ ఇటూగా ఆ చట్రంలోనే నిలబడి మొత్తం ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. సాయంకాలమైతే పదిలాంతర్లు, పదిహేను బుడ్డిదీపాలు చుట్టూ పెట్టుకుని ఓ మసిగుడ్డా గుప్పెడు ముగ్గూ తెచ్చుకుని నడిమి హాల్లో సెటిలయ్యే అత్తయ్య దగ్గర్నుంచి కాన్పులపుడు అమెరికాపోయి తిరిగొచ్చాక స్కైపుల్లో మనవళ్లని చూసుకునే అమ్మమ్మల దాకా మధ్యతరగతి ప్రయాణం ఆమె సాహిత్యం. పెళ్లికూతురును నట్టింట్లో కూర్చోబెట్టి సంతలో గేదెను చూసినట్టు చూస్తూ కట్నం బేరాలాడుకునే రోజుల్నించి ఫైన్ డైన్ రెస్టారెంట్లో టేబుల్‌కు ఎదురెదురుగా కూర్చుని మాకు కట్నకానుకలు అక్కర్లేదు, పెళ్లి గ్రాండ్ గా చేస్తే చాలు అనే దాకా మధ్యతరగతి ప్రయాణం. కుటుంబమే సర్వస్వమని, పిల్లలే లోకమని గతం మోపిన బండలను వదిలించుకుంటూ ముఖ్యంగా పరుల అంగీకారం అనే అగ్నిగుండాన్ని దాటుకుంటూ తన ప్రపంచానికి తాను ఎగిరిపోగలిగిన స్ర్తీ ప్రయాణం. చదువు వల్ల ఉద్యోగం వల్ల రెక్కలను గుర్తించాక ఎగరడానికి చేసే పెనుగులాట లాంటి సంధికాలపు ప్రయాణం. ప్రయాణం-లోపలా, బయటా.

‘‘ఊరికి కరెంట్ వచ్చింది, సెప్టిక్ ట్యాంకులు వచ్చాయి…

ఎస్సెస్సెల్సీ కాగానే రాఘవయ్యగారి సుభద్రకీ, బసవపున్నయ్యగారి వెంకటరత్నానికీ, జోసెఫ్ గారి ఎలిజెబెత్‌కీ పెళ్ళిళ్ళయ్యాయి. సంతోషం మాత్రం నర్సు ట్రైనింగ్ కి వెళ్ళింది.’’

ఈ వాక్యాలు ఆమె ఏ స్థలంనుంచి రాస్తున్నారో ఆ స్థలం సామాజిక ప్రయాణాన్నిపట్టించే సంకేతాలు. అన్ని చోట్లా మధ్యతరగతి ప్రయాణం ఒక్కటి కాదు. రాజకీయాల్లోనూ రచనల్లోనూ వ్యాపారాల్లోనూ వ్యసనాల్లోనూ ముందునడిచిన ప్రాంతమది.

మధ్యతరగతి ముందుగా ఎదిగిన ప్రాంతంలో నిలబడి తాను నమ్మిన విశ్వాసాల కుదురునుంచి దూరం పోకుండా స్త్రీల కోణంలోంచి మొత్తం కథను వివరించే వ్యాఖ్యాత సత్యవతి. స్త్రీల కోణం లోంచి ఈ చారిత్రక ప్రయాణాన్ని చెప్పే ప్రయత్నం ఆమె చేసినంత బలంగా విస్తారంగా చేసినవారు, చేస్తున్నవారు అరుదు. లో ప్రొఫైల్లో ఉండడం, గుర్తింపు కోసం ఎగబడకపోవడం ఆమెను ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇపుడున్న వాతావరణంలో ఇవేమీ చిన్నవిషయాలు కావు.

సత్యవతి  శైలిలాగే ఆమె పాత్రలు కూడా ఫ్లాషీగా ఉండవు. మనిషిలోని చైతన్యాన్ని stretch చేసేట్టు ఉంటాయి తప్పితే పూర్తిగా కట్టుతెంచుకుని వెళ్లేట్టు ఉండవు. ఎంతెంత రాడికల్ ఆలోచనలు చేసినా ఆచరణలో మాత్రం ఉన్న స్థితి నించి ఒకటో రెండో అడుగులు ముందుకు మాత్రమే వేస్తాయి. అంటే చదివే వారికి ఇది వాస్తవికం, ఇలా చేయొచ్చు, ఇలా జరగొచ్చు అనిపిస్తాయి. మనమూ ముందడుగు వేయొచ్చు అని స్త్రీలను ప్రోత్సహించేట్టు ఉంటాయి. కొన్ని కథలు భుజం ఆసరా ఇచ్చినట్టు కూడా ఉంటాయి.

కొంచెం అభ్యుదయం అవసరమే కానీ మరీ తాడు తెంచేదాకా వెళ్లకూడదు అని రాసే వాళ్లలోఒక సమస్య ఉంటుంది. వాళ్లు మౌలిక మైన ప్రశ్నలు వేయరు. తూతూ మంత్రం కాస్మోటిక్ మార్పులతో సరిపుచ్చుతారు. కానీ pragmatic గా  ఉన్నప్పటికీ సత్యవతి పాత్రలు అలా ఉండవు. అవి రాడికల్ ప్రశ్నలు వేస్తాయి. ఎగిరిపోతే ఎంతబాగుంటుంది  అని రాడికల్ ఆలోచనలు చేస్తాయి. కాకపోతే ఇప్పటికిప్పుడు ఎగిరిపోయే పని చేయలేము కాబట్టి స్కూటర్ నేర్చుకుని కాస్త వేగంగా ప్రయాణిద్దాం అని నిర్ణయించుకుంటాయి. మరీ అవసరమైనచోట ఎగిరే ప్రయత్నాలు కూడా చేస్తాయి. అంటే ఎగరడం అంటే ఏంటో తెలిసి ఆ అవసరాన్ని చర్చిస్తూ కూడా పాత్రలను నేలవదలకుండా చూసే రచయిత సత్యవతి. అదీ తేడా. అందుకే ప్రాగ్మాటిక్ అండ్ ప్రాక్టికల్ ఎట్ రాడికల్. పరిధులు ప్రమేయాలు తెలిసిన సెకెండ్ థర్డ్ టైర్ సిటీల్లానే ఉంటాయి ఆమె పాత్రలు, వాటి చైతన్యం కూడా. పాతికేళ్ల క్రితం స్లీపర్ క్లాస్ లోనూ ఇపుడు థర్డ్ ఎసీలోనూ కనిపించే వినిపించే కథలు, వ్యథలు.

ఖరీదైనవి, అందమైనవి, అరుదైనవి అన్నింటిని జానెడు దూరం నుంచి అద్దాల్లోంచి చూస్తూ నిలిచిపోయే క్లాస్ మధ్యతరగతి. అణిచివేసుకోవడం కోర్కెలనయినా, కోపాన్నయినా. బ్యాలెన్స్ మధ్యతరగతి జీవితంలో భాగం.  ఆ యాతన, పెనుగులాట ఈ కథల్లో ప్రతిఫలిస్తుంది.

ఏదీ నిలువ నీరు కాదు, అంతా ప్రవాహమే. ఆమె 70ల్లో రాసిన కథల్లో స్త్రీలు చూపించిన చైతన్యానికి ఇటీవల రాసిన కథల్లో చూపించిన చైతన్యానికి చాలా తేడా ఉంది. కూతురిని గొంతుపిసికి చంపడానికి ప్రయత్నించిన అల్లుడి దగ్గరకు పంపొద్దు అని భర్తతో నోరువిడిచి చెప్పడమే మాఘసూర్యకాంతి అయిన సందర్భమూ ఉంటుంది. ఒకనాటి భర్త ఇల్లు వెతుక్కుంటూ వస్తే ఒక్క మాటా మాట్లాడకుండా నిభాయించుకున్న ధీర గంభీర సందర్భమూ ఉంటుంది. కాలంతో పాటుగా మార్పులు. అందులోనూ ఆయా కాలాల్లోని సగటు చైతన్యం కంటే ఒక్కటి రెండడుగగులు ముందుకేస్తాయి. కథలంటే అదేదో నిర్వచనంలాగా ఒక ఘటన చుట్టూనే తిరగనక్కర్లేదు. ఘటన కేంద్రకంగా ఉన్నా ప్రపంచం చుట్టి రావచ్చు అని చూపించిన రచయిత సత్యవతి. ఘటన కంటే పరిణామాలకు ప్రాధాన్యమిచ్చే స్కూల్ కు చెందిన రచయిత్రి. ఈ విషయంలో కొ.కు గుర్తుకురావడం యాదృచ్ఛికమేమీ కాదు.

పట్టణీకరణ వేగం పుంజుకుంటున్న దశలో ఆడవాళ్లు చదువుల్లోకి ఉద్యోగాల్లోకి అడుగులేస్తున్న వేళ కలం పట్టిన రచయిత్రి సత్యవతి. వర్కింగ్ విమెన్ ప్రధానంగా ఆమె కథా నాయిక. ఎక్స్చేంజ్ వాల్యూ ఉన్న పనిచేసే వర్కింగ్ విమెన్. అది అంతగా లేని వర్కింగ్ విమెన్ కూడా. సినిమాలకు ఇంకా సి క్లాస్  మార్కెట్ ప్రధానంగా ఉన్న దశలో పట్టణాలను, మహిళా విద్యను ఈసడించుకుంటూ పాతతరపు ’గుమ్మడి, ఎస్వీరంగారావు, ప్రభాకరరెడ్డి’ కారెక్టర్ల కళ్లలోంచి సమాజాన్ని చిత్రిస్తూ తెలుగు సినిమా దుర్గంధాన్ని వెదజల్లుతున్న దశలో దానికి భిన్నంగా ఆధునిక మహిళ కంటితో పరిణామాలను చూసి రాయడం ఆరంభించిన రచయిత్రి సత్యవతి.  ప్రపంచంలో ఆకలికేకలు విపరీతంగా వినిపించిన సమయం, తిరుగుబాటు పతాకలు ఎగిసిపడిన సమయం కూడా అదే. ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుంది అని గురజాడ అన్నాడే అదిగో అలాంటి ప్రయత్నం ఈ కథలన్నీ. పాఠకుల వయస్సును బట్టి చదువు- exposure ను బట్టి మన నిన్న, నేడు, రేపు కూడా ఈ కథల్లో కనిపిస్తుంది.

వ్యవసాయ కుటుంబాల నుంచి పట్టణాల కొచ్చిస్థిరపడిన పాత్రలు ఎక్కువ. ’’కుటుంబం గురించి, వివాహ వ్యవస్థ గురించి చర్చలు జరుగుతున్నపుడు అసలు పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా అనీ, ప్రీ మారిటల్ సెక్స్ లో తప్పేంటి అని ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నపుడు ఇంకొకవైపు ఇంకా అలివిమాలిన పాతివ్రత్యాలు, పతి సేవలు, లక్షలు లక్షలు పోసి మొగుణ్ణి కొనుక్కోవడాలు, మర్యాదలు, అలకలు, మహానగరాలలో మహమ్మారిలా వ్యాపించిన పెట్టుబడీదారీ సంస్కృతి, పల్లెటూళ్లలో ఇంకా మిగిలి ఉన్న భూస్వామ్య భావజాలం-అన్నిచోట్లా ఉన్న పితృస్వామ్య సంస్కృతి ప్రభావం-మనుషులంతా ఆలోచించడం మర్చిపోయారా? చలనం లేని బొమ్మలైపోయారా’’ అని ఆలోచించి ఆ రెండు ప్రపంచాలను వాటి మధ్య ప్రయాణాలను అందులోని కష్టనష్టాలను రికార్డు చేసే పని చేశారు సత్యవతి. ‘‘ఒకప్పుడు సంప్రదాయాలూ నీతి నియమాలూ స్త్రీల జీవితాలని నియంత్రిస్తే ఇప్పుడు అవసరాలు, మార్కెట్ కూడా వాటికి తోడయ్యాయి…..  ఈ సమస్త పరిణామాలూ, పర్యవసానాలూ స్త్రీల జీవితాలపై చూపుతున్న ప్రభావాలని చూస్తూ  నాకు తెలిసిన రీతిలో నమోదు చేసుకుంటూ వస్తున్నాను’’ అని ఒకచోట ఆమే చెప్పారు. అన్నింటికి జవాబులు సిద్ధంగా ఉండడం గొప్ప లక్షణమేమీ కాదని గుర్తించి కొన్ని ప్రశ్నలుగానే వదిలేయడం ఆమె కథలను విలక్షణంగా నిలుపుతుంది.

నీ మంచి కోసమే అనే ప్రేమపూర్వక హింస గురించి బహుశా సత్యవతి చెప్పినంత సమర్థంగా తెలుగులో మరెవరూ చెప్పలేదేమో అనిపిస్తుంది. హింస అని బాహాటంగా తెలిసే హింసను గుర్తించడం వేరు. ఇదిగో ఈ ప్రేమ పేరుతో సాగే హింసనుగుర్తించడం ఎదుర్కోవడం వేరు. మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే హింసలో ఎక్కువ భాగం ఇదే. మనుషులందరినీ వీలైనన్ని ముక్కలుగా విడగొట్టి పరస్పరం కలవకుండా కాపలా కాస్తూ వ్యవస్థ తనను తాను కాపాడుకుంటూ ఉంటుందని ఆమె పహారా అనే కథలో చెపుతారు. ఈపహారా కాసేవాళ్లలో ఎక్కువ భాగం ఈ ప్రేమ హింస బాపతే. మన అన్నలు అక్కలు, తల్లులు తండ్రులు, మామయ్యలు, అత్తయ్యలు ఇలా. నువ్వుండే ప్రాంతం మరీ చిన్నదైతే ఎదురింటివారు పొరుగింటివారు, గ్రామ పెద్దమనుషులు కూడా.

నిత్యజీవితంలోని చిన్ని చిన్ని విషయాల గురించి అబ్జర్వేషన్, మానవ సంబంధాలను ప్రభావితం చేసే అంశాల గురించిన విస్తృత పరిశీలన మంచి రచయితల్లో కనిపించే సామాన్య లక్షణాలు. సత్యవతి సీసాలో మందు అయిపోతే అగ్గిపుల్ల వెలిగించి బోర్లించడం గురించి ప్రస్తావిస్తారు. ఉన్నచోట తిండిదొరక్క పట్నం పోయే వలస, సుఖమయజీవనం కోసం మరెక్కడికో ఎగిరిపోయే వలస- రెంటినీ పక్కపక్కనే పెట్టి చర్చిస్తారు.

పాత్రల్లో పరిణతి, కథలో పురోగతి సాధిస్తూ చివరికి ఆధిపత్య విలువలపై ధిక్కారపు చిహ్నంతో ముగించడం ఆమె కథల్లో కనిపించే సామాన్య లక్షణం.  ఒక రకంగా అది టెంప్లెట్ లాగా అయిపోయింది అని చెప్పొచ్చు. ఆమె ఏర్పరుచుకున్న టెంప్లెట్ ఆమె విస్ర్తృతికి, వైవిధ్యానికి సంకెలగా  మారిందా అనే సందేహం కూడా కలుగుతుంది- కథలన్నీ ఒకచోట చేర్చిన పుస్తకం చదువుతుంటే. ఇంత అధ్యయనం, పరిశీలనా ఉన్న రచయిత్రి తనకు తాను విధించుకున్న చట్రం నుంచి బయటపడి ఇంకాస్త విస్రృతమైన కాన్వాస్ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. కాయలున్న చెట్టునుంచి ఎక్కువే ఆశిస్తారు.

ఆమెకు సెటైర్ ఇష్టము అని కొన్ని చోట్ల అర్థం అవుతుంది. కానీ అతి పొదుపు పాటిస్తారు. ప్రయోగాభిలాష ఉంది అని ఇల్లలకగానే, నేనొస్తున్నాను లాంటి కథలను చూస్తే అర్థం అవుతుంది. కానీ అదే పొదుపు. జాగ్రత్త, పొదుపు అనే మధ్యతరగతి అవిభాజ్య లక్షణాలు రచయిత పాత్రలకే పరిమితం కాలేదు అని అర్థం అవుతుంది.

అన్నింటిని ప్రధానంగా స్త్రీల కోణం నుంచి మాత్రమే రాయాలనే నియమం కొన్ని చోట్ల పరిమితిగా కూడా మారుతుంది. కథ మరింత విస్తృతమవ్వాల్సిన చోట ఏకోన్ముఖంగా పయనిస్తుంది. అది తప్పని కాదుగానీ సమర్థమైన రచయిత్రి కాన్వాస్ ను ఇరుకున పెట్టే విషయం అని మాత్రం చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రధానమైన అంశం పక్కకు పోయే ప్రమాదం ఉంది. సందర్భాలను బట్టి ఆయా ఘటనల్లో క్లాస్, క్యాస్ట్, జెండర్, ప్రాంతం, వయసు వగైరా ప్రధానపాత్ర పోషిస్తూ ఉంటాయి. ఒకవేపే చూడు అన్నట్టుంటే అంతకంటే ప్రధానమైన అంశాన్ని మిస్సయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకటిరెండు చోట్ల అలా అనిపిస్తుంది. ఉదాహరణకు కాడి కథే తీసుకుందాం. అందులో స్వర్ణ మొగుడు, ఇరుగుపొరుగు ఆమె సోకుల గురించీ బట్టల గురించీ ఫిర్యాదు చేయడం వేధించడం అనేది గ్రామీణ పట్టణ వైరుధ్యంతో ముడిపడిన అంశం. ఫార్మల్ ఇన్ ఫార్మల్ తేడాలుంటాయి ఇందులో. కథలో ఆ అంశం మరుగున పడిపోయింది. అతను పల్లెటూరిలో వ్యవసాయ పనులు చేసుకునే మనిషి. స్వర్ణ పట్టణంలోని  బస్తీలో పెరిగిన మనిషి. పల్లెటూరిలో వరికోతకు పోయే మనిషి పట్నంలో పనికి వెళ్లాల్సి వచ్చినపుడు వేరేగా తయారవుతారు. అది పూర్తిగా వైయక్తికమైన అంశం కాదు. నువ్వున్న ప్రదేశం అప్పటికే అక్కడ ఏర్పడిన ప్రమాణాలు మనుషులపై ప్రభావాలు చూపిస్తాయి. శుభ్రంగా ఉండడం మాత్రమే కాదు, శుభ్రంగా కనిపించడం అనేదానికి పల్లెలోనూ పట్నంలోనూ కనీసప్రమాణాలు మారతాయి. ఒకే మనిషి పల్లెల్లో వరికోతకు పోయినపుడు పట్నంలో అడ్డామీద నుంచున్నపుడు వేర్వేరుగా ఉంటారు. అడ్డా కూలీనే ఫ్యాక్టరీలో వాచ్మెన్ గానో ఇంకో పనికో పోవాల్సివచ్చినపుడు ఇంకో రకంగా తయారుకావాల్సి ఉంటుందది. యూనిఫామ్ వస్తే ఇంకాస్త తేడా ఉంటది. ఇంత అని డబ్బులు తీసుకుని పాయిఖానాలు కడిగేవాళ్లకు పట్టణ ఆఫీసుల్లో మెయిన్ టెయిన్స్ డిపార్ట్మెంట్‌కు బోలెడంత తేడా. కథల్లో మౌలికమైన అంశం ఏంటి అనేదానికి సంబంధించిన ఇలాంటి సమస్యలు కథల్లో అక్కడక్కడా తొంగి చూస్తాయి.

ఇల్లలకగానే తీసుకుందాం. గొప్ప కథ. కూతురు, భార్య, తల్లి లాంటి పాత్రల్లో తప్ప తనకు తానుగా మిగలని స్ర్తీ కథ. ఇంటా బయటా మహిళల చాకిరీకి గుర్తింపు దొరక్కపోవడం అనేది అత్యంత బలంగా ఎస్టాబ్లిష్ చేసిన అలాంటి కథలు ఆమె మరికొన్ని కూడా రాశారు. కానీ ఇంకొంత విస్తరించి ఎక్స్చేంజ్ వాల్యూ ఉన్న పని లేని పనికి తేడాలను చర్చించొచ్చు. ఇంట్లో పెద్దగా గుర్తింపు ఉండని అదే పని ఎక్స్చేంచి వాల్యూ సంతరించుకున్నపుడు ఉన్న గుర్తింపు వేరే. ఇవాళ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చెఫ్స్ ప్రధానంగా మగవారే. కొన్ని కథల్లో కార్యకారణ సంబంధం కొంత ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు. అన్ని కథల్లో విధిగా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పట్లేదు, పరిష్కారం సూచించాలని అస్సలు చెప్పబోవడం లేదు. కాకపోతే అవకాశం ఉన్న చోట మరింత లోతుకు వెళ్లి ఉండొచ్చు అనిపిస్తుంది, రచయిత శక్తిమంతురాలు కాబట్టి.

వర్తమానం కంటే గతం మేలు అనేదాకా వెళ్లరు కానీ ఈ వస్తువులు వాటి వ్యామోహం పెరిగాక మనుషులు మనుషులు కాకుండా పోతున్నారని, అవి అంతగా లేని రోజులే కాస్త మెరుగేమోనని సూచిక ఒకటి రెండు చోట్ల తగులుతుంది. వస్తువ్యామోహం మీద విసుగు చాలామందికి ఉండొచ్చు కానీ ఇక్కడో ఇబ్బంది ఎదురవుతుంది. ఏ వస్తువుల దగ్గర ఆగుదాం. నాగలిదాకా నిప్పు దాకా తవ్వుకుంటూ వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. మనిషి జీవనం సుఖమయం కావడం కోసం వస్తువులు కనుగొంటూనే ఉంటారు. అవి ఎవరికి అందుబాటులో ఉన్నాయి ఎవరికి లేవు, ఎందుకు లేవు అనేది చర్చించడం సరైంది అవుతుంది కానీ వస్తువ్యామోహం మీద వ్యతిరేకతలో భాగంగా అవిలేని రోజుల పట్ల సూచికగా నైనా సానుకూలత వ్యక్తం చేయడం ఇబ్బందికరం. వస్తువ్యామోహాన్ని చర్చించడం వేరు. అందులో అవిలేని రోజుల పట్ల ధ్వని పూర్వకంగానైనా సానుకూలత వ్యక్తం చేయడం వేరు. ‘‘మంచి గతమున కొంచెమేనోయ్’’ అని మరువరాదు.

అయితే ఇవేవీ ఆమె సాధించినదాన్ని కప్పేయలేవు. ఆధునిక మహిళ, ముఖ్యంగా వర్కింగ్ విమెన్ ప్రయాణాన్ని తెలుసుకోవాలనుకునే వారికి ఆమె కథలు పాఠాలుగా ఉపయోగపడతాయి.

రాయడం కంటే చదవడమే ఇష్టం అని ఆమె ఎక్కడో రాసినట్టు గుర్తు. కానీ దమయంతీ ఆమె కూతురు చేయాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. మనం ఇంకా చదవాల్సే ఉంది. సత్యవతి గారూ, వింటున్నారా!

*

జీ.ఎస్. రామ్మోహన్

20 comments

Leave a Reply to Anil అట్లూరి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సత్యవతి గారు వింటారు.
    వింటారు కాబట్టే వారికి చదవడం ఇష్టం రాయడం కంటే !
    లో ప్రొఫైల్ ఇష్టం హడావుడి కంటే !
    చూడడం ఇష్టం !
    చూసింది రాయడం మరింత సులువు కదా!
    Good one, Ram Mohan.

  • మీ విశ్లేషణ చదివాక సత్యవతి గారి కథలు తప్పక చదవా లనిపించింది. చదువుతాను.

  • You gave the quintessential points of Smt.Satyavathi garu story telling.many thanks to you and regards to Mam.

  • సత్యవతిగారి రచనలగురించి సమగ్రమైన విశ్లేషణ చాలా బాగుంది. నేను చాలా తక్కువ చదివింది వారికథలు.” ఆమె కథలు పాఠాలుగా ఉపయోగపడతాయి”. సత్యవతిగారి కథలు చదివినంత సంతోషం. మంచి విశ్లేషణను అందించిన మీకు ధన్యవాదాలు.

  • “ పి. సత్యవతి సాహిత్య కృషి – ఒక అంచనా “ ~ బండారి సుజాత

    “ వృత్తిరీత్యా ఆంగ్లోభాషాపన్యాసకురాలు, ప్రపంచసాహిత్యంతో ఆత్మీయ సంబంధం ఉన్న పి. సత్యవతి 1960వ దశకం నుండి రచనలు చేస్తూ, వర్తమానంలో మారుతున్న సామాజిక రాజకీయార్థిక పరిణామాల ప్రభావాలను స్త్రీల కోణం నుండి వ్యాఖ్యానిస్తూ, స్త్రీల జీవితంపై వాటి వెలుగునీడల క్రీడను చూపిస్తూ సాహిత్య కృషి చేసారు.

    స్త్రీల జీవితంలోని నియంత్రణను, హింసను, ఇంటిపని భారాన్ని, లైంగికత మీద పురుష పెత్తనాన్ని వివాహ వ్యవస్థలోని అధికార లక్షణాన్ని, నిరసన స్వరంతో వినిపించారు.

    కధ, నవల, వ్యాసాల బహుముఖాలుగా సాగిన సత్యవతి సాహిత్య కృషి మొత్తం పందొమ్మిది వందల తొంబయ్యవ దశకపు స్త్రీవాద ఉద్యమానికి ఒక జీవశక్తి నిచ్చిందనటంలో అతిశయోక్తి లేదు. స్త్రీ సమస్య ప్రపంచ శ్రామిక విముక్తి ఉద్యమాలతో, హక్కుల ఉద్యమాలతో ముడిపడి పరిష్కరింపబడుతుందన్న అవగాహనను కూడా సత్యవతి తన ఈ రచనల ద్వారా తెలుగువారి భావ ప్రపంచంలోకి ప్రసరింపచేయటం విశేషం.

    ఎ. రేవతి తమిళంలో రాసిన ఆత్మకథ ‘ద ట్రూత్‌ ఎబౌట్‌ మీ: ఏ హిజ్రా స్టోరీ’ ను ‘ఓ హిజ్రా ఆత్మకథ’ గా అనువదించిన రచనకు పి. సత్యవతి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. “ ~ బండారి సుజాత

  • చక్కని చిక్కనైన విశ్లేషణ రామ్మోహన్ గారూ.. ఇప్పుడు మళ్లీ చదవాలి సత్యవతి గారి కథలు.. మీ పరిశీలన లోతుగా అధ్యయనం చేయడమే కాక, అన్వయించి చేయడం నచ్చింది 🙏

  • A beautiful review! Enjoyed as much as I enjoyed reading her stories. Excellent job, Ramamohan garu!

  • సాహిత్య పెత్తందారీ తనానికి దూరంగా ‘మిత్రందారీ’ తనంతో సాగిన విశ్లేషణ!

  • సత్యవతి కధల గురించి చాలా మంచి విశ్లేషణ రాశారు రామ్మోహన్ గారు. ఆవిడ రాసిన అనువాద నవల “రేవతి – ఒక హిజ్రా ఆత్మకధ ” చాలా మంచి నవల. ఆవిడకు మొన్న 13 మార్చ్ 2021 కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు