ఏ భాషలో ఆలోచిస్తున్నారు?

ఏ భాషలో ఆలోచిస్తున్నారు?

మీ మాతృభాష  ఏదని కాదు. ఏభాషలో ఆలోచిస్తున్నారని అడగాలి ఇప్పుడు.

ముందే మనవి చేసుకుంటాను. నేను భాషాశాస్త్రాలు చదివినదాన్ని కాను. నాకొచ్చిన పిసరంత తెలుగూ 40, 50 దశకాల్లో భాషయందు మంచి పట్టుగల విద్వద్వరులు రాసిన కథలు చదవడంవల్ల వచ్చింది మాత్రమే. ఈరోజుల్లో వస్తున్న తెలుగు చూసేక, నాకు కలిగిన అభిప్రాయాలు  పంచుకోడం మాత్రమే ఇక్కడ చేస్తున్నది.

అఫ్సర్ గారు నా అనుభవాలు, జ్ఞాపకాలు రాయమని అడిగేరు. ఇది ఆ కోవలోకి రావచ్చు అనే అనుకుంటున్నాను భాషాపరంగా.

నేను అమెరికా వచ్చిన కొత్తలో ఎవరితోనైనా మాటాడుతున్నప్పుడు ఎదటివారిమాటలు తెలుగులోకి మార్చుకుని, తెలుగులో జవాబు ఆలోచించి ఇంగ్లీషులో జవాబు చెప్పేదాన్ని. కొంతకాలానికి ఇంగ్లీషు నుడికారం అలవాటయేక, ఇంగ్లీషులో ఆలోచించడం మొదలుపెట్టేను.  ఇందులో నాప్రయత్నం లేదు. అచేతనావస్థలోనే జరిగింది ఇది. ముఖ్యంగా నాపరిసరాల్లో నాచుట్టూ ఉన్నవారంతా ఇంగ్లీషు మాటాడేవారు కావడంచేత, తెలుగు ఎక్కడా వినిపించకపోవడంచేత.

గత 10-15ఏళ్ళలో అనుకుంటాను ఈసంగతి నాకు నేనే గమనించుకుని, మళ్ళీ తెలుగులో ఆలోచించే ప్రయత్నం మొదలుపెట్టేను. ఆతరవాత ఫేస్బుక్ చూసి, ఖాతా తెరిచి, తెలుగులో రాయగలిగినవారిని మాత్రమే చేర్చుకుంటూ వచ్చేను. నా ఫేస్బక్ పేజీ తెలుగునుడికారం చూసుకోడానికే కానీ స్నేహాలు పెంచుకోడానికి కాదు.

నాపేజీలో తెలుగులో రాయగలిగినవారినే చేర్చుకుంటానని ప్రకటించేక, నేను గమనించిన మరో వింత – తెలుగులో రాయాలి అంటే తెలుగుమాటలు, తెలుగులిపి అని ప్రత్యేకించి చెప్పుకోవలసివస్తుందని గ్రహించకపోవడం. నారోజుల్లో తెలుగొచ్చా అంటే తెలుగులో రాయడం, తెలుగుఅక్షరాలే రాయడం, తెలుగులో మాటాడడం అంటే తెలుగుపదాలే వాడడం అని ప్రత్యేకంగా వేరే వివరించి చెప్పవలసిన అవుసరం ఉండేది కాదు.

ఏభాషలో మనం ఆలోచిస్తున్నాం అని ఆలోచించుకునే సమయం వచ్చింది ఇప్పుడు అని అందుకే అంటున్నాను. తెలుగు వస్తే చాలదు. వాడుకలో కనిపించాలి.

లేకపోతే,

సరే కి బదులు ఓకే

అవును, అంతేమరి, నిజంలాటి పదాలకి బదులు యస్

వాన కి బదులు రెయిన్

అన్నం, భోజనం, ఫలహారం కి బదులు ఫుడ్

అన్నానికి రైస్ (మనకి వండితే అన్నం, వండకపోతే బియ్యం. ఈతేడా ఇంగ్లీషు పదానికి లేదు.) రాయడం జరగదు.

అలాగే సాల్టు, వాటరు, మిల్కు లెక్కకుమించి ఉన్నాయి మీకూ తెలుసు.

అన్ని నుడికట్టులకి అచ్చమైన తెలుగుపదాలు ఉండవు. అలాటివి Of course, correct, exactly, Exactlyకి సమానార్థకం సరిగ్గా. కానీ చాలామంది ఇంగ్లీషుపదంలో ఉన్న ఊపు తెలుగుపదంలో లేదంటారు.

దీనికి నేపథ్యం చూసుకోవాలి. మనజనాభా కారణంగా మనకి ఎదట ఉండే మనుషులు ఎక్కువ. మాటల్లేకుండా ముఖకవళికలలోనూ, హస్తవిన్యాసంతోనూ అనేక భావాలు అతి తేలిగ్గా ప్రకటించే సంస్కృతి మనది. నడవలో మనుకమంచంమీదో పట్టెమంచమ్మీదో  కూర్చుని సంసారచక్రం తిప్పేసే నాయనమ్మల సంస్కృతి మనది.

ఇవి ఇలా ఉండగా, ప్రస్తుతం తెలుగుభాషలో చోటు చేసుకుంటున్న మరో విపరీతం–దీన్ని నేను విపరీతమనే అంటాను– ఇంగ్లీషు నుడికట్టుకి తెలుగు అనువాదాలు. నిజానికి ఇవి తెలుగూ కాదు ఇంగ్లీషూ కాదు. రెండుభాషలకీ చెడిన రేవడులు అనాలి.

మానాన్న fire అయిపోయేడు

నేను fix అయిపోయేను

light తీసుకోండి.

— ఇక్కడ కొంత వివరణ అవుసరం. lightగా తీసుకోండి అని గా ప్రత్యయంతో వాడితే కొంత నయం కానీ light తీసుకోండి అంటే అర్థం లేదు. ఇంగ్లీషులో take light అంటే అర్థం వేరు.

Take light – Urban Dictionary

Means shut up or chill depending on the situations.

 

అండీ అని విడిపదంగా వాడుకలోకి వచ్చింది. అండి ఒక ప్రత్యయం. దానికి స్వయంప్రతిపత్తి లేదు. సంతోషమండి, వచ్చేరండి అంటూ మరో పదానికి జోడించాలి. మొదట్లో నాకు నచ్చలేదు కానీ క్రమంగా నేనూ వాడేస్థితికి వచ్చేను. ప్రతిచోటా కాకపోయినా, అప్పుడప్పుడు.

 

అలాగే hand ఇవ్వడం అంటే నాలుగేళ్ళక్రితం ఎవరో వివరించి చెప్పేవరకూ నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఇంగ్లీషు వాడకంప్రకారం hand ఇవ్వడం అంటే చెయ్యి అందివ్వడం, సాయం చేయడం అని.

మనకున్న తెలుగుపదాలు కూర, పచ్చడిలాటివి వాడడం మానేసి కర్రీ (నిజానిక కరీ అనాలి), చెట్నీ వాడడాలు ఎలా వచ్చాయో తెలుసా? కరీ, చెట్నీ తమిళపదాలు. పాశ్చాత్యులకి ఈవస్తువులు లేవు కనక వారు తమిళపదాలు తీసుకున్నారు. ఏభాషలో అయినా మరోభాషకి సంబంధించిన పదాలు ఇలాగే చేరడం జరుగుతుంది. వాళ్ళకి లేవు కనక వాళ్ళు తీసుకున్నారు. మనం చుట్టుతిరిగి మన పొరుగువారిపదాలు ఇంగ్లీషు వర్ణక్రమంతో స్వీకరించాం. అంటే కరీ అనే ఉచ్చారణ అయినా curryలో రెండు Rలు తీసుకుని కర్రీ చేసుకున్నాం. అంతే కానీ మనకున్న తెలుగుపదాలు మాత్రం మనకి పనికిరాలేదు..
Bath take చేసేరా, సాల్టూ వాటరూ యాడ్ చేసేరా లాటివి, అదర్సు, హాపీసు లాటి పదాలగురించి నేనింక చెప్పలేను. నాకయితే ఒంటిమీద జెర్రులు పాకినట్టుంటుంది అవి వింటున్నప్పుడు.

ఒకభాష పదాలు మరొకభాషలో చేరడం సాధారణంగా జరిగేదే. అందులో ఆశ్చర్యం లేదు. నిజానికి 19వ శతాబ్దపు పాశ్చాత్యనవలలో భారతీయపదాలు మీరూ గమనించే ఉంటారు. నాకు తెలిసి మామూల్, బక్షిస్, వెరండా లాటి పదాలు ఇలా చేరినవే. వారి సంస్కృతిలో వాటికి సరి తూగగల పదాలు ఉన్నప్పుడు కూడా ధ్వనిలో లేదనిపిస్తే మరోభాష పదాలు తీసుకుంటారు. అలాగే వస్తువులు ఏదేశంనుంచి వచ్చేయే వారిపదాలే వాడకలో స్థిరం చేసుకుంటారు.

వ్యాకరణసిద్ధాంతాలు వ్యావహారికపదాలు ప్రాతిపదికగా చేసుకుని సిద్దాంతీకరించినవే కనక ఈ వ్యావహారికపదాలు కాలక్రమంలో స్థిరపడతాయేమో. అన్నీ కాకపోయినా కొన్ని స్థరపడొచ్చు. నాకు తెలీదు. కానీ ప్రస్తుతానికి నాకు అంతగా రుచించడంలేదని మాత్రం చెప్పగలను. నేను ప్రామాణికం కాదని కూడా ఒప్పేసుకుంటాను పనిలో పనిగా.

ఒక్కమాటలో పై ప్రయోగాలు చూసినప్పుడు మాత్రం నా తల్లిభాష అని చెప్పుకోడం అర్థరహితం అనుకునే స్థితికి వచ్చేం అనిపిస్తోంది. మనకి తల్లిభాష అంటూ ఏమీ మిగలలేదు ప్రయోగపరంగా ఒక కంగాళీభాష తయారు చేసుకుంటున్నాం అనే అనిపిస్తోంది నాకు.

*

 

Sarayu Blue

9 comments

Leave a Reply to ఏభాషలో ఆలోచిస్తున్నారు? – తెలుగు తూలిక Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అయ్యో నేను నాబ్లాగులో ఇచ్చిన లింకు ఇలా వస్తుందని నాకు తెలీదు. మీకు అభ్యంతరమైతే తొలగించగలరు. రెండుసార్లు ఎందుకు వచ్చిందో కూడా తెలీదు.
    -నిడదవోలు మాలతి

  • మాలతీ గారూ
    మీ వ్యాసం చాలా బాగుంది.నిజమే.ఇప్పుడు తెలుగుకవిత్వం లో కూడా పంక్తులకు పంక్తులే ఇంగ్లీష్ వాక్యాలు,లేదా మరో భాషా పదాలతో రాయటం ఎక్కువ అయ్యింది.కథల్లో సరేసరి ఇంకా చెప్పక్కర్లేదు.మన తెలుగు ఛానళ్ళు,ఎఫ్.ఎమ్ రేడియో జాకీ లు మరింత సంకర భాష.కొన్నాళ్ళకి పూర్తిగా అన్ని భాషలతో కలిసిన తెలుగు సాహిత్యం ఉంటుందేమో.

    • ధన్యవాదాలు చదివి మీఅభిప్రాయం రాసినందుకు సుభద్రాదేవిగారూ. అవును. కాలక్రమంలో తెలుగు మరొక సమ్మిళితభాషగా అవకాశమే ఎక్కువ. ఇంగ్లీషువాక్యానికి కదా అనో అండి అని చేర్చితే తెలుగు అయిపోతుందనుకునే పరిస్థితి ఇకమీదట.

  • మాలతీ గారు,
    మీ వ్యాసం చదివాను. ఈ వ్యాసం బట్టి నాకు అర్థమైందేమిటంటే, తెలుగు రోజు రోజుకీ కంగాళీ భాషగా తయారువుతోంది. దీనికి కారణం ఎవరు? ఎవరిని తప్పుపట్టగలం? నేనైతే విద్యా వ్యవస్థనే తప్పుపడతాను. తరగతి గదుల్లో విద్యార్థులలో భాష పట్ల ప్రేమను, సాహితీ అభిలాషను పెంపొందించలేకపోతున్న ఉపాధ్యాయులను తప్ప పడతాను. ఏదైనా భాష తన ఉనికిని కాపాడుకోవాలంటే, దానిని పరిరక్షించే నాథులు ఉండాలి. ఇప్పుడు తెలుగులో మాట్లాడేవారు, లెక్కకు మించి తమ మాటలలో అన్యభాషా పదాలను వాడుతున్నారు. వారు పెరిగిన చోటు కూడా అందుకు కారణం కావచ్చు. అలా మాట్లాడడం తప్పని కూడా ఎవరూ వారికి చెప్పకపోయి ఉండవచ్చు. మరి ఈ తప్పులు సరిచేసేదెవరు? కాలక్రమేణా, వారు అదే తెలుగు అనుకొని, దానినే ఇంకొందరికి నేర్పిస్తారు. ఆ భాషే సినిమాలలో కూడా కనిపిస్తుంది. మరి రేపటి తరం అదే అసలు తెలుగని భావించే అవకాశం ఉంది కదా?

    అందుకే నేటి సాహితీవేత్తలలో ఎవరైనా ముందుకు వచ్చి, నడుం బిగించాలి. శిక్షకులుగా మారాలి. అసలైన తెలుగు భాషను అందరికీ చేరువయ్యేలా చూడాలి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు