ఏపక్షికీ చెప్పకు  

కొండపై ఏమి వుందో
నేలకు తెలియనివ్వకు
మన్ను విరగబడి నవ్వుతుంది

నది ప్రవహించట్లేదని
నదిలో రాళ్లకు చెప్పకు
వాటి నునుపుతనం నిన్ను వెక్కిరిస్తుంది

కొండపై ఏమి వుందో
నేలకు తెలియనివ్వకు
మన్ను విరగబడి నవ్వుతుంది

చెట్లు శ్వాసిస్తాయని, స్వప్నిస్తాయని
సుడిగాలికి కుప్పకూలతాయని
గూళ్ళు కూలిపోతాయని
ఏపక్షికీ చెప్పకు

అవి గూడులేని అనాధలై శపిస్తాయి

నువ్వెక్కడున్నావని ఎవరినీ అడగకు
కలలోంచి కల నడిచివెళ్ళాక
నువ్వొక దీపస్తంభమయ్యావని తెలిస్తే
గుండె కలుక్కుమంటుంది


2

ఎట్లా అల్లుకుపోతారో
మనుషులు మనసులతో

అనుభూతి ఎప్పుడూ నీచుట్టూ
నీలో వుంటుంది
నీ కనుల కాంతి, పాట, మాట
అన్నీ మధురంగా తోస్తాయి.

ఆకళ్ళను చూసిన ప్రతిసారి అనుకుంటా
అవి నాకై ఉన్నాయని

పచ్చని చామంతులు
కలలో నిండుగా నవ్వినట్లు
నేను అదేనై పరవశించినట్లు.

నిన్నటి చినుకులన్నీ
మనపై కురిసినందుకేమో
మేఘాలు పాలనురుగులా తేలిపోతున్నాయి
తేలిగ్గా ఏమిలేనట్లు పారదర్శకంగా
అచ్చం నీమనసులా

స్పందనలు, అనుభూతులు
భాషై, ప్రేమై, బాధై
రాత్రి వర్షమై కురుస్తాయి

కలచి, కలత పెట్టే కలలై
నిదుర కౌగిలిని విడిపిస్తాయి

 

ఫోటో: భాస్కర్ 

శ్రీ సుధా మోదుగు

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు